ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

విశాఖలో ఐ.ఒ.టి., ఎ.ఐ. ప్రతిభాకేంద్రం ప్రారంభం!


ఎలక్ట్రానిక్స్,ఐ.టి. మంత్రిత్వ శాఖ,. ఎ.పి. ప్రభుత్వం,.
నాస్.కామ్.ల ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు..

భవిష్యత్తు టెక్నాలజీని, ఆర్థిక వ్యవస్థను తీర్చిద్దేది
ఐ.ఒ.టి., ఎ.ఐ.లేనని కేంద్రమంత్రి రాజీవ్ వెల్లడి...

Posted On: 30 NOV 2021 5:46PM by PIB Hyderabad

  విశాఖపట్నంలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆవరణలో ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధో పరిజ్ఞాన ప్రతిభా కేంద్రం’ ఈ రోజు ప్రారంభమైంది. ఈ ప్రతిభాకేంద్రాన్ని జాతీయ సాఫ్ట్.వేర్ కంపెనీలు, సేవా కంపెనీల సంఘం (నాస్.కామ్) ఏర్పాటు చేసింది. కేంద్ర ఎలక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలసి ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఒ.టి.), కృత్రిమ మేధో పరిజ్ఞానం (ఎ.ఐ.), రోబోటిక్స్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞాన అంశాల్లో సృజనాత్మకత సాధించడమే లక్ష్యంగా ఈ ప్రతిభా కేంద్రాన్ని రూపొందించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్.ప్రెన్యూర్ శాఖల సహాయమంత్రి  రాజీవ్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నే, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ పి.వి.జి.డి ప్రసాద రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు గన్న డిజిటల్ ఇండియా స్వప్నానికి సాకారం కల్పించే లక్ష్యంతో ఈ కొత్త ప్రతిభా కేంద్రానికి రూపకల్పన చేశారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించి రూపకల్పన దశనుంచి నమూనాల దశవరకూ సృజనాత్మక పరిష్కారాలను కనుగొనేందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంకా ఈ కేంద్రం ఏర్పాటైంది. ఔత్సాహిక పారిశ్రామిక, వాణిజ్య తత్వాన్ని, పారిశ్రామిక వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఈ కేంద్రం దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని స్టార్టప్ కంపెనీలకు కూడా ఈ కేంద్రంతో అనేక ప్రయోజనాలు సమకూరుతాయి. స్టార్టప్ కంపెనీల రూపకల్పన, నిధుల సరఫరా తదితర అంశాల్లో కూడా ఈ ప్రతిభా కేంద్రం తగిన సహాయ సహకారాలు అందిస్తుంది. కొత్త తరహా సృజనాత్మక పరిష్కారాలను అన్వేషించే స్టార్టప్ కంపెనీలకు సహాయ సహకారాలు అందించే వివిధ సంస్థలతో కలసి ప్రస్తుతం ఈ ప్రతిభా కేంద్రం పనిచేస్తోంది.  

  వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు కనుగొని, ప్రభావవంతంగా పనిచేసే లక్ష్యంతో ఈ ప్రతిభా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరిశ్రమలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, అవి ప్రపంచ సంస్థలన్నింటితో పోటీపడేలా తయారు చేయడంలో ఒక ఉత్ప్రేరకంగా పనిచేసేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని రూపొందించారు. పరిశ్రమలకు, స్టార్టప్ కంపెనీలకు, విద్యా, అధ్యయన సంస్థలకు ఇదివరకెన్నడూ లేని అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా కృత్రిమ మేథో పరిజ్ఞానం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ శక్తిసామర్థ్యాలను సానుకూలంగా వినియోగించుకునే అంశంపై ఈ ప్రతిభా కేంద్రం దృష్టిని కేంద్రీకరిస్తుంది.

  ప్రతిభా కేంద్రం ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ న్యూఢిల్లీనుంచి వర్చువల్ పద్ధతిలో ఆన్ లైన్ ద్వారా ప్రసంగించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2021వ సంవత్సరం ఎన్నో గణనీయమైన మార్పులకు నాంది పలికిందన్నారు. “2021వ సంవత్సరం ఒక గొప్ప సంవత్సరంగా భారతీయ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. కోవిడ్ వైరస్ వంటి మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఎంతో పట్టుదల, సామర్థ్యం ప్రదర్శించి, మరింత బలమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన దేశంగా భారత్ నిలిచిపోతుంది.” అని ఆయన అన్నారు.

   కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాల గురించి కేంద్రమంత్రి మాట్లాడుతూ, తదుపరి పాతికేళ్లలో మన దేశ గమనాన్ని డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, నూతన టెక్నాలజీలే నిర్దేశిస్తాయని అన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధో పరిజ్ఞానం వంటి సాంకేతిక పరిజ్ఞానాలు మన దేశ సాంకేతిక పరిజ్ఞాన భవిష్యత్తును, ఆర్థిక వ్యవస్థ భవితను పూర్తిగా మార్చివేస్తాయి. ఈ ప్రతిభా కేంద్రం ఒక విశ్వవిద్యాలయానికి విస్తరణా సంస్థగా మాత్రమే కాకుండా, శక్తి, క్రియాశీలత్వం, ఔత్సాహిక పారిశ్రామిక వాణిజ్య తత్వంతో కూడిన ప్రగతికేంద్రంగా తయారవుతుంది.” అని అన్నారు. ఈ ప్రతిభా కేంద్రం ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పారిశ్రామిక రంగం, వివిధ అధ్యయన సంస్థలు ప్రదర్శించిన చొరవ, సహకార స్ఫూర్తి ఎంతో అభినందనీయమని కేంద్రమంత్రి అన్నారు. కోవిడ్ సంక్షోభం అనంతరం నెలకొన్న ప్రపంచ వ్యవస్థలో ప్రతి అవకాశాన్ని భాగస్వామ్య వర్గాలన్నీ అందిపుచ్చుకోవడానికి ఇలాంటి సహకారం ఎంతో దోహదపడుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞాన అంశాలకు సంబంధించి ప్రపంచం యావత్తూ ఇపుడు భారతదేశంవైపు చూస్తోందని, ఎంతో విశ్వసనీయమైన సరఫరాదారుగా భారత్.ను పరిగణిస్తోందని అన్నారు. ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లాలన్న లక్ష్యం సులభసాధ్యమేనని, ఇందుకు మనమంతా సహకార స్ఫూర్తితో కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మేం కృషి చేస్తున్నాం. మాకు 9రకాల సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచ సన్ రైజ్ టెక్నాలజీలుగా మారబోతున్నాయి. కృత్రిమ మేధో పరిజ్ఞానం, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఎడ్జ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, వర్చువల్ రియాలిటీ, బ్లాక్ చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5 జి., సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ తొమ్మిది సాంకేతిక పరిజ్ఞానాల్లో ఏదైనా ఒక దానిలో ప్రపంచ స్థాయి అగ్రశ్రేణిని సాధించగలిగితే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికే చేరిందని చెప్పవచ్చు.” అని అన్నారు.

   నాస్.కామ్ అధ్యక్షురాలు దేవ్.జానీ ఘోష్ మాట్లాడుతూ. సాంకేతిక పరిజ్ఞానం పరిష్కరించగలిగిన పెద్ద సమస్యలను అవగాహన చేసుకునేందుకు వీలుగా పలురకాల వ్యవస్థలను అనుసంధానం చేసే సంస్థలుగా ఈ ప్రతిభా కేంద్రాలు రూపొందాయన్నారు. సవాళ్లను, సమస్యలను పరిష్కరించేందుకు టెక్నాలజీని గరిష్టస్థాయిలో వినియోగించుకునే అంశంపై మేధోమథనం జరిపేందుకు, ఉమ్మడిగా పరిష్కారాలను రూపొందించేందుకు ఈ ప్రతిభా కేంద్రాలు దోహదపడతాయన్నారు.  ఇందుకు అద్భుతమైన ఉదాహరణగా కోవిడ్ మహమ్మారి సంక్షోభ సమయంలో అనుభవాన్ని గురించి చెప్పుకోవచ్చు. చివరి గమ్యస్థానం వరకూ ఆరోగ్యరక్షణ సదుపాయాలను చేర్చడం, అంటే, ప్రతి పౌరుడికీ రక్షణను అందించడం ఎంతో అవసరమని మనం అర్థం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో తక్కువ బ్యాండ్.విడ్త్, విద్యుత్ అనుసంధానం లేని ప్రాంతాల్లో కూడా ఉపయోగపడే పరిష్కారాలు మనకు అవసరమయ్యాయి. వెంటనే బయోటెక్నాలజీ శాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నాస్.కామ్ ఏకమయ్యాయి. ఆరోగ్య రక్షణ కార్యకలాపాల్లోని వృత్తి నిపుణులను, స్టార్టప్ కంపెనీలను, సాంకేతిక పరిజ్ఞాన పారిశ్రామిక సంస్థలను ఇవి ఏకం చేశాయి. ఆరోగ్య రక్షణ అవసరమైన భారతీయులు ఎక్కడున్నా సరే,.. వారందరికీ రక్షణ అందించే పరిష్కార మార్గాలను వెదికి పట్టుకోవడంలో ఈ కృషి ఎంతో ఉపయోగపడింది.” అని ఆమె అన్నారు.

 

****



(Release ID: 1776626) Visitor Counter : 115


Read this release in: English , Hindi