ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

డిజిటల్ ఇండియా, ఇ-గవర్నెన్స్

Posted On: 03 AUG 2022 3:22PM by PIB Hyderabad

     భారతదేశాన్ని డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంలో సాధికార దేశంగా, సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు, డిజిటల్ ఇండియా పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్ర ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన అనుసంధానం, డిజిటల్ సమ్మిళితం, డిజిటల్ సాధికారత, డిజిటల్ పరిజ్ఞానంలో అంతరాల తొలగింపు వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. క్లుప్తంగా చెప్పాలంటే, దేశంలోని ప్రతి పౌరుడి జీవితం మెరుగుపడాలన్నదే మా లక్ష్యం. భారతదేశపు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ, పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు అవకాశాల కల్పన, దేశంలో ప్రపంచ స్థాయి డిజిటల్ పరిజ్ఞాన సామర్థ్యాలను పెంపొందించడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగింది.  

   డిజిటల్ ఇండియా కార్యక్రమం పుణ్యమా అని, ప్రభుత్వానికి పౌరులకు మధ్య దూరం గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు, ఈ కార్యక్రమం అమలుతో ముఖ్యమైన కార్యక్రమాల, పథకాల లబ్ధిని లబ్ధిదారులకు నేరుగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా బట్వాడా చేసేందుకు అవకాశం ఏర్పడింది. పౌరుల జీవితాలను మార్చివేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే ప్రపంచ దేశాల్లో భారతదేశం మరింత సామర్థ్యం కలిగిన దేశంగా ఆవిర్భవించింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేపట్టే పలు రకాల ప్రాజెక్టులు, పథకాలకు డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని వర్తింపజేస్తున్నారు. ప్రజా సేవల బట్వాడాకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో కొన్నింటిని ఈ దిగువన చూడవచ్చు:

