ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైబర్ భద్రతపై ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం


ఎలక్ట్రానిక్స్, ఐ.టి. మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
-సైబర్ సురక్షిత్ భారత్- పథకం కింద నిర్వహణ..

సైబర్ దాడుల ముప్పు, సైబర్ భద్రతపై అధికారులకు
మెరుగైన అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం..

2018 జూన్ నుంచి 2021 నవంబరు వరకూ
24 బృందాలకు ముగిసిన శిక్షణ...

977మంది సమాచార భద్రతా ప్రధానాధికారులకు,
ఫ్రంట్ లైన్ ఐ.టి. అధికారులకు తర్ఫీదు పూర్తి..

Posted On: 16 DEC 2021 2:48PM by PIB Hyderabad

   దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థల్లో సైబర్ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆరు రోజులపాటు లోతైన శిక్షణా కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ సంస్థలకు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, తదితర సంస్థల సమాచార భద్రతా విభాగాల ప్రధాన అధికారులకు (సి.ఐ.ఎస్.సి.ఒ.-సిసోలకు), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టి.) అధికారులకు ఈ 25వ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టారు.  కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. సైబర్ సురక్షిత్ భారత్ పథకం కింద, నేషనల్ ఈ-గవర్నెన్స్ విభాగం నిర్వహిస్తూ వస్తున్న అనేక చర్చాగోష్టుల్లో భాగంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సైబర్ భద్రతకు ముప్పుగా ఎప్పటికప్పుడు తారసపడే సమస్యలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు, సైబర్ భద్రతకై అందుబాటులో ఉన్న ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు, సురక్షితమైన సైబర్ భద్రతా రంగంతో ఒనగూడే ప్రయోజనాలను ఆయా సంస్థలు, పౌరులు అందుకునేలా చూసేందుకు సమాచార భద్రతా విభాగం ప్రధాన అధికారులు, ఇతర భాగస్వాములకు ఈ శిక్షణ ఎంతో దోహదం చేస్తుంది.

   ఈ శిక్షణలో భాగంగా సామర్థ్యాల నిర్మాణంపై జరిగిన ప్రారంభ కార్యక్రమంలో సైబర్ భద్రతా విభాగం డైరెక్టర్ తూలికా పాండే మాట్లాడారు. ఏదైనా ఒక సంస్థకు సంబందించి,.. సైబర్ భద్రతకు ముప్పుగా పరిణమించే అంశాలపై తమ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు నవీకరించకునే విషయంలో సమాచార భద్రతా విభాగం ప్రధాన అధికారుల పాత్ర ఎంతో కీలకమైనదని తూలికా పాండే వివరించారు. ఈ విషయంలో సదరు అధికారులను మెరుగైన స్థాయిలో విధినిర్వహణకు సన్నద్ధం చేయడంలో డీప్ డైవ్ శిక్షణా కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుందో అన్న అంశాలను కూడా ఆమె వివరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మౌలిక సదుపాయాల వ్యవస్థను సురక్షితంగా ఉంచడానికి తీసుకోవలసిన చర్యలను, అనుసరించవలసిన ఉత్తమ విధానాలను గురించి పారిశ్రామిక రంగానికి, ప్రభుత్వానికి చెందిన భద్రతా నిపుణులు ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారని ఆమె చెప్పారు.

   “సైబర్ భద్రతా రంగంలో అందుబాటులో ఉన్న తాజా ఉపకరణాలు, టెక్నాలజీలు, అలాగే, సంబంధిత చట్టపరమైన అంశాలను, అవసరమైన పరిజ్ఞానాన్ని ఈ శిక్షణా కార్యక్రమం అందించే అవకాశాలున్నాయి. ఈ శిక్షణా కార్యక్రమంలో ఆర్జించే పరిజ్ఞానం,.. సైబర్ భద్రతా విధానాల తయారీకి దోహదపడుతుంది. అలాగే, ఆయా సంస్థల సైబర్ రంగ నిర్వహణా ప్రణాళికల రూపకల్పనకు కూడా ఉపయోగపడుతుంది,” అని ఆమె అన్నారు.

  కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అజమాయిషీలో పనిచేసే ఈ-గవర్నెన్స్ విభాగం సంయుక్త కార్యదర్శి అమితేశ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, ఐ.టి. మౌలిక సదుపాయాల వ్యవస్థను సురక్షితంగా ఉంచేందుకు కొత్తగా ఆవిర్భంచిన బ్లాక్ చైన్, కృత్రి మేధోపరిజ్ఞానం (ఐ.ఎ.), డేటా అనలిటిక్స్ వంటి వాటిని వినియోగించాలని సూచించారు.

 “గత కొన్నేళ్లుగా సైబర్ భద్రతకు ముప్పు క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. 2019లో సైబర్ రంగంపై 3,94,499 దాడులు జరిగాయి. 2020 నాటికి ఈ దాడుల సంఖ్య 11,58,208కు పెరిగింది. ఇక 2021లో ఇప్పటికే 6,07,220 వరకూ సైబర్ దాడులు జరిగాయి.” అని ఆయన వివరించారు.

