గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

"ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" వారోత్సవాల్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 86 మంది ఎస్.టి. పారిశ్రామికవేత్తలను సత్కరించిన - కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

Posted On: 23 NOV 2021 4:41PM by PIB Hyderabad

గిరిజన సమాజంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో, జాతీయ షెడ్యూల్డ్ తెగల ఆర్థిక మరియు అభివృద్ధి సంస్థ (ఎన్.ఎస్.టి.ఎఫ్.డి.సి); కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, 2021 నవంబర్, 22వ తేదీన, గిరిజన పారిశ్రామిక వేత్తలను సన్మానించడం కోసం, ఆంధ్రప్రదేశ్ లోని టి.ఆర్.ఐ.సి.ఓ.ఆర్. సహకారంతో,  విశాఖపట్నంలో, ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. 

భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవం, "ఆజాదీ-కా- అమృత్-మహోత్సవ్" వేడుకల్లో భాగంగా, 75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశ ప్రజలు, సంస్కృతి,  విజయాల యొక్క అద్భుతమైన చరిత్రను జరుపుకోవడానికి, స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం  ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.  భారతదేశాన్ని దాని పరిణామక్రమంలో ఇంతవరకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడం తో పాటు, స్వావలంబన భారతదేశాన్ని ఆవిష్కరించే దిశగా భారత ప్రభుత్వ కృషిని కొనసాగించే శక్తి, సామర్థ్యాలను కలిగి ఉన్న భారతదేశ ప్రజలకు కార్యక్రమాన్ని అంకితం చేయడం జరిగింది. 

భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చివరి రోజైన నవంబర్ 15వ తేదీన భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం “జన్-జాతీయ-గౌరవ-దినోత్సవం" గా నిర్వహించింది.  ఈ బ్రహ్మాండమైన ప్రయత్నంలో భాగంగా మరియు లక్ష్య సమూహం కోసం రూపొందించిన వివిధ ఆర్ధిక పథకాల ద్వారా స్థిరమైన జీవనోపాధి,  ఆదాయ ఉత్పత్తి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి కార్పొరేషన్ చేపట్టిన వివిధ కార్యక్రమాలకు అనుగుణంగా,  దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఒడిశాలోని 86 ఎస్.టి. పారిశ్రామికవేత్తలను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఎన్.ఎస్.టి.ఎఫ్.డి.సి. సత్కరించాయి.   పురస్కారాలు అందుకున్న పారిశ్రామికవేత్తల లో  వివిధ రంగాల్లో వ్యాపార సంస్థలు నెలకొల్పి విజయవంతంగా రాణించిన మహిళా పారిశ్రామికవేత్తలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.  బ్రహ్మాండమైన ఈ భారీ కార్యక్రమంలో గుర్తింపు పొందినందుకు సన్మాన గ్రహీతలు సంతోషంతో ఉద్వేగానికి గురయ్యారు. 

గిరిజనులు తయారు చేసిన వివిధ ఉత్పత్తుల తో ఒక చిన్న ప్రదర్శనను కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భారత గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే పాల్గొన్నారు.  గిరిజనులు స్థాపించిన సంస్థలకు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు మద్దతుగా ముందుకు రావాలని  శ్రీ అనిల్ కుమార్ ఝా  తమ కీలకోపన్యాసం లో  కోరారు.  వైద్యం చేసే పద్ధతులు, మూలికా మందులు, సహజ నివారణలు వంటి గిరిజనుల సంప్రదాయ నైపుణ్యాల గురించి కూడా ఆయన నొక్కి చెప్పారు.

గిరిజన మహిళలకు సాధికారత కల్పించే ప్రత్యేక పథకమైన, "ఆదివాసీ మహిళా సశక్తీకరణ్ యోజన" అనే ప్రధానమైన పధకం తో సహా ఎన్.ఎస్.టి.ఎఫ్.డి.సి. రూపొందించిన ఆదాయాన్ని సమకూర్చే వివిధ పథకాల గురించి, శ్రీ అసిత్ గోపాల్ ప్రత్యేకంగా వివరించారు, అదేవిధంగా, మొదటి తరం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ఆయన నొక్కి చెప్పారు.

 

అసోచామ్; డి.ఐ.సి.సి.ఐ.; సి.ఐ.ఐ. వంటి వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు కూడా గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో తమ పాత్ర గురించి తెలియజేశారు.  ఎస్.టి. ల అభివృద్ధికి డిజిటల్ కార్యక్రమాల పరిధి గురించి, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన "గోయింగ్-ఆన్‌-లైన్-యాజ్-లీడర్స్-జి.ఓ.ఏ.ఎల్." కార్యక్రమ నిర్వాహకులు వివరించారు.    ఎస్.టి. ల వ్యాపారాభివృద్ధికి చేపట్టిన వివిధ మార్కెటింగ్ కార్యక్రమాల గురించి, గిరిజన సహకార కార్పొరేషన్ (జీ.సీ.సీ) లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీమతి పి.ఎ.శోభ వివరించారు.

ఈ కార్యక్రమంలో, ఎన్.ఎస్.టి.ఎఫ్.డి.సి. బోర్డు సభ్యులతో పాటు; కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జె.ఎస్. & ఎఫ్.ఏ. శ్రీమతి  యతీందర్ ప్రసాద్; ఐ.డి.బి.ఐ. బ్యాంక్, డిప్యూటీ జనరల్ మేనేజర్, శ్రీమతి దీపికా కిస్పొట్టా;  ఆంధ్రప్రదేశ్ లోని టి.ఆర్.ఐ.సి.ఓ.ఆర్., మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ రవీంద్ర బాబు పాల్గొన్నారు.  ఎన్.ఎస్.టి.ఎఫ్.డి.సి., ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాలకు చెందిన అధికారుల బృందం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, సమన్వయం చేసింది.

 

*****



(Release ID: 1774724) Visitor Counter : 199


Read this release in: English , Hindi , Marathi