ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 32.11 కోట్లకుపైగా రుణ దరఖాస్తులపై రూ.17లక్షల కోట్లు మంజూరు; 16.50లక్షల కోట్లు విడుదల

Posted On: 14 DEC 2021 5:33PM by PIB Hyderabad

   ముద్రా పోర్టల్‌లో రుణప్రదాన సభ్య సంస్థలు (ఎంఎల్‌ఐ) ప్రకటించిన సమాచారం ప్రకారం- 2015 ఏప్రిల్‌ నెలలో ప్రారంభమైన ‘ప్రధానమంత్రి ముద్రా యోజన’ (పీఎంఎంవై) కింద 26.11.2021 నాటికి 32.11 కోట్ల రుణ ఖాతాలపై రూ.17 లక్షల కోట్ల మేర మంజూరు చేయగా, రూ.16.50 లక్షల కోట్లు విడుదల చేయబడ్డాయి. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు  ఇవాళ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భగవత్‌ కిషన్‌రావు కరాద్‌ ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో ఈ విషయం వెల్లడించారు. ‘పీఎఎంవై’లోని వివిధ కేటగిరీల కింద సంవత్సరాలవారీగా ఇచ్చిన రుణ వివరాలను మంత్రి తెలిపారు. ఈ మేరకు శిశు (రూ.50,000 వరకు), కిషోర్ (రూ.50,001 నుంచి రూ.5 లక్షలదాకా), తరుణ్ (రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలదాకా) విభాగాల కింద రుణాలు మంజూరుచేసినట్లు వెల్లడించారు. ఈ వివరాలు జవాబుతో జోడించిన అనుబంధంలో పొందుపరచబడ్డాయి.

‘పీఎంఎవై’ ప్రభావంపై అంచనాల దిశగా అనేక అధ్యయనాల గురించి మంత్రి వివరించారు:-

  1. ‘పీఎంఎంవై’ స్వతంత్ర అంచనాలను 2016-17లో ఆర్థిక సార్వజనీనత సంప్రదింపుల సంస్థ ‘మైక్రోసేవ్’ నిర్వహించింది. ఇందులో వెల్లడైన కీలక, ఇతరత్రా అంశాలిలా ఉన్నాయి:-
  • హామీదారు లేదా సహ పూచీకత్తు అవసరం లేదు; సాధారణ పత్రాల ప్రక్రియ, సత్వర పరిశీలనతోపాటు రుణ ప్రదాతల చురుకైన విధానాలవల్ల రుణగ్రహీతలకు ‘పీఎంఎంవై’ రుణాలు ఆకర్షణీయంగా ఉంటున్నాయి;
  • రుణ గ్రహీతల వ్యాపార పరిధి, లాభార్జన అవకాశాలు ‘పీఎంఎంవై’ రుణాలతో పెరుగుతున్నాయి;
  • చిన్న దుకాణ యజమానులు, విక్రేతల మూలధన అవసరాలను తీరుస్తూ వ్యాపార సామర్థ్యాన్ని వెలికితీయడంలో ‘శిశు’ రుణాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి.
  1. ‘పీఎంఎంవై’ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఐఎఫ్‌ఎంఆర్‌ ఫైనాన్స్ ఫౌండేషన్ కూడా 2016-17లో ఒక అధ్యయనం చేసింది. ఇందులో వెల్లడైన కీలక ఫలితాలు, ఇతర అంశాలు ఇలా ఉన్నాయి:
  • ‘ఎంఎస్‌ఎంఈ'లకు ముఖ్యంగా రూ.2 లక్షల లోపు బ్యాంకు రుణాల వృద్ధిలో ‘పీఎంఎంవై’ గణనీయంగా తోడ్పడింది. ఇలా రూ.2 లక్షల లోపు రుణ లభ్యతను పెంచడంలో సూక్ష్మ ఆర్థిక సహాయ సంస్థలు బ్యాంకులతో కలిసి పనిచేస్తున్నాయి;
  • ‘శిశు’ కేటగిరీలో 2016-17లో బ్యాంకులిచ్చిన రుణాల సగటు పరిమాణం గణనీయంగా (దాదాపు 50శాతం) పెరిగింది. ఇప్పటికేగల ఖాతాదారులు మరింత ఎక్కువ మొత్తంలో రుణాలు పొందే అవకాశం ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. మరోవైపు సూక్ష్మ ఆర్థిక సంస్థలిచ్చే ‘శిశు’ కేటగిరీ రుణ పరిమాణంలో పెరుగుదల కనిపించింది;
  • ఇక మరింతమంది రుణగ్రహీతలకు అందుబాటు దిశగా ప్రభుత్వరంగ బ్యాంకులు రుణార్హతలను గణనీయంగా సరళీకరించాయి.  
  1. ‘పీఎంఎంవై’ కింద ఉపాధి సృష్టికి సంబంధించి జాతీయ స్థాయిలో అంచనాల నిమిత్తం కేంద్ర కార్మిక-ఉపాధికల్పన మంత్రిత్వశాఖ ఒక భారీ నమూనా అధ్యయనం నిర్వహించింది. ఇందులో వెల్లడైన ఫలితాల ప్రకారం- సుమారు మూడు సంవత్సరాల (2015 నుంచి 2018) వ్యవధిలో 1.12 కోట్ల నికర అదనపు ఉపాధి అవకాశాల సృష్టికి ‘పీఎంఎంవై’ దోహదం చేసింది. మొత్తంమీద అన్ని స్థాయులలోనూ ఉపాధి అవకాశాలకు సంబంధించి ‘శిశు’ విభాగం కింద ముద్ర లబ్ధిదారులైన వారి యాజమాన్యంలోని సంస్థల ద్వారా సృష్టించబడిన నికర అదనపు ఉపాధి వాటా దాదాపు 66 శాతంగా ఉంది. ఇక 19 శాతం ఉపాధి అవకాశాల సృష్టితో ‘కిషోర్‌’ విభాగం, 15 శాతం వాటాతో ‘తరుణ్‌’ తదుపరి స్థానాల్లో నిలిచాయి.

 

***



(Release ID: 1781772) Visitor Counter : 120


Read this release in: Tamil , English