పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బెంగళూరులో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంత పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రుల సదస్సులో రేపు ప్రసంగించనున్న - కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై


దక్షిణ ప్రాంతంలో వారసత్వం, సాంస్కృతిక పర్యాటకానికి సంబంధించి చేపట్టిన కార్యక్రమాలతో పాటు, రైలు పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, నౌకాయాన పర్యాటకం : ఈ సదస్సులో ప్రధానాంశాలు

Posted On: 27 OCT 2021 2:10PM by PIB Hyderabad

 

కీలక ముఖ్యాంశాలు

*      కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 2021 అక్టోబర్, 28, 29 తేదీల్లో బెంగళూరు లో దక్షిణ ప్రాంత పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రుల సదస్సు ను నిర్వహిస్తోంది. 

*     రెండు రోజుల పాటు నిర్వహించే ఈ  సదస్సులో - పర్యాటక మంత్రిత్వ శాఖ; నౌకా రవాణా మంత్రిత్వ శాఖ; రైల్వే మంత్రిత్వ శాఖ; పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు సర్వే సంస్థ; ఎన్.ఈ.జి.డి.; నీతీ ఆయోగ్ తో సహా వివిధ మంత్రిత్వ శాఖలు తమ కార్యకలాపాల గురించి వివరించనున్నాయి. 

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 2021 అక్టోబర్, 28, 29 తేదీల్లో కర్ణాటకలోని బెంగళూరు లో దక్షిణ ప్రాంత పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రుల సదస్సు ను నిర్వహిస్తోంది.  ఈ సదస్సు నుద్దేశించి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, డి.ఓ.ఎన్.ఈ.ఆర్. శాఖల మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై, 2021 అక్టోబర్, 28వ తేదీన ప్రసంగిస్తారు. ఈ సదస్సులో - భారత ప్రభుత్వ పర్యాటక శాఖ సహాయ మంత్రులు,  వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులతో పాటు, వివిధ ప్రసార మాధ్యమాలు, పరిశ్రమలకు చెందిన భాగస్వాములు పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

దక్షిణ ప్రాంతం లోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విభిన్న పర్యాటక ఆకర్షణలను కలిగి ఉన్నాయి. అదేవిధంగా, ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం తమ తమ స్వీయ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి.  ఈ ప్రాంతంలో మొత్తం పర్యాటక అభివృద్ధిని సులభతరం చేయడం కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రోత్సాహం, ప్రచారం, నైపుణ్యాభివృద్ధి వంటి విభిన్న అంశాలపై,  కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోంది.

రెండు రోజుల పాటు నిర్వహించే ఈ  సదస్సులో భాగంగా, పర్యాటక మంత్రిత్వ శాఖ; నౌకా రవాణా మంత్రిత్వ శాఖ; రైల్వే మంత్రిత్వ శాఖ; పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు సర్వే సంస్థ; ఎన్.ఈ.జి.డి.; నీతీ ఆయోగ్ తో సహా వివిధ మంత్రిత్వ శాఖలు, ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కార్యక్రమాల గురించి వివరంగా తెలియజేయనున్నాయి. 

ఈ రెండు రోజుల్లో నిర్వహించే వివిధ సదస్సుల్లో, ఈ ప్రాంతానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా, తమ తమ రాష్ట్రాల్లో పర్యాటక రంగ స్థితిగతులతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి వారు చేపడుతున్న తాజా కార్యక్రమాల గురించి వివరిస్తాయి.   ఈ సదస్సుల్లో భాగంగా,  దక్షిణ ప్రాంతంలో వారసత్వం, సాంస్కృతిక పర్యాటకానికి సంబంధించి చేపట్టిన కార్యక్రమాలతో పాటు, రైలు పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, నౌకాయాన పర్యాటకం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. 

దక్షిణ ప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా భారతదేశాన్ని సంపూర్ణ గమ్యస్థానంగా, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, డిజిటల్, ప్రింట్ మరియు సామాజిక మాధ్యమాలకు చెందిన వివిధ వేదికల ద్వారా, ప్రచారం చేస్తోంది.   "దేఖో-అప్నా-దేశ్" ప్రచార కార్యక్రమం కింద, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, 2020 ఏప్రిల్ నుండి, దక్షిణ ప్రాంతంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం  ప్రత్యేకంగా నిర్వహించిన వెబినార్ లతో సహా వివిధ పర్యాటక కార్యక్రమాలపై వెబినార్ లు నిర్వహిస్తోంది.  ఈ ప్రాంతంలోని వివిధ గమ్యస్థానాలతో పాటు అనేకమంది ప్రత్యేకంగా కోరుకునే ప్రదేశాలకు కూడా వాయు, రైలు, రహదారి మార్గాల ద్వారా అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. 

దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో సాధించవలసిన లక్ష్యాల గురించి అవగాహన కల్పించడం కోసం తగినంత ప్రచారం, మార్కెటింగ్ చేసి, పర్యాటకులకు ప్రపంచ స్థాయి సేవలను అందించడానికి సుశిక్షితులైన, వృత్తిపరమైన పర్యాటక సౌకర్యాలను కలుగజేసే సహాయకుల బృందాన్ని అందుబాటులోకి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పర్యాటక రంగంలో నైపుణ్యాభివృద్ధి సమస్యలపై దృష్టి సారించింది. 

గత కొన్ని నెలలుగా దేశీయ పర్యాటకం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.  అయితే, అంతర్జాతీయ పర్యాటకుల కోసం సరిహద్దులు త్వరలో తెరుచుకోనున్న నేపథ్యంలో,  పర్యాటకుల విశ్వాసం, నమ్మకాన్ని పెంపొందించడం చాలా ముఖ్యం.  ఈ సందర్భంగా,  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోవిడ్-19 భద్రతా, పరిశుభ్రతల కోసం పాటించాల్సిన నియమ, నిబంధనలను తెలియజేశాయి.   కోవిడ్-19 భద్రతా, పరిశుభ్రత మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించేలా చూసుకోవడంతో పాటు, ఉద్యోగుల, వినియోగదారుల భద్రత, ఆరోగ్యాలను నిర్ధారించడానికి, కేంద్ర మంత్రిత్వ శాఖ, ఆతిథ్య రంగంలో అంచనా, అవగాహన, శిక్షణ కోసం ఒక వ్యవస్థ (ఎస్.ఏ.ఏ.టి.హెచ్.ఐ. - సాథీ) ని ఏర్పాటు చేసింది.   సురక్షితంగా తమ కార్యకలాపాలను కొనసాగించడానికి అనువైన సంసిద్ధతను హోటళ్ళకు కల్పించడంతో పాటు, అతిథుల విశ్వాసాన్ని పునరుద్ధరించి, బాధ్యతాయుతమైన హోటల్‌ గా ఆ హోటళ్ళ ప్రతిష్టను, గౌరవాన్నీ మెరుగుపరచడమే లక్ష్యం గా సాథీ ని ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ రోజు వరకు, సాథీ కింద సౌకర్యాలు కల్పించడానికి, 10,000 కంటే ఎక్కువ వసతి యూనిట్లు నమోదయ్యాయి. అవసరమైన నియమ, నిబంధనలు, మార్గదర్శకాలు పాటించి, అనుసరిస్తూ,  సాథీ పోర్టల్ లో తమ పేరు నమోదు చేసుకోవడానికి, దక్షిణ ప్రాంతంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన హోటల్ యూనిట్లు మంచి స్పందనను కనబరిచాయి.

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, స్వదేశ్ దర్శన్ (ఎస్.డి) మరియు ప్రసాద్ (తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక, వారసత్వ అభివృద్ధి ప్రచార జాతీయ మిషన్) వంటి తన మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాల కింద దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టింది.  స్వదేశ్ దర్శన్ పథకం లో భాగంగా  భారతదేశవ్యాప్తంగా 76 ప్రాజెక్టులు మంజూరయ్యాయి.  వీటిలో దక్షిణ ప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి.  స్వదేశ్ దర్శన్ పథకం కింద,  కోస్టల్ సర్క్యూట్, బౌద్ధ సర్క్యూట్, ఎకో సర్క్యూట్, స్పిరిచువల్ సర్క్యూట్ వంటి వివిధ ఇతివృత్తాలతో,  ప్రాజెక్టులు మంజూరు చేయడం జరిగింది.  ప్రసాద్ పథకం కింద భారతదేశంలో మొత్తం 37 ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వీటిలో దక్షిణ ప్రాంత రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి.  ఈ ప్రయత్నాల ఫలితంగా, ఈ ప్రాంతంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

*****


(Release ID: 1767067) Visitor Counter : 165