విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'విద్యుత్ (ప్రసారాల వ్యవస్థ ప్రణాళిక, అభివృద్ధి, అంతర్రాష్ట్ర ప్రసారాల రుసుముల పునరుద్ధరణ)

నిబంధనలు 2021'ని ప్రకటించిన విద్యుత్ మంత్రిత్వ శాఖ
విద్యుత్‌ ప్రసారాల నెట్‌వర్క్‌ను సులభతరం చేయనున్న కొత్త నియమావళి
అంతర్రాష్ట్ర ప్రసారాల వ్యవస్థలో 'జనరల్ నెట్‌వర్క్ యాక్సెస్‌'గా పిలిచే ప్రసారాల వ్యవస్థ ప్రాప్యతను బలంగా మార్చనున్న కొత్త నియమాలు
స్వల్పకాలిక, మధ్యకాలిక ఒప్పందాల ద్వారా విద్యుత్ కొనుగోలుకు, సమర్థవంతంగా ఖర్చు చేయడానికి రాష్ట్రాలకు వెసులుబాటు

Posted On: 03 OCT 2021 10:57AM by PIB Hyderabad

'విద్యుత్ (ప్రసారాల వ్యవస్థ ప్రణాళిక, అభివృద్ధి, అంతర్రాష్ట్ర ప్రసారాల రుసుముల పునరుద్ధరణ) నిబంధనలు 2021'ను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రసారాల వ్యవస్థ ప్రణాళికను మరింత సమర్థవంతంగా మార్చడానికి, దేశవ్యాప్తంగా విద్యుత్‌ రంగ యుటిలిటీలకు విద్యుత్ ప్రసారాల నెట్‌వర్క్‌ను సులభంగా పొందేలా కొత్త నియమావళి మార్గం సుగమం చేస్తుంది.

ప్రస్తుతం, ఉత్పాదక సంస్థలు తమ పంపిణీ ఒప్పందాల ఆధారంగా దీర్ఘకాలిక ప్రాప్యత (ఎల్‌టీఏ) కోసం దరఖాస్తు చేసుకుంటాయి. అదే సమయంలో, లాభాల ఆధారంగా మధ్యకాలిక, స్వల్పకాలిక ప్రసారాల ప్రాప్యత ఉంటుంది. ఎల్‌టీఏ దరఖాస్తు ఆధారంగా, అదనపు ప్రసారాల సామర్థ్యం జోడిస్తారు. పునరుత్పాదక విద్యుత్‌పై పెరుగుతున్న ఆసక్తి, మార్కెట్ కార్యకలాపాల అభివృద్ధి అనేక రంగాల అభివృద్ధి కోసం, ఎల్‌టీఏ ఆధారంగా ప్రస్తుతమున్న ప్రసార ప్రణాళిక విధానాలను సమీక్షించాల్సిన అవసరం ఉంది.

అంతర్రాష్ట్ర ప్రసారాల వ్యవస్థలో 'జనరల్ నెట్‌వర్క్ యాక్సెస్‌' (జీఎన్‌ఏ)గా పిలిచే ప్రసారాల వ్యవస్థ ప్రాప్యతను కొత్త నియమాలు బలపరుస్తాయి. రాష్ట్రాలకు, ఉత్పత్తి కేంద్రాలకు అవసరాలకు అనుగుణంగా ప్రసార సామర్థ్యాన్ని పొందడానికి, నిలబెట్టుకోవడానికి, పంపిణీ చేయడానికి సమర్థతను కొత్త నియమావళి అందిస్తుంది. కాబట్టి, ప్రసార ప్రణాళిక ప్రక్రియతోపాటు, వ్యయాల్లోనూ హేతుబద్ధత, బాధ్యత, న్యాయాన్ని ఈ నియమాలు తీసుకొస్తాయి. కొత్తగా వచ్చిన పెద్ద మార్పు ఏమిటంటే, విద్యుత్‌ ప్లాంట్లు వాటి లక్ష్యిత లబ్ధిదారులను పేర్కొనాల్సిన అవసరం లేదు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ, ప్రసార సంస్థలు వాటి ప్రసార అవసరాలను నిర్ణయించుకోవడానికి, తీర్చుకోవడానికి ఈ నియమాలు అధికారం ఇస్తాయి. అలాగే, స్వల్పకాలిక, మధ్యకాలిక ఒప్పందాల ద్వారా రాష్ట్రాలు విద్యుత్‌ కొనుగోలు చేయగలవు, కొనుగోలు ఖర్చులను సమర్థవంతంగా మార్చుకోగలవు.

జీఎన్ఏ మాత్రమేగాక, ప్రసార ప్రణాళిక ప్రక్రియలో పాల్గొనే వివిధ ఏజెన్సీల స్పష్టమైన బాధ్యతలను కూడా కొత్త నియమావళి నిర్ణయించింది. 'కేంద్ర విద్యుత్‌ సాధికార సంస్థ', రాబోయే ఐదేళ్ల స్వల్పకాలిక ప్రణాళికను ప్రతి ఏటా రూపొందిస్తుంది. అంతేకాదు, రాబోయే పదేళ్ల దృక్పథ ప్రణాళికను సంవత్సరం విడిచి సంవత్సరం సిద్ధం చేస్తుంది. 'కేంద్ర ప్రసారాల విభాగం', రాబోయే ఐదేళ్ల అంతర్రాష్ట్ర ప్రసారాల వ్యవస్థ కోసం కార్యాచరణ ప్రణాళికను ఏటా సిద్ధం చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి, గిరాకీలోని మార్పులను ఆధారంగా ఈ ప్రణాళికను రూపొందిస్తుంది. ప్రస్తుతమున్న ఎల్‌టీఏ 'జనరల్ నెట్‌వర్క్ యాక్సెస్‌'గా ఎలా మారుతుందో ఈ నియమాలు వివరించాయి. ప్రసారల నెట్‌వర్క్ వినియోగదారుల నుంచి జీఎన్‌ఏ ఛార్జీల వసూలును వివరించడంతోపాటు, అంతర్రాష్ట్ర ప్రసారాల రుసుముల బిల్లింగ్, సేకరణ, పంపిణీ బాధ్యతను కేంద్ర ప్రసారాల విభాగానికి నూతన నియమావళి అప్పగిస్తుంది.

రాష్ట్రాలు, ఉత్పత్తి సంస్థలు ప్రసార సామర్థ్యాన్ని విక్రయించడానికి, పంచుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి మొట్టమొదటిసారి నియమాలు అనుమతించాయి. అనుమతించిన జీఎన్‌ఏ సామర్ధ్యం కంటే ఎక్కువ స్వీకరణ లేదా పంపిణీపై, వర్తించే ధర కంటే కనీసం 25% అధికంగా వసూలు చేయాలని నియమాలు నిర్దేశించాయి. జీఎన్ఏ సామర్థ్యాన్ని తక్కువగా ప్రకటించకుండా ఇది నియంత్రిస్తుంది. అంతర్రాష్ట్ర ప్రసారాల వ్యవస్థలో జీఎన్‌ఏపై వివరణాత్మక నిబంధనలు తీసుకురావడానికి కేంద్ర విద్యుత్‌ నియంత్రణ సంస్థ (సీఈఆర్‌సీ)కి అధికారం వచ్చింది.

ప్రసార వ్యవస్థలో పెట్టుబడుల ప్రణాళిక, అభివృద్ధి, పునరుద్ధరణ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నియమావళిని తీసుకువచ్చింది. ఉత్పత్తి, ప్రసారాల రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడమే ఈ నియమావళి లక్ష్యం. దేశంలో బలమైన మార్కెట్లను అభివృద్ధి చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.

ఉత్పత్తి, గిరాకీని అనుసంధానించే విద్యుత్ రంగ విలువ గొలుసులో ప్రసారాల వ్యవస్థ ఒక కీలకమైన అనుసంధానం. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి, ప్రాంతాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థ సమగ్రతను నిర్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. "ప్రసార వ్యవస్థ అందుబాటులో లేకపోవడం వివిధ ప్రాంతాల అభివృద్ధి ఆగిపోకుండా విద్యుత్ ప్రసార ప్రణాళిక రూపకల్పన జరగాలి. సాధ్యమైనంత వరకు, ఉత్పత్తి వృద్ధి, భారంతో సరిపోలేలా ప్రసార వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా రూపొందించాలి. వ్యర్థ పెట్టుబడి లేనివిధంగా జాగ్రత్త పడాలి" అన్న సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నియమాలు బలపరుస్తున్నాయి.

గతంలో తీసుకొచ్చిన సంస్కరణలకు కొనసాగింపుగా, కేంద్ర విద్యుత్ మంత్రి శ్రీ ఆర్‌కె సింగ్ ఆదేశాలతోనూ; ప్రసారాల వేలంలో పారదర్శకత, సమర్థతను అందించడానికి, ప్రసార ప్రాజెక్టుల లాక్-ఇన్ వ్యవధిని తగ్గించడానికి విద్యుత్‌ మంత్రిత్వ శాఖ 'కేంద్ర ప్రసారాల విభాగాన్ని' పవర్‌గ్రిడ్ నుంచి వేరు చేసింది. ఎక్కువ పెట్టుబడులు, మరింత పోటీని ఆకర్షించడం ఈ చర్య ఉద్దేశం.  వినియోగదారులకు మరింత శక్తినిచ్చేలా, 'వినియోగదారుల హక్కు' నియమాలను కూడా విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసింది.


(Release ID: 1760750) Visitor Counter : 261