ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2022 ఏప్రిల్ 24వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట ’) కార్యక్రమం 88వ భాగం లో ప్రధాన మంత్రిప్రసంగం పాఠం

Posted On: 24 APR 2022 11:38AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం.

 

కొత్త అంశాల తో, కొత్త స్ఫూర్తిదాయకమైన ఉదాహరణల తో, కొత్త కొత్త సందేశాల తో మీకు నా ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) చెప్పేందుకు మరోసారి మీ ముందుకు వచ్చాను. ఈసారి నాకు ఎక్కువ ఉత్తరాలు, సందేశాలు ఏ విషయం పై వచ్చాయో మీకు తెలుసా? అది చరిత్ర, వర్తమానం మరియు భవిష్యత్తు.. ఈ మూడిటి కి సంబంధించింది. మరి నేను చెబుతోంది దేశాని కి లభించిన నూతన ప్రధాన మంత్రి సంగ్రహాలయాన్ని గురించి.

 

 

బాబాసాహెబ్ అమ్బేడ్ కర్ జయంతి నాడు, ఈ ఏప్రిల్ 14వ తేదీ న ప్రధాన మంత్రి సంగ్రహాలయాన్ని దేశ ప్రజల కు అంకితం చేయడం జరిగింది. దేశ పౌరుల కోసం ఈ మ్యూజియాన్ని తెరవడమైంది. సార్థక్ గారు ఒక శ్రోత. ఆయన గురుగ్రామ్‌ లో ఉంటారు. ఒకటో అవకాశం దొరకడంతోనే ఆయన ప్రధాన మంత్రి సంగ్రహాలయాన్ని చూడడానికి వచ్చారు. సార్థక్ గారు నమో ఏప్‌ (Namo App) లో నాకు రాసినటువంటి సందేశం చాలా ఆసక్తికరం గా ఉంది. ఆయన చాలా సంవత్సరాలు గా న్యూస్ చానల్స్ ను చూస్తున్నట్లు, వార్తాపత్రికల ను చదువుతున్నట్లు, కొన్నాళ్లు గా సామాజిక మాధ్యమాల తో జత కలసినట్లు తెలియజేశారు. మరి ఆయన కు సామాన్య జ్ఞ‌ానం చాలా బాగుందని అనిపించేదట. కానీ ప్రధాన మంత్రి సంగ్రహాలయానికి వెళ్లినప్పుడు ఆయన చాలా ఆందోళన కు గురయ్యారు. దేశాన్ని గురించి, దేశాని కి నాయకత్వం వహించిన వారి ని గురించి చాలా విషయాలు ఆయన కు తెలియనే తెలియవు అనే సంగతి ని ఆయన గ్రహించారు. ప్రధాన మంత్రి సంగ్రహాలయం లో తనకు ఆసక్తికరంగా కనిపించిన విషయాల ను గురించి ఆయన రాశారు. లాల్ బహాదుర్ శాస్త్రి గారి కి ఆయన అత్తమామ లు బహుమతి గా ఇచ్చిన చరఖా ను చూసి సార్థక్ గారు చాలా సంతోషించారు. శాస్త్రి గారి పాస్‌బుక్‌ ను కూడా సార్థక్ గారు చూశారు. శాస్త్రి గారి వద్ద ఎంత తక్కువ డబ్బు ఉండిందీ కూడా ఆయన తెలుసుకోగలిగారు. ‘స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొనడానికి ముందు మొరార్ జీ భాయి దేసాయి గుజరాత్‌ లో డిప్యూటీ కలెక్టర్‌ గా ఉన్నారని నాకు తెలియదు’ అంటూ సార్థక్ గారు రాశారు. మొరార్ జీ దేసాయి పరిపాలన రంగం లో సుదీర్ఘ కాలం పాటు సేవల ను అందించారు. చౌధరీ చరణ్ సింహ్ గారి ని గురించి కూడా సార్థక్ గారు రాశారు. జమీందారీ నిర్మూలన కోసం చౌధరి చరణ్ సింహ్ గారు గొప్ప గా కృషి చేశారన్న విషయం ఆయన ఎరుగరు. ఇది మాత్రమే కాదు, ‘శ్రీ పి.వి. నరసింహారావు గారు భూ సంస్కరణల విషయం లో చాలా ఆసక్తి ని కనబరిచిన సంగతి ని కూడా ఈ మ్యూజియమ్ లోనే నేను తెలుసుకొన్నాను’ అంటూ సార్థక్ గారు వివరించారు. చంద్రశేఖర్ గారు నాలుగు వేల కిలోమీటర్లకు పైగా నడచి చరిత్రాత్మకమైనటువంటి భారతదేశం యాత్ర ను చేశారని ఈ మ్యూజియానికి వచ్చిన తరువాతే సార్థక్ గారి కి కూడా తెలిసివచ్చింది. అటల్ గారు ఉపయోగించిన వస్తువుల ను సంగ్రహాలయం లో చూసినప్పుడు, ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు సార్థక్ గారు గర్వం తో ఉప్పొంగిపోయారు. ఈ మ్యూజియమ్ లో మహాత్మ గాంధీ, సర్ దార్ పటేల్, డాక్టర్ అమ్బేడ్ కర్, జయ ప్రకాశ్ నారాయణ్, మన ప్రధాన మంత్రి పండిత్ జవాహర్‌ లాల్ నెహ్ రూ లను గురించి కూడా చాలా ఆసక్తికరమైన సమాచారం ఉంది అని సార్థక్ గారు వెల్లడి చేశారు.

 

 

 

మిత్రులారా, దేశ ప్రధానమంత్రుల సేవల ను గుర్తు కు తెచ్చుకోవడానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కంటే మంచి కాలం మరేమిటి ఉంటుంది! స్వాతంత్య్ర అమృత మహోత్సవం ప్రజా ఆందోళన రూపాన్ని దాల్చడం దేశాని కి గర్వకారణం. చరిత్ర అంటే ప్రజల లో ఆసక్తి చాలా పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితి లో దేశం లోని అమూల్యమైన వారసత్వ సంపద తో యువత ను కలుపుతూ ఈ మ్యూజియమ్ యువత కు ఆకర్షణ కేంద్రం గా మారుతున్నది.

