ఆయుష్
సమన్వయ సాధనకు ఆయుష్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల మధ్య రెండవ దఫా చర్చలు
సమన్వయంతో కలసి సమస్యలు పరిష్కరించాలని ఆయుష్, ఆరోగ్య శాఖల మంత్రుల నిర్ణయం
Posted On:
07 OCT 2021 6:53PM by PIB Hyderabad
రెండు మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం సాధించడానికి ఆయుష్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మధ్య రెండోసారి జరిగిన చర్చలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయి. ఎంతోకాలం నుంచి పెండింగులో ఉన్న అంశాలను పరిష్కరించడానికి మరింత సమన్వయంతో పనిచేయాలని రెండు మంత్రిత్వ శాఖలు ఈ సమావేశంలో నిర్ణయించాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, సహాయ మంత్రి డాక్టర్ మున్జపర మహేంద్ర భాయి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మున్సూఖ్ మాండవీయ మార్గదర్శకంలో రెండు మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరిగాయి. సమావేశంలో పాల్గొన్న రెండు మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు సమస్యలను చర్చించి మరింత సమన్వయంతోపనిచేసే వీటిని పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో ఆయుష్ ప్యాకేజీలను చేర్చడం, హెల్త్ వెల్ నెస్ సెంటర్లలో ఆయుష్ సేవలను ప్రవేశపెట్టడం, సామాజిక ఆరోగ్య అధికారుల శిక్షణా కార్యక్రమాల్లో ఆయుష్ అంశాన్ని ప్రవేశపెట్టడం, ఎన్ సి ఐ జగజ్జార్ క్యాన్సర్ కేర్ సెంటర్‌కు సహకారం అందించడం, ఇళ్లలో పనిచేస్తున్న వారిని నాల్గవ తరగతి ఆరోగ్య కార్యకర్తలుగా గుర్తించడం, నూతనంగా ఏర్పాటు కానున్న ఎయిమ్స్ లో ఆయుష్ సేవలను అందించడం లాంటి అంశాలతో సహా మరికొన్ని అంశాలు చర్చకు వచ్చాయి.
సమావేశంలో మాట్లాడిన శ్రీ మాండవీయ 'అందరికి ఆరోగ్యం 'అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం అన్ని శాఖలు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్న విధంగా సమగ్ర ఆరోగ్య విధానానికి రూపకల్పన జరగాల్సి ఉందని అన్నారు.ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆయుష్, ఆరోగ్య శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు 2021 ఆగష్టు 12 వ తేదీన తొలిసారిగా సమావేశం అయ్యారని ఆయన చెప్పారు. ' అందరికి ఆరోగ్యం' అంశాన్ని ఈ సమావేశంలో చర్చించామని అన్నారు.
ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ రెండు శాఖలు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. దీనివల్ల ప్రధానమంత్రి ఆశయాలను సాధించడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. రెండు శాఖల మధ్య సమన్వయం ఉండాలన్న శ్రీ మాండవీయ సూచనకు ఆయన ఆమోదం తెలిపారు.
ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మున్జపరా మహేంద్రభాయ్ రెండు మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను సమన్వయంతో సమగ్రంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రెండు శాఖల మధ్య అవగాహన, సమన్వయం కుదిరితే ప్రజలకు అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
సమావేశంలో ఎన్ హెచ్ ఏ సీఈఓ డాక్టర్ ఆర్ ఎస్ శర్మ, రెండు శాఖల సీనియర్ అధికారులు డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ ధర్మేంద్రసింగ్ గంగ్వార్, శ్రీ అలోక్ సక్సన, శ్రీమతి కవితా గార్గ్, శ్రీ లవ్ అగర్వాల్, డాక్టర్ విపుల్ అగర్వాల్, శ్రీ విశాల్ చౌహాన్, డాక్టర్ ఏంజెల్, శ్రీ డి సెంథిల్ పాండియన్ పాల్గొన్నారు.
(Release ID: 1761998)
Visitor Counter : 118