పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
పంచాయతీ ఆఫీసుల డిజిటైజేషన్
Posted On:
03 AUG 2022 1:35PM by PIB Hyderabad
పంచాయతీ రాజ్ అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం. పంచాయతీలకు కంప్యూటర్లను ఏర్పాటు చేయడం రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన బాధ్యత అయినప్పటికీ, ఈ విషయంలో రాష్టాలకు తగిన సహాయ, సహకారాలను కేంద్రమంత్రిత్వ శాఖ అందిస్తోంది. రాష్ట్రీయ గ్రామస్వరాజద్ అభియాన్ (ఆర్.జి.ఎస్.ఎ.) పథకం కింద కంప్యూటర్ల ఏర్పాటుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ వార్షిక ప్రణాళికల్లో చేసిన ప్రతిపాదనలపై కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోంది. కేంద్రీయ సాధికారిక కమిటీ ఆమోదంతో ఈ కృషి జరుగుతోంది. డిజిటల్ ఇండియా కలను సాకారం చేసేందుకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ఆధ్వర్యంలో భారత్‌నెట్ ప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తున్నారు. దేశంలోని అన్ని గ్రామపంచాయతీలను బ్రాడ్‌బాండ్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసేందుకు ఈ ప్రాజెక్టు కింద కృషి జరుగుతోంది. భారత్‌నెట్ కార్యక్రమం పరిధిని కూడా 2021 జూన్ నెలాఖరున విస్తరింపజేశారు. దేశంలో గ్రామపంచాయతీల పరిధికి ఆవల ఉన్న అన్ని నివాసిత గ్రామాలకు ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.
పంచాయతీ రాజ్ సంస్థల (పి.ఆర్.ఐ.ల) పనితీరును మార్చివేసే లక్ష్యంతో డిజిటల్ ఇండియా పథకం కింద ఇ-పంచాయత్ మిషన్ మోడ్ కార్యక్రమాన్ని కేంద్రమంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. పంచాయతీలను మరింత పారదర్శకంగా, జవాబుదారీగా, మరింత సమర్థవంతంగా మార్చివేసేందుకు కృషి జరుగుతోంది. పంచాయతీ రాజ్ సంస్థలకోసం పనితీరు ప్రాతిపదికన రూపొందించిన ఇ-గ్రామ్‌స్వరాజ్ అక్కౌంట్ అప్లికేషన్‌ను కేంద్రమంత్రిత్వ శాఖ 202 ఏప్రిల్ 24వ తేదీన ప్రారంభించింది. పంచాయతీల పనితీరుకు సంబంధించిన అన్ని అంశాలకు ఈ అప్లికేషన్‌ను వర్తింపజేశారు. ప్రణాళికా రూపకల్పన, బడ్జెట్ తయారీ, లెక్కల తయారీ, పర్యవేక్షణ, ఆస్తుల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి ఒకే ఒక డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. ఆన్‌లైన్ ద్వారా జరిగే చెల్లింపులకు కూడా ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది.
ఇ-పంచాయతీ అప్లికేషన్‌ల నిర్వహణకు కేంద్రస్థాయి మద్దతు కోసం నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఇన్‌కార్పొరేషన్‌కు ఇ-పంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్టు కింద నిధులను అందిస్తున్నారు.
ఇప్పటివరకూ 2.53లక్షల గ్రామ పంచాయతీలు,.. 2022-23వ సంవత్సరపు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను (జి.పి.డి.పి.లను) ఇ-గ్రామస్వరాజ్‌పై తయారు చేశాయి. 14వ ఆర్థిక సంఘం కింద, 2020-21లో లక్షా 44వేల గ్రామపంచాయతీలు, 2021-22లో 91,607 గ్రామ పంచాయతీలు ఆన్‌లైన్ లావాదేవీలను ప్రారంభించాయి. అలాగే, 15వ ఆర్థిక సంఘం కింద 2021-22లో లక్షా 93వేల గ్రామ పంచాయతీలు ఆన్‌లైన్ లావాదేవీలను మొదలుపెట్టాయి. ఇ-పంచాయతీ మిషన్ మోడ్ కార్యక్రమాన్ని తమతమ వనరుల పరిధిలో అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాలు కృషి చేస్తున్నాయి. పంచాయతీరాజ్ సంస్థల పనితీరులో వివిధ రాష్ట్రాలు డిజిటల్ అప్లికేషన్లను అమలుచేయడంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది.
ఈ సమాచారాన్ని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయమంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ ఈ రోజు రాజ్యసభకు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక లిఖిత పూర్వక సమాధానం ద్వారా ఆయనఈ సమాచారం తెలిపారు.
*****
(Release ID: 1848826)
Visitor Counter : 109