ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గువాహటి లో 08 అక్టోబర్ 2022న జరిగిన 70వ ఎన్ ఇ సి ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి



. ఈశాన్య రాష్ట్రాలు తమ నిధులను సద్వినియోగం చేసుకోవాలి: కిషన్ రెడ్డి

· అప్పుడే కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన సమగ్రాభివృద్ధికి సార్థకత చేకూరుతుంది.

·   ఎన్ఈసీ 70వ ప్లీనరీ సమావేశాల్లో కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి సూచన

·   ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి లేకుండా భారతదేశ అభివృద్ధి సంపూర్ణం కాదని వెల్లడి

·   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నకృషికి భాగస్వామ్య పక్షాలు, ప్రైవేటు రంగం సంపూర్ణ సహకారం అందించినపుడే అనుసంధానత సాధ్యమవుతుంది

·   పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, ప్రైవేటు పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి సూచన

·   NER పర్యాటకాభివృద్ధికి విస్తృతమైన అవకాశాలున్నాయి, కావాల్సిందల్లా ఆ అవకాశాలను గుర్తించి సద్వినియోగ పరుచుకోవడమేనని సూచన



प्रविष्टि तिथि: 08 OCT 2022 9:58PM by PIB Hyderabad

 

ఈశాన్య రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సద్వినియోగ పరుచుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రారంభమైందని, ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్ర పురోగతికి ఉద్దేశించిన నిధులను ఈ ఎనిమిది రాష్ట్రాలు సద్వినియోగ పరుచుకోవాలని ఆయన సూచించారు. అప్పుడే సంకల్పిత లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి లేకుండా భారతదేశం అభివృద్ధి సంపూర్ణం కాదని కిషన్ రెడ్డి వెల్లడించారు.

 

గువాహటిలో శని వారం ప్రారంభమైన రెండ్రోజుల 70వ ఎన్ఈసీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి  మంత్రి ప్రారంభోపన్యాసం చేస్తూ.. ఎన్ఈఆర్ ప్రాంత సమగ్రాభివృద్ధికి ఇది ‘అమృత కాల’మని, దీన్ని సద్వినియెగం చేసుకుంటే ఈ ప్రాంతంలో సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని కిషన్ రెడ్డి నొక్కిచెప్పారు.

 

ఈశాన్య రాష్ట్రాలకు నిర్దేశించిన జీబీఎస్ (గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్) నిధుల్లో లక్షిత 10 శాతం నిధుల సద్వినియోగం జరగాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ.. ఈ నిధులను వినియోగించుకునేందుకు అవసరమైన నిబంధనల్లో మార్పులు చేసుకోవాలని ఆయన సూచించారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలతో సమన్వయం ద్వారా ఈ నిధుల సద్వినియోగంపై దృష్టిసారించాలన్నారు. నిధుల సద్వినియోగం విషయంలో ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు అవసరమైన సూచనలు చేయాలని ఆయన అన్నారు.

 

ఎన్ఈఆర్ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి స్థాపనకోసం, రాజకీయ స్థిరత్వం కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని, దీంతోపాటుగా రోడ్డు, రైలు, విమాన అనుసంధానతను మెరుగుపరచడంపై ప్రత్యేకమైన దృష్టి సారించడం ద్వారా కొంతకాలంగా గణనీయమైన మార్పులు కనబడుతున్నాయని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి సూచించారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి, ఇతర భాగస్వామ్య పక్షాలు, ప్రైవేటు రంగం సంపూర్ణ సహకారం అందించాలని ఆయన పేర్కొన్నారు.

 

ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయ రంగాభివృద్ధికి సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ‘అగ్రి టాస్క్ ఫోర్స్’ కమిటీ త్వరలోనే తమ నివేదిక అందించనుందని, ఇందులో పేర్కొన్న అంశాల ఆధారంగా వ్యవసాయానికి కేటాయించే నిధులను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని కిషన్ రెడ్డి సూచించారు.

 

ఈశాన్య రాష్ట్రాల్లో పురోగతికి అవకాశమున్న అంశాలు, మనం చేరుకోలేకపోతున్న అంశాలన్నీ కలుపుకుని ‘స్వాట్ అనాలసిస్’ (Strengths, Weakness, Opportunities and Threats) చేసుకుని, వివిధ కీలకమైన రంగాల్లో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించుకుని ముందుకెళ్లాల్సిన అవసరాన్ని కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిపై ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఎన్ఈఆర్ - జిల్లాల వారి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే సమయంలో గ్రామీణ ప్రాంతాల వరకు అనుసంధానతను పరిగణనలోకి తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకాభివృద్ధికి విస్తృతమైన అవకాశాలున్నాయని, ఈ అవకాశాలను గుర్తిస్తూ వాటిని ప్రోత్సహించే లక్ష్యంతో DoNER ఆధ్వర్యంలో టూరిజం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటుచేయనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యాభివృద్ధి అంశాలు ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాలయని ఆయన అన్నారు.

                               https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001U50A.png

                                              https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002YYXK.png

ప్రైవేటు పెట్టుబడులు పెరగాల్సిన అవసరాన్ని కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పెట్టుబడులకు అవసరమైన వాతావరణాన్ని కల్పించే విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇందుకోసం కొన్ని ముఖ్యమైన రంగాలను ఎంచుకుని ముందుగా వాటి విషయంలో పనిచేయాలని, తర్వాత మిగిలిన రంగాల్లోనూ ప్రైవేటు పెట్టబడులను మెల్లిమెల్లిగా పెంచాలని సూచించారు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్శించేందుకు అన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్) ను కూడా త్వరలోనే నిర్వహించే ఆలోచనను కిషన్ రెడ్డి వ్యక్తం చేశారు. పెట్టుబడి దారులకు అవసరమైన విధానపర నిర్ణయాలు, భూ బ్యాంకు డిజటలీకరణ (ఎక్కడెక్కడ ఎంతెంత భూమి అందుబాటులో ఉందనే విషయం), ఇతర పెట్టుబడుల నిబంధనల సరళీకరణ, సింగిల్ విండో నిబంధనల ద్వారా పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించాల్సిన  అవసరం ఉందన్నారు. ప్రతి రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ ఫెసలిటేషన్ సెంటర్ ఏర్పాటుచేయాలని ఆయన సూచించారు. ఇందులో నిర్దేశిత ప్రాంతానికి ఉన్న అనుసంధానత, విద్యుత్ సదుపాయం, నీటి లభ్యత, తదితర అంశాలను వివరించే వ్యవస్థను ఏర్పాటుచేయాలన్నారు. రానున్న రోజుల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ను గొప్పగా నిర్వహించుకునేందుకు అన్ని సాధ్యమైన అంశాలతో సిద్ధం కావాలని కిషన్ రెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఎన్ఈసీ ఉన్నతాధికారులు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ బీఎల్ వర్మ, శాఖ  ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు


(रिलीज़ आईडी: 1866199) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी