నీతి ఆయోగ్

ఏఎన్‌ఐసీలో భాగంగా మహిళా కేంద్రీకృత సవాళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించిన 'అటల్ ఇన్నోవేషన్ మిషన్'

Posted On: 09 NOV 2022 4:55PM by PIB Hyderabad

న్యూ దిల్లీ: 'అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్' (ఏఎన్‌ఐసీ) 2వ అంచెలో రెండో దశలో భాగంగా, మహిళా కేంద్రీకృత సవాళ్ల కార్యక్రమాన్ని నీతి ఆయోగ్‌ ప్రతిష్టాత్మక విభాగమైన 'అటల్ ఇన్నోవేషన్ మిషన్' (ఏఐఎం) ప్రారంభించింది. ఈ సవాల్‌ కింద ఒక కోటి రూపాయల వరకు గ్రాంట్ మంజూరు చేస్తారు. జాతీయ ప్రాముఖ్యత, సామాజిక ఔచిత్యానికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించే సాంకేతిక ఆవిష్కరణలను వెతకడం, ఎంచుకోవడం, మద్దతు ఇవ్వడం, పెంపొందించడం లక్ష్యంగా తీసుకున్న చొరవ ఇది.

"ఒక మహిళ సమాజ రూపశి" అన్న అంశానికి ప్రాధాన్యతనిస్తూ, జీవితంలోని అన్ని దశల్లో అతివలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఏఎన్‌ఐసీ చేపట్టిన మహిళా కేంద్రీకృత సవాళ్లు పరిష్కరిస్తాయి. కొత్త ఆవిష్కరణల ద్వారా మహిళలను పరిశుభ్రత వైపు నడిపించడం, మహిళల భద్రతను మెరుగు పరచడం, మహిళలకు వృత్తిపరమైన అవకాశాలు పెంచడం, పని చేసే మాతృమూర్తుల జీవనాన్ని మెరుగు పరచడం, గ్రామీణ మహిళల జీవనాన్ని సులభతరం చేయడం వంటివి ఈ కార్యక్రమంలో ఉన్నాయి.

సమావేశాన్ని ఉద్దేశించి నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ మాట్లాడుతూ, “ మహిళ సాధికారత మీద నీతి ఆయోగ్, ఏఐఎం ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. మహిళా కేంద్రీకృత సవాళ్లను ఇవాళ ప్రారంభిస్తున్నాం. నేను ఏఐఎం బృందాన్ని అభినందిస్తున్నాను. యువ ఆవిష్కర్తల కోసం ఇటువంటి అవకాశం తెచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ ఆవిష్కరణలు ఆలోచింపజేసేవిగా ఉండవచ్చు. ప్రధాన ఆవిష్కరణలకు, పరిష్కారాలకు అవి దారి తీయవచ్చు" అని చెప్పారు.

నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ మాట్లాడుతూ, “మహిళలు, బాలికలు తమ పూర్తి జీవన సామర్థ్యానికి అనుగుణంగా జీవించాలన్న ప్రధాన మంత్రి దృక్పథానికి అనుగుణంగా ఏఐఎం ద్వారా స్త్రీ కేంద్రీకృత సవాళ్లను ప్రారంభిస్తున్నాం అన్నారు. జీవితంలోని అన్ని దశల్లో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించేలా ఈ సవాళ్లు ఏఎన్‌ఐసీకి రూపకల్పన చేశాయని" చెప్పారు. ఆవిష్కర్తలు తమ వెబ్‌సైట్‌ను సందర్శించి, ఈ గొప్ప కార్యక్రమం కోసం వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

https://www.aim-challenges.in/ లింక్‌ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

ఆదర్శప్రాయ సలహాదారులను సన్మానించడానికి ఏఐఎం ఏర్పాటు చేసిన వార్షిక మెంటార్ రౌండ్ టేబుల్ కార్యక్రమం సందర్భంగా ఈ ఛాలెంజ్‌ ప్రారంభించారు.

 

***



(Release ID: 1874837) Visitor Counter : 123


Read this release in: English , Urdu , Hindi , Tamil