గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
దిల్లీహాట్‌లో కొనసాగుతున్నట్రైబ్స్ ఇండియా ఆదిమహోత్సవ్‌లో ప్రామాణికమైన గిరిజన వంటకాల విశిష్ట రుచులు
Posted On:
21 NOV 2021 6:05PM by PIB Hyderabad
గిరిజన హస్తకళలు, సంస్కృతి, వాణిజ్య ఉత్సవమైన ఆది మహోత్సవం న్యూఢిల్లీలోని ఐఎన్ఎ, దిల్లీహాట్‌లో 30 నవంబర్ 2021 వరకు కొనసాగనుంది. ఈ ప్రదర్శన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోన్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి జన జాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించిన నవంబర్ 15న ప్రారంభించారు.
గిరిజన జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అంశాలలో భిన్న జాతులకు ప్రత్యేకమైన, ప్రామాణిక వంటకాల శ్రేణి. న్యూఢిల్లీలోని దిల్లీ హాట్ లో కొనసాగుతున్న గిరిజన ఇండియా ఆది మహోత్సవ్‌లో ప్రధాన ఆకర్షణగా నిజమైన గిరిజన వంటకాలు నిలిచాయి. వార్షికోత్సవమైన జాతీయ గిరిజన ఉత్సవంలో దేశం నలుమూలలకు చెందిన ఆసక్తికరమైన, రుచికర వంటకాలను ప్రదర్శిస్తారు. దిల్లీ హాట్‌ను సందర్శించిన ప్రజలంతా, దేశంలోని సిక్కిం, ఉత్తరాఖండ్, తెలంగాణ, తమిళనాడు, నాగాలాండ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలకు చెందిన ఫుడ్ స్టాల్స్ ఉన్న ఆది వ్యంజన్ విభాగం వద్ద గుమిగూడుతున్నారు.
గిరిజన సమాజాలకు ప్రకృతితో సన్నిహిత సంబంధం ఉంటుంది; వారి నిరాడంబరత, ప్రకృతి పట్ల వారికి ఉన్న గౌరవం వారి ఆహారానికి కూడా వర్తించి, కొనసాగుతుంది. ఇదే గౌరవం వారి వంటకాలలో ప్రతిఫలిస్తుంది; గిరిజనులు తమ ఆహారాన్ని పవిత్రంగా పరిగణిస్తారు. గిరిజన వంటకాలు ఆసక్తికరమైనవే కాదు, అవి సమతుల్యతతో, పౌష్టికతతో నిండి ఉంటాయి. అది రాజస్థాన్‌కు చెందిన దాల్ బాటీ చుర్మ లేదా లిట్టి చోఖా, లేదా జార్ఖండ్‌కు చెందిన తాప్డీ రోటీ లేదా ఉత్తరాఖండ్ కు చెందిన కాధి కావచ్చు, గిరిజన ఆహారం నిరాడంబరంగా, పౌష్టికతతో, రుచికరంగా ఉంటుంది. భిన్న గిరిజన తెగలు, విభిన్న చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇస్తారు. కనుక, ప్రధాన చిరుధాన్యాలతో, లేదా ఇతర చిరుధాన్యాలతో చేసిన రాగి పకోడీలు, జార్ఖండ్‌కు చెందిన మద్వా రోటీలు, తమిళనాడుకు చెందిన రాగి, ఇడ్లీలు, దోశల వంటి వంటకాలు అందుబాటులో ఉన్నాయి.
గత కొద్ది రోజులుగా, ఇతర వంటకాల కన్నా కొన్ని మాత్రమే ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చాప్డా చట్నీ లేదా ఎర్ర చీమల చట్నీని చాలామంది ఇష్టపడుతున్నారు. ఎర్ర చీమలతో చేసిన చాప్డా చట్నీ, రుచికరంగా ఉండటమే కాక వ్యాధులను నిరోధించడంలో తోడ్పడుతుందని భావిస్తున్నారు. మహువా వంటకాల పట్ల కూడా ఎక్కువ ఆసక్తి కనిపించింది. మధ్య, పశ్చిమ భారతదేశంలోని అటవీ ప్రాంతాలలో మహువా చెట్లు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. అందుకే మహువా టీ నుంచి మహువా షకర్‌పారా వరకు భిన్న మహువా వంటకాలు కనిపించడంలో ఆశ్చర్యం లేదు. దేశం నలుమూలల నుంచి వచ్చిన విలక్షణమైన, రుచికరమైన ధుస్కా (బియ్యపు పిండితో చేసిన చక్కిలాల వంటి వంటకం), బంజారా, బిర్యానీ, థాప్డీ రోటీ, హెర్బల్ టీలు, అరకు కాఫీ వంటి వాటిని తిని, తాగి ఆనందించవచ్చు.
ఆదిమహోత్సవ్‌ను సందర్శించి, వోకల్ ఫర్ లోకల్ (స్థానికత కోసం గళమెత్తండి) ఉద్యమానికి మద్దతునిచ్చి, స్వయం సమృద్ధ భారతాన్ని నిర్మించేందుకు తోడ్పడండి. # బై ట్రైబల్ (గిరిజన ఉత్పత్తులు కొనండి).
***
(Release ID: 1773828)
Visitor Counter : 231