ప్రధాన మంత్రి కార్యాలయం

2022 ఫిబ్రవరి 27 వ తేదీనాటి ‘ మన్ కీబాత్ ’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం86 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 27 FEB 2022 11:34AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశప్రజలారా, నమస్కారం. మరోసారి మీ అందరి కి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ ) కార్యక్రమం లో పాలుపంచుకోవలసిలంది గా స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు మనం భారతదేశ విజయ ప్రస్తావన తో 'మన్ కీ బాత్' (‘మనసు లో మాట’ )ను మొదలుపెడదాం. ఈ నెల మొదట్లో ఇటలీ నుంచి తన విలువైన వారసత్వ సంపదను తిరిగి తీసుకురావడం లో భారతదేశం సఫలం అయింది. ఇది ఒక వారసత్వ సంపద. వెయ్యి సంవత్సరాల కంటే పురాతనమైంది అవలోకితేశ్వర పద్మపాణి విగ్రహం. ఈ విగ్రహం కొన్నేళ్ల క్రితం బీహార్‌ లోని గయా జీ దేవస్థానం కుండల్‌పుర్ ఆలయం నుంచి దొంగతనానికి గురైంది. అయితే ఎన్నో ప్ర‌య‌త్నాల త‌రువాత ఇప్పుడు ఈ విగ్ర‌హాన్ని భారతదేశం తిరిగి దక్కించుకొంది. అదే విధంగా కొన్నేళ్ల క్రితం తమిళ నాడు లోని వేలూరు లో హనుమంతుడి విగ్రహం చోరీ కి గురైంది. ఈ హనుమాన్ విగ్రహం కూడా 600-700 సంవత్సరాల నాటిది. ఈ నెల మొదట్లో దీనిని ఆస్ట్రేలియా లో స్వీకరించాం. మన విశేష ప్రయత్నాల కారణంగా ఇది సాధ్యమైంది.

 

సహచరులారా, వేలాది సంవత్సరాల మన చరిత్ర లో దేశం లోని నలుమూలల్లో ఎప్పుడూ ఒకదాని తరువాత ఒకటి విగ్రహాలు తయారవుతూ వచ్చాయి. ఇందులో శ్రద్ధ, సామర్థ్యం, నైపుణ్యం, వైవిధ్యం మిళితమై ఉన్నాయి. మన ప్రతి విగ్రహంలో ఆ కాలం నాటి చరిత్ర ప్రభావం కూడా కనిపిస్తుంది. అవి భారతీయ శిల్పకళ కు అద్వితీయమైన ఉదాహరణలు మాత్రమే కాదు- మన విశ్వాసం కూడా అందులో మిళితమైంది. గతం లో చాలా విగ్రహాలు చోరీ కి గురై భారతదేశం నుంచి బయటకు వెళ్లిపోయాయి. కొన్నిసార్లు వివిధ దేశాల లో ఆ విగ్రహాల ను విక్రయించారు. వారికి అవి కళాఖండాలు మాత్రమే. వారికి దాని చరిత్ర తో గాని, లేక విశ్వాసాలతో గాని ఎటువంటి సంబంధం లేదు. ఈ విగ్రహాల ను తిరిగి తీసుకు రావడం భారత మాత పట్ల మన బాధ్యత. ఈ విగ్రహాల లో భారతదేశ ఆత్మ ఉంది. విశ్వాసం ఉంది. వాటికి సాంస్కృతిక, చారిత్రిక ప్రాముఖ్యం కూడా ఉంది. ఈ బాధ్యత ను గ్రహించిన భారతదేశం తన ప్రయత్నాల ను పెంచింది. దొంగతనం చేసే ప్రవృత్తి లో భయం జనించడం కూడా ఒక కారణం అయింది. ఈ విగ్రహాల ను దొంగిలించి తీసుకెళ్లిన దేశాల వారు ఇప్పుడు భారతదేశం తో సంబంధాల లో సున్నితత్వం విషయంలో దౌత్య మార్గం లో కూడా దీనికి గొప్ప ప్రాముఖ్యం ఉంటుంది అని భావించడం మొదలుపెట్టారు. దీనికి కారణం భారతదేశ భావాలు దానితో ముడిపడి ఉన్నాయి. భారతదేశ గౌరవం కూడా దానితో ముడిపడి ఉంది. ఒక విధం గా ఇది ప్రజల మధ్య సంబంధాల లో కూడాను చాలా ప్రభావాన్ని కలిగిస్తుంది. కాశీ లో చోరీ కి గురి అయినటువంటి అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని కూడా తిరిగి తీసుకు రావడం కొద్దిరోజుల క్రితమే మీరు చూసి ఉంటారు. భారతదేశం పట్ల ప్రపంచ దృక్పథం మారుతున్నదనడానికి ఇది ఒక ఉదాహరణ. 2013వ సంవత్సరం నాటికి ఇంచుమించు 13 విగ్రహాలు భారతదేశాని కి చేరుకొన్నాయి. అయితే గత ఏడు సంవత్సరాల లో భారతదేశం విజయవంతం గా 200 కంటే ఎక్కువ విలువైన విగ్రహాలను తిరిగి తీసుకు వచ్చింది. అమెరికా, బ్రిటన్‌, హాలండ్‌, ఫ్రాన్స్‌, కెనడా, జర్మనీ, సింగపూర్‌- ఇలా ఎన్నో దేశాలు భారతదేశం యొక్క భావన ను అర్థం చేసుకొని విగ్రహాల ను తిరిగి తీసుకు రావడానికి సహకరించాయి. గతేడాది సెప్టెంబర్‌ లో నేను అమెరికా కు వెళ్లినప్పుడు అక్కడ చాలా పురాతనమైన విగ్రహాలు, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ఎన్నో వస్తువులు లభ్యమయ్యాయి. దేశం లోని ఏదైనా విలువైన వారసత్వ సంపద తిరిగి వచ్చినప్పుడు చరిత్ర పై గౌరవం ఉన్నవారు, పురావస్తు శాస్త్రం పై ఆసక్తి ఉన్న వారు; విశ్వాసం తో, సంస్కృతి తో ముడిపడి ఉన్న వ్యక్తులు; భారతీయులు గా మనమంతా సంతోషపడడం చాలా సహజం.

