వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ రంగానికి పారిశ్రామిక స్థాయి!
Posted On:
17 DEC 2021 3:17PM by PIB Hyderabad
దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి కీలకపాత్ర ఉంది. వ్యవసాయానికి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చిన ప్రభుత్వం, పారిశ్రామిక స్థాయిని కల్పిస్తోంది. వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపును కూడా గణనీయంగా పెంచింది. దీనితో 2013-14వ సంవత్సరంలో రూ. 21,933.50 కోట్లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపు,.. 2021-22నాటికల్లా రూ. 1,23,017.57 కోట్లకు పెరిగింది.
తయారీ రంగానికి, పారిశ్రామిక రంగానికి అందుబాటులో ఉన్న ప్రయోజనాలకు దీటుగా వ్యవసాయానికి కూడా తగినన్ని ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. రుణాలను సులభంగా అందుబాటులో ఉంచడం, మార్కెటింగ్ సౌకర్యం, దిగుబడి అనంతర పంటల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలు, ఉపకరణాలు తదితర ప్రయోజనాలు వ్యవసాయానికీ అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
దీనికితోడు, రైతులకు ఆదాయ మద్దతుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పి.ఎం.-కిసాన్) పథకాన్ని, ప్రభుత్వం ప్రారంభించింది. అలాగే,..వ్యవసాయ రంగానికి ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితుల్లో పంటనష్టానికి పరిహారాన్ని వర్తింపజేసేందుకు ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయానికి వెన్నుదన్నుగా ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాల, పథకాల జాబితాను ఈ దిగువన చూడవచ్చు. దేశంలోని రైతుల సంక్షేమంకోసమే ప్రభుత్వం ఈ చర్యలన్నీ తీసుకుంది.
Lరైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాల జాబితా:
- ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పి.ఎం.-కిసాన్): దేశవ్యాప్తంగా ఉన్న రైతు కుటుంబాలకు ఆదాయపరమైన మద్దతు అందించేందుకు,.. వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ఇంటి అవసరాల ఖర్చుల్లో సహాయం అందించేందుకు కేంద్ర రంగంలో ఒక కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పి.ఎం.-కిసాన్) పేరిట ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ. 6,000 చొప్పున అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పున మూడు వాయిదాలుగా ఈ మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారు. అయితే, ఎక్కువ ఆదాయం వర్గాల వారిని మాత్రం ఈ పథకంనుంచి మినహాయిస్తారు. ఈ పథకం కింద ఇప్పటివరకూ మొత్తం 11.5 కోట్ల రైతు కుటుంబాలకు, రూ. 1.6లక్షల కోట్లను విడుదల చేశారు.
- ప్రధానమంత్రి కిసాన్ మానధన్ యోజన (పి.ఎం.-కె.ఎం.వై.): చిన్న, సన్నకారు (ఎస్.ఎం.ఎఫ్.) రైతులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన పథకం. తక్కువ పొదుపు మొత్తాలను కలిగిఉన్న లేదా పొదుపు చేయడానికి ఏమాత్రం అవకాశంలేని చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో అండగా నిలిచేందుకు, జీవనోపాధి కోల్పోయిన వారికి సహాయ పడేందుకు కేంద్ర రంగంలో మరో కొత్త పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి కిసాన్ మానధన్ యోజన (పి.ఎం.-కె.ఎం.వై.) పేరిట ఈ పథకాన్ని ప్రారంభించారు. చిన్న, సన్నకారు రైతులకు వృద్థ్యాప్యంలో పింఛన్ అందించడమే లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం కింద, అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు రూ. 3,000 కనీస పింఛను అందిస్తారు. అయితే, రైతులు 60ఏళ్లవయస్సు వచ్చినపుడు కొన్ని రకాల మినహాయింపులతో ఈ పథకాన్ని అమలు చేస్తారు.
- ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పి.ఎం.ఎఫ్.బి.వై.): రైతుల పంట నష్టాలకు మెరుగైన బీమా కవరేజీ లక్ష్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పి.ఎం.ఎఫ్.బి.వై.) పేరిట పంటల బీమా పథకాన్ని 2016 ఖరీప్ సీజన్ నుంచి అమలులోకి తెచ్చారు. పంటనూర్పిళ్లకు సంబంధించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎదురయ్యే నష్టాలకు పరిహారాలతో సహా పంటసాగులోని అన్ని దశల్లోనూ బీమా ప్రయోజనాన్ని ఈ పథకం అందిస్తుంది. రైతులనుంచి తక్కువ ప్రీమియం చెల్లింపుతోనే ఈ బీమా ప్రయోజనాలను అందిస్తారు. ఈ పథకం కింద రైతులు తమ వాటాగా దాదాపు రూ. 21,450కోట్లను చెల్లించగా, క్లెయిముల రూపంలో రైతులు రూ. 1,01,875కోట్లను అందుకున్నారు. అంటే, రైతులు తాము ప్రీమియం రూపంలో చెల్లించిన ప్రతి వంద రూపాయలకు, క్లెయిముల రూపంలో రూ. 475 వరకూ లభించింది.
- కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పి.): రైతుల ఆదాయానికి భారీ ప్రోత్సాహాన్ని అందిస్తూ ఖరీఫ్, రబీ సీజన్లలో వర్తింపజేసే కనీస మద్దతు ధరలో పెరుగుదలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
- ఖరీఫ్, రబీ సీజన్లతోపాటుగా, అన్ని వాణిజ్య పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధరను (ఎం.ఎస్.పి.ని) ప్రభుత్వం పెంచింది. ఉత్పత్తి సగటు వ్యయంలో కనీసం 50శాతాన్ని మద్దతు ధరగా నిర్ణయిస్తూ ఈ పెంపుదలను 2018-19వ సంవత్సరంనుంచి అమలులోకి తెచ్చారు.
- 2013-14లో క్వింటాలుకు రూ. 1,310గా ఉన్న ధాన్యం కనీస మద్దతు ధరను 2020-21లో రూ. 1,868కు పెంచారు. దీనితో ధాన్యం కనీస మద్దతు ధర 43శాతం పెరిగినట్టయింది.
- ఇక 2013-14వ సంవత్సరంలో క్వింటాలుకు రూ. 1,400గా ఉన్న గోధుమల కనీస మద్దతు ధరను, 2020-21లో రూ. 1,975కు పెంచారు.
- నేల ఆరోగ్య కార్డులు: ఎరువుల వినియోగాన్ని హేతుబద్ధం చేయడమే లక్ష్యంగా నేల ఆరోగ్య కార్డులు అనే ఫ్లాగ్ షిప్ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా, దాదాపు 11కోట్లమంది రైతులకు నేల ఆరోగ్య కార్డలను పంపిణీ చేశారు.
- “ప్రతి నీటి బిందువుకూ మరింత పంట” అందుబాటులో ఉన్న నీటిని గరిష్ట స్థాయి వినియోగించే పద్ధతిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. పెట్టుబడి వ్యయాన్ని తగ్గిస్తూ, పంటల ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా డ్రిప్, స్ప్రింక్లర్ సాగును ఈ కార్యక్రమం కింద చేపట్టారు. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పి.ఎం.కె.ఎస్.వై.-పి.డి.ఎం.సి.) పథకంలో భాగంగా ప్రతి నీటి బిందువుకూ మరింత పంట కార్యక్రమాన్ని చేపట్టారు. సూక్ష్మ సేద్యం మెలకువల ద్వారా వ్యవసాయ క్షేత్రం స్థాయిలో నీటి వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. డ్రిప్ వ్యవసాయం, స్ప్రింక్లర్ సేద్యం ఈ కార్యక్రమం కిందకు వస్తుంది. ఈ పథకం కింద 20.39లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగును ప్రోత్సహించారు. అంటే, 2019-20, 2020 సంవత్సరాల్లో సూక్ష్మ సేద్యపు నీటి పథకం కింద దాదాపు 16లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పి.ఎం.కె.ఎస్.వై.) కింద 2019-20, 2020-21 సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాలకు కేంద్ర సహాయంగా రూ. 5,262.20కోట్ల మొత్తం అందింది. 2021-22వ సంవత్సరానికి గాను ఈ పథకం అమలుకోసం రూ. 4,000కోట్ల మొత్తాన్ని కేటాయించారు. రూ. 351.50కోట్ల మొత్తం ఇప్పటివరకూ వివిధ రాష్ట్రాలకు విడుదలైంది.
