ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ప్రతిష్టాత్మక హరిత భవన పురస్కారం గెలుచుకున్న ఉడాయ్ ప్రధాన కార్యాలయ భవనం
గృహ ఎగ్జెంప్లరీ పెర్ఫార్మెన్స్ అవార్డ్ 2022 విజేతగా ప్రకటన
Posted On:
22 DEC 2022 3:30PM by PIB Hyderabad
జాతీయ స్థాయి అత్యున్నత హరిత భవన పురస్కారమైన 'గృహ ఎగ్జెంప్లరీ పెర్ఫార్మెన్స్ అవార్డ్ 2022'ను న్యూదిల్లీలోని 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (ఉడాయ్) ప్రధాన కార్యాలయం గెలుచుకుంది.

భారతదేశంలోని పర్యావరణ అనుకూల భవనాలకు జాతీయ స్థాయి రేటింగ్ ఇచ్చే వ్యవస్థ 'గృహ' (గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హాబిటాట్ అసెస్‌మెంట్). దేశవ్యాప్తంగా ఇప్పటికే అత్యధిక రేటింగ్ పొందిన భవనాల విభాగంలో ఉడాయ్ భవనాన్ని విజేతగా ప్రకటించారు.
కర్బన ఉద్గారాలను తగ్గించడానికి పునర్వినియోగం పద్థతులను ఉడాయ్ పాటిస్తోంది, ప్రోత్సహిస్తోంది. తన విద్యుత్ అవసరాల్లో కొంత భాగాన్ని తీర్చుకోవడానికి సౌరశక్తిని ఉపయోగిస్తోంది. ఒకసారి వినియోగించిన నీటిని శుద్ధి చేసి పునర్వినియోగించుకుంటోంది. వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులకు కట్టుబడి ఉంది.
సగటున, ఉడాయ్ రోజువారీ వాడుకుంటున్న నీటిలో 25% నుంచి 30% వాటా పునర్వినియోగ జలానిది. అదేవిధంగా, ఉడాయ్ ప్రధాన కార్యాలయ భవనం సంవత్సరానికి సగటున 3590 కి.లీ. భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తోంది.
ఈ పురస్కారం కోసం, దేశవ్యాప్తంగా ఉన్న గృహ రేటింగ్ భవనాల నుంచి 2022 అక్టోబర్ నెలలో నామినేషన్లను ఆహ్వానించారు. దీనిలో, 34 ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని 100 పాయింట్ల రేటింగ్ ఇస్తారు. ఉడాయ్ ప్రధాన కార్యాలయ భవనం ఈ పోటీలో పాల్గొంది.

2021లో ఉడాయ్ ప్రధాన కార్యాలయ భవనం రెండో ర్యాంకులో నిలిచింది. నిరంతర ప్రయత్నం ద్వారా ఈసారి విజేతగా ఆవిర్భవించింది. ఉడాయ్ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యావరణ స్పృహకు, భారతదేశ సున్నా కర్బన ఉద్గార లక్ష్యానికి ఎలా తమవంతు కృషి చేస్తున్నారు అన్నదానికి ఈ పురస్కారం ఒక స్పష్టమైన గుర్తింపు. ఉడాయ్ ప్రధాన కార్యాలయ భవనంలోని పర్యావరణ అనుకూలత, అక్కడి సిబ్బందికి చక్కటి పని వాతావరణాన్ని కూడా కల్పించింది.
***
(Release ID: 1885786)