రక్షణ మంత్రిత్వ శాఖ
ఇండోనేషియా కరవాంగ్‌లోని సంగ్గ బువాన శిక్షణ ప్రాంతంలో ఇండోనేషియా ప్రత్యేక సైనిక దళంతో కలిసి 'గరుడ శక్తి' విన్యాసాలు చేపట్టిన భారత సైన్య ప్రత్యేక బృందం
Posted On:
23 NOV 2022 2:25PM by PIB Hyderabad
ద్వైపాక్షిక సైనిక మార్పిడి కార్యక్రమాల్లో భాగంగా, భారత సైన్య ప్రత్యేక దళం ప్రస్తుతం ఇండోనేషియాలోని కరవాంగ్‌లోని సంగ్గ బువాన శిక్షణ కేంద్రంలో ఉంది. ఇండోనేషియా ప్రత్యేక సైనిక దళంతో కలిసి, శిక్షణ విన్యాసాల కార్యక్రమం 'గరుడ శక్తి'లో పాల్గొంటోంది. 'గరుడ శక్తి' పేరిట జరుగుతున్న ఉమ్మడి శిక్షణ విన్యాసాల పరంపరలో ఇది ఎనిమిదవది.
రెండు సైన్యాల ప్రత్యేక బలగాల మధ్య అవగాహన, సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో 2022 నవంబర్ 21న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రత్యేక దళాల నైపుణ్యాలను పెంచడం; ఆయుధాలు, పరికరాలు, ఆవిష్కరణలు, వ్యూహాలు, విధానాలు, వివిధ ఆపరేషన్ల నుంచి నేర్చుకున్న పాఠాల సమాచారాన్ని పంచుకోవడం; అడవుల్లో ప్రత్యేక దళ ఆపరేషన్లు; ఉగ్రవాద శిబిరాలపై దాడులు; ప్రత్యేక దళాల ప్రాథమిక & అధునాతన నైపుణ్యాలను ఏకీకృతం చేసే విన్యాసాలు; రెండు దేశాల జీవనశైలి & సంస్కృతి గురించి అవగాహన పెంచడం ఈ సంయుక్త శిక్షణ విన్యాసాల్లో భాగం. 13 రోజుల పాటు సాగే ఈ ఉమ్మడి శిక్షణ కార్యక్రమంలో గరిష్ట స్థాయి శారీరక దృఢత్వం, వ్యూహాత్మక కసరత్తులు, పద్ధతులపైనా దృష్టి పెడతారు. 48 గంటల సుదీర్ఘ విన్యాసాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
ఇరు సైన్యాలు ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడానికి, ఉగ్రవాద కార్యకలాపాల మీద ఎదురుదాడులు, అంతర్జాతీయ వాతావరణంలో ప్రాంతీయ భద్రత కార్యకలాపాలు & శాంతి పరిరక్షణలో తమ విస్తృత అనుభవాలను పంచుకోవడానికి ఈ ఉమ్మడి విన్యాసాలు రెండు సైన్యాలకు వీలు కల్పిస్తుంది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలను, ప్రాంతీయ భద్రతను పెంచడంలో ఈ కార్యక్రమంలో ఒక మైలురాయి.
(Release ID: 1878531)
Visitor Counter : 209