జల శక్తి మంత్రిత్వ శాఖ
నీటి సరఫరా, పారిశుధ్యంలో పెట్టుబడులు
Posted On:
22 DEC 2022 3:25PM by PIB Hyderabad
నీటి సరఫరా, పారిశుధ్యం రాష్ర్ట జాబితాలోని అంశాలు. రాష్ర్ట ప్రభుత్వాల ప్రయత్నాలకు మద్దతుగా కేంద్రప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తుంది.
2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఒక్క ఇంటికి కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా లక్ష్యంగా రాష్ర్టప్రభుత్వాల భాగస్వామ్యంతో కేంద్రప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి సుమారు రూ.3.60 లక్షల కోట్ల పెట్టుబడితో జల్ జీవన్ మిషన్ (జెజెఎం) అమలుపరుస్తోంది. 12.19.2022 నాటికి దేశంలోని మొత్తం 19.36 కోట్ల గ్రామీణ గృహాల్లో 10.75 కోట్ల గ్రామీణ గృహాలకు (55.54%) ఇళ్లకే పైప్ ల ద్వారా మంచినీరు అందిస్తున్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి.
రాష్ర్టప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అందించిన వివరాల ప్రకారం 12.12.2022 నాటికి దేశంలోని 16.97 కోట్ల గ్రామీణ జనావాస ప్రాంతాల్లో 13.07 లక్షల (77%) ప్రాంతాలకు మంచినీటి సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు రోజుకి 40 లీటర్లకు (ఎల్ పిసిడి) పైబడి మంచినీరు అందుతోంది. 3.64 లక్షల (21.5%) ప్రాంతాల ప్రజలకు తగినంత దూరంలో రోజుకి 40 లీటర్ల (ఎల్ పిసిడి) కన్నా తక్కువ మంచినీరు అందుతోంది. కేవలం 0.26 లక్షల గృహాలు నీటి నాణ్యతకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఫిర్యాదు చేశాయి.
ప్రతీ ఒక్క ఇంటికి మరుగుదొడ్డి వసతి కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలను బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా (ఒడిఎఫ్) చేయడం లక్ష్యంగా కేంద్రప్రభుత్వం 2014 సంవత్సరంలో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద 2014-15 నుంచి 2019-20 సంవత్సరాల మధ్య కాలంలో రూ.1.09 లక్షల కోట్లు (కేంద్ర రాష్ర్టప్రభుత్వాల వాటాగా) ఖర్చు చేశారు. ఎస్ బిఎం (జి) కింద 10 కోట్ల ఇళ్లకు మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో 100% ఇళ్లు మరుగుదొడ్డి వసతి కలిగి ఉన్నాయని రాష్ర్టప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అందించిన సమాచారం తెలుపుతోంది. గ్రామాల ఒడిఎఫ్ హోదా స్థిరత్వం, 2024-25 నాటికి అన్ని గ్రామాల్లోను ఘన, వ్యర్థ నిర్వహణ వ్యవస్థల ఏర్పాటు కోసం రాష్ర్టాల భాగస్వామ్యంలో 2020 ఏప్రిల్ నుంచి రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడితో ఎస్ బిఎం (జి)-2.0 అమలులో ఉంది.
దీనికి తోడు గ్రామాల్లో నీటి సరఫరా, పారిశుధ్య సేవల కోసం 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల కింద రూ.11,698.37 కోట్లు (42%) 2022-23 సంవత్సరానికి ఆర్ఎల్ బి, పిఆర్ఐలకు అందుబాటులో ఉంచారు.
అలాగే జెజెఎం కింద సుదూర/జనావాస ప్రాంతాలకు వేరుగా ఉన్న/గిరిజన గ్రామాలకు సోలార్ ఇంధనం ఆధారిత నీటి సరఫరా వ్యవస్థలు; భూగర్భ జలాలు కలుషితంగా ఉన్న ప్రాంతాల్లో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, ఇతర కాలుష్యాలను నిలువరించే సామాజిక నీటి శుద్ధి వ్యవస్థలు (సిడబ్ల్యుపిపి), శీతల ఎడారులు/రాతి ప్రదేశాలు/కొండ ప్రదేశాలు/కోస్తా ప్రాంతాల్లో నీటి వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. సమర్థవంతమైన అమలు కోసం స్మార్ట్ మీటరింగ్, ఆస్తుల జియో-టాగింగ్ వంటి టెక్నాలజీలు వినియోగిస్తున్నారు.