సహచరులారా, భారతీయ సంస్కృతి, మన వారసత్వం గురించి మాట్లాడుతూ ఈ రోజు 'మన్ కీ బాత్' (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ఇద్దరి ని మీకు పరిచయం చేయదలుస్తున్నాను. ఈ రోజుల్లో Facebook, Twitter, Instagram లలో వార్తల లో ఉన్న ఆ ఇద్దరు టాంజానియన్ తోబుట్టువు లు కిలి పాల్, ఆయన సోదరి నీమా. వారి ని గురించి మీరు కూడా తప్పకుండా విని ఉంటారని నేను అనుకొంటున్నాను. వారికి భారతీయ సంగీతం పై అభిరుచి, మమకారం ఉన్నాయి. ఈ కారణం గా వారు చాలా ప్రజాదరణ ను పొందారు. పెదవులు కదలించే విధానం చూస్తే వారు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. ఈ మధ్య గణతంత్ర దినం సందర్భం లో మన జాతీయ గీతం 'జన గణ మన' ను వారు ఆలాపించిన వీడియో వైరల్‌ గా మారింది. కొద్ది రోజుల క్రితం కూడా లతా దీదీ కి ఓ పాట ను పాడి, వారు ఆత్మీయ నివాళులను అర్పించారు. ఈ అద్భుతమైన సృజనాత్మకత కు ఈ ఇద్దరు తోబుట్టువు లు కిలి ని, నీమా ను నేను చాలా అభినందిస్తున్నాను. కొద్ది రోజుల క్రితం టాంజానియా లోని భారత రాయబార కార్యాలయం లో కూడా వారి ని సన్మానించారు. భారతీయ సంగీతం లోని మాయాజాలం అందరి ని ఆకట్టుకొంటుంది. నాకు జ్ఞ‌ాపకం ఉంది- కొన్ని సంవత్సరాల కిందట ప్రపంచం లోని నూట యాభై కి పైగా దేశాల నుంచి గాయకులు, సంగీతకారులు వారి వారి దేశాల లో, వారి వారి సాంప్రదాయిక ఆహార్యం తో పూజ్య బాపూ జీ కి ఇష్టమైన భజన 'వైష్ణవ జనతో' ను పాడడం లో సఫలత ను సాధించారు.

 

 

నేడు భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల ముఖ్యమైన పండుగ ను జరుపుకొంటున్నప్పుడు దేశభక్తి గీతాల కు సంబంధించి ఇలాంటి ప్రయోగాలు చేయవచ్చు. విదేశీ పౌరుల ను, అక్కడి నుంచి ప్రసిద్ధ గాయకుల ను భారతీయ దేశభక్తి గీతాల ను పాడటానికి ఆహ్వానిద్దాం. ఇది మాత్రమే కాదు- మన దేశం లో అనేక భాషల లో చాలా రకాల పాట లు ఉన్నాయి. టాంజానియా లోని కిలి, నీమా లు భారతదేశం లోని పాటల కు ఈ విధం గా పెదవులను కదపగలిగినట్టే ఎవరైనా గుజరాతీ బాలలు తమిళం లో చేయవచ్చు. కేరళ పిల్లలు అసమీ పాటలు చేయాలి. మరికొందరు కన్నడ పిల్లలు జమ్ము- కశ్మీర్ పాటలు చేయాలి. మనం 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' అనుభూతి చెందగలిగే వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. ఇది మాత్రమే కాదు- మనం స్వాతంత్ర్య అమృత మహోత్సవాల ను కొత్త పద్ధతి లో జరుపుకోవచ్చు. నేను దేశం లోని యువత కు విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ భాషలలోని ప్రసిద్ధ పాటల ను మీకు తోచిన విధానం లో వీడియో తీయండి. మీరు బాగా పాపులర్ అవుతారు. దేశం లోని వైవిధ్యం కొత్త తరాని కి పరిచయం అవుతుంది.

