మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

41వ “హునర్ హాట్” అగ్రాలో ప్రారంభం!


ప్రదర్శనను ప్రారంభించిన కేంద్రమంత్రి
ముక్తార్ అబ్బాస్ నక్వీ,
యు.పి. డిప్యూటీ సి.ఎం. పాఠక్ తదితరులు...

శతాబ్దాలనాటి సుసంపన్న కళారూపాలను,
హస్తకళలను సంరక్షించి, ప్రోత్సహించడంలో
హునర్ హాట్ ప్రదర్శనదే కీలకపాత్ర: నక్వీ


రాష్ట్రాల కళా, సంస్కృతీ రూపాలను
ఒకే వేదికపైకి తేవడం సులభం కాదు.
ఈ విషయంలో హునర్ హాట్ కృషి
ప్రశంసనీయం: బ్రజేష్ పాఠక్.


దేశ సంస్కృతి, ఆధ్యాత్మకత, కళలు,
సంగీత, సాహిత్యాలను రక్షించి, ప్రోత్సహించి,
బలోపేతం చేయడమే హునర్ హాట్ లక్ష్యం
: ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

Posted On: 19 MAY 2022 4:51PM by PIB Hyderabad

   కళా రూపాలకు ప్రశంసను, నైపుణ్యానికి తేజస్సును అందించే లక్ష్యంతో హునర్ హాట్ పేరిట చేపట్టిన 41వ ప్రదర్శన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆగ్రా నగరంలో ప్రారంభమైంది. ఆగ్రానగరం తాజ్ గంజ్ ప్రాంతంలో ఉన్న  శిల్పాగ్రామ్ లో ఈ ప్రదర్శనను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్, కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. దేశం అన్ని ప్రాంతాలకూ సంబంధించిన కళా సంస్కృతులను ఒకే చోట వీక్షించేందుకు ఏర్పాటు చేసిన హునర్ హాట్ ప్రదర్శనలో 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 800మందికిపైగా కళా నిపుణులు, హస్త కళాకారులు పాల్గొంటున్నారు. 2022 మే నెల 18న మొదలైన ఈ ప్రదర్శన మే 29వరకూ అంటే 12 రోజులపాటు జరుగుతుంది.

  ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మాట్లాడుతూ, "హునర్ హాట్" అనేది, దేశంలోని అన్ని ప్రాంతాల కళలను, సంస్కృతులను వీక్షించేందుకు ఏర్పాటు చేసిన పటిష్ట వేదిక అని అన్నారు. భారతదేశపు సంప్రదాయ సాస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించి, ప్రోత్సహించడంలో "హునర్ హాట్" పటిష్టమైన పాత్రను పోషిస్తోందని ఆయన అన్నారు.

  హునర్ హాట్ లో ఒకవైపు కళాకారులు, చేతి వృత్తుల వారు సృష్టించిన కళారూపాలే కాక, ప్రతి ప్రాంతానికి చెందిన రుచికరమైన సంప్రదాయ వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయని పాఠక్ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన కళా, సాంస్కృతిక రూపాలను ఒక చోట చేర్చడం అంత సులభమైన పనికాదని, అయితే, ఈ విషయంలో హునర్ హాట్ కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు.

  కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్ మాట్లాడుతూ, భారతదేశపు సంస్కృతి, మతధర్మం, ఆధ్యాత్మికత, కళలు, సంగీతం, సాహిత్యం వంటి వాటిని రక్షించి, తగిన ప్రోత్సాహం అందించడానికి హునర్ హాట్ రూపంలో చక్కని కృషి జరుగుతోందని అన్నారు. జానపద కళలు, జానపద సంస్కృతి, జనపదుల భాష, జానపదుల ఆహారం వంటి అంశాలను చైతన్యవంతంగా కొనసాగిస్తూ వాటిని సమీకృతం చేయడంలో హునర్ హాట్ విశేష కృషి చేస్తోందన్నారు. భారతదేశపు కళా సంస్కృతులను ప్రదర్శించేందుకు హునర్ హాట్ అద్భుతమైన, సుసంపన్నమైన వేదికగా పనిచేస్తుందని ఆయన అన్నారు.

   కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ మాట్లాడుతూ, విధాన స్తబ్దత అన్న వ్యాధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్మూలించారని,  దాని స్థానంలో సంస్థాగతమైన సుపరిపాలనా ప్రక్రియను, సమ్మిళిత అభివృద్థి కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. సంక్షోభాన్ని సదవకాశంగా మార్చడం ద్వారా మోదీ దేశాన్ని రక్షించారని కేంద్రమంత్రి అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతున్న తరుణంలో కూడా, దేశ భద్రత, దేశం సంక్షేమం, దేశ ప్రజల క్షేమం కోసం నరేంద్రమోదీ నిర్విరామంగా కృషి చేశారని ఆయన అన్నారు.

