శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కృత్రిమేధస్సు, డిజిటల్ వైద్యం వైద్యరక్షణ భవితకు కీలకం!
జమ్ము ఎయిమ్స్ భవనం సందర్శనలో
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రకటన..
సంస్థలో నూతనంగా నిర్మించే బ్లాకుల పరిశీలన..,
పూర్తయిన పలుసదుపాయాలకు ప్రారంభోత్సవం
ఒ.పి.డి. సేవలు సత్వరం మొదలవుతాయని ప్రకటన..
వైజ్ఞానిక సహకార బాంధవ్యం కోసం జమ్ము ఎయిమ్స్,
జమ్ము ఐ.ఐ.ఐ.ఎం. మధ్య కుదిరిన అవగాహన..
Posted On:
29 JAN 2022 5:12PM by PIB Hyderabad
ఆరోగ్య రక్షణ రంగానికి సంబంధించి భవిష్యత్తులో కృత్రిమ మేధో పరిజ్ఞానం, డిజిటల్ వైద్యం వంటివి కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు అన్నారు. జమ్ములోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ-ఎయిమ్స్ (ఎ.ఐ.ఐ.ఎం.ఎస్.)ను ఆయన ఈ రోజు సందర్శించారు. నూతనంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు. జమ్ము ఎయిమ్స్ భవనంలో ఇటీవల అభివృద్ధి చేసిన కొన్ని సదుపాయాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, జమ్ము ఎయిమ్స్ సంస్థకు ఒక విశిష్టమైన గుర్తింపును తీసుకువచ్చేందుకు కీలకమైన కృత్రిమ మేధో పరిజ్ఞానం, డిజిటల్ వైద్యంపై దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ఆరోగ్యరక్షణ రంగంలో టెలీ మెడిసిన్, రోబొటిక్ శస్త్రచికిత్సలకు ఇప్పటికే పెద్ద ఎత్తున వినియోగంలోకి వచ్చాయని, ఇటీవల దేశవ్యాప్తంగా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఈ రెండింటి వినియోగం ఎంత అవసరమో మనందరికీ తెలిసివచ్చిందని ఆయన అన్నారు.
జమ్ము ఎయిమ్స్ నూతన భవనంలో అవుట్ పేషంట్ విభాగం సేవలు సత్వరమే ప్రారంభమవుతాయని, తొలి దశ సేవలు ఈ ఏడాది జూన్ 1వ తేదీనుంచి మొదలవుతాయని, అనంతం రెండవ దశ సేవలు కూడా ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి చెప్పారు. ఇప్పటికే 30మంది నిపుణలు, సిబ్బందితో కూడిన ఫ్యాకల్టీని చేర్చుకున్నారని, ఆరు అంతస్తుల జమ్ము ఎయిమ్స్ భవన సముదాయం వచ్చే సంవత్సరం ప్రారంభానికల్లా పూర్తి స్థాయిలో సంసిద్ధమవుతుందని ఆయన చెప్పారు. వైజ్ఞానిక శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్.ఐ.ఆర్.)కు అనుబంధంగా జమ్ములో ఏర్పాటైన భారతీయ సమగ్ర వైద్య అధ్యయన సంస్థ (ఐ.ఐ.ఐ.ఎం) సన్నిహిత సహకారంతో జమ్ము ఎయిమ్స్ పనిచేస్తుందని ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించి జమ్ము ఎయిమ్స్ డైక్టర్ డాక్టర్ శక్తి గుప్తా, జమ్ము ఐ.ఐ.ఐ.ఎం. డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస రెడ్డి మధ్య కేంద్రమంత్రి సమక్షంలోనే ఈ రోజు ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది.
ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, వైద్య పరిశోధనా రంగానికి అంకితమై పనిచేస్తున్న జమ్ము ఐ.ఐ.ఐ.ఎం., జమ్ములోని ప్రభుత్వ వైద్య కళాశాల,.. పరస్పరం దాదాపు 4 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నప్పటికీ గతంలో ఈ రెండు సంస్థల మధ్య ఎలాంటి సహకార బాంధ్యవ్యం లేకపోవడం విడ్డూరమని అన్నారు. జమ్ము ఐ.ఐ.ఐ.ఎం.కు, జమ్ము ప్రభుత్వ వైద్య కళాశాలకు మధ్యన,.. అలాగే జమ్ము ఐ.ఐ.ఐ.ఎం., జమ్ము ఎయిమ్స్ సంస్థకు మధ్య సాన్నిహిత్యాన్ని, సమగ్రతను తీసుకవచ్చేందుకు అన్ని విధాలా కృషి చేయగలమని ఆయన చెప్పారు.
సి.ఎస్.ఐ.ఆర్.కు సంబంధించి దేశంలో ఉన్న ప్రాచీన పరిశోధనా సంస్థల్లో జమ్ము ఐ.ఐ.ఐ.ఎం. కూడా ఉందని, గంజాయి ఆధారిత మత్తు మందులపై పరిశోధనలో అగ్రశ్రేణి సంస్థగా ఇప్పటికీ ఈ సంస్థకు పేరుప్రఖ్యాతులు ఉన్నాయని, పలు రకాల ఇతర ఔషధాలపై కూడా ఇక్కడ పరిశోధన సాగుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దీనితో పరిశోధన, వైద్య విద్య ప్రధాన విధులుగా నిర్వర్తిస్తున్న ఎయిమ్స్.కు కూడా జమ్ము ఐ.ఐ.ఐ.ఎం. సహజమైన మైత్రీసంస్థగా మారిందని అన్నారు.
డాక్టర్ శక్తి గుప్తా డైరెక్టర్.గా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి జమ్ము ఎయిమ్స్ సాధించిన ప్రగతి అభినందనీయమని కేంద్రమంత్రి అన్నారు. ఈ సంస్థకు మరింత విశిష్టమైన గుర్తింపును తీసుకువచ్చేందుకు డిజిటల్ ఆరోగ్యం, కృత్రిమ మేధో పరిజ్ఞానం వంటి రంగాల్లో దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. కృత్రిమ మేధో పరిజ్ఞానం ఆధారంగా ఆరోగ్య రక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో జమ్ము ఎయిమ్స్ ఉత్తరభారతదేశానికే అగ్రశ్రేణి సంస్థగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న వ్యక్తిగత శ్రద్ధ కారణంగానే, ఇటీవలి కాలంలో జమ్ములో కేంద్రప్రభుత్వ ఆర్థిక సహాయంతో కూడిన అనేక ప్రధాన సంస్థలు పరస్పరం సామీప్యంలోనే అభివృద్ధి చెందాయని, తద్వారా ముఖ్యమైన విద్యా, విజ్ఞాన కేంద్రంగా జమ్ము రూపుదిద్దుకున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ నేపథ్యంలో, మొదట వివిధ శాస్త్ర పరిశోధనా సంస్థల మధ్యన,.. ఆతర్వాత, వైజ్ఞానిక సంస్థలు, వైజ్ఞానికేతర సంస్థల మధ్యన మరింత సమన్వయం, సమాకలనం బలపడాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. సుస్థిర అభివృద్ధిని, జీవనోపాధిని లక్ష్యాలుగా సాధించాలంటే ఈ విద్యా సంస్థలన్నింటి మధ్యనా సమగ్రత, సాన్నిహిత్యం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
జమ్ము కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించి గతంలో కొనసాగిన రాజ్యాంగపరమైన అడ్డంకులు, ఇబ్బందులు తొలగిపోవడంతో దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ఉత్తమమైన నిపుణులను, సిబ్బందిని జమ్ము, కాశ్మీర్ ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు పరిపాలనా యంత్రాగం, యాజమాన్య వ్యవస్థలు అన్ని రకాలుగా కృషి చేయగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
****
(Release ID: 1793617)
Visitor Counter : 148