శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రపంచశ్రేణి సొంత పరిజ్ఞానంతో దేశంలో రహదారుల నిర్మాణం కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడి..
సైన్స్, టెక్నాలజీ వినియోగంతో ప్రగతి దిశగా
రోడ్డు రవాణా, రహదారుల నిర్మాణం..
Posted On:
09 MAY 2022 5:17PM by PIB Hyderabad
రోడ్లు, రహదారుల నిర్మాణంకోసం ప్రపంచ స్థాయి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉందని కేంద్ర సైన్స్ టెక్నాలజీ శాఖ సహాయ (స్వతంత్రహోదా) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. అయితే, వినియోగానికి అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం గురించి సంబంధిత మంత్రిత్వ శాఖలు వేటికీ పూర్తి స్థాయి అవగాహన లేదని ఆయన అన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చునో, వివరించేందుకు ఆయా శాఖల శాస్త్రవేత్తలు వివిధ రంగాల మంత్రిత్వ శాఖల ప్రతినిధులకు వివరించే ప్రక్రియను తాను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు.
రోడ్లు, రహదారుల నిర్మాణానికి తాజాగా తగిన విలువల జోడింపు కోసం కేంద్ర విజ్ఞానశాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్.ఐ.ఆర్.) నూతనంగా రూపొందించిన రెండు పరికరాలను ప్రజలకు అంకితం చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని ప్రసంగించారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సహాయమంత్రి రిటైర్డ్ జనరల్ వి.కె. సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'సంచార కోల్డ్ మిక్చర్, కమ్ పేవర్' అనే యంత్రాన్ని, అలాగే, రహదారుల వెంబడి ఏర్పడిన గుంటలను పూడ్చేందుకు వినియోగించే 'ప్యాచ్ ఫిల్ యంత్రాన్ని' ఈ కార్యక్రమంలో లాంఛనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, రోడ్డు రవాణా, రహదారుల రంగంలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న సైన్స్, టెక్నాలజీ వినియోగంతో భారతదేశపు అభివృద్ధి కార్యక్రమాలకు మరింత విలువ చేకూరుతోందని అన్నారు. మరో పాతిక సంవత్సరాలకు అంటే మనం స్వాతంత్ర్యం సాధించి వందేళ్లయ్యే నాటికి ప్రపంచంలో భారతదేశాన్ని ముందువరుసలో నిలవడంలో అధునాతన రహదారులు కీలకపాత్ర పోషిస్తాయని, దేశ రహదారుల చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ గతంలో చేసిన వ్యాఖ్యలను మంత్రి ప్రస్తావించారు. "అమెరికా సంపన్నదేశం కాబట్టి అమెరికన్ రోడ్లు బాగలేవని అనరాదు. అమెరికా రోడ్లు బాగున్నాయి కాబట్టే అమెరికా సంపన్నదేశం అవుతుంది". అన్న కెన్నెడీ వ్యాఖ్యలను డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా ఉదహరించారు.
రోడ్లు, రహదారుల నిర్మాణంలో అందుబాటు యోగ్యమైన, సుస్థిరమైన, పునర్వినియోగానికి వీలైన సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించడంతో భారతదేశంలో రోడ్ల వ్యవస్థ వేంగా రూపుదిద్దుకోగలిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో భారతదేశం వర్ధమాన దేశాలన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. రానున్న దశాబ్దాల్లో భారతదేశం పురోగతిని నిర్వహించేందుకు సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలనే ప్రమాణంగా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
రహదారుల నిర్మాణంకోసం కొత్తగా ఆవిష్కరించిన రెండు అధునాతన యంత్రాలను గురించి కేంద్రమంత్రి ప్రస్తావిస్తూ,.. ఈ రెండు యంత్రాలూ పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోనే తయారయ్యాయని, స్వావలంబన లక్ష్యంగా దేశం సాధించిన "ఆత్మనిర్భర భారత్" స్థాయికి ఈ యంత్రాలే సరైన ఉదాహరణలని ఆయన అన్నారు. దేశంలోని పర్వత ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఈశాన్య ప్రాతంలో జరిగే రోడ్లు, రహదారుల నిర్మాణంలో కోల్డ్ మిక్సర్, ప్యాచ్ ఫిల్ మెషీన్ కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు.
సైన్స్, టెక్నాలజీకి సంపబంధించిన విభిన్న రంగాల్లో అధునాతన పరిశోధన, అభివృద్ధి పరిజ్ఞానాల రూపకల్పనకు సి.ఎస్.ఐ.ఆర్. ప్రసిద్ధి చెందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. రహదారులు, రోడ్డు రవాణా రంగాలకోసం కేంద్ర రహదారుల పరిశోధనా సంస్థ సహకారంతో పాటుగా, సి.ఎస్.ఐ.ఆర్. సంబంధిత పరిశోధనాగారాలు కూడా ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాల ఆవిష్కరణకోసం కలసి పనిచేయవచ్చని ఆయన సూచించారు. సొరంగాల తవ్వకం, ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రానిక్స్, రోడ్ పేవ్మెంట్ బిండర్లు, హైడ్రోకార్బన్లు, జియోపాలిమర్, రోడ్డు వెంబడి మొక్కల పెంపకం, పర్యావరణ ప్రభావిత అధ్యయనం, యంత్రాలు, యంత్ర పరికరాల రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాల ఆవిష్కరణ, వినియోగం కోసం వివిధ లేబరేటరీలు పనిచేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశంలో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానస్థాయికి తీసుకురావాలన్న ప్రధానమంత్రి దార్శనిక భావాలను, ఆలోచనలను గురించి కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈశాన్య ప్రాంతం, కొండ ప్రాంతాల రాష్ట్రాలు, ఇతర వెనుకబడిన ప్రాంతాల బహుముఖ అభివృద్ధికోసం ప్రభుత్వం 2014వ సంవత్సరంనుంచి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూవస్తున్నట్టు చెప్పారు. గత ఏడెనిమిది సంవత్సరాల కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ స్థాయిలో నిర్మితమైన రహదారులు, రైలు మార్గాల వ్యవస్థ కారణంగా ఆ ప్రాంతంలో ఎన్నో సానుకూల సామాజిక, ఆర్థిక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో మెరుగైన రవాణా ఏర్పాట్లు, ఆర్థిక ప్రగతి లక్ష్యంగా కొత్తగా 3 జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ రోడ్ కారిడార్. నిర్మాణం పూర్తి చేయడంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కృషి అభినందనీయమని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
<><><>
(Release ID: 1824026)
Visitor Counter : 217