ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐ.టి. మరియు వ్యవస్థాపకతలను ప్రోత్సహించనున్న - ఎస్.టి.పి.ఐ.,మీరట్


ఆత్మనిర్భర్ భారత్‌ కు రహదారి ఉత్తరప్రదేశ్ గుండా వెళుతుంది: రాజీవ్ చంద్రశేఖర్

"మిట్టి-కో-జానో, ఫసల్-పెహచానో" అనే ఏ.ఐ. సొల్యూషన్‌ ను అభివృద్ధి చేసిన లలిత్‌ పూర్‌ కు చెందిన ఒక రైతు కుమార్తె, 9వ తరగతి విద్యార్థిని కోసం స్కాలర్‌ షిప్‌ ప్రకటించిన - కేంద్ర సహాయ మంత్రి

Posted On: 28 DEC 2021 5:17PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో 5వ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కును కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రారంభిస్తూ, ఆత్మ నిర్భర్ భారత్‌ కు వెళ్లే రహదారి యు.పి. మీదుగా వెళుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ,  “రాష్ట్రం సాంకేతికత మరియు పెట్టుబడి కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. సాంకేతికత ప్రజల జీవితాలను మారుస్తోంది. మెరుగైన జీవనం కోసం యువత సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తద్వారా డిజిటల్ ఉత్తరప్రదేశ్ కోసం అవసరమైన మొత్తం పర్యావరణ వ్యవస్థను సృష్టించడం జరుగుతోంది." అని తెలియజేశారు. 

ఇంటెల్‌ సంస్థ భాగస్వామ్యంతో ఎలక్ట్రానిక్స్ మరియు ఐ.టి. మంత్రిత్వ శాఖ నిర్వహించిన "యువత కోసం ఏ.ఐ. ఛాలెంజ్" అనే  కార్యక్రమంలో పాల్గొన్న లలిత్‌ పూర్‌ కు చెందిన ఒక రైతు కుమార్తె నందిని కుష్వాహ అనే 9వ తరగతి విద్యార్థినిని ఆయన ఉదాహరణ గా పేర్కొన్నారు.  "మిట్టి-కో-జానో, ఫసల్-పెహచానో"  అనే శీర్షికతో ఆమె ఒక పరిష్కారాన్ని రూపొందించింది.  ఆమె ఆన్‌-లైన్ తరగతుల్లో పాల్గొనడానికి వీలుగా,భారతదేశంలో యారైన ఒక అత్యాధునిక సెల్ ఫోన్ బహూకరిస్తున్నట్లు ప్రకటించారు.  అదేవిధంగా కళాశాల స్థాయి వరకు ఆమె విద్యకు అవసరమైన ఆర్ధిక సహాయం చేయనున్నట్లు కూడా మంత్రి ప్రకటించారు. "డిజిటల్ ఉత్తరప్రదేశ్ కు "బ్రాండ్ అంబాసిడర్‌" లుగా నిలువనున్న వీరికి, నరేంద్ర మోడీ ప్రభుత్వం వీరికి పూర్తి మద్దతు నిస్తుంది." అని భరోసా ఇచ్చారు.  

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ల జంట నాయకత్వంలో ఈ రాష్ట్రం గత ఐదేళ్లుగా అభివృద్ధిపథంలో ఎలా ముందుకు దూసుకు పోతున్నదీ ఆయన ప్రత్యేకంగా వివరించారు.  రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చురుకైన విధానాల కారణంగా, వ్యాపారాన్ని సులభతరం చేసే అగ్ర రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ ఒకటిగా నిలిచింది. 

కొత్త విమానాశ్రయాలు, రైల్వేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు / హైవేలతో పాటు, ముఖ్యంగా ఐ-వే లు రావడంతో కనెక్టివిటీ పరంగా రాష్ట్రం భారీ అభివృద్ధి సాధించింది.  తద్వారా ప్రజలను అనుసంధానించడం, స్థానిక వ్యాపారానికి ఊతం ఇవ్వడం జరిగింది. 

సాఫ్ట్‌ వేర్ ఎగుమతులను పెంచడంతో పాటు, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి వీలుగా, ఈ ప్రాంతంలో సాంకేతిక అంకురసంస్థలు, ఎం.ఎస్.ఎం.ఈ. లను శక్తివంతం చేయడంలో, ఎఫ్‌.డి.ఐ. ని ఆకర్షిస్తూ, డిజిటల్ ఉత్తరప్రదేశ్ దృక్పథాన్ని గ్రహించడంలో, ఎస్.టి.పి.ఐ-మీరట్ కేంద్రం ఉత్ప్రేరక పాత్ర పోషిస్తోంది. 

