సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కేంద్ర పర్యాటక-సాంస్కృతిక-ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి అక్టోబరు 21న తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలోగల రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అక్టోబర్ 21న ఉదయం 11:00 గంటలకు ప్రపంచ
వారసత్వ ఫలకం ఆవిష్కరణతోపాటు ప్రజా సదుపాయాలను ప్రారంభిస్తారు;
జి.కిషన్ రెడ్డి అక్టోబరు 21న మధ్యాహ్నం 3:45 గంటలకు
వెయ్యి స్తంభాల ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకుంటారు;
మంత్రి వరంగల్ కోటలో అక్టోబరు 21న సాయంత్రం
5:15 గంటలకు సౌండ్ అండ్ లైట్ ప్రదర్శనను తిలకిస్తారు;
అక్టోబరు 21న రామప్ప ఆలయానికి వెళ్లే మార్గంలో
గట్టమ వద్ద గిరిజన్ సర్క్యూట్ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు
నాడు పోస్టు చేయడమైనది:
20 OCT 2021 6:20PM by PIB Hyderabad
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అక్టోబరు 21న తెలంగాణలోని ములుగు జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఉదయం 11:00 గంటలకు కేంద్రమంత్రి రామప్ప ఆలయాన్ని సందర్శించి, ఆ చారిత్రక నిర్మాణాన్ని పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రపంచ వారసత్వ ఫలకాన్ని ఆవిష్కరించడంతోపాటు అక్కడ ప్రజా సౌకర్యాలను ప్రారంభిస్తారు. అటుపైన మధ్యాహ్నం 1:00 గంటకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతారు.

రామప్ప దేవాలయం
సజీవ శిల్పకళకు తార్కాణమైన రుద్రేశ్వర ఆలయాన్నే రామప్ప దేవాలయంగా వ్యవహరిస్తారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌కు ఈశాన్యంగా 200 కిలోమీటర్ల దూరంలోగల పాలంపేట గ్రామంలో ఉంది. పెద్దపెద్ద గోడలతో నిర్మించిన ఈ ప్రాంగణంలోని ప్రధానమైన శివాలయంలో మూలవిరాట్టును రుద్రేశ్వర స్వామిగా పిలుస్తారు. అలాగే కొన్ని చిన్న ఆలయాలతోపాటు మందార నిర్మాణాలు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నాయి. రుద్రదేవ, రాచర్ల రుద్రుల పాలన కాలంలో ఈ ఆలయం నిర్మితమైంది. అత్యున్నత సృజనాత్మక, కళాత్మక, నిర్మాణ కౌశలానికి రుద్రేశ్వర ఆలయం ఒక నిదర్శనం. కాకతీయ రాజుల హయాంలో (క్రీ.శ.1123-1323)లో ఈ ఆలయ నిర్మాణం అనేక ప్రయోగాత్మక, శిల్పాత్మక రూపాల్లో సాగింది. ఇసుకరాతితో నిర్మించిన ఈ ఆలయంలో అలంకృత దూలాలు, గ్రానైట్, డోలరైట్‌తో మలచిన స్తంభాలు, విశిష్ట పిరమిడ్ ఆకారంలో ‘తేలే ఇటుకలు’గా పిలిచే బోలు ఇటుకలతో రూపొందించిన విమానం తదితరాలు సందర్శకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రామప్ప ఆలయం ఇప్పుడు చరిత్రకెక్కింది.
వెయ్యి స్తంభాల గుడి
శివుడు, విష్ణువు, సూర్యుడు ప్రధాన దైవాలుగా నిర్మితమైన వెయ్యి స్తంభాల గుడిని కూడా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:45 గంటలకు వెయ్యి స్తంభాల గుడిలో దైవ దర్శనం చేసుకుని, కేంద్ర మంత్రి అక్కడినుంచి వరంగల్ కోట పర్యటనకు బయల్దేరుతారు.
వరంగల్ కోట
తెలంగాణలోని వరంగల్ జిల్లా దాదాపు 12వ శతాబ్దం నుంచి కాకతీయ, ముసునూరి నాయకుల పాలన కాలంలో రాజధానిగా ఉండేది. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అక్టోబరు 21న సాయంత్రం 5:15 గంటలకు ఈ కోటను సందర్శించి, అక్కడ అధికారులతో కలసి సౌండ్ అండ్ లైట్ ప్రదర్శనను తిలకిస్తారు.
‘స్వదేశ దర్శన్’లో భాగంగా గిరిజన సర్క్యూట్ పర్యాటక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం
తెలంగాణలో సమీకృత గిరిజన సర్య్యూట్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 2017లో రూ.75.88 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ములుగు-లక్నవరం-మేడవరం-తాడ్వాయ్-దామరావి-మల్లూర్-బొగత జలపాతాల సందర్శన భాగంగా ఉంటుంది. ఈ సర్క్యూట్ ప్రారంభోత్సవంలో భాగంగా పాలంపేటలోని ప్రపంచ వారసత్వ ఫలకం ఆవిష్కరణకు వెళ్లే మార్గంలోగల గట్టమవద్ద హరిత రెస్టారెంట్ బ్లాక్‌ను కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి పర్యటనలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పలువురితోపాటు కేంద్ర పర్యాటక శాఖ, భారత పురావస్తు అధ్యయన శాఖ అధికారులుసహా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులు కూడా పాల్గొంటారు.
***
(రిలీజ్ ఐడి: 1765221)
సందర్శకుల సూచీ సంఖ్య : : 125