గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో ప్రధానమంత్రి సంభాషణ


“విద్యారంగంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం”;

“ఉపాధ్యాయురాలైన ప్రస్తుత భారత రాష్ట్రపతి ద్వారా సత్కారం విశిష్టమైనది”;

“ఒక వ్యక్తికి వెలుగుబాట చూపడం ఉపాధ్యాయుని కర్తవ్యం..
కలలకు రూపమిచ్చి సంకల్పంగా మార్చుకోవడం నేర్పేదీ వారే”;

“ఈ ప్రభుత్వ పత్రం విద్యార్థుల జీవితాలకు ప్రాతిపదిక కాగలిగేలా
జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది”;

“దేశంలో ఏ మూలనైనా 2047 గురించి కలలు కనని విద్యార్థి ఉండరాదు”;

“దండి యాత్ర… క్విట్ ఇండియా మధ్య కాలంలో దేశాన్ని
ఆవహించిన స్ఫూర్తిని పునరుజ్జీవింజేయాల్సిన అవసరం ఉంది”

Posted On: 05 SEP 2022 7:28PM by PIB Hyderabad

   పాధ్యాయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ- ముందుగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళి అర్పించారు. ఉపాధ్యాయురాలు కావడమేగాక ఒడిసా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో విద్యాబోధన చేసిన ప్రస్తుత భారత రాష్ట్రపతి చేతులమీదుగా సత్కారం పొందడం ఎంతో విశిష్ట అంశమని ఆయన ఉపాధ్యాయులకు గుర్తుచేశారు. “ఇవాళ దేశం బృహత్తరమైన స్వాతంత్ర్య అమృత మహోత్సవ స్వప్నాన్ని నెరవేర్చుకోవడం ప్రారంభించిన నేపథ్యంలో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగంలో చేసిన కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సంద‌ర్భంగా జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులంద‌రినీ నేను అభినందిస్తున్నాను” అని ప్ర‌ధానమంత్రి వ్యాఖ్యానించారు.

   పాధ్యాయుల విజ్ఞానం, అంకిత భావం గురించి ప్ర‌ధానమంత్రి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. విద్యార్థులు ముందంజ వేసేదిశగా వారితో కలసి అవిశ్రాంతంగా ప‌నిచేయ‌గల సానుకూల దృక్పథమే వారి విశిష్ట లక్షణమని పేర్కొన్నారు. “ఒక వ్యక్తికి వెలుగుబాట చూపడం ఉపాధ్యాయుని కర్తవ్యం.. అలాగే విద్యార్థుల కలలకు రూపమిచ్చి వాటిని సంకల్పంగా మార్చుకోవడం నేర్పేదీ వారే” అని ఆయన పేర్కొన్నారు. నేటి విద్యార్థులపైనే 2047 నాటి భారతదేశ స్థాయి, భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయని ఆయన అన్నారు. తదనుగుణంగా  విద్యార్థుల భవిష్యత్తును నేటి ఉపాధ్యాయులు రూపొందిస్తున్నారని చెప్పారు. “ఆ విధంగా మీరు విద్యార్థుల జీవితాలను ఉజ్వలం చేయడంతోపాటు దేశ భవితకు ఒక రూపాన్నివ్వడంలో మీ వంతు పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు” అని ప్రధానమంత్రి కొనియాడారు. విద్యార్థి కలలతో ఉపాధ్యాయుడికి అనుబంధం ఏర్పడినప్పుడు, వారినుంచి గౌరవాదరణలు పొందడంలో విజయవంతం కాగలడని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

   వివిధ అంశాలకు సంబంధించి విద్యార్థుల జీవితంలోని సంఘర్షణలు-వైరుధ్యాలను తొలగించాల్సిన ప్రాముఖ్యం గురించి కూడా ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. పాఠశాలలో, సమాజంలో, ఇంట్లో విద్యార్థి అనుభవంలోకి వచ్చే అంశాల నడుమ ఎలాంటి సంఘర్షణకూ తావుండరాదన్నది అత్యంత ప్రధానాంశమని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు, విద్యారంగ భాగస్వాములు విద్యార్థుల కుటుంబాలతో మమేకమయ్యే విధానం అవసరమని ప్రధాని నొక్కిచెప్పారు. ప్రతి విద్యార్థినీ సమానంగా చూడాలని, కొందరిపై ఇష్టం.. మరికొందరిపై అయిష్టం చూపరాదని హితవు పలికారు.

