జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

15న భారత జల ప్రభావ శిఖరాగ్ర సదస్సు ప్రారంభించనున్న కేంద్ర జలశక్తి శాఖా మంత్రి


15-17 మధ్య న్యూఢిల్లీలో 7వ భారత జల ప్రభావ శిఖరాగ్ర సదస్సు

Posted On: 14 DEC 2022 5:28PM by PIB Hyderabad

7వ భారత జల ప్రభావ శిఖరాగ్ర సదస్సును కేంద్ర జలశక్తి శాఖామంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిసవేశ్వర్ తుడు కూడా పాల్గొంటారు. 15-17 మధ్య  న్యూ ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగే ఈ సదస్సును స్వచ్చ గంగ జాతీయ మిషన్, గంగా నదీ పరీవాహక యాజమాన్యం, అధ్యయనం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారతదేశంలో నదులు, జలాశయాల రక్షణకు అవసరమైన పర్యావరణ మౌలికసదుపాయాలను అభివృద్ధి చేయటం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

“పెద్ద పరీవాహక ప్రాంతంలో చిన్న నదుల పునరుద్ధరణ, పరిరక్షణ” అనేది ఈ 7వ భారత జల ప్రభావ శిఖరాగ్ర సదస్సు లో చర్చించే ప్రధాన అంశం.  ఇది  ప్రజలు, విధానం, ప్రణాళిక, కార్యక్రమం, ప్రాజెక్ట్ అనే అంశాలను ఏకీకృతం చేయటం మీద దృష్టి పెడుతుంది. ఈ మూడు రోజుల సదస్సులో దేశ విదేశాలకు చెందిన నిపుణులు పెద్ద నదీ పరీవాహక ప్రాంతాల్లో దాదాపుగా అంతరించిపోతున్న చిన్న నదులను రక్షించటం మీద  చర్చిస్తారు.  అలా నదులు విడిపోవటానికి కారణాలు పరిశీలించి వాటిని ఏకం చేయటం మీద సదస్సు  దృష్టిపెడుతుంది.  గతంలో లాగే ఈ సదస్సులో భాగంగా ఆర్థిక అంశాలమీద జరిగే చర్చావేదికలో నదుల పునరుద్ధరణ ప్రాజెక్టులలో ఆసక్తి ఉన్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, మదుపుదారులు పాల్గొంటారు. ప్రపంచం నలుమూలలనుంచి వచ్చే డజన్ల కొద్దీ టెక్నాలజీ కంపెనీలు కూడా పాల్గొని భారత నదుల విషయంలో పనికొచ్చే  తమ నూతన ఆవిష్కరణలను, ప్రత్యేక  విధానాలను ప్రదర్శించుకుంటాయి.    

·       భారతదేశంలో నదులు, జలాశయాల రక్షణకు అవసరమైన పర్యావరణ మౌలికసదుపాయాలను అభివృద్ధి చేయటం ఈ శిఖరాగ్ర సదస్సు లక్ష్యం.

·       “పెద్ద పరీవాహక ప్రాంతంలో చిన్న నదుల పునరుద్ధరణ, పరిరక్షణ” అనేది ఈ 7వ భారత జల ప్రభావ శిఖరాగ్ర సదస్సు లో చర్చించే ప్రధాన అంశం. ప్రజలు, విధానం, ప్రణాళిక, కార్యక్రమం, ప్రాజెక్ట్ అనే అంశాలను ఏకీకృతం చేయటం మీద దృష్టి పెడుతుంది

·       దేశ విదేశాలకు చెందిన నిపుణులు పెద్ద నదీ పరీవాహక ప్రాంతాల్లో దాదాపుగా అంతరించిపోతున్న చిన్న నదులను రక్షించటం మీద  చర్చిస్తారు

·       నదులు విడిపోవటానికి కారణాలు పరిశీలించి వాటిని ఏకం చేయటానికి అనుసరించాల్సిన వ్యూహం మీద సదస్సు  దృష్టిపెడుతుంది.

