ఆయుష్
azadi ka amrit mahotsav

పుణెలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి'ని సందర్శించిన కేంద్ర ఆయుష్ మంత్రి


మానవుల సంపూర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రకృతి వైద్యం ముఖ్య పాత్ర పోషిస్తోంది: శ్రీ శర్వానంద సోనోవాల్

Posted On: 05 NOV 2022 6:21PM by PIB Hyderabad

పుణెలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి'ని (ఎన్‌ఐఎన్‌) కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ శర్వానంద సోనోవాల్ ఇవాళ సందర్శించారు. సంస్థలో కొనసాగుతున్న కార్యకలాపాల గురించి కేంద్ర మంత్రికి అధికారులు వివరించారు. ఎన్‌ఐఎన్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ కె.సత్య లక్ష్మి, సంస్థలో కొనసాగుతున్న కార్యకలాపాల గురించి వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. ఎన్‌ఐఎన్ సిబ్బంది, విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు.

ఈ సందర్భంగా శ్రీ శర్వానంద సోనోవాల్ మాట్లాడారు. “ఆయుష్ వ్యవస్థను ప్రజలు విస్తృతంగా స్వీకరించారు. మానవాళికి అనేక ప్రయోజనాలను ఆయుష్‌ అందించింది, ఇంకా అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆయుష్‌ కోసం స్వతంత్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం, యోగా ద్వారా ప్రపంచంలోని ప్రతి వ్యక్తిలో భారతదేశం పట్ల గౌరవాన్ని పెంచడం వంటి అవిశ్రాంత కృషితో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆయుష్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

 

 

"ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్" నినాదంతో భారత దేశ ప్రజలంతా ఐకమత్యంతో ఉన్నారని కేంద్ర మంత్రి సోనోవాల్ చెప్పారు. 'స్వయం సమృద్ధి సాధించిన భారత్‌' కల త్వరలో ఖచ్చితంగా నెరవేరుతుందని అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కలిసి పని చేస్తున్నాయని, చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాయని వివరించారు.

పుణెలోని తడివాలా రోడ్‌లో ఉన్న నేషనల్ 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి'ని 'బాపు భవన్' అని కూడా పిలుస్తారు. మహాత్మాగాంధీ పుణె వచ్చినప్పుడల్లా ఇక్కడే బస చేసేవారు. వివిధ సందర్భాల్లో కలిపి 156 రోజుల పాటు మహాత్మాగాంధీ ఇక్కడ ఉన్నారు. ప్రకృతి వైద్యంపై అనేక ప్రయోగాలు చేశారు.

****


(Release ID: 1874040) Visitor Counter : 131


Read this release in: English , Urdu , Hindi