- పరం పరాగత్ కృషి వికాస్ యోజన (పి.కె.కె.వి.వై.) ”సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు ఈ పథకం చేపట్టారు. ఈ పథకం కింద 2018-19నుంచి 2020-21 వరకూ, 19,043 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. 3.81 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి ఈ పథకాన్ని అమలు చేసి, 9.52లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించారు. దీనికి తోడు, నమామీ గంగే పథకాన్ని 1,23,620 హెక్టార్ల విస్తీర్ణానికి వర్తింపజేశారు. ఇక ప్రకృతి వ్యవసాయం కింద దేశంలోని 4.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని సాగులోకి తెచ్చారు.
- జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) పథకం: పారదర్శకమైన, పోటీ తత్వంతో కూడిన ఆన్ లైన్ వాణిజ్య వేదికను రైతులకు సమకూర్చే లక్ష్యంతో ఈ-నామ్ పథకాన్ని ప్రారంభించారు. వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులకోసం ఏకీకృత జాతీయ మార్కెట్టును సృష్టించడానికి చేసిన ఏర్పాటు ఇది.
- దేశంలోని 18 రాష్ట్రాల్లో, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1,000 మార్కెట్లను ఇప్పటికే ఈ-నామ్ వేదికతో సమీకృతం చేశారు.
- 24.11.2021 నవంబరు 24నాటికి అందిన సమాచారం ప్రకారం, మొత్తం 4.99కోట్ల మెట్రిక్ టన్నులు, 10,57 సంఖ్యలు (వెదురు, తమలపాకులు, కొబ్బరి, నిమ్మ, స్వీట్ కార్న్ పంటలతో) దాదాపు రూ. 1.57 లక్షల కోట్ల ఉమ్మడి వాణిజ్యం ఈ-నామ్ వేదికపై నమోదైంది. ఇప్పటివరకూ 1.72కోట్ల మంది రైతులు, 2.04 లక్షలమంది వ్యాపారులు ఈ-నామ్ వేదికపై నమోదయ్యారు.
- హర్ మేడ్ పర్ పేడ్: ఈ పథకం కింద అదనపు ఆదాయం కోసం వ్వయసాయ అటవీ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. 1927వ సంవత్సరపు భారతీయ అటవీ చట్టాన్ని సవరించడంతో చెట్ల నిర్వచనం నుంచి వెదురును మినహాయించారు. పునర్వ్యవస్థీకరించిన జాతీయ వెదురు పథకాన్ని 2018లో ప్రారంభించారు. అటవీయేతర ప్రభుత్వ భూముల్లో, ప్రైవేటు స్థలాల్లో వెదురు మొక్కల నాటడాన్ని ప్రోత్సహించేందుకు ఈ పథకం చేపట్టారు. విలువల జోడింపు, ఉత్పాదన అభివృద్ధి, మార్కెట్ల అభివృద్ధికి ఈ పథకం కింద ప్రాధాన్యం ఇస్తారు.
- ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్ (పి.ఎం.ఎ.ఎ.ఎస్.హెచ్.ఎ.): వ్యవసాయ సానుకూల కార్యక్రమాలకు ప్రోత్సాహంగా మరో పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ‘ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ (పి.ఎం. ఆశా)’ పేరిట ఈ పథకం రూపొందింది. 2018వ సంవత్సరపు కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా రైతుల ఉత్పత్తికి తప్పనిసరిగా గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. రైతుల ఆదాయాన్ని పరిరక్షించేందుకు ఈ పథకం ద్వారా ఇదివరకెన్నడూ లేని రీతిలో పలు చర్యలు తీసుకున్నారు. రైతుల సంక్షేమానికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
- ధర మద్దతు పథకం (పి.ఎస్.ఎస్.): ధర మద్దతు పథకం కింద పంటల సేకరణను పెంచడం:- పప్పు దిసునులు, నూనెగింజలు, కొబ్బెర కురిడీలు వంటి వాటిని ధర మద్దతు పథకం కింద కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పి.)పై సేకరణ గణనీయంగా పెరిగింది. 2014-15 నుంచి 2021-22 వరకూ (అంటే 2021 జూలై 22వరకూ) కనీస మద్దతుధరపై పప్పు దినుసులు, నూనె గింజలు, కొబ్బర కురిడీల సేకరణ 167.05 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. దీనికి తోడు, ధర లోటు భర్తీ పథకం (పి.డి.పి.ఎస్.) కింద 2018-19వ సంవత్సరంలో 16.85లక్షల మెట్రిక్ టన్నుల నూనె గింజలను సేకరించారు. దీనికి తోడుగా, ధరల స్థిరీకకరణ నిధి (పి.ఎస్.ఎఫ్.) కింద 154.53లక్షల మెట్రిక్ టన్నుల పప్పు దినుసులను కనీస మద్దతు ధరపై సేకరించారు. వినియోగదార్ల వ్యవహారాల శాఖ పరిపాలనా పరిమితి పరిధిలో ఈ సేకరణ జరిగింది.