 

 

 

మిత్రులారా, మ్యూజియాన్ని గురించి మీతో ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అని నాకు తోచింది. మీ సామాన్య జ్ఞ‌ానం ఏం చెప్తుందో చూద్దాం. మీకు ఎంత అవగాహన ఉందో చూద్దాం. మీరు సిద్ధం గా ఉన్నారా? నా యువ సహచరులు కాగితాన్ని, కలాన్ని వారి చేతుల లోకి తీసుకున్నారా? నేను ప్రస్తుతం మిమ్మల్ని అడిగే ప్రశ్నల కు సమాధానాల ను మీరు నమో ఏప్ (NaMo App) లేదా సామాజిక మాధ్యమం లో అయితే #MuseumQuiz తో శేర్ చేసుకోవచ్చును. దయచేసి ఈ ప్రశ్నలన్నిటి కి జవాబుల ను ఇవ్వవలసింది గా మిమ్మల్ని నేను కోరుతున్నాను. దీంతో దేశ వ్యాప్తం గా ప్రజల లో మ్యూజియం పైన ఆసక్తి అధికం అవుతుంది. దేశం లోని ఏ నగరం లో ప్రసిద్ధ రైలు మ్యూజియం ఉందో మీకు తెలుసా? అక్కడ గత 45 సంవత్సరాలు గా భారతీయ రైల్ వే వారసత్వాన్ని చూసే అవకాశం ప్రజల కు లభిస్తోంది. నేను మీకు మరొక క్లూ ఇస్తాను. మీరు ఇక్కడ ఫెయరీ క్వీన్, సలూన్ ఆఫ్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి మొదలుకొని ఫైయర్‌లెస్ స్టీమ్ లోకోమోటివ్ వరకు కూడాను తిలకించేందుకు వీలు ఉంది. ముంబయి లోని ఏ మ్యూజియమ్ కరెన్సీ యొక్క పరిణామ క్రమాన్ని ఆసక్తికరం గా వివరిస్తుందో మీరు ఎరుగుదురా? క్రీస్తు కు పూర్వం ఆరో శతాబ్దానికి చెందిన నాణేలు ఆ సంగ్రహాలయం లో ఉన్నాయి. మరో వైపు ఎలక్ట్రానిక్ మనీ (e-Money) కూడా ఉందండోయ్. మూడో ప్రశ్న 'విరాసత్--ఖాల్ సా' ఈ మ్యూజియం తో పెనవేసుకొని ఉంది. మీకు తెలుసా, ఈ మ్యూజియమ్, పంజాబ్‌ లోని ఏ నగరం లో ఉందో? గాలిపటాల ను ఎగురవేయడం అంటే దాంతో మీకందరి కి చాలా ఆనందం వేస్తుందనుకుంటాను. మరి తదుపరి ప్రశ్న దీనితోనే ముడిపడిన ప్రశ్న సుమా. దేశం లోని ఒకే ఒక కైట్ స్ (గాలిపటాల) మ్యూజియం ఎక్కడ ఉంది? నేను మీకు ఒక క్లూ ను ఇస్తాను. ఆ మ్యూజియం లో ఉన్న అతి పెద్ద గాలిపటం యొక్క ఆకారం 22 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు తో ఉంది. ఏమైనా గుర్తొచ్చిందా? లేదంటే ఇక్కడే ఇంకొక విషయాన్ని చెబుతాను. ఈ సంగ్రహాలయం ఉన్న ఊరి తో బాపు గారి కి ప్రత్యేక అనుబంధం ఉండింది. చిన్నతనం నుంచి తపాలా బిళ్లల ను సేకరించే అలవాటు ఎవరికి మాత్రం ఉండదు! అయితే భారతదేశం లో తపాలా బిళ్లల కు సంబంధించిన జాతీయ సంగ్రహాలయం ఎక్కడ ఉంది అనేది మీకు తెలుసునా? నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. గుల్ శన్ మహల్ పేరు తో ఉన్నటువంటి భవనం లో ఏ మ్యూజియమ్ ఉందంటారు? మీ కోసం ఒక క్లూ; అది ఏమిటి అంటే, ఆ మ్యూజియమ్ లో మీరు సినిమా డైరెక్టర్‌ గా కూడా మారవచ్చును అనేదే. మీరు కేమరా, ఎడిటింగ్ ల వంటి సూక్ష్మాల ను కూడా అక్కడ దర్శించవచ్చును. సరే, మీరు భారతదేశం యొక్క వస్త్రాల తో జతపడినటువంటి వారసత్వాన్ని తెలియజేసే మ్యూజియాన్ని గురించి తెలుసుకొన్నారా? ఆ మ్యూజియమ్ లో సూక్ష్మ రూప వర్ణ చిత్రాలు, జైన చేతిరాత ప్రతులు, శిల్పాలు చాలానే ఉన్నాయి. అది తన విశిష్ట ప్రదర్శన కు కూడాను ప్రఖ్యాతి గాంచింది.

 

 

 

మిత్రులారా, ఈ సాంకేతిక విజ్ఞ‌ాన యుగం లో మీరు వాటికి సమాధానాలు కనుగొనడం చాలా సులభం. మన కొత్త తరం లో ఆసక్తి పెరగాలని, వాటి గురించి మరింత ఎక్కువ గా చదవాలని, చూడడానికి వెళ్లాలని నేను ఈ ప్రశ్న లు వేశాను. ఇప్పుడు మ్యూజియాల కు ఉన్న ప్రాధాన్యం కారణం గా చాలా మంది స్వయం గా ముందుకు వచ్చి వాటి కి విరాళాలు ఇస్తున్నారు. చాలా మంది వారి పాత సేకరణల తో పాటు చారిత్రిక విశేషాల ను మ్యూజియాల కు అందజేస్తున్నారు. మీరు ఇలా చేసినప్పుడు ఒక విధం గా మీరు యావత్తు సమాజం తో సాంస్కృతిక అంశాల ను పంచుకొంటారన్నమాట. భారతదేశం లో కూడా ఇప్పుడు ప్రజలు దీని కోసం ముందుకు వస్తున్నారు. అలాంటి వ్యక్తిగత ప్రయత్నాలన్నిటి ని నేను అభినందిస్తున్నాను. ఈ రోజుల లో మారుతున్న కాలం లో కోవిడ్ నిబంధన ల కారణం గా మ్యూజియాల లో కొత్త పద్ధతుల ను అవలంబించడం పై దృష్టి సారిస్తున్నారు.

 

 

మ్యూజియాల లో డిజిటలైజేశన్‌ పై కూడా దృష్టి పెరిగింది. మే 18 న అంతర్జాతీయ సంగ్రహాలయ దినాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోనున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. నా యువ సహచరుల కోసం నా దగ్గర ఒక ఆలోచన ఉంది. రాబోయే సెలవుల లో మీ స్నేహితుల బృందం తో కలసి వెళ్లి స్థానిక సంగ్రహాలయాన్ని ఎందుకు సందర్శించకూడదు! మీ అనుభవాన్ని #MuseumMemories తో శేర్ చేయండి. మీరు ఇలా చేసినందువల్ల ఇతరుల మనస్సు లో సైతం మ్యూజియాల తాలూకు ఆసక్తి ఏర్పడుతుంది.