 

ప్రియమైన నా దేశప్రజలారా, కొద్దిరోజుల క్రితం మనం మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకొన్నాం. మాతృభాష అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, దాని వ్యుత్పత్తి ఏంటి అనే విషయాలపై విద్యా సంబంధమైన అంశాలను పండితులు చెప్పగలరు. మాతృభాష కు సంబంధించి నేను ఒకటే చెప్తాను- మన తల్లి మన జీవితాన్ని తీర్చిదిద్దే విధం గా మాతృభాష కూడా మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. అమ్మ, మాతృభాష.. ఈ రెండూ జీవితపు పునాది ని బలపరుస్తాయి. చిరంజీవి ని చేస్తాయి. మనం తల్లి ని విడిచిపెట్టలేం. అలాగే మాతృభాష ను కూడా వదలలేం. కొన్నాళ్ల కిందటి ఒక విషయం నాకు గుర్తుంది. నేను అమెరికా కు వెళ్ళినప్పుడు వివిధ కుటుంబాల ను పరామర్శించే అవకాశం కలిగేది. ఒకసారి నేను తెలుగు కుటుంబాన్ని కలిసినప్పుడు అక్కడ చాలా సంతోషకరమైన దృశ్యాన్ని చూశాను. కుటుంబం లో ప్రతి ఒక్కరు ఎంత పని ఉన్నా ఊరి బయట, లేకపోతే కుటుంబ సభ్యులంతా కలిసి రాత్రి భోజనం చేయాలని, భోజన సమయం లో తెలుగు భాష లో మాత్రమే మాట్లాడాలని నియమం గా పెట్టుకొన్నట్టు వారు చెప్పారు. అక్కడ పుట్టిన పిల్లల కు కూడా ఇదే నియమం. మాతృభాష మీద ఉన్న ఈ ప్రేమ కారణం గా ఈ కుటుంబం నన్ను ఎంతగానో ప్రభావితుడి ని చేసింది.

 

 

సహచరులారా, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా కొందరు వ్యక్తులు తమ భాష, వేషధారణ, తిండి, పానీయాల పట్ల సంకోచం తో మానసిక సంఘర్షణ లో బతుకుతున్నారు. అయితే ప్రపంచం లో మరెక్కడా ఇలా ఉండదు. మన మాతృభాష ను మనం గర్వం గా మాట్లాడాలి. మన భారతదేశం భాష ల పరం గా చాలా సమృద్ధమైంది. దానిని ఇతర దేశాల తో పోల్చలేం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ఛ్ నుంచి కోహిమా వరకు- వందల కొద్దీ భాష లు, వేల కొద్దీ మాండలికాలు ఒకదానికి మరొకటి భిన్నం గా ఉంటాయి. కానీ ఒకదానికి మరొకటి కలిసిపోయాయి. భాష లు అనేకం. కానీ భావం ఒక్కటే. శతాబ్దాలు గా మన భాష లు వాటిని అవి మెరుగుపరుచుకొంటున్నాయి. ఒకదాని నుంచి మరొకటి నేర్చుకొంటూ అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచం లోనే అత్యంత పురాతనమైన భాష తమిళం భారతదేశం లోనే ఉంది. ప్రపంచంలోనే ఇంత గొప్ప వారసత్వ సంపద మనకు ఉన్నందుకు ప్రతి భారతీయుడు గర్వపడాలి. అదే విధం గా అనేక ప్రాచీన ధర్మ శాస్త్ర గ్రంథాల లో అభివ్యక్తి మన సంస్కృత భాష లో కూడా ఉంది. భారతదేశం లోని ప్రజలు సుమారు గా 121 అంటే 121 రకాల మాతృభాషల తో అనుబంధం కలిగి ఉండడం మనకు గర్వ కారణం. వీటిలో దైనందిన జీవితంలో 14 భాషల లో ఒక కోటి మందికి పైగా ప్రజలు మాట్లాడుతారు. అంటే అనేక యూరోపియన్ దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది ప్రజలు మన దేశంలో 14 వేరు వేరు భాషల తో అనుబంధం కలిగి ఉన్నారు. 2019 సంవత్సరం లో ప్రపంచం లో అత్యధికంగా మాట్లాడే భాషల లో హిందీ మూడో స్థానం లో నిలచింది. ప్రతి భారతీయుడు ఈ విషయం లో గర్వించాలి. భాష అనేది భావ వ్యక్తీకరణ మాధ్యమం మాత్రమే కాదు. సమాజ సంస్కృతి ని, వారసత్వాన్ని కాపాడేందుకు కూడా భాష ఉపయోగపడుతుంది. సుర్ జన్ పరోహి గారు తన భాషా వారసత్వాన్ని కాపాడుకోవడానికి సూరినామ్‌ లో ఇటువంటి పని చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీ న ఆయన 84వ ఏట అడుగుపెట్టారు. ఆయన పూర్వికులు జీవనోపాధి కోసం వేల కొద్ది కార్మికుల తో పాటు చాలా ఏళ్ల కిందట సూరినామ్‌ కు వెళ్లారు. సుర్ జన్ పరోహి గారు హిందీ లో చాలా మంచి కవిత్వం రాస్తారు. ఆయన కు అక్కడ జాతీయ కవుల లో ఒకరు గా గుర్తింపు లభించింది. అంటే నేటికీ ఆయన గుండెల్లో హిందుస్థాన్ ధ్వని వినబడుతుంది. ఆయన రచనల్లో హిందుస్థానీ మట్టి పరిమళం ఉంది. సూరీనామ్ ప్రజలు సుర్జన్ పరోహి పేరు మీద మ్యూజియం కూడా నిర్మించారు. 2015లో ఆయనను సన్మానించే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.

