వ్యవసాయ మంత్రిత్వ శాఖ
మోరెనా వ్యవసాయ మేళాకు రెండో రోజూ ఆదరణ! రైతులతో కిక్కిరిసిన ఎగ్జిబిషన్
• ప్రకృతి వ్యసాయమే రైతుల సౌభాగ్యానికి దారి:
ఆచార్య దేవవ్రత్..
• విత్తనాలదశ నుంచి మార్కెట్ వరకూ రైతలకు
ప్రభుత్వ సదుపాయాలు: జ్యోతిరాదిత్య సింధియా..
• గిరిజనాభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించిన
కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్,
టిష్యూ కల్చర్ ల్యాబ్‌కు శంకుస్థాపన
• వ్యవసాయ మేళాలో స్టాల్స్ ప్రధాన ఆకర్షణ,..
ఆసక్తిగా సమాచారం సేకరిస్తున్న రైతులు
• వ్యవసాయ మేళాలో స్టాళ్లను సందర్శించిన
కేంద్ర మంత్రులు నరేంద్ర తోమర్, కైలాస్ చౌదరి
Posted On:
12 NOV 2022 8:24PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో నిర్వహించిన మూడు రోజుల మెగా వ్యవసాయ ప్రదర్శన, ఎగ్జిబిషన్, శిక్షణా కార్యక్రమానికి ఈ రోజు రెండవ రోజు కూడా వేలాది మంది రైతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. సహజ వ్యవసాయ విధానం రైతులు సౌభాగ్యానికి బాటలు వేస్తుందని ఆయన అన్నారు. అడవిలో సహజసిద్ధంగా మొక్కలు ఎలా పెరుగుతాయో, అదే విధంగా రైతులు పొలాల్లో గో ఆధారితమైన సహజ పద్ధతిలో పంటలను సాగు చేయడం ద్వారా ఉత్పత్తిని పెంచుకోవచ్చని, తమ భూముల సారాన్ని కూడా పెంచుకోవచ్చని అన్నారు.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక పార్లమెంటు సభ్యుడు అయిన నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాస్ చౌదరి, మధ్యప్రదేశ్ మంత్రి భరత్ సింగ్ కుష్వాహ, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) చీఫ్ జనరల్ మేనేజర్ నిరుపమ్ మెహ్రోత్రా, పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా వర్చువల్ పద్ధతిలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా, స్థానిక గిరిజనుల అభివృద్ధి కోసం పహాడ్‌గఢ్‌లో ఏర్పాటు చేసిన నాబార్డ్ ప్రాజెక్ట్‌ను కేంద్రమంత్రి తోమర్ ప్రారంభించారు, అలాగే మోరేనాలో సేంద్రియ విత్తన క్షేత్రానికి హైటెక్ నర్సరీ-టిష్యూ కల్చర్ లేబరేటరీకి శంకుస్థాపన చేశారు.
మోరీనాలోని డాక్టర్ అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మెగా వ్యవసాయ ప్రదర్శన-ఎగ్జిబిషన్‌కు వచ్చిన రైతులకు సహజ వ్యవసాయం ప్రాముఖ్యతను గుజరాత్ గవర్నర్ వివరించారు. ఎరువుల సబ్సిడీ కోసం భారత ప్రభుత్వం సంవత్సరానికి రూ. రెండున్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. నిజానికి ఈ మొత్తాన్ని దేశంలోని ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగించే అవకాశం ఉందన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం బాటన నడిస్తే, రసాయనిక ఎరువులతో వ్యవసాయం వల్ల తలెత్తే నష్టాన్ని కూడా నివారించవచ్చని అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు ఆదాయం పెరగడంతోపాటు 70 శాతం వరకు నీరు ఆదా అవుతుందని అన్నారు.
ప్రత్యేక అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ దేశమంతటికి రైతు తిండి పెడుతున్నాడంటే, ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండబోదని అన్నారు. నేడు భారతదేశం పేరు, ప్రఖ్యాతులు ప్రపంచమంతటా వ్యాపిస్తున్నాయంటే, అందుకు రైతులే ప్రధాన కారణమని అన్నారు. గతంలో అంటే,.. 2013-14 వరకు రూ. 21,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ శాఖ బడ్జెట్ ఇప్పుడు దాదాపు ఆరు రెట్లు పెరిగి కోటీ 24లక్షల రూపాయలకు చేరిందని, రైతుల కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని, రైతులు కూడా ఉత్పత్తిని పెంచుతున్నారని సింధియా చెప్పారు. 2013-14 సంవత్సరంతో పోలిస్తే దేశంలో ఆహార ధాన్యాల్లో, ఉద్యానవన సాగులో రికార్డు స్థాయి ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఆవిర్భించవిందని, పూల సాగులో రెండవ స్థానంలో, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉందని అన్నారు.