 

 

 

ప్రియమైన నా దేశప్రజలారా, మీరు మీ జీవనం లో చాలా సంకల్పాల ను తీసుకొని ఉంటారు. వాటిని నెరవేర్చడానికి మీరు కష్టపడి ఉండాలి. ఇటీవలే నేను ఒక భిన్నమైన, ప్రత్యేకమైన సంకల్పాన్ని గురించి తెలుసుకున్నాను. దానిని ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం శ్రోతల కు తప్పక వెల్లడి చేయాలి అని నేను భావిస్తున్నాను.

 

 

మిత్రులారా, రోజంతా ఊరంతా తిరుగుతూ నగదు రూపం లో ఎలాంటి లావాదేవీ లు జరపబోను అనే సంకల్పం తో ఎవరైనా తమ ఇంటి నుంచి బయటకు రాగలరు అని మీరు ఊహించగలరా! ఇది ఆసక్తికరమైన సంకల్పం కదూ! దిల్లీ కి చెందిన ఇద్దరు అమ్మాయిలు సాగరిక, ప్రేక్ష ఇలాంటి ఒక క్యాష్‌లెస్ డే అవుట్‌ ప్రయోగం చేశారు. దిల్లీలో సాగరిక, ప్రేక్ష ఎక్కడికి వెళ్లినా డిజిటల్‌ పేమెంట్‌ సౌకర్యం లభించింది. యుపిఐ క్యు ఆర్ (UPI QR) కోడ్ కారణం గా వారు నగదు విత్‌డ్రా చేయవలసిన అవసరం రాలేదు. స్ట్రీట్ ఫూడ్ దుకాణాలలోనూ తోపుడు బండ్ల పై వ్యాపారం చేసే వారి దగ్గర కూడా వారు ఆన్‌లైన్ లావాదేవీ ల సౌకర్యాన్ని పొందారు.

 

 

 

మిత్రులారా, దిల్లీ మహా నగరం కాబట్టి అక్కడ ఇవన్నీ ఉండడం చాలా సులభం అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు యుపిఐ వ్యాప్తి ఒక్క దిల్లీ వంటి పెద్ద నగరాలకే పరిమితం కాదు. గాజియాబాద్ కు చెందిన ఆనందితా త్రిపాఠి గారి నుంచి నాకు ఒక సందేశం వచ్చింది. ఆనందిత గారు గత వారం తన భర్త తో పాటు ఈశాన్య రాష్ట్రాల కు వెళ్లారు. అసమ్ నుంచి మొదలుపెట్టి మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని తవాంగ్‌ వరకు వారి ప్రయాణ అనుభవాన్ని గురించి వివరించారు. చాలా రోజుల ఈ ప్రయాణం లో వారు మారుమూల ప్రాంతాలలోనూ నగదు ను ఉపయోగించవలసిన అవసరం రాలేదు అని తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కొన్నేళ్ల క్రితం వరకు మంచి ఇంటర్ నెట్ సదుపాయం కూడా లేని చోటు లో ఇప్పుడు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సౌకర్యం కూడా అందుబాటు లోకి వచ్చింది. సాగరిక, ప్రేక్ష, ఆనందిత గారుల అనుభవాల ను పరిశీలిస్తూ క్యాష్‌లెస్ డే అవుట్ ప్రయోగాన్ని ప్రయత్నించండి అని మిమ్మల్ని కూడా నేను కోరుతున్నాను. తప్పకుండా ఈ పని ని చేయండి.

 

మిత్రులారా, గత కొన్ని సంవత్సరాలు గా భీమ్ యుపిఐ (BHIM UPI) మన ఆర్థిక వ్యవస్థ లో, మన అలవాటుల లో ఒక భాగం గా మారిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల లో, చాలా గ్రామాల లో ప్రజలు యుపిఐ ద్వారానే లావాదేవీల ను జరుపుతున్నారు. డిజిటల్ ఇకానమీ వల్ల దేశం లో ఒక సంస్కృతి కూడా ఏర్పడుతోంది. డిజిటల్ చెల్లింపు ల కారణం గా వీధుల లోని చిన్న చిన్న దుకాణాలు ఎక్కువ మంది వినియోగదారుల కు సేవల ను అందించడాన్ని సులభతరం చేసివేశాయి. ఇప్పుడు వారికి నగదు సమస్య కూడా లేదు. మీరు రోజువారీ జీవితం లో యుపిఐ సౌలభ్యాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్లినప్పటికీ నగదు ను తీసుకుపోవడం, బ్యాంకు కు వెళ్ళడం, ఏటీఎమ్ ఎక్కడ అంటూ వెతకడం మొదలైన సమస్య లు దూరం అయ్యాయి. అన్ని చెల్లింపు లు మొబైల్ ద్వారానే జరుగుతాయి. కానీ మీ ఈ చిన్న ఆన్‌లైన్ చెల్లింపు ల వల్ల దేశం లో ఎంత పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏర్పడిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా! ప్రస్తుతం మన దేశం లో ప్రతి రోజూ దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల లావాదేవీ లు జరుగుతున్నాయి. గత మార్చి నెల లో యూపీఐ లావాదేవీ లు ఇంచుమించు పది లక్షల కోట్ల రూపాయల వరకు చేరుకొన్నాయి. దీని వల్ల దేశం లో సౌలభ్యం కూడా పెరిగి నిజాయతీభరిత వాతావరణం ఏర్పడుతున్నది. ఇప్పుడు ఫిన్-టెక్‌ కి సంబంధించిన అనేక కొత్త స్టార్ట్- అప్‌ స్ కూడా దేశం లో ముందుకు సాగుతున్నాయి. ఈ డిజిటల్ పేమెంట్ యొక్క శక్తి, స్టార్ట్-అప్ వ్యవస్థ కు సంబంధించి మీకు ఏవైనా అనుభవాలు ఉంటే వాటిని తెలియజేయవలసింది గా నేను కోరుతున్నాను. మీ అనుభవాలు అన్యుల కు ఎంతోమంది కి ప్రేరణ ను ఇవ్వవచ్చును.

