ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024 నాటికి నాసిన్ అకాడమీని పూర్తి చేస్తాం: అంతర్జాతీయ స్థాయిలో సంస్థ ను తీర్చిదిద్దుతాం: శ్రీమతి నిర్మలా సీతారామన్


2023 సెప్టెంబర్ నుంచి ప్రొబేషనరి ఐఆర్ఎస్ అధికారులకు ప్రారంభం కానున్న శిక్షణ.

రాష్ట్రానికి ఎటువంటి లోపం లేకుండా అన్ని రకాల కేంద్రం సహకారం: కేంద్ర ఆర్థిక మంత్రి

Posted On: 05 MAR 2022 10:11PM by PIB Hyderabad

నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ మరియు నార్కోటిక్స్ (నాసిన్) అకాడమీని 2024 సంవత్సరం నాటికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. నాసిన్ అకాడమీ కోసం మొదటి దశలో 729 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని, ఇందు అవసరమయ్యే నిధులను ఇప్పటికే కేటాయించడం జరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు. 

 

అనంతపురము జిల్లా గోరంట్ల మండలం, పాలసముద్రం గ్రామం వద్ద నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ మరియు నార్కోటిక్స్ (నాసిన్) అకాడమీ పనులకు భూమి పూజ చేసే కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. 

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రంలో నాసిన్ అకాడమీని ఏర్పాటు చేస్తామని ప్రధాని శ్రీ నరేంద్రమోడీ హామీ ఇచ్చారని, అందులో భాగంగా మొదటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే అనంతపురం జిల్లా పాల సముద్రం వద్ద అకాడమీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారన్నారు. 

 

2015 ఏప్రిల్ నెలలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, నాసిన్ అకాడమీ ఏర్పాటుకు శిలాఫలకం ఆవిష్కరణ చేశారని... ఇటీవల కాలంలో అకాడమి నిర్మాణానికి సంబంధించి రైతులు ఇచ్చిన భూమి చుట్టూ ప్రహరీ గోడను నిర్మించడం, రైతులకు పునరావాస (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ కింద పరిహారం అండిచామని, ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందన్నారు. 

 

ఐఏఎస్ లకు మస్సూరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ, ఐపిఎస్ లకు హైదరాబాదులోని సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ అకాడమీలలో ఏ విధంగా శిక్షణ ఇస్తారో అదే విధంగా అనంతపురం జిల్లాలోని పాలసముద్రం వద్ద ఏర్పాటు చేసిన నాసిన్ అకాడమీలో ఐఆర్ఎస్ పాసైన అధికారులకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. నాసిన్ అకాడమీలో 2023 సెప్టెంబర్ నుంచి ఐఆర్ఎస్ పాసైన్ అధికారులకు శిక్షణను ప్రారంభిస్తామని శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఆకాడమికి భూములిచ్చిన రెండు గ్రామాల రైతులకు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అకాడమీ నిర్మాణానికి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అకాడమీ వల్ల హిందూపురం, పాలసముద్రం ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాల సహకారం అందిస్తుందని శ్రీమతి సీతారామన్ అన్నారు. 

 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, కేంద్ర నెహ్రూ యువకేంద్రం (ఎన్ వై కెఎస్) వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) కేతన్ గార్గ్, పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.

 

***

 

 

 


(Release ID: 1803261) Visitor Counter : 146


Read this release in: English , Marathi