   జాతీయ విద్యా విధానంపై ప్రశంసలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఇది సరైన దిశలో వేసిన ముందడుగని ప్రధాని వ్యాఖ్యానించారు. ఒకటికి నాలుగు సార్లు జాతీయ విద్యా విధానాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. భగవద్గీతను పదేపదే చదివిన మహాత్మాగాంధీ ప్రతిసారి ఓ కొత్త భాష్యాన్ని కనుగొన్నారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వ పత్రం విద్యార్థుల జీవితాలకు ప్రాతిపదిక కాగలిగేలా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. “ఈ విధానాన్ని రూపొందించడంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషించారు” అని ఆయన వెల్లడించారు. అందుకే జాతీయ విద్యా విధానం అమలులో వారి పాత్ర ఎంతో కీలకమని ప్రకటించారు.

   స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో తానిచ్చిన సందేశంలో భాగంగా  ‘పంచ్‌ప్రాణ్‌’ పేరిట చేసిన ప్రకటనను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ ‘పంచ ప్రాణాల’ గురించి పాఠశాలల్లో క్రమం తప్పకుండా చర్చించవచ్చని, తద్వారా వాటి స్ఫూర్తిని విద్యార్థులకు స్పష్టంగా తెలపాలని సూచించారు. ఈ సంకల్పాలు దేశ ప్రగతికి ఒక మార్గంగా ప్రశంసించబడుతున్నాయని పేర్కొన్నారు. ఆ మేరకు వాటిని పిల్లలకు, విద్యార్థులకు తెలియజేసేందుకు మనం ఒక మార్గం అన్వేషించాల్సి ఉందని ఆయన అన్నారు. “దేశంలో ఏ మూలనైనా 2047 గురించి కలలు కనని విద్యార్థి ఉండరాదు” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దండి యాత్ర, క్విట్‌ ఇండియా ఉద్యమాల మధ్య కాలంలో దేశాన్ని ఉర్రూతలూగించిన స్ఫూర్తిని పునరుజ్జీవింప చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు.

   యునైటెడ్ కింగ్‌డమ్‌ను అధిగమించి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ద్వారా భారతదేశం సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ- సుమారు 250 ఏళ్లు మనమీద పెత్తనం చలాయించిన వారిని వెనక్కునెట్టడంలోని ఆనందం ఇప్పుడు ప్రస్ఫుటం అవుతోందన్నారు. గణాంకాల పరంగా 6వ స్థానం నుంచి 5వ స్థానంలోకి దూసుకెళ్లడాన్ని మించిన ఈ వాస్తవం మనకు ఎనలేని సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా భార‌త‌దేశం కొత్త శిఖ‌రాల‌ను అధిరోహించడానికి దోహదం చేసిన త్రివర్ణ స్ఫూర్తిని ప్ర‌ధాని ప్రముఖంగా ప్రస్తావించారు. “ఈ స్ఫూర్తి ఇవాళ చాలా అవసరం” అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం 1930 నుంచి 1942 వరకూ ప్రతి భారతీయుడూ బ్రిటిష్ పాలకులతో పోరాడిన సమయంలో దేశం కోసం జీవించి, శ్రమించి, ఆత్మత్యాగం చేసిన స్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ రగలాలని పిలుపునిచ్చారు. “నా దేశం వెనుకబడి పోవడాన్ని నేనెంత మాత్రం సహించను” అంటూ ప్రతినబూనాలని సూచించారు. “వేల ఏళ్లుగా కొనసాగిన దాస్య శృంఖలాలను మనం ఛేదించాం. మనం ఇక్కడితో ఆగేది లేదు… మున్ముందుకు సాగడమే మన కర్తవ్యం” అని పునరుద్ఘాటించారు. భారత భవిష్యత్‌ చరిత్రలో ఉపాధ్యాయులు ఇలాంటి స్ఫూర్తిని నిండుగా నింపాలని, తద్వారా జాతి బలం బహుళం కాగలదని స్పష్టం చేస్తూ ప్ర‌ధానమంత్రి త‌న ప్ర‌సంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ ప్రధాన్‌, సహాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి కూడా పాల్గొన్నారు.

నేపథ్యం

   ర్తవ్య నిబద్ధత, విశిష్ట కృషితో పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపరచడమేగాక విద్యార్థుల జీవితాలను సుసంపన్నం చేసిన అత్యుత్తమ ఉధ్యాయులను సగౌరవంగా సత్కరించడమే ఈ జాతీయ అవార్డుల ప్రధానోద్దేశం. దేశవ్యాప్తంగా ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో పనిచేస్తున్న  ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు ప్రజల్లోగల గుర్తింపును ఈ జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. ఈ సంవత్సరం పురస్కారాలకు పటిష్ట, పారదర్శక ఆన్‌లైన్ ప్రక్రియను మూడు దశలలో నిర్వహించి 45 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.



(Release ID: 1856962) Visitor Counter : 106


Read this release in: English , Urdu , Hindi