 

 

 

ప్రియమైన నా దేశప్రజలారా, సాంకేతిక విజ్ఞ‌ానం యొక్క శక్తి ఏ విధం గా సామాన్య ప్రజల జీవనాన్ని మార్చుతున్నదో, అది మనకు మన చుట్టుపక్కల నిరంతరం కనుపిస్తూనే ఉంది. సాంకేతిక విజ్ఞ‌ానం మరో గొప్ప పని ని చేసింది. అది ఏమిటి అంటే దివ్యాంగ సహచరుల అసాధారణ సామర్థ్యాల యొక్క ప్రయోజనాన్ని దేశాని కి, ప్రపంచాని కి అందించింది అనేదే. మన దివ్యాంగ సోదరులు, మన దివ్యాంగ సోదరీమణులు ఏం చేయగలరనేది మనం టోక్యో పారాలింపిక్స్‌ లో గమనించాం. క్రీడలతో పాటు కళ లు, విద్య రంగం మొదలైన అనేక ఇతర రంగాల లో దివ్యాంగ సహచరులు అద్భుతాలు చేస్తున్నారు. అయితే ఈ సహచరుల కు సాంకేతిక విజ్ఞ‌ానం యొక్క శక్తి లభించిందా అంటే అప్పుడు వారు మరింత ఉన్నత స్థానాల ను చేజిక్కించుకు మరీ చూపగలరు. అందుకే దేశం ప్రస్తుతం దివ్యాంగులకు వనరుల ను, మౌలిక సదుపాయాలను అందుబాటు లోకి తీసుకు రావడానికి నిరంతరం కృషి చేస్తున్నది. దేశం లో అనేక స్టార్ట్- అప్‌ స్, సంస్థ లు ఈ దిశ లో స్ఫూర్తిదాయకమైన కార్యాలను చేస్తున్నాయి. అటువంటి సంస్థల లో ఒకటి ‘వాయిస్ ఆఫ్ స్పేశియలీ ఏబుల్డ్ పీపుల్. ఈ సంస్థ సహాయక సాంకేతిక విజ్ఞ‌ానం రంగం లో కొత్త అవకాశాల ను ప్రోత్సహిస్తోంది. దివ్యాంగ కళాకారుల కృషి ని అంతర్జాతీయ స్థాయి కి తీసుకుపోయేందుకు వినూత్నమైన ప్రారంభం కూడా జరిగింది. వాయిస్ ఆఫ్ స్పేశియలీ ఏబుల్డ్ పీపుల్ సంస్థ కు చెందిన కళాకారుల చిత్రాల డిజిటల్ ఆర్ట్ గేలరీ ని సంస్థ సిద్ధం చేసింది. దివ్యాంగులైన సహచరులు ఎంతటి అసాధారణమైన ప్రతిభ ను కలిగివుంటారో, మరి వారి వద్ద ఎటువంటి అసాధారణ సామర్థ్యాలు ఉంటాయో తెలిపేందుకు ఈ ఆర్ట్ గేలరీ ఓ ఉదాహరణ గా నిలుస్తుంది. దివ్యాంగ సహచరుల జీవనం లో ఉండే సవాళ్లు, వాటిని అధిగమిస్తే వారు ఎంత దూరం చేరుకోగలుగుతారు అనే విషయాలు ఈ పెయింటింగ్స్‌ ను చూస్తే తెలుస్తాయి. మీకు కూడా ఏ దివ్యాంగ సహచరుల ను గురించి అయినా పరిచయం ఉండి ఉంటే, వారి ప్రతిభ ను గురించి మీకు తెలిసి ఉంటే గనక అప్పుడు డిజిటల్ టెక్నాలజీ యొక్క సహాయం తో వారిని ప్రపంచం ముందుకు తీసుకురావచ్చును. ఎవరైతే దివ్యాంగ సహచరులు ఉన్నారో, వారు కూడా ఈ విధమైన ప్రయత్నాల లో పాలుపంచుకోవాలి.

 

 

ప్రియమైన నా దేశప్రజలారా, దేశం లోని చాలా ప్రాంతాల లో వేడిమి చాలా వేగం గా పెరుగుతోంది. పెరుగుతున్నఈ వేడి- నీటి ని ఆదా చేయవలసిన మన బాధ్యత ను అంతే స్థాయి లో పెంచివేస్తుంది. మీరు ఇప్పుడు ఉన్న చోట పుష్కలం గా నీరు అందుబాటు లో ఉండవచ్చు. కానీ, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల లో నివసించే కోట్ల కొద్దీ ప్రజల ను కూడా మీరు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. వారి కి ఒక్కొక్క నీటి బొట్టు అమృతం తో సమానమైంది అవుతుంది.

 

 

 

మిత్రులారా, ప్రస్తుతం స్వాతంత్య్రం తాలూకు 75వ సంవత్సరం లో, ఆజాదీ కే అమృతోత్సవ్ లో, దేశం ఏయే సంకల్పాల ను తీసుకొని ముందుకు సాగుతోందో, వాటి లో జల సంరక్షణ కూడా ఒక సంకల్పం గా ఉంది. అమృత్ మహోత్సవ్ సందర్భం లో దేశం లోని ప్రతి జిల్లా లోనూ 75 అమృత సరోవరాల ను నిర్మిస్తారు. ఇది ఎంత పెద్ద ఉద్యమమో మీరు ఊహించవచ్చు. మీ పట్టణాని కి 75 అమృత సరోవరాలు వచ్చే రోజు ఎంతో దూరం లో లేదు. మీరంతా- ముఖ్యంగా యువత ఈ ప్రచార ఉద్యమాన్ని గురించి తెలుసుకోవాలని, ఈ బాధ్యత ను తీసుకోవాలని నేను కోరుతున్నాను. మీ ప్రాంతం లో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఏదైనా చరిత్ర ఉన్నా, ఒక పోరాట యోధుని జ్ఞాపకాలు ఉన్నా వాటిని మీరు అమృత సరోవరాల తో జోడించవచ్చును. అమృత్ సరోవర్ సంకల్పాన్ని తీసుకొన్న తరువాత దాని కోసం పనులు చాలా చోట్ల శరవేగం గా మొదలయ్యాయి అని తెలిసి నాకు చాలా సంతోషం వేసింది. ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపుర్ లో పట్ వాయి గ్రామ పంచాయతీ ని గురించి నాకు సమాచారం వచ్చింది. అక్కడ గ్రామసభ జరిగే స్థలం లో ఒక చెరువు ఉంది. కానీ అది మురికి తో, చెత్త తో నిండి ఉంది. ఎంతో కష్టం మీద స్థానికుల సహకారం తో, స్థానిక పాఠశాల విద్యార్థుల సహకారం తో ఆ మురికి చెరువు గత కొన్ని వారాల లో రూపాంతరం చెందింది. ఇప్పుడు ఆ సరస్సు ఒడ్డు న రిటైనింగ్ వాల్, ప్రహరీ గోడ, ఫూడ్ కోర్టు, ఫౌంటెన్ లు, లైటింగ్ వంటి ఏర్పాటుల ను చేశారు. ఈ కృషి కి రాంపుర్‌ లోని పట్ వాయి గ్రామ పంచాయతీ ని, గ్రామ ప్రజల ను, అక్కడి చిన్నారుల ను నేను అభినందిస్తున్నాను.