మరో ప్రత్యేక అతిథి, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాస్ చౌదరి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం, వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు భారీ ఎత్తున అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు, వారికి పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పారు. దేశాన్ని ఆత్మనిర్భరభారత్‌గా తీర్చిదిద్దాలంటే రైతులు నిలదొక్కుకుని స్వావలంబన పొందేలా చూడాలన్నారు. నేడు రైతులు తక్కువ వడ్డీకి సాధారణ రుణాలు పొందుతూ ఉండటం, వారి కష్టాలను తగ్గించిందని చెప్పారు. చిన్న భూ కమతాలు కలిగిన రైతుల కోసం 10,000 కొత్త వ్యవసాయ ఉత్పత్తిదార్ల సంఘాలను ఏర్పాటు చేయడంతో సహా వ్యవసాయ అభివృద్ధికోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కేంద్రమంత్రి చెప్పారు.
మూడు రోజుల మెగా కృషి మేళాలో రైతులు వివిధ శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకున్నారు. రేపు కూడా శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. గిరిజనుల అభివృద్ధి కోసం రూ.3.75 కోట్లతో నాబార్డ్ చేపడుతున్న ప్రాజెక్టును నేటి ప్రధాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి తోమర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన కుటుంబాలకు టూల్‌కిట్‌లను ఆయన పంపిణీ చేశారు. దీంతో గిరిజనుల జీవన ప్రమాణాలు మారుతాయని, వారి ఆదాయం పెరుగుతుందని తోమర్ అన్నారు. గిరిజన అభివృద్ధి ప్రాజెక్ట్ కోసం మోరెనా జిల్లాలోని పహాడ్‌గఢ్‌ను నాబార్డ్ ఎంపిక చేసింది, ఎందుకంటే ఈ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులలో ఎక్కువ మంది సహారియా సమూహానికి చెందినవారు. సహారియా తెగను ఆదిమ తెగగా భారత ప్రభుత్వం గుర్తించింది. నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టు కింద గొట్టపు బావులతో పాటు పంపుసెట్లు, డ్రిప్‌లు, ప్లాస్టిక్ డ్రమ్ములు, పొలం కుంటలు, పైపులు ఏర్పాటు తదితర కార్యక్రమాలకు ఆమోదం లభించింది. దీంతో పాటు ఉద్యానవన సాగు, అటవీ మొక్కలను పంపిణీ చేయనున్నారు. భూసారం, నీటి సంరక్షణ కింద కార్యకలాపాలు, 25 యూనిట్ల చొప్పున పౌల్ట్రీ-మేకల పెంపకం ప్రాజెక్టులను కూడా ఆమోదించారు.
స్వయం సహాయక సంఘం మహిళలకు అవగాహన కార్యక్రమాలు, పుట్టగొడుగుల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి ఆదాయ సముపార్జనా కార్యకలాపాలు, అప్పడాల తయారీ, స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు, బ్యాంకు లింకేజీ వంటి కార్యక్రమాలను మంజూరు చేశారు. ఆరోగ్య శిబిరాలు, పశు ఆరోగ్య శిబిరాలు, కూరగాయల తోటలు, వ్యవసాయ ఉత్పత్తిదార్ల సంఘాల (ఎఫ్.పి.ఒ.ల) ఏర్పాటు వంటి కార్యక్రమాలకు కూడా ఆమోదం లభించింది. గిరిజన కుటుంబాల సమగ్ర అభివృద్ధి, వారి భాగస్వామ్యం, సామర్థ్యాల వినియోగం ఆధారంగా వారి స్థిరమైన ఆదాయ ఉత్పత్తికి కొత్త నమూనాలను రూపొందించడం ఈ నమూనాల లక్ష్యంగా నిర్దేశించారు. గిరిజన అవసరాలు. గ్రామ స్థాయిలో గిరిజన సంస్థలను సృష్టించడం ద్వారా సామర్థ్య పెంపుదల, వివిధ సంఘాల కోసం విధాన రూపకల్పనలో పాల్గొనడం, వారి సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడం వంటి లక్షాలతో ఈ కార్యక్రమాలు చేపట్టారు..
ఎగుడు దిగుడు నేలల్లో భూసారాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మోరెనాలో జాతీయ విత్తన సంస్థ (ఎన్.ఎస్.సి.) ఆధ్వర్యంలో సేంద్రీయ విత్తన క్షేత్రం కోసం అధునాతన ( హైటెక్) నర్సరీ, టిష్యూ కల్చర్ లేబరేటరీ నిర్మాణానికి కేంద్రమంత్రి తోమర్ శంకుస్థాపన చేశారు. ఇందుకోసం గడోరా, జఖౌనా, రితోరా ఖుర్ద్, గూర్ఖా గ్రామాల్లో 885.34 హెక్టార్ల భూమిని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు కేటాయించింది.