ఎస్.టి.పి.ఐ-నోయిడా  డైరెక్టరేట్ అధికార పరిధి కింద, ద్వితీయ / తృతీయ శ్రేణి నగరాల్లో, మీరట్ కేంద్రం, ఎస్.టి.పి.ఐ. కి చెందిన 54వ కేంద్రం.  ఉత్తరప్రదేశ్ లో ఐ.టి. రంగాన్ని విస్తరించడంతో పాటు,  ద్వితీయ / తృతీయ శ్రేణి నగరాలోని, వర్ధమాన సాంకేతిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలను శక్తివంతం చేయడంలో, అదేవిధంగా,  వారి ప్రత్యేక ఆలోచనలను వినూత్న ఉత్పత్తులుగా మార్చడంలో,  ఎస్.టి.ఐ.పి-మీరట్ కేంద్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో, ఎస్.టి. పి .ఐ. వద్ద నమోదు చేసిన సంస్థలు, 4,96,313 కోట్ల రూపాయల మేర ఐ.టి/ఐ.టి.ఈ.ఎస్. ఎగుమతులు చేయగా, వీటిలో, ఉత్తరప్రదేశ్  నుండి 22,671 కోట్ల రూపాయల మేర ఎగుమతులు జరిగాయి. 

ఎస్.టి.పి.ఐ-మీరట్ లో, మొత్తం 25,074 చదారపు అడుగుల వైశాల్యంతో ఉన్న, అత్యాధునిక ఇంక్యుబేషన్ సౌకర్యంలో,  133 సీట్ల సామర్థ్యంతో 3,704 చదరపు అడుగుల ప్లగ్-ఎన్-ప్లే స్థలం, 2,021 చదరపు అడుగుల ముడి  ఇంక్యుబేషన్ స్థలంతో పాటు,  హై-స్పీడ్ డేటా కమ్యూనికేషన్ సౌకర్యాలు ఉన్నాయి.  దేశ విదేశాల నుండి ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే దిశగా, వినూత్న సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి వారికి అధికారం కల్పిస్తూనే,  యువ సాంకేతిక వ్యవస్థాపకులకు, అంకుర సంస్థలకు తయారీ  సంస్కృతి ని సృష్టించడానికి, ఈ సదుపాయం శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను అందిస్తుంది.  ఈ ప్రాంతం నుంచి ఐటీ ఎగుమతులను పెంచడంలో ఇది దోహదపడుతుంది.  అదేవిధంగా, ఈ ప్రాంతంలోని యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. 

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అంకురసంస్థలు మరియు పరిశ్రమల ప్రతినిధులు మంత్రితో విస్తృతంగా చర్చలు జరిపారు.  అంకుర సంస్థల కోసం, తమ ప్రాంగణంలో అందిస్తున్న సౌకర్యాలపై, ఎస్.టి.పి.ఐ. రూపొందించిన ఒక చిన్న సమాచార, ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది.  సమీపంలోని  విశ్వవిద్యాలయాలకు చెందిన ఐ.టి. విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

పార్లమెంటు సభ్యుడు (లోక్‌సభ) శ్రీ రాజేంద్ర అగర్వాల్;  శాసనసభ్యుడు శ్రీ సోమేంద్ర తోమర్;  శాసనసభ్యుడు శ్రీ సత్యప్రకాష్ అగర్వాల్; శాసన మండలి సభ్యుడు శ్రీ అశ్విని త్యాగి; ఎస్.టి.పి.ఐ. డైరెక్టర్ జనరల్, శ్రీ అరవింద్ కుమార్,  మీరట్ లోని  వేదవ్యాస్ పూరి యోజన, ఎన్.హెచ్-58 బైపాస్ దగ్గర ఐ.టి.పి-03 వద్ద ఉన్న ఎం.ఏ.ఐ.టి.వై. సంయుక్త కార్యదర్శి, శ్రీ భువనేష్ కుమార్ ప్రభృతుల సమక్షంలో ఈ కేంద్రం ప్రారంభించబడింది. 

******


(Release ID: 1785962) Visitor Counter : 211


Read this release in: English , Urdu , Hindi , Bengali