·       సదస్సులో చర్చించే ఐదు ప్రధాన అంశాలు – సైన్స్, పాలసీ, ఆర్థికాంశాలు, టెక్నాలజీ, నవకల్పనలు, అమలులో ఎదురయ్యే సవాళ్ళు 

·       ఆర్థిక అంశాలమీద జరిగే చర్చావేదికలో నదుల పునరుద్ధరణ ప్రాజెక్టులలో ఆసక్తి ఉన్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, మదుపుదారులు పాల్గొంటారు

 

 

ఐదు కీలక అంశాలైన ప్రజలు, విధానం, ప్రణాళిక, కార్యక్రమం, ప్రాజెక్ట్, వాటి ఏకీకరణ నదీ  పరీవాహక ప్రాంత యాజమాన్యంలో కీలకమైన సవాలు. అందుకే ఈ 7వ సదస్సు దీనికి సంబంధించిన వ్యూహ రచన మీద ప్రధానంగా దృష్టిసారించబోతోంది. ప్లీనరీ సదస్సులు, బృందాల చర్చలు, అంతర్జాతీయ వేదికల ద్వారా అది సాధిస్తారు. 

జల యాజమాన్యం మీద, జల సంరక్షణ మీద  పనిచేసే వివిధ సంస్థల అధిపతులు ఈ మూడు రోజుల కార్యక్రమంలో పాల్గొంటారు. నదీ శాస్త్ర నిపుణులు, జల సంబంధ అంశాల పాలనాధికారులు తమ అనుభవాలను ఈ వేదిక మీద పంచుకుంటారు. జలశక్తి మంత్రిత్వశాఖలో జలవనరుల విభాగం కార్యదర్శి, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవ విభాగాధిపతి శ్రీ పంకజ్ కుమార్. స్వచ్ఛ గంగ జాతీయ మిషన్ డైరెక్టర్ జనరల్ శ్రీ అశోక్ కుమార్,  గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల అదనపు కార్యదర్శి శ్రీ డి. తారా, నీతి ఆయోగ్ సలహాదారు శ్రీ అవినాశ్ మిశ్రా, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ రూపా మిశ్రా, ఎన్ఎంసీజీ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్  శ్రీ డీపీ మథూరియా కూడా ఈ సదస్సులో పాల్గొంటారు.

విదేశీ ప్రతినిధులలో యూరోపియన్ యూనియన్ కు చెందిన సెప్పో నుర్మి, జర్మనీ రాయబారి డాక్టర్ ఫిలిప్ ఆకర్మన్, స్లోవేనియా రాయబారి మాతేజా వోడెబ్ ఘోష కూడా ఈ సదస్సు చర్చల్లో పాల్గొంటారు.  పర్యావరణ,  సైన్స్ తదితర రంగాలలో చురుగ్గా ఉన్న వరల్డ్  వైల్డ్ లైఫ్  ఫెడరేషన్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వంటి  సంస్థలు కూడా పాల్గొంటాయి.

6 వ శిఖరాగ్రసదస్సులో మిగిలిఉన్న నదీ వనరులను అనేక అభివృద్ధి కార్యక్రమాలకోసం జాగ్రత్తగా వాడుకోవటం మీద చర్చించారు. 2015 లో ఐఐటీలు, ఐఐటీసీ, ఐఐటీ కాన్పూర్ సారధ్యంలో గంగా నాడీ పరీవాహక ప్రాంత యాజమాన్యం మీద అధ్యయనం జరిపిన బృందం ‘సమర్థ గంగ’ కు ఇచ్చిన  నివేదికను  చర్చించారు.  సమర్థ గంగకు కీలక స్తంభాల్లాంటి అవిరళ గంగ, నిర్మల గంగ, అర్థ గంగ, జానా గంగ, జ్ఞాన గంగ అమలు గురించి సమగ్ర చర్చ జరిగింది.

భారత జల ప్రభావ 5 వ శిఖరాగ్ర సదస్సులో అర్థ గంగ మీద ఎక్కువగా దృష్టిపెట్టారు. దశాబ్దాల భారత ఉపఖండ   సాంస్కృతిక చరిత్రకు అద్దం పట్టే పవిత్ర  గంగానది  పునరుద్ధరణ, పరిరక్షణ మీద కేంద్రీకరించటమే అర్థ గంగ నమూనాను సూచిస్తోంది. గంగానదీ  పరీవాహక ప్రాంత ప్రజల మీద అర్థ గంగా ప్రభావం ఎంతగానో ఉంది.  ఈ నమూనా వల్ల గంగానది ఉవపనదుల పునరుజ్జీవంతో బాటు వాటి ప్రభావం ఉండే ప్రజల జీవితాలు కూడా మెరుగవుతాయి.  

 

***


(Release ID: 1883669) Visitor Counter : 111


Read this release in: English , Urdu , Hindi