కోటి రూపాయల వ్యయంతో టిష్యూ కల్చర్ ల్యాబ్ ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. ఉద్యానవన సాగు సమగ్ర అభివృద్ధి పథకం (ఎం.ఐ.డి.హెచ్.) కింద రెండున్నర కోట్ల రూపాయలతో టిష్యూ కల్చర్ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ ల్యాబ్ సంవత్సరానికి సుమారు 30 లక్షల మొక్కలను ఉత్పత్తి చేస్తుంది. అధిక దిగుబడినిచ్చే, వ్యాధి రహిత మొక్కలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా వాణిజ్య, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ఇది దోహదపడుతుంది. వెదురు, అరటి, స్ట్రాబెర్రీ, లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా తదితర మొక్కలను ఈ ల్యాబ్‌లో ఉత్పత్తి చేయనున్నారు. దీని గురించి జాతీయ విత్తన సంస్థ (ఎన్.ఎస్.సి.) డైరెక్టర్ సాహు సవివరంగా సమాచారం ఇచ్చారు.
సీతాల్‌మాత స్వయం సహాయక సంఘం (ఎస్.హెచ్.జి.) మహిళలకు రూ. 2 కోట్లు అందించారు. స్వల్పకాలిక రుణం కింద కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మధ్యప్రదేశ్ గ్రామీణాభివృద్ధి బ్యాంకు మంజూరు చేసిన రూ. 4.56 లక్షల మొత్తానికి చెక్కును కూడా మంత్రి అందజేశారు. మరిన్ని ఎక్కువ చిరుధాన్యాల ఉత్పత్తికి వాటి ప్రాసెసింగ్‌కు ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. దీనితో పాటు, చిరుధాన్యాలతో అప్పడాల తయారీలో శిక్షణకు సహాయం అందించారు. డ్రోన్ల కోసం ఎఫ్.పి.ఒ.ల ద్వారా గ్రాంటును అందించారు. భమూర్ సమీపంలోని తిగ్రా గ్రామంలో ఏర్పాటు చేసిన వంగడాల మెరుగుదల కేంద్రంలో 14 మంది లబ్ధిదారులకు ట్యాబులను కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అందజేశారు.
మోరెనాలో నిర్వహిస్తున్న మెగా వ్యవసాయ మేళా, ఎగ్జిబిషన్ సందర్భంగా 143 ప్రదర్శన శాలలను ఏర్పాటు చేశారు, ఇక్కడ రైతులు ఎంతో ఉత్సాహంతో, ఆసక్తితో సమాచారం తెలుసుకుంటున్నారు. మెరుగైన వ్యవసాయం, వ్యవసాయ ఆవిష్కరణలవైపునకు రైతులను మళ్లించేందుకు వారికి ఎగ్జిబిషన్ ద్వారా తగినఏ ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం, నానో యూరియా, జంతు పోషకాలు, మత్స్య సంపద, నీటి సంరక్షణ, సూక్ష్మ నీటిపారుదల, పంటల బీమా పథకం వంటి అంశాలపై వ్యవసాయ స్టార్టప్‌లతో సహా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్.) ఆధ్వర్యంలోని జాతీయ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఈ మేళాలో స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి కైలాస్ చౌదరి, మోరెనా జిల్లా ఇన్‌చార్జి మంత్రి భరత్ సింగ్ కుష్వాహ తదితర ప్రముఖులు స్వయంగా ఈ మెగా వ్యవసాయ మేళాను సందర్శించారు. మేళాలో పాల్గొన్న రైతులతో, విక్రయశాలలు, స్టాళ్ల నిర్వాహకులతో వారు సంభాషించారు.
ఇక ఆధునిక వ్యవసాయంలో వినూత్న పద్ధతులను ప్రోత్సహించేందుకు ఈ మేళాలో నిర్వహించిన రైతు డ్రోన్‌ల ప్రదర్శనను రైతులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. డ్రోన్‌ల ఎగ్జిబిషన్‌ను వీక్షించాలని రైతులకు తోమర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి కూడా చేశారు. ఈ ఎగ్జిబిషన్‌ను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా రైతులు వస్తున్నారు. ప్రదర్శనలో ఉంచిన వ్యవసాయ పరికరాలను, ఇతర ఉత్పత్తులను చూసి రైతులు ఎంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మూడు రోజుల వ్యవసాయ మేళా, ప్రదర్శన 2022, నవంబర్ 13 న ముగుస్తుంది.
***
(Release ID: 1875648)
Visitor Counter : 163