 

 

మిత్రులారా, నీటి లభ్యత, నీటి ఎద్దడి .. ఇవి ఏ దేశం ప్రగతి ని అయినా, ఏ దేశం గతి ని అయినా నిర్ధారిస్తాయి. మీరు సైతం గమనించే ఉంటారు, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో స్వచ్ఛత వంటి అంశాల తో పాటు గా పదే పదే నీటి సంరక్షణ ను గురించి నేను తప్పక మాట్లాడుతూ వస్తున్న సంగతి ని. మన గ్రంథాల లో స్పష్టం గా చెప్పడం జరిగింది. అది ఏమని అంటే -

పానీయమ్ పరమమ్ లోకే, జీవానాం జీవనం సమృతమ్..” అని.

 

ఈ మాటల కు.. నీరే ప్రపంచం లోని ప్రతి జీవి కి, జీవనాని కి ఆధారం గా ఉంది. మరి నీరే అతి పెద్ద వనరు కూడా.. అని భావం. అందుకే మన పూర్వికులు జల సంరక్షణ కు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చారు. వేదాల నుంచి పురాణాల వరకు ప్రతి చోటా- నీటి పొదుపు ను, చెరువు ల, సరస్సు ల వంటిటి నిర్మాణాన్ని మనిషి సామాజిక, ఆధ్యాత్మిక కర్తవ్యాలు గా పేర్కొన్నారు. వాల్మీకి రామాయణం లో నీటి సంరక్షణ, నీటి వనరుల అనుసంధానం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అదే విధం గా సింధు-సరస్వతి , హరప్పా నాగరకతల లో కూడా నీటి కి సంబంధించి భారతదేశం లో ఇంజినీరింగ్ ఎంత అభివృద్ధి చెందిందో చరిత్ర విద్యార్థుల కు తెలిసి ఉండవచ్చు. పురాతన కాలం లో, అనేక నగరాల లో నీటి వనరులు ఒకదాని తో ఒకటి అనుసంధానమైన వ్యవస్థ ఉండేది. ఆ కాలం లో జనాభా అంతగా లేదు. సహజ వనరుల కొరత లేదు. ఒక రకమైన సమృద్ధి ఉంది. అయినప్పటికీ నీటి సంరక్షణ గురించి అప్పుడు అవగాహన చాలా ఎక్కువ గా ఉండేది. కానీ ఈ రోజుల లో పరిస్థితి అందుకు భిన్నం గా ఉంది. మీ ప్రాంతం లోని ఇటువంటి పాత చెరువుల గురించి, బావుల గురించి, సరస్సుల గురించి తెలుసుకోవాలి అని మీ అందరికి విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. అమృత్ సరోవర్ అభియాన్ కారణం గా జల సంరక్షణ తో పాటు మీ ప్రాంతాని కి గుర్తింపు కూడా లభిస్తుంది. దీంతో నగరాల తో పాటు వివిధ ప్రాంతాల లో కూడా పర్యటన స్థలాల అభివృద్ధి చోటు చేసుకొంటుంది. అంతే కాక, ప్రజల కు పర్యటన లు జరపడానికి ఒక జాగా అంటూ దొరుకుతుంది.

 

 

 

 

మిత్రులారా, నీటికి సంబంధించిన ప్రతి ప్రయత్నమూ మన భవిష్యత్తు తో ముడిపడిందే. అది మన సామాజిక బాధ్యత కదా. దీని కోసం శతాబ్దాలు గా విభిన్న సమాజాలు భిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. కచ్ఛ్ కే రణ్ కు చెందిన మాల్ ధారీ అనే ఓ తెగ జల సంరక్షణ కోసం వృదాస్ అనే ఓ ప్రత్యేకమైన ప్రక్రియ ను అనుసరిస్తున్నది. దాంట్లో చిన్న చిన్న బావులను ఏర్పాటు చేసుకొని వాటి సంరక్షణ కోసం పరిసరాలలో మొక్కలను నాటి, చెట్లు గా పెంచుతారు. అదే విధం గా మధ్య ప్రదేశ్ కు చెందిన భీల్ అనే తెగ హల్ మా అనే ఓ సంప్రదాయ విధానాన్ని అవలంబించింది. ఈ విధానం లో జల సంరక్షణ కు సంబంధించిన విషయాల ను గురించి చర్చించుకొనేందుకు అందరు కలసి ఓ చోటు లో సమావేశమవుతారు. హల్ మా విధానం లో కనుగొన్న పరిష్కారాల వల్ల ఈ ప్రదేశం లో నీటి సంకటం తగ్గింది. భూగర్భ జలమట్టం కూడా పెరుగుతోంది.

 

 

 

 

మిత్రులారా, అసలు ఇది మన కర్తవ్యం అన్న భావన అందరి మనసులలలో ఏర్పడితే నీటి ఎద్దడి కి సంబంధించిన అతి పెద్ద సమస్యల కు సైతం సులభ పరిష్కారాలు లభిస్తాయి. అందుకే ఆజాదీ కే అమృత్ మహోత్సవం లో మనం జల సంరక్షణ, జీవన సంరక్షణ అనే సంకల్పాలు చేద్దాం. మనం ప్రతి నీటి బొట్టు ను మరియు మన జీవితాల ను కాపాడుకుందాం.