  స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం”, “స్వదేశీ తయారీ”, “స్వావలంబనతో కూడిన భారతదేశం”, “ఏక్ భారత్ శ్రేష్ణ భారత్ వంటి నినాదాల సమీకృత సమాహారానికి ప్రతిరూపమే హునర్ హాట్ ప్రదర్శన అని నక్వీ అన్నారు. మనదేశపు శతాబ్దాల చరిత్ర కలిగిన సుసంపన్నమైన వారసత్వ సంపద, కళలు, హస్తకళా ఖండాలను పరిరక్షించి, తగిన ప్రోత్సాహం కల్పించండలో హునర్ హాట్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

  కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన దాదాపు 10లక్షల 50వేల మంది హస్తకళాకారులకు, కళా నిపుణులకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను హునర్ హాట్ కల్పించిందని, గత ఆరేళ్ల కాలంలో ఈ కృషి జరిగిందని నక్వీ అన్నారు. ఇలా లబ్ధి పొందిన వారిలో 50శాతం మందికి పైగా మహిళలే ఉన్నారని ఆయన తెలిపారు. దాదాపుగా అంతరిస్తున్న స్థితికి చేరుకున్న శతాబ్దాల చరిత్ర కలిగిన స్వదేశీ కళా సంస్కృతులకు హునర్ హాట్ ప్రదర్శన కొత్త వైభవాన్ని, గుర్తింపును తీసుకువచ్చిందన్నారు. హునర్ హాట్ ఇంత అద్భుతంగా విజయవంతం కావడానికి స్వదేశీ భావనపట్ల ప్రజల్లో ఏర్పడిన సానుకూలత,

ఉత్సాహమే ప్రధాన కారణమని అన్నారు.

  మట్టి పాత్రలనుంచి, కలప వస్తువులు, చందనపు ఉత్పాదనలు, బంకమట్టితో తయారు చేసిన వస్తువులు, గాజు ఉత్పాదనలు, ఇనుముతో తయారైన వస్తువులు, చేనేత, హస్తకళాఖండాల వరకూ చేతితో తయారైన అనేక వస్తువులను, హస్తకళా రూపాలను హునర్ హాట్  ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. మేరా గాఁవ్ మేరా దేశ్ పేరిట ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలను, ఆహార పదార్దాలను సందర్శకులు రుచి చూస్తున్నారు.  “విశ్వకర్మ వాటిక”, సంప్రదాయ సర్కస్, లేజర్ షోల ప్రదర్శన, ప్రముఖ, వర్ధమాన కళాకారులు అందించే సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, సెల్ఫీ పాయింట్లు వంటివి హునర్ హాట్ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.

   ఆగ్రాలో జరుగుతున్న హునర్ హాట్ ప్రదర్శనలో ప్రతి రోజూ సాయంత్రం సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ప్రముఖ కళాకారులు, శైలేంద్ర సింగ్, పంకజ్ ఉధాస్, దలేర్ మెహదీ, అల్తాఫ్ రజా, తలత్ అజీజ్, మోహిత్ చౌహాన్, రూప్ కుమార్ రాథోడ్- సోనాలీ రాథోడ్, భూమీ త్రివేదీ, పూర్ణిమా శ్రేష్ట్ర, రాజు శ్రీవాత్సవ, నిజామీ బంధు, ప్రతిభా సింగ్ బఘేల్, దిల్ బాగ్ సింగ్, నేహా ఖాన్, మహిత్ ఖన్నా, రేఖా రాజ్, పి. గణేశ్, బేలా సులేఖ, అంకితా పాఠక్, జాలీ ముఖర్జీ, అదితీ ఖండేగల్, హేమా సర్దేశాయి, భూపీందర్ సింగ్ భుప్పీ, అనిల్ భట్, హంసికా అయ్యర్, ప్రియా మాలిక్, దిల్బాగ్ సింగ్, రితేశ్ మిశ్రా, భూమికా మాలిక్, అషు బజాజ్, వివేక్ మిశ్రా, రాహుల్ జోషి, సుప్రియా జోషీ, తదితరులు వివిధ రకాల సంగీత, సాంస్కృతిక, సంప్రదాయ కళా కార్యక్రమాలు, నృత్యాలు, హాస్య కార్యక్రమాలతో వీక్షకులను అలరించబోతున్నారు.

   ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి బేబీ రాణీ మౌర్య, రాజ్యసభ సభ్యుడు హరిద్వార్ దూబే, ఆగ్రా నగర మేయర్ నవీన్ జైన్, ఆగ్రా కంటోన్మెంట్ శాసనసభ్యుడు డాక్టర్ జి.ఎస్. ధర్మేష్, ఆగ్రా నార్త్ శాసనసభ్యుడు పురుషోత్తమ్ ఖండేల్వాల్, బాహ్ ఎమ్మెల్యే రాణీ పక్షాలికా సింగ్, ఎట్మాడ్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ ధర్మపాల్ సింగ్, ఫతేహాబాద్ ఎమ్మెల్యే చౌటే లాల్ వర్మ, ఫతేపూర్ సిక్రీ ఎమ్మెల్యే బాబూలాల్ చౌధరి, ఖేరాగఢ్ ఎమ్మెల్యే భగవాన్ సింగ్, ఎమెల్సీ డాక్టర్ ఆకాశ్ అగర్వాల్, బి.జె.పి. ఆగ్రా జిల్లా అధ్యక్షుడు గిరిరాజ్ సింగ్ కుష్వాహ్, మహానగర్ అధ్యక్షుడు భాను మహాజన్, ఉత్తరప్రదేశ్ ఎస్.సి., ఎస్.టి. కమిషన్ చైర్మన్ డాక్టర్ రాంబాబు హరీత్, ఉత్తరప్రదేశ్ మైనారిటీ కమిషన్ అధ్యక్షుడు అష్ఫాఖ్ సైఫీ తదితర ప్రముఖులు హునర్ హాట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

***



(Release ID: 1826777) Visitor Counter : 158


Read this release in: English , Urdu , Hindi