మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

‘నిపుణ్‌ భారత్‌ మిషన్‌’ అమలుకు జాతీయ సారథ్య సంఘం ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Posted On: 25 OCT 2021 6:57PM by PIB Hyderabad

   రాయ‌డం.. అర్థం చేసుకో‌వ‌డం... లెక్కించ‌డంలో నైపుణ్యం కోసం జాతీయ కార్య‌క్ర‌మం “నిపుణ్‌ భారత్‌ మిషన్‌”ను కేంద్ర పాఠశాల విద్య-అక్షరాస్యత విభాగం 2021 జూలై 5న ప్రారంభించింది. జాతీయ విద్యావిధానం-2020 నిర్దేశించిన మేరకు ప్రతి బిడ్డ 3వ తరగతి చేరేసరికి ప్రాథమిక అక్షరాస్యత, లెక్కింపు నైపుణ్యం సంతరించుకోవాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ నేపథ్యంలో కార్యక్రమ మార్గదర్శకాలకు అనుగుణంగా ‘నిపుణ్‌ భారత్‌ మిషన్‌’ అమలు కోసం 2021 అక్టోబరు 25న ‘జాతీయ సారథ్యం సంఘం’ (ఎన్‌ఎస్‌సి) ఏర్పాటు చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ సంఘానికి అధ్యక్షుడు కాగా, సహాయమంత్రి శ్రీమతి అన్నపూర్ణ ఉపాధ్యక్షురాలుగా ఉంటారు.

‘ఎన్‌ఎస్‌సి’లో సభ్యులుగా:- పాఠశాల విద్య-అక్షరాస్యత విభాగం కార్యదర్శి; ‘ఎన్‌సీఈఆర్‌టీ’ డైరెక్టర్‌; ‘ఎన్‌ఐఈపీఏ'’ ఉప కులపతి; ‘ఎన్‌సీటీఈ’ చైర్‌పర్సన్; ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల  విద్యాశాఖ కార్యదర్శులు; గుజరాత్‌, సిక్కిం రాష్ట్రాల ‘ఎస్‌సీఈఆర్‌టీ' డైరెక్టర్లు; వీరితోపాటు 7 కేంద్ర మంత్రిత్వ శాఖలు- మహిళా-శిశు అభివృద్ధి; గిరిజన వ్యవహారాలు; సామాజిక న్యాయం- సాధికారత; ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం; ఆర్థికశాఖ; ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ; పంచాయతీ రాజ్‌ శాఖల ప్రతినిధులుసహా ‘ఎన్‌సీఈఆర్‌టీ’; ఆర్‌ఐఈ, అజ్మీర్‌ నుంచి ఇద్దరు నిపుణులు, ముగ్గురు ప్రభుత్వేత్వర నిపుణులు నియమితులయ్యారు. ఈ సంఘానికి ‘నిపుణ్‌ భారత్‌ మిషన్‌’ డైరెక్టర్‌-సంయుక్త కార్యదర్శి కన్వీనరుగా వ్యవహరిస్తారు.

నిపుణ్‌ భారత్‌ మిషన్‌లో ‘ఎన్‌ఎస్‌సి’ పాత్ర, బాధ్యతలు కింది విధంగా ఉంటాయి:

  1. ప్రాథమిక అక్షరాస్యత, లెక్కింపు నైపుణ్యంపై జాతీయ కార్యక్రమ ప్రగతిని పర్యవేక్షించడం, విధానపరమైన అంశాలపై మార్గనిర్దేశం చేయడం.
  2. జాతీయ స్థాయిలో 2026-27కల్లా లక్ష్యం సాధించేలా చూడటం.
  3. మార్గదర్శకాల జారీద్వారా వార్షిక ప్రగతిని అంచనావేసే ఉపకరణాలను సమకూర్చడం
  4. దేశంలోని ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం కోసం కె.ఆర్‌.ఎ.లతో కలసి (రాష్ట్రాల కార్యాచరణ ప్రణాళికల ఆధారంగా) ఒక జాతీయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ఆమోదించడం. ఇందులో భాగంగా వివిధ (నిధుల కొరత, ఖాళీలు, ఉపాధ్యాయులు, జనసంఖ్య, స్థానిక సమస్యలు, ఉపాధ్యాయులకు శిక్షణావశ్యకత, పాఠ్య ప్రణాళిక, బోధకశిక్షణ సంబంధిత) అంశాలను, లోటుపాట్లను పరిగణనలోకి తీసుకోవడం.
  5. లక్ష్యాలను సాధించే దిశగా కార్యక్రమ, ఆర్థిక నిబంధనలను క్రమానుగతంగా సమీక్షిస్తూ వాటిమధ్య సమన్వయం సాధించడం.
  6. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అభిప్రాయ సేకరణ-ప్రదానంసహా ప్రగతిపై విశ్లేషణకు విధివిధానాల రూపకల్పన.

 

***



(Release ID: 1766555) Visitor Counter : 162


Read this release in: English , Urdu , Hindi