హోం మంత్రిత్వ శాఖ
ఢిల్లీ లోని ద్వారకలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సి.ఐ.ఎస్.ఎఫ్) కుటుంబ గృహ సముదాయాన్ని ప్రారంభించిన - కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంతో పాటు, హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో అన్ని కేంద్ర పోలీసు బలగాల కుటుంబాలకు వసతి, బ్యారక్ లతో సహా అన్ని అవసరాలకు ప్రాధాన్యతనిస్తున్న - కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
ఢిల్లీ లో సి.ఐ.ఎస్.ఎఫ్. / డి.ఎం.ఆర్.సి. కోసం 71 కోట్ల రూపాయల వ్యయంతో 10 భవనాల నిర్మాణం; గురుగ్రామ్ లో 104 కోట్ల రూపాయల వ్యయంతో భూ సేకరణ; ఘజియాబాద్ లో 261 కోట్ల రూపాయల వ్యయంతో నివాస / కార్యాలయ సముదాయంతో పాటు శిక్షణ సౌకర్యాల విస్తరణ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.
దేశ భద్రత, ఐక్యతను కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న - కేంద్ర సాయుధ పోలీసు బలగాలు
'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్', 'భిన్నత్వంలో ఏకత్వం' కలను సాకారం చేసేందుకు గొప్ప ఉదాహరణలుగా నిలిచిన - సీ.ఐ.ఎస్.ఎఫ్. వంటి బలగాలు
Posted On:
18 NOV 2021 5:58PM by PIB Hyderabad
ఢిల్లీ లోని ద్వారక లో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సి.ఐ.ఎస్.ఎఫ్) కుటుంబ గృహ సముదాయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్, ఈ రోజు, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రిత్వ శాఖ, సి.ఐ.ఎస్.ఎఫ్. లకు చెందిన సీనియర్ అధికారులతో పాటు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్ర పోలీసు బలగాల కోసం హోం మంత్రిత్వ శాఖ అనేక సంక్షేమ కార్యక్రమాలలో నిమగ్నమై ఉందనీ, నేటి కార్యక్రమం కూడా ఆ ప్రయత్నంలో భాగమేననీ, పేర్కొన్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సభ్యుల కోసం ఈ కుటుంబ నివాస ప్రాంగణంలో 768 కొత్త ఇళ్లు నిర్మించారు. ఈ ప్రాంగణంలో సెంట్రల్ పోలీస్ వెల్ఫేర్ స్టోర్, మల్టీ-స్కిల్ సెంటర్, వ్యాయామశాల, శిశు సదన్ (క్రెచ్)తో పాటు, మెడికల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫ్యామిలీ హౌసింగ్ సెంటర్ అందుబాటులోకి రావడంతో సి.ఐ.ఎస్.ఎఫ్. మరియు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డి.ఎం.ఆర్.సి) లకు చెందిన సిబ్బంది, వారి కుటుంబాలు హాయిగా జీవించగలగడంతో పాటు, ఇది, వారి ధైర్యాన్ని, సామర్థ్యాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుందని, శ్రీ నిత్యానంద రాయ్ తెలిపారు.
సి.ఐ.ఎస్.ఎఫ్. అనేది, దేశంలోని ఒక ప్రముఖ కేంద్ర సాయుధ పోలీసు దళమని, శ్రీ నిత్యానంద రాయ్, కొనియాడుతూ, ఈ దళం ముఖ్యమైన పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ భవనాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, అణు విద్యుత్తు ప్లాంట్లు, అంతరిక్ష పరిశోధన కేంద్రాలు, ఎన్.టి.పి.సి., పెద్ద పెద్ద ఉక్కు కర్మాగారాలు, ముఖ్యమైన ఆనకట్టలు, బొగ్గు, ఇతర ఖనిజ గనుల తో పాటు దేశంలోని ముఖ్యమైన వ్యక్తుల భద్రతను కూడా పర్యవేక్షిస్తోందని, పేర్కొన్నారు. దేశం వెలుపల ఉన్న పది భారత రాయబార కార్యాలయాలు, మిషన్ ల వద్ద కూడా సి.ఐ.ఎస్.ఎఫ్. భద్రతను కల్పిస్తుండడం ద్వారా కూడా సి.ఐ.ఎస్.ఎఫ్. యొక్క బహుముఖ ప్రజ్ఞ వ్యక్తమవుతోందని ఆయన అన్నారు. ఈ దళం ఐక్యరాజ్యసమితి మిషన్ కు నిరంతరం సహకరిస్తోంది. దాని పనిని అందరూ స్థిరంగా ప్రశంసిస్తున్నారు.