  • కామన్ సర్వీస్ సెంటర్లు (సి.ఎస్.సి.లు)గ్రామీణప్రాంతాలకు వాణిజ్య సేవలను డిజిటల్ పద్ధతిలో అందించేందుకు ఈ కామన్ సర్వీస్ సెంటర్లు (సి.ఎస్.సి.లు) ఏర్పాటయ్యాయి. గ్రామ స్థాయి ఔత్సాహికుల (వి.ఎల్.ఇ.ల) ద్వారా ఇవి తమ సేవలను అందిస్తున్నాయి. 400కు పైగా డిజిటల్ సేవలను అందిస్తున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 5.31లక్షల సి.ఎస్.ఇ.లు పనిచేస్తున్నాయి. 4.20లక్షలమేర సి.ఎస్.సి.లు గ్రామ పంచాయతీల స్థాయిలో సేవలందిస్తున్నాయి.
  • కొత్త యుగపు గవర్నెన్స్ కోసం యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్  (ఉమంగ్)మొబైల్ ఫోన్ ద్వారా ప్రభుత్వ సేవలను పౌరులకు అందించేందుకు, 1,570 సేవలు, 22,000కు పైగా బిల్లు చెల్లింపు సేవలు  అందుబాటులో ఉంచేందుకు ఉమంగ్ వ్యవస్థకు రూపకల్పన చేశారు.
  • ఇ-డిస్ట్రిక్ట్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ (ఎం.ఎం.పి.): అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జిల్లా, ఉపజిల్లా పరిధిలో, ఇ-డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు అమలవుతూ వస్తోంది. జనన, కుల ధ్రువీకరణ, మరణ ధ్రువీకరణ, ఆదాయ, స్థానిక నివాస సర్టిఫికెట్లతో సహా, అన్ని రకాల సర్టిఫికెట్లకు సంబంధించిన ఇ-సేవలను అందించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. పెన్షన్ (వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు), ఎలెక్టోరల్, వినియోగదార్ల కోర్టు, రెవెన్యూ కోర్టు, భూమి రికార్డు, వాణిజ్య పన్ను, వ్యవసాయ, కార్మిక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి సేవలు వంటివి ఈ ప్రాజెక్టు ద్వారా అందుతున్నాయి.  ప్రస్తుతం 4,671 ఇ-సర్వీసులను దేశవ్యాప్తంగా 709 జిల్లాల్లో ప్రారంభించారు.
  • డిజీ లాకర్: అధికారిక ధ్రువీకరణ పత్రాలను (పబ్లిక్ డాక్యుమెంట్లను) కాగిత రహితంగా అందుబాటులో ఉంచేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుంది. డిజిలాకర్‌కు 11.7కోట్ల వినియోగదారులు ఉన్నారు. 2,167 జారీ సంస్థలనుంచి 532కోట్లకు పైగా అధికారిక పత్రాలను డిజీ లాకర్ వ్యవస్థ అందుబాటులో ఉంచింది.
  • యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యు.పి.ఐ.) డిజిటల్ పద్ధతిలో చెల్లింపు జరిపేందుకు ఉపయోగపడే వేదికల్లో యు.పి.ఐ. అగ్రస్థానంలో ఉంది. 330కోట్లమేర బ్యాంకులతో అనుసంధానమై ఉంది.  రూ. 10లక్షల కోట్లకు పైగా విలువైన 586కోట్ల వరకూ లావాదేవీలను యు.పి.ఐ. 2022 జూన్ నెలలో నిర్వహించింది.
  • కో-విన్ కోవిడ్ 19 వైరస్ నిరోధంకోసం చేపట్టే వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్, అప్పాయింట్‌మెంట్ షెడ్యూలింగ్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను అందించడం, వంటి కార్యకలాపాలను చేపట్టడానికి ఈ వేదికను నిర్వహించారు. కో-విన్ యాప్ ద్వారా 203 కోట్లమేర వ్యాక్సీన్ డోసులను, 110కోట్లమేర రిజిస్ట్రేషన్లను చేయించగలిగారు.
  • మై గవ్ పౌరుల ప్రమేయం కల్పించేందుకు ఏర్పాటు చేసిన డిజిటల్ ప్లాట్‌ఫామ్. భాగస్వామ్య ప్రాతిపదికన చేపట్టే పరిపాలనా వ్యవస్థకోసం దీనికి రూపకల్పన చేశారు. మైగవ్‌ను ఇపుడు 2.48కోట్లమంది వినియోగిస్తున్నారు.
  • మేరీ పెహ్‌చాన్ జాతీయ స్థాయిలో సింగిల్ సైన్-ఆన్ వేదికగా మేరీ పెహ్‌చాన్‌ను 2022 జూలైలో ప్రారంభించారు. ప్రభుత్వ అధీనంలోని పోర్టల్స్‌తో పౌరులకు సులభంగా అనుసంధానం కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.
  •  మైస్కీమ్ 2022 జూలై నెలలో దీన్ని ప్రారంభించారు. అర్హతా ప్రాతిపదికతో కూడిన సేవలను పౌరులకు అందించే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు.
  • ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు (డి.బి.టి.) 53 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 315 పథకాల ఫలాలను ఆధార్ ప్రాతిపదికన ప్రత్యక్ష ప్రయోజన బదిలీల ద్వారా పౌరులకు అందిస్తున్నారు. డి.బి.టి. విధానం ద్వారా ఇప్పటివరకూ, రూ. 24.3లక్షల కోట్లను పంపిణీ చేశారు.
  • దీక్షాదీక్షా అనేది జాతీయ స్థాయిలో అమలుచేస్తున్న విద్యాబోధనా వేదిక. విద్యా బోధనలో ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పరస్పర సహకార వేదికగా ఇది ఉపయోగపడుతుంది. 2022 జూలై 27 నాటికి, దీక్షా ప్లాట్‌ఫారమ్ ద్వారా 7,633కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకూ 15కోట్ల మేర ఎన్‌రోల్‌మెంట్లు జరిగాయి.

రైతుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ కార్యక్రమాలు, పథకాల్లో కొన్నింటిని ఈ దిగువన చూడవచ్చు:

  • నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్): రైతులు తమ ఉత్పాదనకు గిట్టుబాటు ధరను కల్పించే లక్ష్యంతో ఆన్‌లైన్ ద్వారా పారదర్శకమైన, పోటీ తత్వంతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్) వ్యవస్థను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కోటీ 73లక్షల మంది రైతులు, 2.26లక్షల మంది వ్యాపారులు ఇ-నామ్ వేదికలో రిజిస్టర్ చేసుకున్నారు. 18 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని వెయ్యి మండీలను, మార్కెట్లను కూడా ఇ-నామ్ ప్లాట్‌ఫాంతో సమీకృతం చేశారు.
  • ఎం-కిసాన్- పంటలకు సంబంధించిన అనేక వ్యవహారాల సమాచారాన్ని, హెచ్చరికలను రిజిస్టర్డ్ రైతులకు ఎస్.ఎం.ఎస్.ల ద్వారా పంపించేందుకు తయారు చేసిన పోర్టల్ ఎం-కిసాన్  (www.mkisan.gov.in). ఎం-కిసాన్‌లో 5.13కోట్ల మేర రైతులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.  వ్యవసాయ కార్యకలాపాల్లో రైతులకు సహాయం అందించేందుకు ఇప్పటి వరకూ 2,462కోట్ల మేర మొబైల్ ఆధారిత సలహాలను, సమాచారాన్ని ఎం-కిసాన్ ద్వారా పంపిణీ చేశారు. 
  • వన్ స్టాప్ విండో- విత్తన వంగడాల రకాలు, నిల్వ గోదాములు, మొక్కల చీడపీడల సమాచారంతో సహా, వ్యవసాయ సంబంధమైన అనేక రకాల సమాచారాన్ని పంపిణీ చేసే లక్ష్యంతో రైతుల పోర్టల్ (www.farmer.gov.in)ను ఏర్పాటు చేశారు. ఉత్తమమైన వ్యవసాయ కార్యకలాపాలు, సాగు పద్ధతులు, వాటర్‌షెడ్, మండీ వివరాలు వంటివి, భూఆరోగ్య కార్డు వంటి సమాచారాన్ని కూడా ఈ పోర్టల్ ద్వారా అందిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకూ 22కోట్లకు పైగా భూఆరోగ్య కార్డులను ప్రచురించి, రైతులకు బట్వాడా చేశారు.
  • వ్యవసాయ, ఉద్యానసాగుకోసం మొబైల్ ఆధారిత సలహా వ్యవస్థ (ఎం4అగ్రి)- ఇది వ్యవసాయం, ఉద్యాన సాగులకోసం మొబైల్ ఆధారంగా పనిచేసే సూచనల వ్యవస్థ. ఈశాన్య ప్రాంతంలోని త్రిపుర, మిజోరాం, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ వ్యవస్థను అమలు చేశారు. 

దేశం సామాజిక ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సమాచార పాలనకోసం ప్రభుత్వం ఈ కింది చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ దిగువన చూడవచ్చు:

  • ఓపెన్ గవర్నమెంట్ డాటాసమాచార పంపిణీకి దోహదపడేందుకు, వ్యక్తిగతం కాని సమాచారంపై సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఓపెన్ గవర్నమెంట్ డాటా పేరిట ఒక వేదికకు రూపకల్పన చేశారు. ఇందుకు సంబంధించి 12,800కు పైగా కేటలాగుల్లో 5.65లక్షల డాటా సెట్లను ప్రచురించారు. ఈ ప్లాట్‌ఫాం ద్వారా 93.5లక్షల వరకూ డౌన్‌లోడ్లు జరిగాయి.
  • ఎ.పి.సేతువ్యవస్థలో సమాచార పరస్పర మార్పిడి లక్ష్యంగా ఎ.పి.ఐ. సేతును ఒక వేదికగా రూపొందించారు. ఈ ప్లాట్‌ఫాంలో 2,100కు పైగా ఎ.పి.ఐ.లు వెయ్యికి పైగా యూజర్ సంస్థలను పొందుపరిచారు.  
  • ఎం.ఇ.ఐ.టి.వై.- భారతదేశంపు డిజిటల్ ప్రభుత్వం దార్శనికతను పూర్తిస్థాయిలో సాకారం చేసుకునే లక్ష్యంతో నేషనల్ డాటా గవర్నెన్స్ ఫ్రేంవర్క్ పాలసీ ముసాయిదాను ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎం.ఇ.ఐ.టి.వై.) తయారు చేసింది. డాటా ఆదారిత ప్రభుత్వ పాలనా వ్యవస్థను, ప్రజా సేవా బట్వాడాను బలోపేతం చేసి, డాటా ఆధారిత పరిశోధనకు, ఆవిష్కరణకు ఊతమిచ్చేందుకు ఈ పాలసీని రూపొందించారు. ప్రస్తుతం ముసాయిదా విధానం ఖరారు దశలో ఉంది. నేషనల్ డాటా గవర్నెన్స్ ఫ్రేంవర్క్ పాలసీ ముసాయిదాను 2022 మే నెల 26న మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

  డాటా గోప్యత, భద్రత వంటి అంశాలపై తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన చర్యలు తీసుకుంది. 2000వ సంవత్సరపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ చర్యలు అమలుచేసింది.  

కేంద్ర ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈరోజు లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాలు తెలిపారు.

 

*****



(Release ID: 1848778) Visitor Counter : 144


Read this release in: English , Urdu