వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

12 రాష్ట్రాలలో 249 ప్రాంతాలలో 111.125 ఎల్ఎంటీ సామర్థ్యం గల ఉక్కు గోదాములు నిర్మించనున్న భారత ఆహార సంస్థ


హబ్ అండ్ స్పోక్ నమూనాలో మొదటి దశలో 34.875 ఎల్ఎంటీ సామర్థ్యం గల ఉక్కు గోదాముల నిర్మాణం

Posted On: 19 OCT 2022 2:32PM by PIB Hyderabad

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దాదాపు 9236 కోట్ల ఖర్చుతో హబ్ అండ్ స్పోక్ నమూనాలో 12 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 249 ప్రాంతాలలో  111.125 ఎల్ఎంటీ సామర్థ్యం గల ఉక్కు గోదాములు నిర్మించాలని భారత ఆహార సంస్థ నిర్ణయించింది. రానున్న 3-4 సంవత్సరాల కాలంలో గోదాముల నిర్మాణం జరుగుతుంది.
ప్రాజెక్టు మొదటి దశలో 34.875 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలు నిల్వ చేయగల సామర్థ్యం గల ఉక్కు గోదాముల నిర్మాణాన్ని హబ్ అండ్ స్పోక్ నమూనాలో 80 ప్రాంతాలలో చేపడతారు. వీటిలో  14 ప్రాంతాలలో 10.125 ఎల్ఎంటీ సామర్థ్యం గల ఉక్కు గోదాములను  డీబీఎఫ్ఓటీ విధానంలో   నిర్మిస్తారు.  డీబీఎఫ్ఓఓ విధానంలో  66 ప్రాంతాలలో 24.75   ఎల్ఎంటీ సామర్థ్యం గల గోదాముల నిర్మాణాన్ని చేపడతారు. డీబీఎఫ్ఓఓ   విధానంలో నిర్మాణాలు చేపట్టేందుకు ఆహ్వానించిన టెండర్లను 31.10.2022 తెరుస్తారు.   డీబీఎఫ్ఓటీ విధానంలో నిర్మాణాలు చేపట్టేందుకు ఆహ్వానించిన టెండర్లను 10.08.2022 తెరిచి ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక  సంస్థకు అప్పగించడం జరిగింది. మిగిలిన టెండర్లు వివిధ దశల్లో ఉన్నాయి. శాస్త్రీయ పద్ధతుల్లో ఆహారధాన్యాల రవాణా చేసి,  నిల్వ చేసేందుకు గిడ్డంగుల్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తారు. దీనివల్ల ఆహార ధాన్యాలు ఎక్కువ కాలం దెబ్బ తినకుండా  నిల్వ  ఉంటాయి.
ఇప్పటికే ఆమోదించిన ప్రాజెక్టులో భాగంగా 31 ప్రాంతాలలో 17.75 ఎల్ఎంటీ సామర్థ్యం గల గోదాముల నిర్మాణం ( సర్క్యూట్ నమూనాతో సహా) పూర్తయింది. వీటిలో కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి. 31 ప్రాంతాల్లో చేపట్టిన  15.50 ఎల్ఎంటీ సామర్థ్యం గల గోదాముల నిర్మాణం  వివిధ దశల్లో ఉంది.
గోదాముల నిర్మాణానికి అమలు చేస్తున్న  డీబీఎఫ్ఓటీ (రూపకల్పన, నిర్మాణం, ఆర్థిక అంశాలు, నిర్వహణ, బదిలీ) డీబీఎఫ్ఓఓ  (రూపకల్పన, నిర్మాణం, ఆర్థిక అంశాలు, యాజమాన్య హక్కు  నిర్వహణ) విధానాల కింద ప్రైవేట్ సంస్థలు ఆధునిక గోదాములను నిర్మించి అంగీకరించిన కాలం వరకు  నిర్వహణ బాధ్యత చేపడతాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో డీబీఎఫ్ఓటీ పద్దతిలో చేపట్టే గోదాముల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని భారత ఆహార సంస్థ సమకూరుస్తుంది. డీబీఎఫ్ఓఓ విధానంలో ప్రైవేట్ సంస్థలు అవసరమైన స్థలాన్ని సమకూర్చుకుని నిర్మాణం చేపడతాయి.  
పంజాబ్,హర్యానా,ఉత్తర ప్రాదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్,రాజస్థాన్,మహారాష్ట్ర,బీహార్,  పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో 80 ప్రాంతాలలో  గోదాములను 2,800 కోట్ల రూపాయల ఖర్చుతో చేపడతారు. సంబంధిత రాష్ట్రాలు, నీతి ఆయోగ్, ఆర్ధిక మంత్రిత్వ శాఖ,రైల్వే శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన తరువాత స్థలాలను  ఎంపిక చేయడం జరిగింది.  
పంట పొలాలకు సమీపంలో నిర్మించే ఆధునిక గోదాములు కొనుగోలు కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి. దీనివల్ల రైతులు ఎక్కువ దూరం ప్రయాణించకుండా పంటలను విక్రయించుకోవడానికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. యంత్రాలతో పనిచేసే గోదాముల్లో 24 గంటల సేపు కార్యకలాపాలు సాగుతాయి. దీనివల్ల వ్యవసాయ సరుకుల రాకపోకలు వేగంగా సాగుతాయి. అన్ని రంగాల్లో సామర్థ్యం పెరుగుతుంది. ఇంతేకాకుండా, సాధారణ గోదాములతో పోల్చి చూస్తే ఉక్కు గోదాముల  నిర్మాణం కోసం అవసరమైన స్థలం 1/3 వరకు తగ్గుతుంది.

***


(Release ID: 1869201) Visitor Counter : 150


Read this release in: English , Urdu , Hindi