మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఐ.ఐ.ఎం., కోజికోడ్ సహకారంతో మహిళల కోసం ద్విభాషా వ్యవస్థాపకత కార్యక్రమాన్ని అందిస్తున్న - ఎన్.సి.డబ్ల్యు
నాడు పోస్టు చేయడమైనది:
08 AUG 2022 5:13PM by PIB Hyderabad
వ్యవస్థాపక వృత్తిని ప్రారంభించాలనుకునే మహిళా పారిశ్రామికవేత్తలకు వృత్తిపరమైన శిక్షణను అందించడంతో పాటు, ఇప్పటికే ఈ రంగంలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను పెంపొందించుకోడానికి అవసరమైన మార్గదర్శక కార్యక్రమాన్ని అందించడం కోసం కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సోషల్ ఇన్నోవేషన్ (సి.ఈ.ఎస్.ఐ) తో జాతీయ మహిళా కమిషన్ చేతులు కలిపింది.
మహిళా పారిశ్రామికవేత్తలలో వ్యవస్థాపక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి మరియు నిర్మించడానికి జాతీయ మహిళా కమిషన్ చేపడుతున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా, మహిళా వ్యాపారవేత్తలకు వారి వ్యవస్థాపక వెంచర్లను అభివృద్ధి చేయడానికి మరియు కొనసాగించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను తెలుసుకోడానికి వీలుగా, కమీషన్ ఒక ఆన్-లైన్ శిక్షణా కార్యక్రమాన్ని కూడా అభివృద్ధి చేసింది.
ఔత్సాహిక మహిళా వ్యాపార వేత్తలు వారి ప్రస్తుత వృత్తి జీవితం మరియు నైపుణ్యాలకు అనుగుణంగా ఈ రెండు కార్యక్రమాల్లో ఏదో ఒక కార్యక్రమాన్ని ఎంచుకోవచ్చు:
1. వ్యవస్థాపక రంగంలోకి ప్రవేశించాలనుకునే వారి కోసం 'ఫౌండేషన్-ప్రోగ్రామ్-ఇన్-ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్';
2. తమ వ్యాపారాలను పెంపొందించుకోవాలనుకునే వారి కోసం 'అడ్వాన్స్‌డ్-ప్రోగ్రామ్-ఇన్-ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్'.
నాలుగు నెలల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఉపన్యాసాలు, చర్చలు, వ్యవస్థాపకత చర్చలతో పాటు వివిధ విషయ నిపుణుల మార్గదర్శకత్వం ఉంటాయి.
జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి రేఖా శర్మ మాట్లాడుతూ, జీవితంలోని అన్ని రంగాల్లోనూ మహిళలకు సమానావకాశాలు కల్పించాలని కమిషన్ ఎప్పుడూ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. “మహిళల సాధికారతలో ఆర్థిక స్వాతంత్య్రం కీలకమైన అంశం కాబట్టి, మహిళలు తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి, నిలబెట్టుకోవడానికి అవసరమైన జ్ఞానం తో పాటు నైపుణ్యాలను పొందేందుకు కమిషన్ కృషి చేస్తోంది. మహిళలు స్థిరమైన వ్యాపారాలను ప్రారంభించడానికి, నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలు, దృక్కోణాలను అభివృద్ధి చేయడంతో పాటు సమాజానికి దోహదపడటం మా లక్ష్యం" అని శ్రీమతి శర్మ వివరించారు.
వ్యాపారాన్ని గుర్తించడానికి, నిర్మించడానికి అవసరమైన వ్యవస్థాపక నైపుణ్యంతో పాటు, వ్యాపారాన్ని విజయవంతంగా నడపడానికి అవసరమైన నిర్వాహక సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా "ఫౌండేషన్" కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. కాగా, "అడ్వాన్స్‌డ్" కార్యక్రమంలో పాల్గొనేవారు తమ వ్యాపార నమూనాను చక్కగా తీర్చిదిద్దుకోవడం, తమ మార్కెట్ లను విస్తరించుకోవడం, నిధులను అందుబాటులో ఉంచుకోవడంతో పాటు వారి ఉత్పత్తులు, సేవలను వైవిధ్యపరచడం నేర్చుకుంటారు.
"ఫౌండేషన్" కార్యక్రమంలో భాగంగా, 40 గంటల విషయం బోధన, 20 గంటల విషయ నిపుణుల మార్గదర్శకత్వం, ప్రశ్నోత్తరాల విభాగంతో మొత్తం 60 గంటల అభ్యాసం ఉంటుంది. కాగా, "అడ్వాన్స్‌డ్" కార్యక్రమంలో భాగంగా, 20 గంటల విషయ బోధన, 40 గంటల విషయ నిపుణుల మార్గదర్శకత్వం, ప్రశ్నోత్తరాల విభాగంతో మొత్తం 60 గంటల అభ్యాసం ఉంటుంది. శిక్షణ మరియు బోధన ఇంగ్లీషు మరియు మలయాళం భాషల్లో ఉంటాయి.
కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న మహిళలు 2022 ఆగష్టు 16వ తేదీ వరకు https://innovateindia.mygov.in/entrepreneurship-program-for-women/ అనే "మై-గోవ్" పోర్టల్ లో ఆన్-లైన్ లో నమోదు చేసుకోవచ్చు.
******
(రిలీజ్ ఐడి: 1850218)
సందర్శకుల సూచీ సంఖ్య : : 207