వ్యవసాయ మంత్రిత్వ శాఖ
తెలంగాణరాష్ట్రం లో వ్యవసాయ రంగం లో కేంద్ర పథకాల అమలును సమీక్షించిన కేంద్ర మంత్రి శోభ కరంద్ లాజే
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు వ్యవసాయఎగుమతులను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టీకరణ; జీడిమెట్ల లోని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో రైతులతోమాటామంతీ
Posted On:
13 SEP 2021 5:03PM by PIB Hyderabad
రైతుల ఆదాయాన్ని ఒక సహేతుకమైన కాల వ్యవధి లోపల రెట్టింపు చేసేందుకు వీలుగా వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని వ్యవసాయం, రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రి శోభ కరంద్ లాజే స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారు దేశంగా భారతదేశాన్ని తీర్చి దిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం కలసి కృషి చేస్తుందని ఆమె అన్నారు.
హైదరాబాద్ లోని బూర్గుల రామ కృష్ణా రావు భవన్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో సోమవారం జరిగిన ఒక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ ఎగుమతులను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంది అన్నారు. ఈ విభాగం రైతులు వారు పండించిన పంటలకు చక్కని విలువ ను రాబట్టుకోవడానికి గాను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయం- శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి ప్రాధికరణ సంస్థ (ఎపిఇడిఎ..‘అపెడా’) లను సమన్వయపరచాలి అని మంత్రి అన్నారు. 20 లక్షల ఎకరాల లో ఆయిల్ పామ్ చెట్లను పెంచే కార్యక్రమాన్ని చేపట్టినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రి అభినందించారు. ఇది విదేశీ మారక ద్రవ్యాన్ని గణనీయమైన స్థాయి లో ఆదా చేసుకోవడానికి దేశానికిసాయపడుతుందని ఆమె అన్నారు. నూనె గింజల సాగును లాభసాటిగా మార్చగలిగే విధంగా నూనె గింజలను ప్రాసెస్ చేసే పరిశ్రమలను స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అని శోభ కరంద్ లాజే తెలిపారు.


తెలంగాణ ప్రభుత్వం లో వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ ఎస్. నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల ఫలితం గా గడచిన ఏడేళ్లలో ఫల సాయం లో 68 శాతం పెరుగుదలతో పాటు సేద్యానికి అనువైన ప్రాంతంలో 38 శాతం విస్తరణ కూడా సాధ్యం అయింది అని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా, రైతు వేదికలు, రైతు బంధు వంటి కొత్త కొత్త పథకాలను గురించి సమగ్రంగా వివరించారు. ఇదే కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ విభాగం కార్యదర్శి శ్రీ రఘునందన్ రావు మాట్లాడుతూ, సేద్యపు నీటిపారుదల, విద్యుత్తు, పెట్టుబడి సాయం, రైతులకు సామాజిక భద్రత వంటి చర్యలు రాష్ట్ర వ్యవసాయ రంగ సామర్ధ్యాన్ని పెంచడంలో తోడ్పడ్డాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి, రాష్ట్ర తోట పంటల విశ్వవిద్యాలయం ఉప కులపతి తో పాటు, ఐసిఎఆర్, ఎంఎఎన్ఎజిఇ, ఐఐఎమ్ఆర్ ల సీనియర్ అధికారులు, రాష్ట్ర సహకార బ్యాంకు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయం, రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రి శోభ కరంద్ లాజే ఆ తరువాత హైదరాబాద్ లోని జీడిమెట్ల లో గల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (వెజిటబుల్స్ ఎండ్ ఫ్లవర్స్) ను సందర్శించారు. భవనాల మిద్దెల మీద పంటలను పండించే పథకాన్ని మంత్రి ప్రారంభించారు. నేటి ప్రపంచంలో ఈ తరహా అర్బన్ ఫార్మింగ్ కు , కొత్త కొత్త సాంకేతికతలను స్వీకరిస్తూ ముందుకు సాగిపోవడానికి గల గల ప్రాముఖ్యాన్ని గురించి ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. మంత్రి హైదరాబాద్ లోని తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్ టిట్యూట్ లో శిక్షణ పొందిన పట్టణ ప్రాంతాల రైతులకు ప్రశంస ధ్రువపత్రాలను ప్రదానం చేశారు.



మంత్రి శోభ కరంద్ లాజే వెంట కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం, రైతుల సంక్షేమం శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ శమిత బిశ్వాస్, తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విభాగం కార్యదర్శి శ్రీ ఎం. రఘునందన్ రావు, హార్టికల్చర్ ఎండ్ సెరికల్చర్ డైరెక్టర్ శ్రీ ఎల్. వెంకట రామ్ రెడ్డి లతో పాటు ఇతర సీనియర్ అధికారులు కూడా ఉన్నారు.
**
(Release ID: 1754572)