 

 

 

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, మీరంతా చూసే ఉంటారు; నేను కొన్ని రోజుల క్రితం నా యువ నేస్తాల తో, విద్యార్ధుల తో పరీక్షల పై చర్చ ను జరపడాన్ని. ఆ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో చాలా మంది విద్యార్థులు ఏమన్నారంటే వారి కి పరీక్షల లో లెక్కల పరీక్ష అంటే చాలా భయం వేస్తోంది అని. ఇదే విషయాన్ని ఎంతో మంది విద్యార్ధులు నాకు సందేశాల ద్వారా కూడా పంపించారు. ఈసారి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో గణితాన్ని గురించి చర్చించాలి అని నేను ఆ క్షణం లోనే నిర్ణయించుకున్నాను. మిత్రులారా, అసలు లెక్కల గురించైతే మన భారతీయులు ఎవరూ అసలు భయపడవలసిన పనే లేదు. ఎందుకంటే లెక్కల కు సంబంధించి భారతీయులే ఎక్కువగా వీలైనన్ని పరిశోధనల ను, ఆవిష్కారాల ను చేశారు కదా. సున్నా యొక్క విలువ, అలాగే దాని ప్రాధాన్యాన్ని గురించి మన యువతరం వినే ఉంటుంది కదా. నిజాని కి మీకు ఇంకొక విషయం కూడా తెలిసే ఉంటుంది; అసలు సున్నా ను కనిపెట్టక పోయి ఉంటే ప్రపంచం ఇంతటి వైజ్ఞానిక ప్రగతి ని సాధించడాన్ని మనం చూసి ఉండే వాళ్లం కాదేమో. కేల్ క్యులస్ నుంచి కంప్యూటర్ ల వరకు.. ఈ అన్ని వైజ్ఞానిక ఆవిష్కరణ లు సున్నామీదే ఆధారపడి ఉంటాయి కదా. అసలు మన భారతీయ గణిత శాస్త్రవేత్తలు, విద్వాంసులు ఏమని రాశారు అంటే -

యత్ కించిత్ వస్తు తత్ సర్వమ్,

గణితేన బినా నహి.. అని.

ఈ మాటల కు.. అసలు ఈ యావత్తు బ్రహ్మాండం లో ఉన్నది అంతా కూడాను గణితం మీదే ఆధారపడి ఉంది; అంతకు వినా ఏమీ లేదు.. అని భావం. మీరు విజ్ఞానశాస్త్రాన్ని గురించి గుర్తు చేసుకుంటే అప్పుడు మీకు దీని ని గురించి అర్థమైపోతుంది. విజ్ఞానాని కి సంబంధించిన ప్రతి ఒక్క సూత్రాన్ని మేథమెటికల్ ఫార్ములా గానే వ్యక్తం చెయ్యడం జరిగింది కదా. న్యూటన్ యొక్క లాస్ కావచ్చు, ప్రసిద్ధి చెందిన ఆయిన్ స్టైన్ ఈక్వేశన్ కావొచ్చు, ఈ బ్రహ్మాండాని కి సంబంధించిన మొత్తం విజ్ఞానం గణితమే కదా. ఇప్పుడు శాస్త్రవేత్త లు ధీయరి ఆఫ్ ఎవ్రీ థింగ్ ను గురించి మాట్లాడుతున్నారు. అంటే మొత్తం బ్రహ్మాండం గురించి చెప్పడానికి ఒకే ఒక సూత్రమన్న మాట. అసలు గణితాని కి సంబంధించి మన మహర్షులు ఎంతో విస్తృత స్థాయి లో ఆలోచించారు, పరిశోధన లు చేశారు. మనం సున్నా ని ఆవిష్కరించడం ఒక్కటే కాకుండా అనంతాన్ని, అంటే ఇన్ఫినిటీ ని, కూడా కనిపెట్టాం. సాధారణమైన మాటల లో మనం సంఖ్యల ను గురించి మాట్లాడుకొన్నప్పుడు మిలియన్, బిలియన్, ట్రిలియన్ ల దాకా చెబుతాం, ఆలోచిస్తాం. కానీ వేదాల లో అలాగే భారతీయ గణితం లో ఈ గణన ఇంకా చాలా ముందుకు పోయింది. మనకు ఓ పురాతనమైన శ్లోకం కూడా ప్రచారం లో ఉంది.

 

ఏకం దశం శతం చైవ, సహస్రం అయుతం తథా

లక్షం చ నియుతం చైవ, కోటిః అర్బుదమ్ ఏవ చ

వృన్దం ఖర్వే నిఖర్వ: చ, శంఖః పద్మః చ సాగరః

అంత్యం మధ్యం పరార్ధః చ, దశ వృధ్యా యధా క్రమమ్.. అని.

 

ఈ శ్లోకం లో సంఖ్య ల యొక్క క్రమాన్ని గురించి చెప్పడమైంది. ఎలాగంటే-

ఒకటి, పది, వంద, వెయ్యి మరియు అయుతం;

లక్ష, నియుత మరియు కోటి..

 

ఇదే మాదిరి గా ఈ సంఖ్య సాగిపోతూ ఉంటుంది. శంఖం, పద్మం ఇంకా సాగరం వరకు. ఓ సాగరం అంటే ఎంతంటే పది టు ద పవర్ ఆఫ్ 57. అది మాత్రమే కాక ఇంకా ఆ తరువాత ఓఘ్ అలాగే మహోఘ్ వంటి సంఖ్య లు కూడా ఉన్నాయి. ఓ మహోఘ్ అంటే అది 10 టు ద పవర్ ఆఫ్ 62 కి సమానం. అంటే ఒక అంకె తరువాత 62 సున్నా లు. మనం అసలు అంత పెద్ద సంఖ్యల ను గురించి సలు తలచుకున్నా సరే కష్టం గా అనిపిస్తుంది. కానీ భారతీయ గణితం లో వీటి ప్రయోగం వేలాది సంవత్సరాలు గా జరుగుతోంది. నాకు కొన్ని రోజుల క్రితం ఇంటెల్ కంపెనీ సీఈఓ కలిశారు. అసలు ఇంటెల్ పేరు వింటేనే మీ మనసు లో కంప్యూటర్ అన్న ఆలోచన వచ్చేస్తుంది కదా. మీరు కంప్యూటర్ ను గురించి మన బైనరి సిస్టమ్ (ద్విగుణ వ్యవస్థ) ను గురించి కూడా విని ఉంటారు కదా. కానీ మీకు ఒకటి తెలుసా, అసలు మన దేశం లో ఆచార్య పింగళుడు ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ బైనరి సిస్టమ్ ను గురించి ఆలోచించాడు. ఈ విధం గా ఆర్యభట్ట నుంచి రామానుజన్ వంటి గణిత శాస్త్రవేత్త ల వరకు అందరూ గణితాని కి సంబంధించిన అనేక సూత్రాల ను సిద్ధాంతీకరించారు.