 

 

సహచరులారా, ఈ రోజు న- అంటే ఫిబ్రవరి 27వ తేదీ న మరాఠీ భాషాదినోత్సవం కూడాను.

"సర్వ్ మరాఠీ బంధు భగినినా మరాఠీ భాషా దినాచ్యా హార్దిక్ శుభేచ్ఛా! "

ఈ రోజు న మరాఠీ కవిరాజు విష్ణు బామన్ షిర్వాడ్ కర్ జీ, శ్రీమాన్ కుసుమాగ్రజ్ జీ కి అంకితం. ఈ రోజు న కుసుమాగ్రజ్ గారి జన్మదినం కూడా. కుసుమాగ్రజ్ గారు మరాఠీ లో కవిత్వం రాశారు. అనేక నాటకాలు రాశారు. మరాఠీ సాహిత్యాని కి సరికొత్త ఔన్నత్యాన్ని ఇచ్చారు.

 

 

సహచరులారా, భాష కు స్వీయ లక్షణాలు ఉన్నాయి. మాతృభాష కు దాని స్వీయ విజ్ఞానం ఉంది. ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకొని జాతీయ విద్య విధానం లో స్థానిక భాష లో విద్య కు ప్రాధాన్యం ఇవ్వబడింది. మన వృత్తిపరమైన కోర్సులను కూడా స్థానిక భాషలోనే బోధించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర అమృత కాలం లో మనమందరం కలసి ఈ ప్రయత్నాని కి ఊపు ఇవ్వాలి. ఇది మన స్వాభిమాన కార్యం. మీరు ఏ మాతృభాష మాట్లాడినా దాని యోగ్యత ను గురించి తెలుసుకొని ఆ విషయం పై రాయాలి.

 

 

సహచరులారా, కొన్ని రోజుల క్రితం నేను నా స్నేహితుడు, కెన్యా మాజీ ప్రధాన మంత్రి రైలా ఒడింగా గారి తో సమావేశమయ్యాను. ఈ సమావేశం ఆసక్తికరం గా, చాలా ఉద్వేగభరితం గా సాగింది. మనం చాలా మంచి స్నేహితులమైతే స్వేచ్ఛగా మాట్లాడుతాం. మేము ఇద్దరం మాట్లాడుకొంటున్నప్పుడు ఒడింగా గారు తన కుమార్తె గురించి చెప్పారు. ఆయన కుమార్తె రోజ్ మేరీ కి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. అందువల్ల ఆమె కు శస్త్రచికిత్స చేయించవలసి వచ్చింది. అయితే దీని వల్ల ఒక దుష్ఫలితం ఏమిటంటే రోజ్ మేరీ కంటి చూపు దాదాపు గా పోయింది. ఆయన కూతురి పరిస్థితి ఎలా ఉందో మీరు ఊహించగలరు. ఆ తండ్రి పరిస్థితి కూడా ఊహించగలం. ఆయన భావాల ను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తం గా ఉన్న ఆసుపత్రుల లో తన పుత్రిక చికిత్స కోసం ఆయన తన వంతు ప్రయత్నాన్ని చేయని పెద్ద దేశం ప్రపంచం లోనే లేదు.

 

 

ప్రపంచం లోని పెద్ద పెద్ద దేశాల లో వెతికినా ఫలితం లేకపోవడం తో ఓ విధం గా ఆశలన్నిటి ని వదలుకొన్నారు. దాంతో ఇల్లంతా నిస్పృహ వాతావరణం నెలకొంది. ఆయుర్వేద చికిత్స కోసం భారతదేశాని కి వెళ్లవలసింది గా ఎవరో సూచించారు. ఆయన చాలా చేశారు. అలసిపోయారు. “ఒకసారి ప్రయత్నం చేద్దాం” అనుకొని భారతదేశాని కి వచ్చారు. కేరళ లోని ఆయుర్వేద ఆసుపత్రి లో తన కుమార్తె కు చికిత్స ను అందించడం ప్రారంభించారు. ఆయన కూతురు చాలా కాలం ఇక్కడే ఉండిపోయింది. ఆయుర్వేద చికిత్స ప్రభావం వల్ల రోజ్ మేరీ కంటి చూపు చాలా వరకు తిరిగి వచ్చింది. రోజ్ మేరీ కి కొత్త జీవితం లభించినట్టు, ఆమె జీవితాని కి కొత్త వెలుగు వచ్చినట్టు మీరు ఊహించవచ్చు. కానీ మొత్తం కుటుంబాని కి ఒక కొత్త వెలుగు వచ్చింది. ఈ విషయం నాకు చెబుతున్నప్పుడు ఒడింగా గారు చాలా ఉద్వేగానికి లోనయ్యారు. భారతీయ ఆయుర్వేద పరిజ్ఞానాన్ని కెన్యా కు తీసుకు వెళ్లాలని ఆయన కోరుకొంటున్నారు. ఆయుర్వేదం లో ఉపయోగించే మొక్కల ను పెంచి, మరింత మంది కి ప్రయోజనం కలిగేలా కృషి చేస్తామన్నారు.

