కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
'నెట్‌వర్క్ సంసిద్ధత సూచీ 2022'లో ఆరు స్థానాలు మెరుగుపడి 61వ ర్యాంక్‌లో భారత్
నివేదిక రూపొందించిన వాషింగ్టన్ డీసీలోని పోర్చులాన్స్ ఇన్‌స్టిట్యూట్
Posted On:
19 NOV 2022 6:04PM by PIB Hyderabad
ఇటీవల విడుదలయిన 'నెట్‌వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2022'లో (ఎన్‌ఆర్‌ఐ 2022), భారతదేశం ఆరు స్థానాలు ఎగబాకి 61వ ర్యాంక్‌కు చేరుకుంది. 131 దేశాల్లోని నెట్‌వర్క్ ఆధారిత సంసిద్ధత వాతావరణాన్ని అధ్యయనం చేసి తాజా నివేదిక రూపొందించారు. సాంకేతికత, ప్రజలు, పరిపాలన, ప్రభావం అనే నాలుగు ప్రధానాంశాల్లోని 58 ఉప అంశాల మీద సర్వే చేశారు. వాషింగ్టన్ డీసీలోని లాభాపేక్ష లేని, స్వతంత్ర, నిష్పక్షపాత పరిశోధన, విద్యాసంస్థ పోర్చులాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఈ నివేదిక రూపొందించింది.
తాజా నివేదికలో భారతదేశ ర్యాంక్ మెరుగుపడడమే కాదు, 2021లో 49.74గా ఉన్న స్కోర్ 2022లో 51.19కి పెరిగింది. అనేక సూచీల్లో భారత్ ముందుకు వచ్చింది. “దేశంలో కృత్రిమ మేథ నైపుణ్యం”లో 1వ స్థానంలో, “దేశంలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వాడకం”, “అంతర్జాతీయ ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్”లో 2వ ర్యాంక్, “టెలీకమ్యూనికేషన్ సేవల్లో వార్షిక పెట్టుబడి”, “దేశీయ విఫణి పరిమాణం”లో 3వ ర్యాంక్, “ఐసీటీ సేవల ఎగుమతులు”లో 4వ స్థానం, “ఎఫ్‌టీటీహెచ్/ఇంటర్నెట్ చందాదారుల పెరుగుదల”, “కృత్రిమ మేథ సైద్ధాంతిక రూపకల్పనలు”లో 5వ ర్యాంక్‌లో ఉంది.
ఎన్‌ఆర్‌ఐ-2022 నివేదిక ప్రకారం, ఆదాయ స్థాయిని బట్టి ఊహించిన దాని కంటే ఎక్కువ నెట్‌వర్క్ సంసిద్ధతను భారత్ కలిగి ఉంది. 36 దేశాలున్న దిగువ మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థల విభాగంలో ఉక్రెయిన్ (50), ఇండోనేషియా (59) తర్వాత భారతదేశం 3వ స్థానంలో ఉంది. అన్ని ప్రధానాంశాలు, ఉప అంశాల్లో మొత్తం ఆదాయ సమూహం సగటు కంటే భారత్ ఎక్కువ స్కోర్ సాధించింది.
***
(Release ID: 1877800)
Visitor Counter : 321