 

 

 

మిత్రులారా, అసలు మన భారతీయులకు ఎప్పుడూ గణితం అసలు కష్టం గా అనిపించలేదు. దానికి మన వైదిక గణితం కూడా ఓ కారణం. ఆధునిక కాలం లో వైదిక గణితాని కి సంబంధించిన కీర్తి ఎవరికి దక్కుతుంది అంటే శ్రీ భారతీ కృష్ణ తీర్థ్ మహరాజ్ కే. ఆయన గణన (కేల్ క్యులేశన్) కు సంబంధించిన ప్రాచీన విధానాల ను ఆధునికీకరించారు. అలాగే దానికి వైదిక గణితం అనే పేరు ను పెట్టారు. అసలు వైదిక గణితం విశిష్టత ఏమిటి అంటే మీరు దాంతో అత్యంత కఠిమైన లెక్కలను కూడా రెప్పపాటు కాలం లో చేసెయ్యవచ్చు. ఈ మధ్య కాలం లో సామాజిక మాధ్యమాల లో అలా వైదిక గణితాన్ని నేర్పించే వారి, నేర్చుకొనే వారి వీడియోల ను అనేకం గా చూడవచ్చును.

 

 

 

మిత్రులారా, నేటి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమంలో అలా వైదిక గణితాన్ని నేర్పించే ఓ మిత్రుడు మనతో కలవబోతున్నారు. ఆయన ఎవరంటే కోల్ కాతా కు చందిన సౌరవ్ టేక్ రీవాల్ గారు. ఆయన గడచిన రెండు, రెండున్నర దశాబ్దాల నుంచి వైదిక్ మేధమేటిక్స్.. ఈ యొక్క ఉద్యమాన్ని చాలా అంకిత భావం తో ముందుకు తీసుకు పోతున్నారు. ఇప్పుడు మనం ఆయన తో కొన్ని విషయాలను గురించి మాట్లాడదాం.

 

 

నరేంద్ర మోదీ గారు: గౌరవ్ గారూ, నమస్కారం

గౌరవ్: నమస్కారం సర్

నరేంద్ర మోదీ గారు: నేను విన్నాను ఏమని అంటే మీకు వైదిక్ మేథ్స్ అంటే చాలా ఇష్టమని, చాలా పరిశ్రమ చేశారట కదా అందులో.

ముందు నేను మీ గురించి తెలుసుకోవాలి అని అనుకొంటున్నాను. మీకు దానిమీద ఎందుకు ఇష్టం కలిగిందో చెప్పండి.

గౌరవ్: సర్, నేను ఇరవై ఏళ్ల క్రితం బిజినెస్ స్కూల్ కు దరఖాస్తు పెట్టుకొన్నప్పుడు, దానికో పోటీ పరీక్ష్ జరిగేది. దాని పేరు క్యాట్. అందులో గణితానికి సంబంధించి చాలా ప్రశ్నలు వచ్చేవి. వాటిని చాలా తక్కువ సమయం లో పూర్తి చెయ్యాలి.

అప్పుడు మా అమ్మ నాకు ఒక పుస్తకాన్ని తీసుకు వచ్చి ఇచ్చారు, ఆ పుస్తకం పేరు ఏమిటి అంటే వైదిక గణితం. ఆ పుస్తకాన్ని స్వామి శ్రీ భారతీ కృష్ణ తీర్థ మహారాజు రాశారు.

ఆవిడ ఆ పుస్తకం లో పదహారు సూత్రాల్ని ఇచ్చారు. వాటి వల్ల గణితం చాలా సులభం గా, చాలా తొందర గా పూర్తి అయిపోయేది. నేను ఆ పుస్తకాన్ని చదివినప్పుడు నాకు చాలా ప్రేరణ కలిగింది. తరువాత నాకు మేథమెటిక్స్ మీద అనురక్తి ఏర్పడింది. అసలు మనకు ఉన్న ఆ విజ్ఞానాన్ని, ఆ బలాన్ని ప్రపంచం నలుమూల ల విస్తృత స్థాయి లో ప్రచారం చెయ్యొచ్చనిపించింది. అందుకే నేను అప్పటి నుంచి వైదిక గణితాన్ని ప్రపంచం లో మూలమూల ల ప్రచారం చెయ్యడం అనే ఓ మిశన్ ను చేపట్టి, అందుకోసం ప్రయత్నిస్తున్నాను.

ఎందుకంటే ప్రతి ఒక్కరూ లెక్కలు అంటే భయపడతారు కాబట్టి. పైగా అసలు వైదిక గణితం కంటే తేలికైంది ఇంకేదైనా ఉంటుందా.

నరేంద్ర మోదీ గారు: గౌరవ్ గారు, మీరు ఎన్నేళ్లు గా దీనికోసం పనిచేస్తున్నారు.

గౌరవ్: దాదాపు గా ఈ రోజు కు ఇరవై సంవత్సరాలు అయింది సర్. నేను పూర్తిగా ఇందులోనే ఉన్నాను.

నరేంద్ర మోదీ గారు: మరి ఎరుక కోసం ఏం చేస్తారు? ఏమేం ప్రయోగాలు చేస్తారు?

గౌరవ్: మేం పాఠశాలలకు వెళ్తాం. ఆన్ లైన్ లో శిక్షణ ను ఇస్తాం.

మా సంస్థ పేరు ఏమిటంటే వైదిక్ మేథ్స్ ఫోరమ్ ఇండియా.

ఆ సంస్థ ద్వారా మేం ఇంటర్ నెట్ మాధ్యమం లో ఇరవై నాలుగు గంటలూ చదువు చెబుతాం సర్.

నరేంద్ర మోదీ గారు: గౌరవ్ గారు, నాకు అసలు ఎప్పుడూ పిల్లల తో మాట్లాడడం చాలా ఇష్టం అని, పైగా నేను దానికోసం అవకాశాలు వెతుక్కుంటానని మీకు తెలుసు కదా. పైపెచ్చు అసలు ‘ఎగ్జాం వారియర్’ తో నేను పూర్తి గా ఓ విధం గా దానిని సంస్థాగతం చేసేశాను. పైగా అసలు విషయం ఏంటంటే మనం బాలల తో మాట్లాడేటప్పుడు లెక్కల ను గురించి మాట్లాడితే చాలు చాలా మంది పిల్లలు వెంటనే పారిపోతారు. అందుకే నేను ఏం చేస్తాను అంటే అటువంటి అనవసరపు భయాలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తాను. ఆ భయాన్ని పోగొట్టాలి. అలాగే వారికి మనకి వారసత్వంగా లభించిన చిన్న చిన్న మెలకువలను (టెక్నిక్స్) చెప్పాలి. ఎందుకంటే భారతీయుల కు లెక్కలు అంటే కొత్త విషయం ఏమీ కాదు గా. బహుశా ప్రపంచం లో ఉన్న అత్యంత పురాతనమైన రీతుల్లో భారత దేశాని కి చెందిన గణిత శాస్త్ర రీతులు కూడా భాగమేనేమో. మరి ఎగ్జామ్ వారియర్ యొక్క భయాన్ని పోగొట్టాలి అంటే వారికి మీరు ఏం చెబుతారు?

