జల శక్తి మంత్రిత్వ శాఖ

'గంగానది సమగ్ర పునరుజ్జీవనం'లో మెరుగైన సమన్వయం, అభిస‌ర‌ణకు జ‌లశ‌క్తి శాఖ స‌హాయ మంత్రి అధ్య‌క్ష‌త‌న సాధికారిత టాస్క్ ఫోర్స్ సమావేశం


- ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్‌ల‌లో మూడు గంగా టూరిస్ట్ సర్క్యూట్‌లను అభివృద్ధి చేయనున్న‌ పర్యాటక మంత్రిత్వ శాఖ

- గంగానది పొడవునా సేంద్రియ వ్యవసాయం మ‌రియు వ్యవసాయ-అటవీప్రాంతం 23,840 హెక్టార్ల నుండి 1,03,780 హెక్టార్లకు పెరుగుద‌ల‌

- 'నమామి గంగే' గంగానది శుభ్రపరిచే కార్యక్రమం మాత్రమే కాదు.. ప్రజలలో సామూహిక చైతన్యాన్ని తీసుకువ‌చ్చే కార్య‌క్ర‌మం: శ్రీ బిశ్వేశ్వర్ తుడు

Posted On: 23 SEP 2021 7:29PM by PIB Hyderabad

గంగా నది మరియు దాని  ప‌రివాహ‌క ప్రాంతం యొక్క సంపూర్ణ పునరుజ్జీవనం కోసం ప‌ని చేస్తున్న ఏజెన్సీలు, కార్యక్రమాల మధ్య మెరుగైన సమన్వయం మరియు అనుస‌ర‌ణకు గాను వివిధ‌ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఏర్పాటు చేసిన సాధికారిత టాస్క్ ఫోర్స్ సమావేశానికి కేంద్ర జ‌ల‌శ‌క్తి  స‌హాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు అధ్యక్షత వహించారు. నిన్న జ‌రిగిన ఈ స‌మావేశంలో మంత్రి పాల్గొన్నారు.  మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్రాలు ఇటీవలి పరిణామాలపై తాజా స్థితిని గురించి తెలియ‌జేశారు. వారి భవిష్యత్తు ప్రణాళికలను కూడా రూపొందించి అందించాయి. స‌మావేశానికి హాజ‌రైన  మంత్రిత్వ శాఖలలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం మరియు వ్యవసాయ - అటవీ సంరక్షణ విస్తీర్ణం 23,840 హెక్టార్ల నుండి 1,03,780 హెక్టార్లకు పెరిగిన‌ట్టుగా తెలియజేసింది. ఇందులో ఉత్తరాఖండ్‌లో సేంద్రీయ వ్యవసాయ‌ భూమి 50,840 హెక్టార్ల‌కు, ఉత్తరప్రదేశ్ 42,180 హెక్టార్ల‌కు, బీహార్‌ల‌లో 16,060 హెక్టార్లు, జార్ఖండ్‌లో 4,540 హెక్టార్ల‌కు చేరింది.  సేంద్రీయ వ్యవసాయానికి మారడం రైతుల ఆదాయాన్ని పెంచడానికి, నీటి వినియోగాన్ని మెరుగుపరచడానికి మరియు పంట వైవిధ్యతను మెరుగుపరచడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. గంగా నది వెంట సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల కోసం రాష్ట్రాలు నమామి గంగే బ్రాండ్‌ను కూడా ఉపయోగిస్తున్నాయి. హరిద్వార్‌లోని గంగా మ్యూజియం ఇప్ప‌టికే  పనిచేస్తోంది. హృషికేష్‌లో మ్యూజియం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని, పాట్నాలోని మరొక మ్యూజియం కూడా మంజూరు చేయబడిందని పర్యాటక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు బీహార్‌ల‌లోని గంగానదిలో పర్యాటకుల సర్క్యూట్‌లను అభివృద్ధి చేయడానికి గాను మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. 38 జిల్లాలకు సంబంధించిన నిర్మాణ, సాంస్కృతిక మరియు సహజ మ్యాపింగ్‌పై నివేదిక కూడా సమర్పించారు. రాష్ట్రాలలో, బీహార్ వారి 'స్టేట్ ఆర్గానిక్ మిషన్'  సేంద్రీయ ఉత్పత్తుల ఉత్పత్తి మరియు మార్కెటింగ్‌ను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది. ఉత్తర్ ప్రదేశ్ సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రజలను ప్రోత్సహించడానికి పట్టణ ప్రాంతాల్లో సేంద్రీయ తోటల పెంపకం & పట్టణ నివాస కాలనీలలో మండీలను (ఔట్‌లెట్‌ల‌ను) అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రలో సేంద్రీయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి 20 పెద్ద మరియు 410 చిన్న అవుట్‌లెట్‌లను ప్రారంభించింది, జార్ఖండ్ ప్రభుత్వం ముఖ్యంగా గంగానదిలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ‘జార్ఖండ్ సేంద్రీయ వ్యవసాయ ప్రాధికారిక‌త‌’  సంస్థ‌ను ప్రారంభించింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సుందర్‌బన్ ప్రాంతంలో భారీ ప్లాంటేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. 10,000 ఎకరాల భూమిలో 3 జిల్లాలలో 15 కోట్ల మొక్క‌ల‌ను నాటింది. ఈ  సమావేశంలో జల శక్తి శాఖ స‌హాయ మంత్రి  శ్రీ బిశ్వేశ్వర్ తుడు మాట్లాడుతూ 'నమామి గంగే' గంగా నదిని శుభ్రపరిచే కార్యక్రమం మాత్రమే కాదని, ప్రజలలో సామూహిక చైతన్యాన్ని తీసుకువస్తుందని అన్నారు. అందువల్ల, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రిత్వ శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి గంగా అవిరాల్ మరియు నిర్మల్‌గా మార్చేందుకు కృషి చేయాలి అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ కుమార్, ఎన్ఎంసీజీ సంస్థ డీజీ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా,  ఎన్ఎంసీజీ ఈడీ (ఫైనాన్స్‌)  శ్రీ రోజీ అగర్వాల్, ఎన్ఎంసీజీ ఈడీ (ప్రాజెక్ట్స్‌)  శ్రీ అశోక్ కుమార్ సింగ్, ఎన్ఎంసీజీ ఈడీ (టెక్నిక‌ల్) శ్రీ డి.పి. మాథూరియాలు  సమావేశంలో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కార్య‌క్ర‌మానికి ప్రాతినిధ్యం వహించారు.
                                                                                             

****



(Release ID: 1757479) Visitor Counter : 128


Read this release in: English , Urdu , Hindi