సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్లాస్టిక్ రంగంలో నిరుద్యోగ యువతకు అపార ఉపాధి అవకాశాలు- డా।।బి.శ్రీనివాసులు, సీపెట్ ప్రిన్సిపాల్ డైరెక్టర్
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో సీపెట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 300 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ
Posted On:
08 APR 2022 5:00PM by PIB Hyderabad
నిత్యజీవితంలో ప్లాస్టిక్ అవసరాలు పెరగడంతో పాటు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా అధికమయ్యాయని, ప్లాస్టిక్ వస్తువులపై అవగాహన, వస్తువుల తయారీపై 'సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ' (సీపెట్)లో ఎంతోమంది యువత శిక్షణ పొందుతున్నారని డా।।బి.శ్రీనివాసులు, సీపెట్ ప్రిన్సిపాల్ డైరెక్టర్ & హెడ్ ఈ రోజు హైదరాబాద్ చర్లపల్లిలోని సీపెట్ శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు .
కోర్సుల్లో శిక్షణ పొందుతున్నప్పుడే విధ్యార్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు వస్తున్నాయని, ప్లాస్టిక్ రంగ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నసీపెట్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలోని వివిధ విభాగాల్లో మానవ వనరుల అభివృద్ధి, సాంకేతిక పరిజ్జానం పెంపొందించే దిశగా కృషి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు డా।।బి.శ్రీనివాసులు తెలిపారు.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా సీపెట్ ఆధ్వర్యంలో 300 మంది పేద, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ , భూపాలపల్లి , ఖమ్మం జిల్లాలను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దత్తత తీసుకుంది. ఆ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు డా. బి. శ్రీనివాసులు తెలిపారు. సీఎన్‌సీ మిల్లింగ్ ఆపరేటర్, ప్రోగ్రామర్, సీఎన్‌సీ లేత్ మిషన్ ఆపరేటర్, ప్రోగ్రామర్, టూల్ రూం మెషిన్ ఆపరేటర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ఇంజక్షన్, బ్లో మోల్డింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. 8వ తరగతి, 10 వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమా పూర్తిచేసుకున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్ధులకు ఉచిత శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందే అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితి మినహాయింపు ఉంటుందని డా. బి. శ్రీనివాసులు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత, కులం, ఆదాయం సర్టిఫికెట్లు, ఆధార్‌తోపాటు 4 ఫొటోలతో నింపిన దరఖాస్తును vtc-hyderabad@cipet.gov.in కి మెయిల్ చేయాలని, లేదా ప్రత్యక్షంగా వచ్చి సంప్రదించాలని సూచించారు.
సీపెట్... పేద, వెనుకబడినవర్గాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటు కల్పిస్తోంది. ప్లాస్టిక్ రంగంలో దేశ, విదేశాల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని శ్రీ ఎ. కె . రావు , చీఫ్ మేనేజర్ (టెక్నికల్) తెలిపారు.
హైదరాబాద్‌లోని సీపెట్ పదవతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ విద్యార్థులకు ప్లాస్టిక్ ఇంజనీరింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. సీపెట్ సెంటర్లు దేశమంతటా 37 ప్రధాన నగరాలలో ఉన్నాయి. ప్లాస్టిక్స్ లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులు అందివ్వడం దీని ప్రత్యేకత.
యువతకు ఉద్యోగావకాశాలు వెంటనే కల్పించడంతో పాటు వారు ఎంట్రీప్రిన్యూర్లుగా ఎదిగే సేవలను కూడా అందిస్తోంది. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్లాస్టిక్ ఇండస్ట్రీస్‌కు డిజైన్, టూలింగ్, ప్లాస్టిక్ ప్రోసెసింగ్, టెస్టింగ్, క్వాలిటీ అస్యూరెన్స్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తోడ్పాటును, శిక్షణను అందిస్తోంది. ఉపాధి పరంగా చూస్తే ప్లాస్టిక్ పరిశ్రమలు యువత భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి. స్టైఫండ్ ఇస్తున్నారు. భవిష్యత్తులో శిక్షణ పొందిన యువత సొంత బిజినెస్ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు బాగా ఉన్నాయి.
స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా స్పాన్సర్‌షిప్ ప్రోగ్రాముల కింద పేద, నిరుద్యోగ యువతకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచితంగా శిక్షణ అందిస్తారు. మూడు నెలలు శిక్షణ ఉంటుంది.ఆధార్ కార్డు, కులం సర్టిఫికేట్, ఆదాయం సర్టిఫికేట్ తెచ్చి సీపెట్లో ఉచిత శిక్షణ పొందవచ్చు.
డిప్లొమా చేయాలంటే పదవ తరగతి అర్హత (పాస్ లేదా ఫెయిల్) ఉంటే చాలు. ఎనిమిదవ తరగతి వరకూ చదివిన వారికి కూడా కొన్ని రకాల శిక్షణను అందిస్తారు. స్కిల్ డెవలెప్మెంట్ ప్రోగ్రాములలో గ్రామీణ యువతకు పెద్దపీట వేశారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు నేరుగా సీపెట్‌ను సంప్రదించవచ్చు.
***
(Release ID: 1814873)
Visitor Counter : 146