ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

వ్యవసాయ రంగంలో పరిశోధనలకు మరింత ప్రోత్సాహం కల్పించాలి: ఉపరాష్ట్రపతి

అన్ని రంగాలు భారతీయికరణ వైపు పయనించాలని ఆకాంక్ష

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్ని రంగాల్లో ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచన

దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఈ సేవలు చేరువ కావలసిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

మానవ వనరులతో పాటం సాంకేతిక పురోగతిని వ్యవసాయరంగ అభివృద్ధికి వినియోగించాలని సూచన

హైదరాబాద్ లోని ఐసీఏఆర్-ఎన్ఏఏఆర్ఎమ్ స్నాతకోత్సవానికి హాజరైన ఉపరాష్ట్రపతి

Posted On: 14 MAY 2022 4:29PM by PIB Hyderabad

భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంతోపాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు దేశంలోని వ్యవసాయ సామర్థ్యాన్ని, నాణ్యతను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా పరిశోధనలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వ్యవసాయంలో దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఇందుకోసం R&D నిధులను మరింతగా పెంచాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. 

హైదరాబాద్ లో ని ఐసీఏఆర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (ఎన్ఏఏఆర్ఆర్ఎమ్) స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వ్యవసాయ రంగంలో పరిశోధలను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు వ్యవసాయ విద్యను విస్తృతం చేయడమే లక్ష్యంతో ఐసీఏఆర్ ఆధ్వర్యంలో నార్మ్ ను ఏర్పాటుచేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో జరిగే ప్రతి పరిశోధన, విధాన నిర్ణేతల నిర్ణయాల అంతిమ లక్ష్యం వ్యవసాయాన్ని సుస్థిరం చేయడం, వాతావరణ మార్పులనుంచి పంటను రక్షించుకోవటం, అన్నదాతల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచటం, దేశ పౌష్టికాహార భద్రతను కాపాడటమే కావాలన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు విద్యార్థులకు బంగారు పతకాలతోపాటు, డైరెక్టర్ మెడల్స్ ను అందజేశారు. భారతీయ సంప్రదాయ వస్త్రాలు ధరించి స్నాతకోత్సవానికి హాజరైన విద్యార్థులను అభినందించిన ఉపరాష్ట్రపతి దేశంలోని అన్ని రంగాలు భారతీయికరణ వైపు పయనించాలని ఆకాంక్షించారు.

కొత్త వ్యవసాయ సాంకేతిక పద్ధతులను, సుస్థిర వంగడాలను వృద్ధి చేయటం మాత్రమే లక్ష్యం కాకుడదన్న ఉపరాష్ట్రపతి.. ప్రతి అన్నదాతను సంప్రదాయ విధానం, అధునాతన సాంకేతిక పద్ధతులతో కలిసి పనిచేసేలా చైతన్య పరచాల్సిన బాధ్యతను కూడా దేశంలోని వ్యవసాయ విద్యాలయాలు భుజస్కంధాలపై వేసుకోవాలన్నారు. వ్యవసాయ పరిశోధనలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడటంలోనూ చొరవతీసుకోవాలని ఆయన సూచించారు. అప్పుడే అన్నదాతల ఆదాయం రెట్టింపు చేసేదిశగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేస్తున్న ఆలోచనలు వేగంగా అమలయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు.

రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసే విషయంలోనూ స్థానిక భాషలోనే వ్యవసాయ శాస్త్రవేత్తలు వారికి బోధించాలని, వారికి అర్థమయ్యే భాషలో చెబితేనే ఆ సాంకేతికత గురించి వారికి తెలుస్తుందన్నారు. ఇందుకోసం మొబైల్ ఆధారిత సాంకేతికతతో మొదలుపెట్టి ఇతర అంశాలను వారికి నేర్పించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

భారతీయ వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తున్న నీటి లభ్యత, వాతావరణ మ ర్పులు, భూసారం తగ్గడం, జీవవైవిధ్యంలో ప్రతికూల మార్పులు, కొత్త కీటకనాశినులు, మొక్కలకు వచ్చే కొత్త వ్యాధులు తదతర అంశాలపైనా ఉపరాష్ట్రపతి తన ఆలోచనలను వ్యవసాయ పరిశోధనకారులు, విద్యార్థులతో పంచుకున్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.

ఇందుకోసం పరిశోధనల్లో సృజనాత్మకతతోపాటు మానవ వనరులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సేవలను మరింత సమర్థవంతంగా, విస్తృతంగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. జెనోమిక్స్, మాలిక్యులార్ బ్రీడింగ్, నానో టెక్నాలజీ మొదలైన రంగాలపై దృష్టిసారించాలన్నారు. డ్రోన్స్, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతను కూడా వ్యవసాయానికి మరింత చేరువ చేయడంలో ఐసీఏఆర్ మరింత కృషి చేయాలన్నారు.

దీంతోపాటుగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు నైపుణ్యత కలిగిన మానవ వనరుల అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న వారు వ్యవసాయాన్ని సంఘటిత రంగంగా మార్చేందుకు ప్రయత్నించాలని, ఉద్యోగాన్వేషణ కంటే, ఉద్యోగ కల్పనపై దృష్టిసారించాలన్నారు. యువత వ్యవసాయంపై దృష్టి సారించినప్పుడే మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. 

వాతావరణ సమస్యలు, ఇతర ఇబ్బందులు ఎన్నున్నా అన్నదాత తన బాధ్యతను విస్మరించకుండా ఆహారోత్పత్తికోసం అహరహం శ్రమిస్తున్నాడని, కరోనా సమయంలోనూ భారతదేశంలో ఆహారోత్పత్తి ఏమాత్రం తగ్గకపోగా ఉత్పత్తి శాతం పెరగడం భారతీయ అన్నదాతల అంకితభావానికి, పట్టుదలకు నిదర్శనమని ఉపరాష్ట్రపతి అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్-ఎన్ఏఏఆర్ఎమ్ హెడ్ డాక్టర్ రంజిత్ కుమార్, ఐసీఏఆర్ డీజీ, డీఏఆర్ఈ కార్యదర్శి డాక్టర్ టి. మహాపాత్ర, సంస్థ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావ్, డీన్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి. వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ కో-ఆర్డినేటర్ బి.గణేశ్ కుమార్ తో పాట విద్యార్థులు, వ్యవసాయ రంగ నిపుణులు, పరిశోధకులు పాల్గొన్నారు.



(Release ID: 1825366) Visitor Counter : 120