పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

భౌగోళిక సమాచార వ్యవస్థలు

Posted On: 08 DEC 2022 2:45PM by PIB Hyderabad

పరివేష్, ఈ-గ్రీన్ వాచ్, వన్ అగ్ని జియో పోర్టల్ వంటి వెబ్ ఆధారిత భౌగోళిక సమాచార వ్యవస్థలను (జీఐఎస్) మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. పరివేష్‌ పోర్టల్‌ అంటే పర్యావరణం, అటవీ, వన్యప్రాణులు, తీర నియంత్రణ ప్రాంతాలకు సంబంధించిన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడానికి, వాటిని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ఏక గవాక్ష సమీకృత పర్యావరణ నిర్వహణ వ్యవస్థ. నిర్ణయ మద్దతు వ్యవస్థ ద్వారా సంబంధిత వర్గాలకు సమాచారం అందించే జీఐఎస్‌ ఆధారిత వ్యవస్థ, విశ్లేషణల వేదిక ఇది.

మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ-గ్రీన్ వాచ్ పోర్టల్ అంటే, కాంపా నిధి కింద చేపట్టిన మొక్కలు నాటడం, ఇతర అటవీ పనులకు సంబంధించిన పనుల స్వయంచాలనం, క్రమబద్ధీకరణ, సమర్థవంతమైన నిర్వహణను సులభతరం చేయడానికి రూపొందించిన అధునాతన సాంకేతికత ఆధారిత వేదిక. మొక్కలు నాటి ప్రదేశం, ప్రాంతం, సంవత్సరానికి సంబంధించిన ఖచ్చితత్వం కోసం ఈ-గ్రీన్ వాచ్ పోర్టల్‌లో రాష్ట్ర అటవీ శాఖలు అప్‌లోడ్ చేసిన వివిధ అటవీ ప్రాంతాల సమాచారాన్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ) విశ్లేషిస్తుంది.

అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చుల సంబంధిత సమాచారాన్ని వినియోగదారు స్నేహపూర్వక అనుసంధానం ద్వారా అందించడానికి వన్ అగ్ని జియో పోర్టల్‌ను ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. సమీప ప్రాంతాల్లో ఏర్పడే కార్చిచ్చులను వాస్తవ సమయంలో నిరంతరం పర్యవేక్షించడానికి ఈ పోర్టల్‌ను తీసుకొచ్చింది. భారతదేశంలో అటవీ కార్చిచ్చులకు సంబంధించిన సమాచారాన్ని అందించే ఒకే ఒక్క మూలంగా వన్ అగ్ని జియో పోర్టల్ పనిచేస్తుంది.

పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే, లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని ఇవాళ రాజ్యసభకు అందించారు. 

 

******



(Release ID: 1882006) Visitor Counter : 140


Read this release in: English , Urdu