- ఉద్యాన పంటల సమీకృత అభివృద్ధి పథకం (ఎం.ఐ.డి.హెచ్.): ఉద్యాన పంటల సమీకృత అభివృద్ధి పథకం కింద తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించారు. పరాగ సంపర్కం ద్వారా పంటల ఉత్పాదనను పెంచేందుకు, రైతులకు అదనపు ఆదాయ వనరుగా తేనె ఉత్పత్తిని పెంచడం తదితర లక్ష్యాలతో ఈ పథకం చేపట్టారు.
- వ్యవసాయానికి సంస్ధాగత పరపతి: వ్యవసాయ రంగానికి తగిన స్థాయిలో పరపతి సదుపాయం అందుబాటులో ఉండేలా చూసే ప్రయత్నంలో బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ వార్షిక లక్ష్యాలను అధిగమిస్తూ వస్తున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ. 13.50లక్షలుగా నిర్దేశించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 15లక్షల కోట్లుగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 16.50 లక్షలకోట్లుగా లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.
- వడ్డీ సహాయ (సబ్వెన్షన్) పథకం: మరింత ఎక్కువ మంది రైతులకు పరపతి సాయం, రుణ సదుపాయం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత. ఈ లక్ష్య సాధన కోసం, రూ. 3 లక్షల వరకూ విలువైన స్వల్ప కాల పంట రుణాలకోసం వడ్డీపై 2 శాతం ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. రుణాన్ని సకాలంలో పూర్తిగా చెల్లింపు జరిపినందుకు 4శాతం వార్షిక వడ్డీ రేటుపై రుణ సదుపాయం ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉంది.
- దీనికి తోడు, 2018-19వ సంవత్సరపు వడ్డీ సహాయ పథకం కింద, జాతీయ విపత్తుల నేపథ్యంలో రైతులకు సహాయం అందించేందుకు 2 శాతం వడ్డీ సబ్వెన్షన్ సదుపాయం బ్యాంకులకు మొదటి సంవత్సరం అందుబాటులో ఉంటుంది. రైతులు తమ ఉత్పత్తులను, పంటలను అయిన కాడికి తెగనమ్ముకోకుండా నివారించేందుకు, వారు తమ ఉత్పాదనలను గిడ్డంగుల్లో నిల్వచేసుకునేలా అనుమతించేందుకు వడ్డీ సబ్వెన్షన్ ప్రయోజనాలు చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులో ఉంటాయి. అయితే, కిసాన్ క్రెడిట్ కార్డులు కలిగి ఉన్న రైతులకు పంటనూర్పిళ్ల తర్వాత ఆరు నెలల వ్యవధి వరకూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
- కిసాన్ క్రెడిట్ కార్డు (కె.సి.సి.): పశుసంరక్షణ, మత్స్యకార సంబంధ కార్యకలాపాలను సాగించే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల సదుపాయాన్ని ప్రభుత్వం వర్తింపజేసింది. అన్ని రకాల ప్రాసెసింగ్ ఫీజు, తనిఖీ, లెడ్జర్ ఫోలియో చార్జీలు, ఇతర సేవా రుసుములను కిసాన్ క్రెడిట్ కార్డుల నవీకరణ సందర్భంలో మాఫీ చేశారు. స్వల్ప కాల వ్యవసాయ రుణాలకు కొలేటరల్ పూచీ అవసరంలేని రుణ పరిమితిని లక్ష రూపాయలనుంచి,.. లక్షా 60వేల రూపాయలకు పెంచారు. అభ్యర్థి దరఖాస్తు పూర్తిగా నింపి దాఖలు చేసిన 14 రోజుల్లోగా కిసాన్ క్రెడిట్ కార్డును మంజూరు చేస్తారు.