 

 

మన భూమి నుంచి, సంప్రదాయం నుంచి ఒకరి జీవితం లోని ఇంత గొప్ప బాధ తొలగిపోవడం నాకు చాలా సంతోషదాయకం అయినటువంటి విషయం. ఇది విని మీరు కూడా సంతోషిస్తారు. దాని గురించి గర్వించని భారతీయుడు ఎవరు ఉంటారు ? ఒడింగా గారు ఒక్కరే కాదు, ప్రపంచం లో లక్షల కొద్దీ ప్రజలు ఆయుర్వేదం నుంచి ఇటువంటి ప్రయోజనాలను పొందుతున్నారు అని మనకు అందరికి తెలిసిన విషయమే.

 

బ్రిటన్ యువరాజు చార్ల్ స్ కూడా ఆయుర్వేదం అభిమానుల లో ఒకరు. నేను ఆయన ను కలిసినప్పుడల్లా ఆయన ఆయుర్వేదం గురించి ప్రస్తావించక మానరు. ఆయన కు భారతదేశం లోని అనేక ఆయుర్వేద సంస్థల ను గురించి కూడా తెలుసును.

 

సహచరులారా, గత ఏడు సంవత్సరాలలో దేశం లో ఆయుర్వేద ప్రచారం పైన చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు మన సంప్రదాయ వైద్యాన్ని, ఆరోగ్య పద్ధతులను ప్రాచుర్యం లోకి తీసుకురావాలి అనే మన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసింది. గత కొన్ని సంవత్సరాలు గా ఆయుర్వేద రంగం లో అనేక కొత్త స్టార్ట్- అప్స్ పుట్టుకు వచ్చినందుకు నేను చాలా సంతోషం గా ఉన్నాను. ఆయుష్ స్టార్ట్- అప్ ఛాలెంజ్ ఈ నెల మొదట్లో ప్రారంభమైంది. ఈ రంగం లో పనిచేస్తున్న స్టార్ట్- అప్ లను గుర్తించడం, వాటికి సహకారం ఇవ్వడం ఈ ఛాలెంజ్ లక్ష్యం. ఈ రంగం లో పనిచేస్తున్న యువత తప్పనిసరి గా ఈ ఛాలెంజ్‌ లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.

 

సహచరులారా, ప్రజలు కలసి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న తరువాత, వారు అద్భుతమైన పనుల ను చేస్తారు. సమాజం లో ఇటువంటి పెద్ద మార్పు లు ఎన్నో వచ్చాయి. అందులో ప్రజల భాగస్వామ్యం, సమిష్టి కృషి పెద్ద పాత్ర పోషించాయి. కశ్మీర్‌ లోని శ్రీనగర్‌ లో ‘మిశన్ జల్ థల్’ పేరు తో అటువంటి ప్రజా ఉద్యమం జరుగుతోంది. శ్రీనగర్‌ లోని సరస్సుల ను, చెరువుల ను శుభ్రపరచి వాటి పాత వైభవాన్ని పునరుద్ధరించడానికి ఇది ఒక ప్రత్యేకమైన ప్రయత్నం. ‘మిశన్ జల్ థల్’ దృష్టి కుశల్ సార్ పైన, గిల్ సార్ పైన ఉంది. ఇందులో ప్రజల భాగస్వామ్యం తో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఎక్కువ గా వినియోగించుకొంటున్నారు. ఎక్కడెక్కడ ఆక్రమణ లు జరిగాయో, ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు జరిగాయో తెలుసుకొనేందుకు ఈ ప్రాంతం లో సర్వేక్షణ ను చేయించారు. దీనితో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల ను తొలగించడం, వ్యర్థాల ను శుభ్రపరచడం వంటి ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. మిశన్ రెండో దశ లో పాత నీటి కాలువల ను, సరస్సుల ను నింపే 19 జలపాతాల ను పునరుద్ధరించడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. ఈ పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రాముఖ్యాన్ని గురించి మరింత అవగాహన కల్పించడానికి స్థానిక ప్రజల ను, యువత ను నీటి రాయబారులు గా నియమించడమైంది. ఇప్పుడు ఇక్కడి స్థానిక ప్రజలు కూడా గిల్ సార్ సరస్సు లో వలస పక్షుల, చేప ల సంఖ్య ను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చూసి ప్రజలు సంతోషిస్తున్నారు. ఈ అద్భుతమైన ప్రయత్నానికి శ్రీనగర్ ప్రజల ను నేను చాలా చాలా అభినందిస్తున్నాను.