ఎలక్ర్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంలో జాతీయ జల జీవన్ మిషన్ ఐసిటి గ్రాండ్ చాలెంజ్ కింద గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా కోసం ‘స్మార్ట్ వాటర్ సప్లై, మానిటరింగ్ వ్యవస్థ’ ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు దేశంలోని 118 ప్రాంతాల్లో వాస్తవిక ప్రాతిపదికన మంచినీటి సరఫరా తీరును పర్యవేక్షించేందుకు ప్రయోగాత్మక ప్రాతిపదికన సెన్సర్ ఆధారిత ఐఒటి వ్యవస్థలు ఏర్పాటు చేసింది. దీనికి తోడు ఇన్వెస్ట్ ఇండియా భాగస్వామ్యంలో పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డిపిఐఐటి) పోర్టబుల్ నీటి నాణ్యత పరీక్ష కోసం తక్కువ వ్యయంతో కూడిన ఇన్నోవేటివ్, మాడ్యులార్ వ్యవస్థల అభివృద్ధి చాలెంజ్ అమలులో ఉంది.
అలాగే ప్రజారోగ్యం మెరుగుపరచడంలో భాగంగా నీటి సరఫరా, పారిశుధ్య, పరిశుద్ధమైన వ్యవస్థలపై (వాష్) దృష్టి కేంద్రీకరిస్తూ ఫీల్డ్ టెస్టింగ్ కిట్లు, నీటి సరఫరా పరీక్ష లాబ్ లను ఉపయోగించి జాతీయ స్థాయి నీటి నాణ్యత నిర్వహణ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థలను (డబ్ల్యుక్యుఎంఐఎస్) ప్రారంభించారు. ఈ డేటాను అప్ లోడ్ చేసి, విశ్లేషించడంతో పాటు నాణ్యతాపరమైన అంశాలున్నట్టయితే తక్షణ దిద్దుబాటు చర్యల కోసం స్థానిక అధికారులకు పంపుతున్నారు.
పారదర్శకత, సమర్థ పర్యవేక్షణ కోసం ‘జెజెఎం డాష్ బోర్డ్’ ఏర్పాటు చేశారు. రాష్ర్టాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లాలు, గ్రామాలవారీగా గ్రామీణ గృహాలకు మంచినీటి సరఫరా పురోగతిపై ఈ వ్యవస్థ సమాచారం అందిస్తుంది. ఈ డాష్ బోర్డ్ ను https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx లింక్ ద్వారా పొందవచ్చును.
ప్రతీ ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత మంచినీటి సరఫరాలో ఉపయోగించేందుకు విభిన్న ఇన్నోవేషన్లు; నీరు, పారిశుధ్య సంబంధిత కొత్త టెక్నాలజీలను పరీక్షించి, సిఫారసులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు (పిఎస్ఏ) అధ్యక్షతన ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఈ కమిటీ 184 ఇన్నోవేటివ్ టెక్నాజీలను, 165 ఆర్ అండ్ డి ప్రతిపాదనలను పరిశీలించింది. 25 ఇన్నోవేటివ్ టెక్నాజీలను, 8 ఆర్ అండ్ డి ప్రతిపాదనలను ఆమోదించారు.
ఎస్ బిఎం (జి) పరిధిలో ఈ శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణ సొల్యూషన్లు అందించడంలో ఇన్నోవేటివ్ టెక్నాలజీలను ప్రోత్సహించేందుకు స్టార్టప్ గ్రాండ్ చాలెంజ్ నిర్వహించింది. ఇందులో 372 టెక్నాలజీ దరఖాస్తులు అందగా 43 టెక్నాలజీలను ఎంపిక చేసి అగ్రస్థానంలో నిలిచిన 6 టెక్నాలజీలకు 2022 అక్టోబర్ 2వ తేదీన నిర్వహించిన స్వచ్ఛ భారత్ దివస్ వేడుకల సందర్భంగా అవార్డులు అందించారు.
లోక్ సభలో ప్రస్తావనకు వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1886667)
Visitor Counter : 145