- రైతులు, ఉతర ఉత్పత్తిదారులు తమ ఉత్పాదనలకు గిట్టుబాటు ధరలు పొందేందుకు వీలుగా మార్కెట్ సంస్కరణలకు సంబంధించిన పలు కార్యక్రమాలను, విధానాలను ప్రారంభించారు.
కార్పస్ నిధి ఏర్పాటు
- సూక్ష్మ నీటిపారుదల సాగు నిధి – రూ. 10,000 కోట్లు.
- వ్యవసాయ మౌలిక వసతుల నిధి- రూ. లక్ష కోట్లు.
- రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (ఎఫ్.పి.ఒ.లు): 10,000వరకూ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను ఏర్పాటు చేసి, వాటిని ప్రోత్సహించే లక్ష్యంతో రైతు ఉత్పత్తిదారుల సంస్థలను రూపొందించడం.
- వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఎ.ఐ.ఎఫ్.) : పంటనూర్పిళ్ల అనంతరం ఉపయోగపడే మార్కెట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటులో పెట్టుబడి కోసం మధ్యకాల, దీర్ఖకాల రుణ వసతిని కల్పించేందుకు రూ. 1,00,000కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని (ఎ.ఐ.ఎఫ్.ను) ఏర్పాటు చేసే కేంద్ర రంగం పథకానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వడ్డీ సహాయ పథకం, ఆర్థిక మద్దతు పథకాల కింద గిడ్డంగుల సుదుపాయానికి, సమూహ వ్యవసాయ ఆస్తులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఆర్థిక సహాయ పథకం కింద అన్ని రుణాలపై 3శాతం వార్షిక వడ్డీ సబ్వెన్షన్ సదుపాయం రూ. 2కోట్ల పరిమితి వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సబ్వెన్షన్ గరిష్టంగా ఏడేళ్ల వ్యవధి వరకూ అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకూ 4,503 గిడ్డంగుల పథకాలకు రూ. 4,152.6 కోట్ల రూపాయల మొత్తం మంజూరైంది.
- వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు (ఎ.ఎం.ఐ.): సమీకృత వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ (ఐ.ఎస్.ఎ.ఎం.) పరిధిలోని ఒక ఉప పథకంగా వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాల కార్యక్రమాన్ని (ఎ.ఎం.ఐ.ని) ప్రభుత్వం అమలు జరుపుతూ వస్తోంది. ఈ పథకం కింద, వివిధ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో గిడ్డంగుల, వేర్ హౌస్.ల నిర్మాణానికి, పునరుద్ధరణకు సహాయం అందిస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు గిడ్డంగుల నిర్మాణం, పునరుద్ధరణ జరుపుతారు. ఈ పథకం కింద, ప్రాజెక్టు మూలధన వ్యయంపై 25శాతం, 33.33శాతం లెక్కన సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. అర్హత కలిగిన లబ్ధిదారు కేటగిరీ ప్రాతిపదికగా ఈ సబ్సిడీ మంజూరవుతుంది. వ్యక్తిగత దరఖాస్తుదారులతో పాటుగా, రైతులకు, రైతు బృందాలకు, పెంపకం దార్లకు, వ్యవసాయ ఔత్సాహిక వ్యాపారులకు, నమోదైన వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్.పి.ఒ.లకు), సహకార సంఘాలకు, రాష్ట్ర స్థాయి ఏజెన్సీలకు ఈ పథకం కింద సహాయం అందిస్తారు. 2001వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీనుంచి 2021 సెప్టెంబరు నెలాఖరు వరకూ దేశవ్యాప్తంగా, 708.67లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన 40,985 నిల్వ సదుపాయాల ప్రాజెక్టులకు ఎ.ఎం.ఐ. ఉప పథకం కింద సహాయాన్ని అందించారు.
ఈ రోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ విషయం తెలిపారు. ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ సమాచారం వెల్లడించారు.
*****
(Release ID: 1783002)
|