 

సహచరులారా, ఎనిమిది సంవత్సరాల కిందట దేశం ప్రారంభించిన ‘స్వచ్చ భారత్ మిశన్' విస్తరణ కాలం తో పాటు పెరిగింది. కొత్త ఆవిష్కరణ లు కూడా జతపడ్డాయి. మీరు భారతదేశం లో ఎక్కడికి వెళ్లినా, ప్రతి చోటా పరిశుభ్రత కోసం కొంత ప్రయత్నం జరుగుతుందని మీకు తెలుస్తుంది. అసమ్ లోని కోక్ రాఝార్‌ లో అటువంటి ఒక ప్రయత్నం గురించి నాకు తెలిసింది. ఇక్కడ మార్నింగ్ వాకర్స్ బృందం ఒకటి 'క్లీన్ అండ్ గ్రీన్ కోక్ రాఝార్' మిశన్ లో భాగం గా చాలా ప్రశంసనీయమైన చొరవ తీసుకొంది. వీరంతా కొత్త ఫ్లై ఓవర్ ప్రాంతం లోని మూడు కిలోమీటర్ల పొడవునా రహదారి ని శుభ్రం చేసి స్వచ్ఛత స్ఫూర్తి సందేశాన్ని అందించారు. అదేవిధం గా విశాఖపట్నం లో ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ లో భాగం గా పాలిథిన్‌కు బదులు గుడ్డ సంచుల ను వినియోగించాలని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు పర్యావరణాన్ని పరిశుభ్రం గా ఉంచేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల కు వ్యతిరేకం గా కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు వ్యర్థాలను ఇంటి వద్దే వేరు చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముంబయి లోని సోమయ్య కాలేజీ విద్యార్థులు పరిశుభ్రత ప్రచారం లో సుందరీకరణ ను కూడా చేర్చారు. కళ్యాణ్ రైల్వే స్టేశన్ గోడల ను చక్కని వర్ణచిత్రాల తో అలంకరించారు. రాజస్థాన్‌ లోని సవాయ్ మాధోపుర్ గురించిన ప్రేరణాత్మక ఉదాహరణ సంగతి నా వరకు వచ్చింది. అక్కడి యువత రణథంబోర్‌ లో ‘మిశన్ బీట్ ప్లాస్టిక్’ పేరు తో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో రణథంబోర్‌ అడవుల్లో ప్లాస్టిక్ ను, పాలిథిన్ ను తొలగించడమైంది. సబ్ కా ప్రయాస్ తాలూకు ఈ భావన దేశం లో ప్రజల భాగస్వామ్యాన్ని బలపరుస్తుంది. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు అతి పెద్దవి అయినటువంటి లక్ష్యాలు సైతం తప్పక నెరవేరుతాయి.

ప్రియమైన నా దేశప్రజలారా,నేటి నుంచి కొద్ది రోజుల తరువాత మార్చి 8వ తేదీ నాడు మహిళ ల అంతర్జాతీయ దినాన్ని ప్రపంచవ్యాప్తం గా పాటించడం జరుగుతుంది. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మనం మహిళ ల సాహసాల కు, నైపుణ్యాని కి, ప్రతిభ కు సంబంధించిన అనేక ఉదాహరణల ను పంచుకొంటున్నాం. నేడు ‘స్కిల్ ఇండియా’ అయినా, స్వయం సహాయక సమూహాలు అయినా, చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు అయినా.. అన్ని చోట్లా మహిళ లు ముందున్నారు. ఎక్కడ చూసినా మహిళ లు పాత అపోహల ను ఛేదిస్తున్నారు. నేడు మ‌న దేశం లో మ‌హిళ‌ లు పార్ల‌మెంట్ నుంచి పంచాయతీ ల వరకు వివిధ రంగాల లో ఉన్నత స్థానాల ను అధిరోహిస్తున్నారు. సైన్యం లో కూడా యువతులు ఇప్పుడు ఉన్నత స్థానాల లో బాధ్యతల ను నిర్వహిస్తున్నారు. దేశాన్ని కాపాడుతున్నారు. గత నెల గణతంత్ర దినం నాడు అమ్మాయి లు కూడా ఆధునిక యుద్ధ విమానాల ను ఎగురవేయడం చూశాం. సైనిక్ పాఠశాలల్లో అమ్మాయిల ప్రవేశం పై ఉన్న నిషేధాన్ని దేశం తొలగించింది. దేశవ్యాప్తం గా ఉన్న సైనిక్ స్కూల్స్ లో ఇప్పుడు అమ్మాయిలు ప్రవేశం పొందుతున్నారు. అదేవిధం గా మన స్టార్ట్- అప్ ప్రపంచాన్ని చూడండి. గత సంవత్సరాల లో దేశం లో వేల కొద్దీ కొ స్టార్ట్- అప్ లు ప్రారంభమయ్యాయి. ఈ స్టార్ట్- అప్ లలో దాదాపు సగం స్టార్ట్- అప్ లు మహిళ లు నిర్వహిస్తున్నవే ఉన్నాయి. ఈ మధ్య కాలం లో మహిళల కు ప్రసూతి సెలవుల పెంపు వంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అబ్బాయిల కు, అమ్మాయిల కు సమానమైన హక్కుల ను కల్పిస్తూ పెళ్లి వయస్సు ను సమానం చేసేందుకు దేశం ప్రయత్నిస్తోంది. దీంతో ప్రతి రంగం లో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నది. దేశం లో జరుగుతున్న మరో పెద్ద మార్పు ను మీరు తప్పక చూస్తారు. ఈ మార్పు మన సామాజిక ప్రచారాల విజయం. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ విజయాన్ని తీసుకోండి.. దీని ద్వారా నేడు దేశం లో లింగ నిష్పత్తి మెరుగుపడింది. బడి కి వెళ్లే బాలిక ల సంఖ్య కూడా మెరుగుపడింది. మన అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేయకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధం గా ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ లో భాగం గా దేశం లోని మహిళ లు ఆరు బయలు ప్రదేశాల లో మల విసర్జన నుంచి విముక్తి ని పొందారు. ముమ్మారు తలాక్ లాంటి సామాజిక దురాచారం కూడా అంతం కాబోతోంది. ట్రిపుల్ తలాక్‌ కు వ్యతిరేకం గా చట్టం వచ్చినప్పటి నుంచి దేశం లో ఈ కేసు లు 80 శాతం తగ్గాయి. ఇంత తక్కువ సమయం లో ఈ మార్పులన్నీ ఎలా జరుగుతున్నాయి? మన దేశం లో పరివర్తన కు, ప్రగతిశీల ప్రయత్నాల కు ఇప్పుడు మహిళలే నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఈ మార్పు వస్తోంది.

