నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సముద్ర రంగంలో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన ఒప్పందం

प्रविष्टि तिथि: 29 JUL 2022 2:21PM by PIB Hyderabad

   సముద్ర రంగంలో సంయుక్తంగా నైపుణ్యాభివృద్ధిపై కృషి దిశగా ఓడరేవులు-నౌకారవాణా-జలమార్గాల మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 20న నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన మంత్రిత్వశాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సముద్ర రంగంతోపాటు ఓడరేవులకు సంబంధించి సహజసిద్ధ సామర్థ్యాల సద్వినియోగం, సామర్థ్యాల మెరుగుదల దిశగా ఈ ఒప్పందం కుదిరింది. రెండుశాఖల మధ్య ఈ అవగాహన ఒప్పందం నేపథ్యంలో నేడు వేగంగా మారిపోతున్న పోటీ ప్రపంచంలో పరిస్థితులను ఎదుర్కొనడంతోపాటు సాగరమాల పథకం, ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం (పీఎంకేవీవై) లక్ష్యాలకు అనుగుణంగా రేవులచోదిత శ్రేయస్సు సాధనకు ఒక సంయుక్త సహకార చట్రం ఏర్పాటు కానుంది.

    దీంతోపాటు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ గ్రామీణ నైపుణ్య యోజన (డీడీయూ-జీకేవై), సాగరమాల పథకాలకు తగినట్లు సముద్ర రంగంలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖతోనూ 2017 మే నెలలో ఓడరేవుల మంత్రిత్వశాఖ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, ఈ ఒప్పందం అమలు గడువు 2022 ఏప్రిల్‌ నెలలో మరింత పొడిగించబడింది.

   ఈ ఒప్పందాల నేపథ్యంలో ప్రస్తుతం జవహర్లాల్‌ నెహ్రూ రేవుల ప్రాధికార సంస్థ (జేఎన్‌పీఏ) ఇప్పటికే బహుళ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని (ఎంఎస్‌డీసీ) నిర్వహిస్తోంది. డీడీయూ-జీకేవై, సాగరమాల పథకాల సంలీన అమలులో భాగంగా మొత్తం 57 రకాల అర్హతల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. వీటితోపాటు ఓడరేవుల శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖల మధ్య తాజా ఒప్పందం మేరకు మరో 10 రకాల కార్యక్రమాలను రూపొందించనున్నారు. ప్రధాన రేవులలో ’ఎంఎస్‌డీసీ’లతోపాటు పథకాల అమలు సంస్థల (పీఐఏ) ద్వారానూ అనేక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొత్తంమీద డీడీయూ-జీకేవై, సాగరమాల సంలీన పథకం, ‘పీఎంకేవీవై’లకింద 4,000 మందికిపైగా నైపుణ్య శిక్షణ, నైపుణ్య పునశ్చరణ, నైపుణ్య ఉన్నతీకరణ శిక్షణ పొందారు.

   నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమైన నాటినుంచీ డీడీయూ-జీకేవై, సాగరమాల సంలీన పథకం కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం రూ.77.02 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటికే రూ.36.29 కోట్ల మేర నిధులు విడుదల చేయబడ్డాయి.

   ఓడరేవులు-నౌకారవాణా-జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్‌ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం వెల్లడించారు.

***


(रिलीज़ आईडी: 1846615) आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu