ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సమాచార సాంకేతికత నిబంధనల్లో సవరణ లక్ష్యం

Posted On: 23 DEC 2022 2:00PM by PIB Hyderabad

డిజిటల్ నాగరికులు లేదా పౌరులకు పారదర్శక, సురక్షిత, విశ్వసనీయ, జవాబుదారీ ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండేలా చూడడం భారత ప్రభుత్వ లక్ష్యం.

ఇంటర్నెట్ విస్తరణ, ఎక్కువ మంది భారతీయులు ఆన్‌లైన్‌ వినియోగంలోకి మారడంతో హాని కలిగించే, తప్పుడు సమాచారం, ఆన్‌లైన్‌ నేరాలకు గురయ్యే అవకాశం కూడా పెరిగింది. భారతదేశంలో డిజిటల్ పర్యావరణ వ్యవస్థతో పాటు, అనుసంధానం అవుతున్న ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, డిజిటల్‌ రూపంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలు, సాంకేతిక వేదికలకు సంబంధించిన గత నిబంధనల్లో కొన్ని బలహీనతలు, లోపాలు ఉన్నాయి. సమాచార సాంకేతికత చట్టం-2000 ద్వారా సమకూరిన అధికారాలతో, సమాచార సాంకేతికత (మాధ్యమాల మార్గదర్శకాలు & డిజిటల్ మీడియా నైతిక నియమావళి) సవరణ నియమాలు-2022ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

మాధ్యమాలు ఏ విధమైన సమాచారాన్ని చూపాలి, ప్రదర్శించాలి, అప్‌లోడ్ చేయాలి, ప్రచురించాలి, ప్రసారం చేయాలి, నిల్వ చేయాలి, పంచుకోవాలన్న నిర్దిష్ట అంశాలను ఈ నియమాలు సూచిస్తాయి. ప్రస్తుతానికి అమల్లో ఉన్న ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించే సమాచారాన్ని మాధ్యమాలు తొలగించాల్సి ఉంటుంది. నాయస్థాన ఆదేశం ద్వారా లేదా ప్రభుత్వం లేదా అధీకృత సంస్థ శ్రీముఖం ద్వారా ఈ విషయాన్ని వాటికి తెలియజేయడం జరుగుతుంది. దీనికితోడు,  వినియోగదారుల ఫిర్యాదులు చేసినప్పుడు మాధ్యమాల్లోని ఫిర్యాదుల పరిష్కార అధికారులు ఏమీ చేయకపోయినా, ఏదైనా నిర్ణయం తీసుకున్నా దాని మీద అప్పీల్ చేయడానికి వినియోగదారులను అనుమతించేందుకు గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ(లు) ఏర్పాటుకు కూడా సవరించిన నియమాలు వీలు కల్పిస్తాయి. పేర్కొన్న నియమాలను విధిగా పాటించడంలో మాధ్యమాలు విఫలమైతే, ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం మినహాయింపును అవి కోల్పోతాయి, పర్యవసాన చర్యలకు బాధ్యత వహిస్తాయి.

ప్రాథమిక హక్కులు సంపూర్ణ హక్కులు కావు, సహేతుక పరిమితులకు లోబడి ఉంటాయని భారత సర్వోన్నత న్యాయస్థానం స్వయంగా చెప్పినందున, నిరాధార విమర్శలు చేయడం తప్పు.

భారత పౌరులకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కు అమలయ్యేలా చూడడం కేంద్ర ప్రభుత్వ నియమాల రూపకల్పన విధానం లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా, రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు అందిన హక్కులను గౌరవించాలని సామాజిక మాధ్యమాలు సహా అన్ని మాధ్యమాలకు 'సవరించిన నియమావళి' స్పష్టం చేసింది.

రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రూపంలో ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఇవాళ ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(Release ID: 1886100) Visitor Counter : 154


Read this release in: English , Urdu , Malayalam