 

 

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, రేపు ఫిబ్రవరి 28 న, ‘నేశనల్ సైన్స్ డే’. ఆ రోజు రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ కు కూడా ప్రసిద్ధి చెందింది. సివి రామన్ గారి తో పాటు మన వైజ్ఞానిక యాత్ర ను సుసంపన్నం చేయడం లో ప్రధాన పాత్ర ను పోషించిన శాస్త్రవేత్తలందరికీ నేను గౌరవపూర్వక శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. మిత్రులారా, సాంకేతిక వి జ్ఞ‌ానం మన జీవితం లో సులభం గా, సరళం గా చాలా చోటు నే సంపాదించుకొంది. ఏ సాంకేతికత మంచిది, ఏ సాంకేతికత ఉత్తమ వినియోగం ఏమిటి - ఈ విషయాలన్నీ మనకు బాగా తెలుసు. కానీ, మన కుటుంబం లోని పిల్లల కు ఆ సాంకేతికతకు ఆధారం ఏమిటి, దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి అనే విషయాల ను వివరించడం పైకి మన దృష్టి వెళ్లడం లేదన్నది కూడా నిజం. ఈ సైన్స్ దినం సందర్భం లో కుటుంబాలన్నీ తమ పిల్లల లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడాన్ని చిన్న చిన్న ప్రయత్నాల ను మొదలుపెట్టితీరాలి అని నేను కోరుతున్నాను.

 

 

