ఆయుష్
అంతర్జాతీయస్థాయిలో ఆయుర్వేద ఔషధాలకు ప్రోత్సాహం
Posted On:
17 DEC 2021 4:05PM by PIB Hyderabad
ఇటీవల ఆయుష్ రంగంపై భారతీయ సంప్రదాయ వైద్య (ఎఫ్ఐటిఎం) వేదిక ఒక నివేదికను ప్రచురించింది. దీనిని అభివృద్ధి చెందిన దేశాలకు పరిశోధన అభివృద్ధి వ్యవస్థ (ఆర్ఐఎస్ ) కింద ప్రచురించారు. ఇది న్యూఢిల్లీలో గల స్వతంత్ర ప్రతిపత్తిగల విధాన పరిశోధన సంస్థ. ఈ నివేదిక ప్రకారం,ఆయుష్ పరిశ్రమ టర్నోవర్ 18.1 బిలియన్ అమెరికన్ డాలర్లు. దీని మార్కెట్ సైజు మొత్తంగా 2014-20లలో 17 శాతం పెరిగింది. ఆయుష్, హెర్బల్ వైద్యానికి సంబంధించి మొత్తం ఎగుమతులు 2014లో 1.09 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా 2020 నాటికి అది 1.54 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏటా ఇది 5.9 శాతం అభివృద్ధిని సాధించింది.
భారత ప్రభుత్వానికి చెందిన ఆయుష్ మంత్రిత్వశాఖ ఆయుష్ రంగంలో అంతర్జాతీయ సహకారానికి ఒక కేంద్ర పథకాన్ని రూపొందించింది. దీని ప్రకారం ఆయుష్ వ్యవస్థ ఔషధాలను అంతర్జాతీయంగా ప్రోత్సహించడం, వాటిపై అవగాహన ను బలోపేతంచేయడం దీని ఉద్దేశం. అంతర్జాతీయంగా ఆయుష్ ఔషధాల ప్రోత్సాహం, ఆయుష్ వ్యవస్థ ఔషధాలకు గుర్తింపు, స్టేక్ హోల్డర్లతో సంబంధాలు కొనసాగింపు, ఆయుష్ ఔషధాలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అభివృద్ధి, ఆయుష్ ఉత్పత్తులు, సేవలు, విద్య , పరిశోధన, శిక్షణను అంతర్జాతీయంగా నిర్వహించడం ఆయుష్ అకడమిక్ ఛైర్ లను విదేశాలలో ఏర్పాటు ద్వారా అకడమిక్ పరిశోధనను ముందుకు తీసుకువెళ్లడం, విదేశాలలో ఆయుష్ సమాచార వ్యవస్థల ఏరర్పాటు, విదేశీ ప్రజలకు ఆయుష్ వ్యవస్థలకు సంబంధించి అధీకృత సమాచారం అందించడం వంటివి ఇందులో ఉన్నాయి.
ఆయుష్ లో అంతర్జాతీయ సహకార పథకం (ఐసి పథకం) లో భాగంగా ఆయుష్ ఫెలోషిప్ పథకం కింద ప్రతి సంవత్సరం 101 దేశాలనుంచి భారత్‌లో ని ప్రముఖ సంస్థలలో ఆయుష్‌కోర్సులు చదువుతున్న అర్హులైన విదేశీ విద్యార్థులకు 104 స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయడం జరుగుతుంది.
ఆయుష్ మంత్రిత్వశాఖ విదేశీ విశ్వవిద్యాలయాలలో , సంస్థలలో ఆయుష్ అకడమిక్ ఛైర్ లు ఏర్పాటు చేసేందుకు 14 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంఇ. ఇందుకు ఆయుష్ నిపుణులను బోధన, శిక్షణ, పరిశోధన కార్యకలాపాలు చేపట్టేందుకు పంపడం జరుగుతుంది. వివిధ బహుళ పక్ష వేదికలైన జి-20, బిమ్‌స్టెక్, బ్రిక్స్, ఐబిఎస్ ఎ, ఎస్‌సిఒ తదితరాలను సమర్ధంగా ఉపయోగించుకుని ఆయుర్వేద, ఆయుష్ వ్యవస్థలకు అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు ప్రయత్నించడం జరుగుతుంది.
ఆయుష్ మంత్రిత్వశాఖ లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్, ట్రాపికల్ మెడిసిన్ ( ఎల్ ఎస్ హెచ్ అండ్ టిఎం) బ్రిటన్ తో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. బ్రిటన్ లో కోవిడ్ -19 నుంచి కోలుకునేందుకు అశ్వగంధ ను ప్రమోట్ చేయడంపై అధ్యయనం చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.
కోవిడ్ 19 ఇన్ ఫెక్షన్‌ను ఎదుర్కోనేందుకు ఇన్ విట్రో, ఇన్ వివో అధ్యయనం కింద పరస్పర సహకారంతో గుడుచ్యాది టాబ్లెట్లపై పరిశోధన సాగించేందుకు జర్మనీ లోని ఫ్రాంక్‌ఫర్డ్‌కు చెందిన ఫ్రాంక్‌ఫర్టర్ ఇన్నొవేషన్ జెంత్రం బయోటెక్నాలజీ జిఎంబిహెచ్ (ఎఫ్ఐజెడ్) తో అయుష్ మంత్రిత్వశాఖ ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్ లోక్ సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
(Release ID: 1783003)
Visitor Counter : 132