గౌరవ్: సర్, ఇది పిల్లలకు అన్నింటి కంటే ఎక్కువ ఉపయోగపడే విషయం. ఎందుకంటే అసలు పరీక్షలంటేనే చాలా భయపడిపోతారు పిల్లలు, వారికి చాలా అపోహలు ఉంటాయి ఆ విషయం లో ప్రతి ఇంట్లోనూ. పరీక్షల కోసం పిల్లలు ట్యూషన్ లకు వెళ్తారు. తల్లితండ్రులు ఇబ్బంది పడుతుంటారు. టీచర్ లు కూడా ఇబ్బంది పడతారు. ఇక వైదిక గణితం తో ఇదంతా ఛూమంత్రకాళి అయిపోతుంది. మామూలు గణితం తో పోలిస్తే వేద గణితం పదిహేను వంద ల శాతం వేగవంతమైంది. అలాగే దాని వల్ల పిల్లలకు చాలా విశ్వాసం కలుగుతుంది. అలాగే బుర్ర కూడా చాలా బాగా పనిచేస్తుంది. అసలు మేం వైదిక గణితంతో పాటుగా యోగాని కూడా పరిచయం చేశాం. దానివల్ల ఒకవేళ పిల్లలు కావాలనుకుంటే కళ్లుమూసుకుని కూడా కేలిక్యులేశన్ చేసేయొచ్చు వైదిక గణిత పద్ధతులలో.

నరేంద్ర మోదీ గారు: నిజానికి అదెలాంటి ధ్యాన రీతి అంటే దాంట్లో ఆ విధం గా గణించడం కూడా ధ్యానం లో ఓ ప్రైమరీ కోర్సు కదా.

గౌరవ్: అవును సర్.

నరేంద్ర మోదీ గారు: సరే గౌరవ్ గారు, మీరు దీన్ని ఉద్యమం తరహా లో తీసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే మీ అమ్మ గారు మిమ్మల్ని ఓ గురువు రూపం లో ఈ దారి లోకి తీసుకు వచ్చారు. ఈ రోజు న మీరు కూడా లక్షల కొద్దీ బాలల ను ఈ మార్గం లోకి తీసుకు వస్తున్నారు. నా తరఫు న మీకు చాలా చాలా శుభాకాంక్ష లు.

గౌరవ్: ధన్యవాదాలు సర్. మీరు వైదిక గణితాని కి ఈ విధం గా ఇప్పుడు గుర్తింపు ను తీసుకు వచ్చేందుకు, దాని కోసం నన్ను ఎంపిక చేసినందుకు మీకు నేను కృతజ్ఞతల చెబుతున్నాను సర్. మేం మీకు ఋణపడి ఉన్నాం.

నరేంద్ర మోదీ గారు: చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.

గౌరవ్: నమస్తే సర్.

 

 

 

మిత్రులారా, వైదిక గణితం సాధారణ గణితం పట్ల కష్టాన్ని ఏ విధం గా ఇష్టం గా మార్చివేస్తుందో గౌరవ్ గారు చాలా చక్కగా చెప్పారు. అది మాత్రమే కాదు, వైదిక గణితం ద్వారా మీరు అతి పెద్ద సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ ను కూడాను అత్యంత సులభం గా పరిష్కరించగలుగుతారు. అందుకే ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి వైదిక గణితాన్ని తమ పిల్లల కు నేర్పించాలి అని నేను కోరుకొంటున్నాను. దానివల్ల వారికి విశ్వాసం పెరగడం మాత్రమే కాక, వారి విశ్లేషణాత్మక శక్తి సైతం పెరుగుతుంది. పైగా ఏంటంటే లెక్కలనే పేరు చెప్పగానే కొందరు పిల్లల లో ఉన్న కాస్తో కూస్తో భయం పూర్తి గా దూరమైపోతుంది.

 

 

 

ప్రియమైన మిత్రులారా, ఈ రోజు న మనం మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ ) కార్యక్రమం లో సంగ్రహాలయం నుంచి గణితం వరకు అనేక విధాలైన జ్ఞానాన్ని పెంపొందించే విషయాల ను గురించి చర్చించుకున్నాం. అసలు ఆ విషయాలన్నీ మీ సూచనల వల్లే మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ ) కార్యక్రమం లో చోటు చేసుకొటున్నాయి. నాకు మీరు ఇదే విధం గా ఇక మీదట కూడా మీ సలహాల ను, సూచనల ను నమో ఏప్ (Namo App) మరియు మై గౌవ్ (MyGov) ల ద్వారా పంపిస్తూ ఉండండి. రాబోయే రోజుల్లో దేశంలో ఈద్ పండగకూడా రాబోతోంది. మే మూడో తేదీ న అక్షయ తృతీయ’, అలాగే పరశురామ భగవానుని జయంతి ని కూడా జరుపుకొంటాం. కొన్ని రోజుల తరువాత వైశాఖ శుద్ధ పౌర్ణమి పర్వదినం కూడా వస్తుంది. ఈ పండుగ లు అన్నీ శాంతి, పవిత్రత, దానం మరియు సహృదయత్వాన్ని పెంపొందించే పండుగ రోజులే. మీకందరికీ ఈ పర్వదినాల సందర్భాలలో ఇవే హార్దిక శుభాకాంక్షలు. ఈ పండుగల ను మంచి మనసు తో చాలా సంతోషం గా జరుపుకోండి. దీనితో పాటు మీరు కరోనా విషయం లో కూడా జాగ్రత్త గా ఉండాలి. మాస్క్ లు ధరించండి. చేతుల ను తరచు గా సబ్బు తో శుభ్రం చేసుకొంటూ ఉండండి. కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి నిర్దేశించినటువంటి ఉపాయాల ను అన్నిటి ని మీరు తప్పక పాటించగలరు. మళ్లీ వచ్చే సారి మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో తిరిగి కలుసుకొందాం. అలాగే మీరు పంపించే మరికొన్ని కొత్త విషయాల ను గురించి చర్చించుకొందాం. అప్పటి దాకా సెలవు తీసుకొందాం. చాలా చాలా ధన్యవాదాలు.

 

 

***


(Release ID: 1819742) Visitor Counter : 323