ఉదాహరణ కు ఇప్పుడు సరిగ్గా కనబడడం లేదు కానీ కళ్లద్దాలు పెట్టుకున్నాక కనిపిస్తోంది.. దీని వెనుక ఉన్న శాస్త్రం ఏమిటో పిల్లల కు సులభం గా వివరించవచ్చు. కేవలం ‘అద్దాలు చూడండి- ఆనందించండి’ అనడం మాత్రమే కాదు. మీరు ఒక చిన్న కాగితం పై వారికి చెప్పవచ్చు. ఇప్పుడు వారు మొబైల్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. కాలిక్యులేటర్ ఎలా పని చేస్తుంది, రిమోట్ కంట్రోల్ ఎలా పని చేస్తుంది, సెన్సర్ లు ఏమిటి? ఇలాంటి వైజ్ఞ‌ానిక అంశాలను ఇంట్లో చర్చిస్తారా? దైనందిన జీవనం వెనుక ఉన్న ఈ విషయాల ను మనం సులభం గా వివరించవచ్చు. అది ఏమి చేస్తుందో దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో చెప్పవచ్చు. అదే విధంగా మనం ఎప్పుడైనా పిల్లలతో కలిసి ఆకాశాన్ని పరిశీలించామా? రాత్రిపూట నక్షత్రాల ను గురించి మాట్లాడాలి. వివిధ రకాల నక్షత్ర రాశులు కనిపిస్తాయి. వాటి గురించి చెప్పండి. ఇలా చేయడం ద్వారా మీరు పిల్లల లో భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం ల పట్ల ఆసక్తి ని కలిగించవచ్చు. ఈ రోజుల్లో, చాలా ఏప్‌ లు కూడా ఉన్నాయి. వాటి నుంచి మీరు నక్షత్రాల ను, గ్రహాల ను గుర్తించవచ్చు లేదా ఆకాశం లో కనిపించే నక్షత్రాన్ని మీరు గుర్తించవచ్చు. దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. దేశ నిర్మాణాని కి సంబంధించిన పని లో మీ నైపుణ్యాలు , శాస్త్రీయ స్వభావాన్ని ఉపయోగించాలని మన స్టార్ట్- అప్‌ ఆవిష్కర్తల కు నేను చెప్తాను. దేశం పట్ల మన సమష్టి శాస్త్రీయ బాధ్యత కూడా ఇదే. ఈ రోజుల్లో మన స్టార్ట్- అప్‌ లు వర్చువల్ రియాలిటీ ప్రపంచం లో చాలా మంచి పని చేస్తున్నాయని నేను చూస్తున్నాను. వర్చువల్ తరగతుల ఈ యుగం లో పిల్లలను దృష్టి లో పెట్టుకొని అటువంటి వర్చువల్ లేబ్‌ ను తయారు చేయవచ్చు. మనం వర్చువల్ రియాలిటీ ద్వారా పిల్లలను ఇంట్లో కూర్చొని కెమిస్ట్రీ లేబ్‌ ను అనుభవించేలా చేయవచ్చు. ఉపాధ్యాయుల ను, తల్లితండ్రుల ను నేను అభ్యర్థించేది ఏమిటి అంటే విద్యార్థులను గాని, లేదా పిల్లల ను గాని వారందరిని ప్రశ్నలు అడగండి అంటూ ప్రోత్సహించండి. వారితో కలసి ప్రశ్నల కు సరైన సమాధానాల ను కనుగొనండి. కరోనా కు వ్యతిరేకం గా పోరాటం లో భారతీయ శాస్త్రవేత్త లు పోషించినటువంటి పాత్ర ను కూడా ఈ రోజు న నేను అభినందించాలనుకొంటున్నాను. వారి కృషి కారణంగానే మేడ్ ఇన్ ఇండియా వాక్సీన్‌ ను తయారు చేయడం సాధ్యమైంది. ఇది యావత్తు ప్రపంచాని కి ఎంతగానో ఉపయోగపడింది. ఇది విజ్ఞ‌ానశాస్త్రం మానవాళి కి అందించిన బహుమతి.

 

 

 

ప్రియమైన నా దేశప్రజలారా, ఈసారి కూడా మనం అనేక అంశాల పై చర్చించాం. మార్చి నెల లో అనేక పండుగ లు వస్తున్నాయి. శివరాత్రి వస్తోంది. ఆ తరువాత కొన్ని రోజులకు మీరందరూ హోలీ కోసం సిద్ధం కావడం మొదలుపెడతారు. హోలీ మనల్ని కలిపే పండుగ. ఇందులో మనవాడు - పరాయివాడు, చిన్న- పెద్ద అనే తేడాలన్నీ తుడిచిపెట్టుకు పోతాయి. ద్వేషాలు-విద్వేషాలు దూరం అవుతాయి. అందుకే హోలీ కి ఉన్న ప్రేమ, సామరస్యాలు హోలీ రంగుల కంటే గాఢమైనవి అని అంటారు. హోలీ లో తీయనైన కజ్జికాయల తో పాటు, సంబంధాల లో కూడా ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది. మనం ఈ సంబంధాల ను మరింత బలోపేతం చేసుకోవాలి. మన కుటుంబం లోని వ్యక్తుల తో మాత్రమే కాకుండా మీ విస్తృత కుటుంబం లో భాగమైన వారి తో కూడా సంబంధాలను బలపరచుకోవాలి. దీనిని చేయడానికి అత్యంత ముఖ్యమైన మార్గం కూడా మీరు గుర్తుంచుకోవాలి. ‘వోకల్ ఫార్ లోకల్’ తో పండుగ ను జరుపుకోవడమే ఈ మార్గం. పండుగ ల సందర్భం గా మీరు స్థానిక ఉత్పత్తుల ను కొనుగోలు చేయాలి. తద్వారా మీ చుట్టూ నివసించే ప్రజల జీవితాల ను కూడా వర్ణభరితం చేయవచ్చు. ఉత్సాహాన్ని నింపవచ్చు. మన దేశం కరోనా పై పైచేయి ని సాధిస్తూ ముందుకు సాగడం తో, పండుగల లో ఉత్సాహం కూడా చాలా రెట్లు పెరిగింది. ఈ ఉత్సాహం తో మనం పండుగల ను జరుపుకోవాలి. అదే కాలం లో మనం జాగ్రత్త గా కూడా ఉండాలి. రానున్న పండుగ ల సందర్భం లో నేను మీ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడూ మీ మాటల కోసం, మీరు పంపించే ఉత్తరాల కోసం, మీ సందేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

 

 

మీకు చాలా చాలా ధన్యవాదాలు.

 

 

***

 



(Release ID: 1801633) Visitor Counter : 305