సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్ర‌ముఖ తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌పై ఫోటో ఎగ్జిబిష‌న్

Posted On: 13 AUG 2021 5:37PM by PIB Hyderabad

భార‌త స్వాతంత్య్రోద్య‌మం, అలాగే హైద‌రాబాద్ సంస్థానంలో నిజాం పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడిన ప్ర‌ముఖ తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర యోధులపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్ ఔట్‌రీచ్‌ బ్యూరో (ఆర్.ఒ.బి.) ఆధ్వ‌ర్యంలో మాదాపూర్  శిల్పారామం(హైద‌రాబాద్‌)లో ఆగ‌స్టు 13 నుంచి 17 వ‌ర‌కు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. విదేశీ పాల‌న నుంచి భార‌త‌దేశాన్ని విముక్తి చేయ‌డానికి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు చేసిన త్యాగాలు, పూర్వ హైద‌రాబాద్ సంస్థానంలో నిజాం పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడి హైద‌రాబాద్ రాష్ట్రాన్ని ఇండియ‌న్ యూనియ‌న్‌లో విలీనం చేయ‌డానికి ప్ర‌ముఖుల కృషిని ప్ర‌స్తుత త‌రానికి తెలియ‌జేయ‌డ‌మే ఈ ఫోటో ఎగ్జిబిష‌న్ ల‌క్ష్యం. దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్స‌వ్ లో భాగంగా ఈ ఫోటో ఎగ్జిబిష‌న్ ఏర్పాటుచేశారు. ఈ ఎగ్జిబిష‌న్‌లో కుమురం భీం, చాక‌లి ఐల‌మ్మ‌, స్వామి రామానంద తీర్థ‌, అల్లూరి సీతారామ‌రాజు, టంగుటూరి ప్ర‌కాశం పంతులు త‌దిత‌రుల పాత్రను ఈ ఫోటోలు ప్ర‌స్తుత త‌రానికి క్లుప్తంగా వివ‌రిస్తాయి.  మాదాపూర్ శిల్పారామం స‌హ‌కారంతో ఏర్పాటుచేసిన‌ ఈ ఎగ్జిబిష‌న్లో 30 ఫోటోల‌తో పాటు ఒక ఫోటో బూత్‌, సిగ్నేచ‌ర్ బోర్డుల‌ను కూడా సంద‌ర్శ‌న‌కు ఉంచారు. కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ప్ర‌చుర‌ణ‌ల విభాగం స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన పుస్త‌క‌ ప్ర‌ద‌ర్శ‌నను ఏర్పాటుచేసింది.

 

ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో, రీజ‌న‌ల్  ఔట్‌రీచ్ బ్యూరో సౌత్‌జోన్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్  శ్రీ ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్ శుక్ర‌వారం ప్రారంభించి మాట్లాడుతూ స్వాత్రంత్య్ర పోరాట యోధుల త్యాగాల‌ను స్మ‌రించుకోవ‌డానికి  ఈ ఎగ్జిబిష‌న్‌ను ఏర్పాటుచేసిన‌ట్లు చెప్పారు. ప్ర‌జ‌లు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ ఎగ్జిబిష‌న్‌ను సంద‌ర్శించాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌వోబీ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి శృతిపాటిల్‌, డిప్యూటీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మాన‌స్ కృష్ణ‌కాంత్‌, ప్ర‌చుర‌ణ‌ల విభాగం అసిస్టెంట్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి కృష్ణ వంద‌న త‌దిత‌రులు పాల్గొన్నారు.  

 

ఇంతకుముందు, రీజనల్ ఔట్‌రీచ్‌ బ్యూరో (ఆర్.ఒ.బి.)  గ‌త మార్చి 12న వరంగ‌ల్‌లో నిర్వ‌హించిన 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. మార్చి 12 నుండి 14 వరకు హైదరాబాద్, నిజామాబాద్ మరియు నల్గొండలో ఇదే ఇతివృత్తంపై మూడు రోజుల పాటు ఫోటో ఎగ్జిబిషన్లను నిర్వహించారు. అలాగే గ‌త ఏప్రిల్ 9 నుంచి 15 వ‌ర‌కు మాదాపూర్ (హైద‌రాబాద్‌) లోని స్టేట్ ఆర్ట్ గ్యాల‌రీలో ఇదే ఇతివృత్తంపై ఫోటో ఎగ్జిబిష‌న్ నిర్వ‌హించారు. 

 

మహాత్మా గాంధీ నేతృత్వంలో నిర్వ‌హించిన‌  చారిత్రాత్మక ఉప్పు సత్యాగ్రహం 91 వ వార్షికోత్సవం సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమంలో అధికారికంగా భార‌త స్వాతంత్య్ర 75వ వార్షికోత్స‌వ‌మైన 2022 ఆగస్టు 15 కి 75 వారాల ముందు అంటే 2021 మార్చి 12 న లాంఛనంగా ప్రారంభించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాలు మ‌న దేశం గ‌త 75 ఏళ్ల‌లో సాధించిన విజ‌యాల‌ను ప్ర‌ద‌ర్శిస్తాయి. అంతేకాకుండా వెలుగులోకి రాని స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల కృషిని ప్ర‌స్తుత త‌రానికి తెలియ‌జేస్తాయి. 

 

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' రూపంలో 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రాన్నిస్మరించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాక, ఈ ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలను రూపొందించడానికి, 259 మంది సభ్యులతో గౌరవనీయ భారత ప్రధానమంత్రి అధ్యక్షతన ప్రభుత్వం జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ జాతీయ కమిటీలో అన్ని వర్గాల ప్రముఖులు, ప్రముఖ పౌరులు ఉన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కార్యక్రమాల రూపకల్పనకు విధాన నిర్దేశం, మార్గదర్శకాలను ఈ కమిటీ అందిస్తుంది. అన్ని ప్ర‌భుత్వ‌శాఖ‌లు, విభాగాలు ఈ మ‌హోత్స‌వాల‌లో భాగంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుంటున్నాయి. 

 

 

****


(Release ID: 1745494) Visitor Counter : 123
Read this release in: English