“సైబర్ రంగంపై దాడులకు పాల్పడే ముష్కరులు,.. తమ కుయుక్తులకు, పన్నాగాలకు కోవిడ్-19 మహమ్మారిని కూడా ఒక అవకాశంగా వాడుకుంటున్నారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సైబర్ దాడుల సంఘటనలు తీవ్రంగా పెరిగాయి. యూజర్ సమాచారాన్ని (డేటాను) దొంగలించి, దాన్ని స్థానంలో చెరుపుచేసే విఛ్చిన్నకరమైన సాఫ్ట్.వేర్.ను చొప్పించే దురుద్దేశంతోనే ఈ తరహా దాడులు ఎక్కువగా జరిగాయి. తాము లక్ష్యంగా చేసుకున్న బాధితులను దెబ్బతీయడానికే ఈ ముష్కరులు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ఈ దాడులకు తెగబడ్డారు. అయితే, ఈ మొత్తం సమస్య పరిష్కారానికి ఎలాంటి మార్గాన్ని అనుసరించాలో తెలుసుకునేందుకు ఈ చర్చాగోష్టి, శిక్షణా కార్యక్రమం ఒక చక్కని అవకాశం.,” అని అమితేశ్ సిన్హా చెప్పారు.

   ప్రపంచ స్థాయి సైబర్ భద్రతా సూచిక (జి.సి.ఐ.)లో భారతదేశం ర్యాంకును మెరుగు పరచడంలో జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహించిన పాత్ర ఎంతో అభినందనీయమని సిన్హా అన్నారు. “సైబర్ భద్రతకు సంబంధించి 2020వ సంవత్సరానికి భారతదేశం మొదటి 10 అగ్రశ్రేణి దేశాల జాబితాలో చోటు సంపాదించింది. సైబర్ భద్రతలో మొత్తం 182 దేశాల పరిస్థితిని పరిశీలించినపుడు 2018లో 47వ స్థానంలో ఉన్న భారతదేశం 2020కల్లా ఏకంగా 10వ స్థానానికి ఎదిగింది. ప్రభుత్వం తీసుకున్న అనేక దిద్దుబాటు చర్యల కారణంగానే జి.సి.ఐ.లో భారతదేశం ర్యాంకు ఇలా గణనీయమైన స్థాయిలో మెరుగుపడింది. సైబర్ భద్రత సంసిద్ధతలో ఇది భారతదేశం సాధించిన గణనీయమైన పురోగమనం. ఈ నేపథ్యంలో దేశంలో సైబర్ భద్రతా వ్యవహారాలతో ప్రమేయం ఉన్న వారందరికీ నేను అభినందనలు తెలియజేయాల్సిందే.” అని ఆయన అన్నారు.

  సైబర్ భద్రతకు ముప్పుగా పరిణమించే సవాళ్లపై సమాచార భద్రతా విభాగం ప్రధాన అధికారులకు సాధికారత కల్పించేందుకు, సవాళ్లను ఎదుర్కొనేలా వారికి తగిన శిక్షణ అందించేందుకు సైబర్ సురక్షిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రభుత్వం 2018 జనవరిలో  ప్రారంభించింది. వివిధ రకాల పారిశ్రామిక సంస్థల కన్షార్షియం మద్దతుతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన 1.200మందిసమాచార భద్రతా విభాగం ప్రధాన అధికారులకు, ఐ.టి. అధికారులకు తగిన శిక్షణ అందించడమే సైబర్ సురక్థిత్ కార్యక్రమ లక్ష్యంగా నిర్దేశించారు. 2018 జూన్ నుంచి ఈ ఏడాది నవంబరు నెలవరకూ సైబర్ భద్రతా అంశాలపై 24 బృందాలకు శిక్షణ ముగిసింది. అంటే, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రభుత్వ రంగ సంస్థలలకు, బ్యాంకులకు చెందిన  977మంది సమాచార భద్రతా విభాగం ప్రధాన అధికారులు, ఇతర ఫ్రంట్ లైన్ ఐ.టి. అధికారులకు శిక్షణ పూర్తయింది.

  ఇక, ఈ ఏడాది డిసెంబరు 13వ తేదీ మొదలైన ఈ డీప్ డైవ్ శిక్షణా కార్యక్రమం డిసెంబరు 18వ తేదీవరకూ కొనసాగుతుంది. పరిపాలనా ప్రక్రియకు ముప్పుగా ఎదురయ్యే సమస్యలు, డేటా గోప్యత, నెట్.వర్క్ భద్రత,, చివరి లక్ష్యం వరకూ భద్రత అమలు, అప్లికేషన్ సెక్యూరిటీ, డేటా భద్రత, క్లౌడ్ సెక్యూరిటీ, మొబైల్ భద్రత, క్రిప్టోగ్రఫీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సైబర్ భద్రతాపరమైన అంశాలు, సెక్యూరిటీ ఆడిట్, సి.సి.ఎం.పి. తయారీ మార్గదర్శక సూత్రాలు, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ నిర్వహణా వ్యవహారాలు తదితర విషయాలపై ఈ శిక్షణా కార్యక్రమంలో విపులంగా చర్చిస్తారు.

****


(Release ID: 1782441) Visitor Counter : 207


Read this release in: English , Hindi