రక్షణ మంత్రిత్వ శాఖ
జమ్ము & కాశ్మీర్ లోని రాజౌరి సెక్టార్ లోని కీలక పోస్ట్ లను సందర్శించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ; ఎల్ఒసి వెంట భద్రతా దృశ్యాన్ని & కార్యాచరణ సంసిద్ధతపై సమీక్ష
ఫ్రంట్ లైన్లలో పనిచేస్తున్న సైనికులతో కలిసి దీపావళి వేడుకలలో పాలుపంచుకున్న సిడిఎస్
Posted On:
24 OCT 2022 6:10PM by PIB Hyderabad
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్ - త్రివిధ దళాధిపతి) అక్టోబర్ 24, 2022న వైట్ నైట్ కార్ప్స్ కమాండర్ లెఫ్టనెంట్ జనరల్ మంజీందర్ సింగ్ తో కలిసి జమ్ము & కాశ్మీర్ లోని రాజౌరీ సెక్టర్ లో కీలక పోస్టులను సందర్శించి ఫ్రంట్ లైన్లలో (శత్రువులకు సమీపంగా) నియమితులైన సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. దేశ సేవలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు స్మారక స్థలమైన నౌషెరా సెక్టార్ లోని నమన్ స్థల్ లో పుష్పగుచ్ఛాన్ని ఉంచి వారికి నివాళులు అర్పించారు.
లైన్ ఆప్ కంట్రోల్ (ఎల్ ఒసి -నియంత్రణ రేఖ) వెంట గల భద్రతా దృశ్యాన్ని, ప్రస్తుత కార్యనిర్వాహక పరిస్థితిని గురించి ఫీల్డ్ కమాండర్లు జనరల్ అనిల్ చౌహాన్ కు వివరించారు. ఆ ప్రాంతంలో భౌగోళిక, వాతావరణ పరిస్థితులు సవాళ్ళతో కూడుకున్నవైనప్పటికీ చేపట్టిన రక్షణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, కార్యాచరణ సంసిద్ధతను కూడా ఆయన సమీక్షించారు.
దళాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, భారతీయ సైన్యం ధైర్యసాహసాలు, శౌర్యం వంటి గొప్ప సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని సిడిఎస్ ఉద్భోధించారు. అత్యున్నత స్థాయి కార్యచరణ సంసిద్ధత అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. సవాళ్ళతో కూడిన పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్లలో మోహరించిన దళాలకు దీపావళి సందర్భంగా సిడిఎస్ పర్యటన గొప్ప నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది.
***
(Release ID: 1870718)
Visitor Counter : 153