రోజుకు సగటున 35 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే ఢిల్లీతో పాటు ఫరీదాబాద్, గురుగ్రామ్, బహదూర్‌ఘర్, ఘజియాబాద్, నోయిడాలోని మెట్రో స్టేషన్లలో కూడా సి.ఐ.ఎస్.ఎఫ్. కు చెందిన డి.ఎం.ఆర్.సి. యూనిట్ భద్రతను కల్పిస్తోందని హోంశాఖ సహాయ మంత్రి చెప్పారు. సీ.ఐ.ఎస్.ఎఫ్. అధికారులు, సిబ్బంది కృషి వల్ల మహిళా ప్రయాణికులకు సురక్షితమైన వాతావరణం ఏర్పడింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వం తో పాటు, హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, అన్ని కేంద్ర పోలీసు బలగాల కుటుంబాలకు వసతి, బ్యారక్ లతో సహా అన్ని అవసరాలకు ప్రాధాన్యత ఇస్తోందని శ్రీ నిత్యానంద రాయ్ తెలియజేశారు. ఈ కార్యక్రమం కింద, ఢిల్లీ మెట్రోలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 13 వేల మంది పోలీసు సిబ్బందికి 22 ప్రదేశాల్లో బ్యారక్ వసతి అందుబాటులోకి వచ్చింది. వీటికి అదనంగా, బవానా, నరేలా, కౌశాంబి, రోహిణి సెక్టార్-34, సిరాస్‌పూర్, బప్రోలాలో కూడా కుటుంబ వసతి కల్పించడం జరిగింది. ఢిల్లీ లో 2,500 మంది భద్రతా సిబ్బంది కోసం కూడా సింగిల్ హౌస్ ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఆయన తెలియజేశారు. ఈ గృహాల ఆధునీకరణ లేదా మార్పు కోసం, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ 133.08 కోట్ల రూపాయలు కేటాయించింది.
ఢిల్లీ లో సి.ఐ.ఎస్.ఎఫ్. / డి.ఎం.ఆర్.సి. కోసం 71 కోట్ల రూపాయల వ్యయంతో 10 భవనాల నిర్మాణం; గురుగ్రామ్ లో 104 కోట్ల రూపాయల వ్యయంతో భూ సేకరణ; ఘజియాబాద్ లో 261 కోట్ల రూపాయల వ్యయంతో నివాస / కార్యాలయ సముదాయంతో పాటు శిక్షణ సౌకర్యాల విస్తరణ కార్యక్రమాలను చేపట్టినట్లు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలియజేశారు. ఈ వనరులు అందుబాటులోకి వచ్చిన తర్వాత భద్రతా దళాల సిబ్బంది ఉత్సాహంగా విధులు నిర్వర్తించగలరని, వారి కుటుంబాలు సంతోషంగా జీవించగలవని ఆయన పేర్కొన్నారు.
తనకు కేటాయించిన విధులతో పాటు, వివిధ కార్యకలాపాల ద్వారా, సి.ఐ.ఎస్.ఎఫ్. దేశానికి అనేక సేవలందిస్తోందని హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ కొనియాడారు. ఈ నేపథ్యంలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 5 లక్షల మొక్కలు నాటాలని, లక్ష్యం నిర్దేశించగా, సీ.ఐ.ఎస్.ఎఫ్. ఈ ఏడాది మొక్కలు నాటే కార్యక్రమం కింద 8 లక్షల మొక్కలు నాటి, లక్ష్యాన్ని అధిగమించిందని, ఆయన ప్రశంసించారు. "ఆజాదీ-కా- అమృత్-మహోత్సవ్" కార్యక్రమాల్లో భాగంగా సీ.ఐ.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీ లో, మొత్తం 5,466 కిలో మీటర్ల దూరం ప్రయాణించడం ద్వారా, సీ.ఐ.ఎస్.ఎఫ్. సిబ్బంది గణనీయమైన కృషి చేశారనీ, అదేవిధంగా, కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా సి.ఐ.ఎస్.ఎఫ్. అధికారులు, సిబ్బంది ఫ్రంట్‌లైన్ యోధులుగా కీలక పాత్ర పోషించారనీ, ఆయన గుర్తుచేశారు.
భద్రతను నిర్ధారించడంలోనూ, దేశ ఐక్యతను కొనసాగించడంలోనూ, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, శ్రీ నిత్యానంద రాయ్ ప్రశంసించారు. 'ఏక్-భారత్, శ్రేష్ఠ-భారత్' మరియు 'భిన్నత్వంలో ఏకత్వం' స్వప్నం సాకారం కావడానికి సి.ఐ.ఎస్.ఎఫ్. వంటి బలగాలు గొప్ప ఉదాహరణలు గా నిలిచాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సి.ఐ.ఎస్.ఎఫ్., జమ్మూ-కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అదేవిధంగా, అరేబియా సముద్రం నుండి మయన్మార్ సరిహద్దు వరకు వివిధ ప్రదేశాలలో, తన సేవలను అందించడం ద్వారా, దేశాన్ని బలోపేతం చేస్తోంది. ఈ దేశ సేవలో మన వీర జవాన్లు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడంలో వెనుకంజ వేయరని, ఆయన పేర్కొన్నారు. "ఎందరో వీర జవాన్లు దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించారు. ఆ వీర జవాన్లు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను." అని శ్రీ నిత్యానంద రాయ్, నివాళులర్పించారు.
*****
(Release ID: 1773235)
Visitor Counter : 190