ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త ఆసుపత్రుల ఏర్పాటు!

Posted On: 10 AUG 2021 1:40PM by PIB Hyderabad

  జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్.హెచ్.ఎం.) కింద ఆరోగ్య రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు వివిధ రాష్టాలకు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పి.హెచ్.సి.లు), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు (సి.హెచ్.సి.లు), జిల్లా స్థాయి ఆసుపత్రులను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సాయపడుతుంది. ఆరోగ్య రక్షణ సేవలు సమస్థాయిలో అందేందుకు, అందుబాటు యోగ్యంగా, అందుబాటు ధరల్లో వైద్యం లభించేలా తగిన ప్రోత్సాహాన్ని కూడా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందిస్తున్నారు. ఆయా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖల బడ్జెట్ల కేటాయింపును యేటా పెంచుతూ కేంద్రం ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది.

  దేశవ్యాప్తంగా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య రక్షణ లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని భారత ప్రభుత్వం 2018లో ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా, ఆయుష్మాన్ భారత్-ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల (ఎ.బి.-హెచ్.డబ్ల్యు.సి.ల) పేరిట దేశంలో లక్షన్నర కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాల (ఎస్.హెచ్.సి.ల)ను, పి.హెచ్.సి.లను, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (యు.పి.హెచ్.సి.లను) నవీకరిస్తున్నారు. ప్రజా బాహుళ్య స్థాయిలో వ్యాధినిరోధక చర్యలు, ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకునేలా ఈ కేంద్రాల స్థాయిని మరింత మెరుగుపరుస్తున్నారు.

   వీటన్నింటికి తోడుగా, ప్రధానమంత్రి స్వాస్థ్య సంరక్షా యోజన (పి.ఎం.ఎస్.ఎస్.వై.), ఆరోగ్య, వైద్యవిద్య కోసం మానవ వనరుల (హెచ్.ఆర్.హెచ్ & ఎం.ఇ.) కల్పన వంటి పథకాలను చేపడుతున్నారు. దేశంలో ఆరోగ్య రంగం సంపూర్ణంగా మెరుగుపరిచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. హెచ్.ఆర్.హెచ్., ఎం.ఇ. అనే పథకం ద్వారా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థల వంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాయిని పెంపొందించడం వంటి లక్ష్యాలతో పి.ఎం.ఎస్.ఎస్.వై. అమలవుతోంది. దీనివల్ల తగిన సదుపాయాలకు నోచుకోని ప్రజలకు దిగువ స్థాయి ఆరోగ్య రక్షణ వ్యవస్థతో అనుసంధానం మెరుగుపడుతోంది. ప్రజలకు చేరువయ్యేలా ఆరోగ్య నిపుణుల లభ్యతను పెంచేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

  దేశంలో మహమ్మారి వైరస్ కట్టడి, చికిత్సా నిర్వహణకు సంబంధించి, వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు “ఇండియా కోవిడ్-19 అత్యసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్యాకేజీ” కింద సహాయం అందుతోంది. ఆరోగ్య రక్షణ మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకలు, ఐసొలేషన్ పడకలు, ఐ.సి.యు. పడకలు, మానవ వనరులు, ఔషధాల సరఫరా వంటి అంశాల్లో తగిన సహాయం అందుతోంది. ఈ ప్యాకేజీ కింద 2020-21వ సంవత్సరంలో రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ. 8147.28 కోట్లను విడుదల చేశారు. ఇందుకు అదనంగా ఆరోగ్య రక్షణ కార్యకర్తల బీమాకోసం రూ. 110.60 కోట్లను అందుబాటులో ఉంచారు. దీనితో మొత్తం రూ. 8257.88 కోట్లను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందించినట్లయింది. ఇందుకు సంబంధించిన వివరాలను అనుబంధం-Iలో చూడవచ్చు.

  

   “ఇండియా కోవిడ్-19 అత్యసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్యాకేజీ- 2వ దశ” పథకాన్ని 2021 జూలై 8న కేంద్ర మంత్రివర్గం,. రూ. 23,123 కోట్ల మొత్తానికి ఆమోదం తెలిపింది. కోవిడ్-19 వైరస్ ముప్పుపై ప్రతిస్పందించడం, వైరస్ ను నిరోధించడం, వ్యాప్తిని పసిగట్టడం లక్ష్యాలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అలాగే, ఇలాంటి ఆరోగ్య అత్యయిక పరిస్థితి ఇకముందు తలెత్తిన పక్షంలో దాన్ని ఎదుర్కొనేందుకు సన్నాహాలకోసం ఆరోగ్య రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం కూడా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

  ఇక, ప్రాథమిక ఆరోగ్య రక్షణ స్థాయిలో ఆరోగ్య రక్షణ వ్యవస్థను స్థానిక స్వపరిపాలనా సంస్థల ద్వారా బలోపేతం చేసేందుకు గ్రాంట్లకోసం 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2021నుంచి 2026వరకూ ఐదేళ్ల కాలానికి రూ. 70,051కోట్ల మొత్తానికి ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. వైద్యసేవల విషయంలో మెరుగైన పర్యవేక్షణ, నాణ్యత లక్ష్యంగా జాతీయ నాణ్యతా హామీ కార్యక్రమం (ఎన్.క్యు.ఎ.ఎస్.), కాయకల్ప అవార్డు పథకాన్ని, ప్రసూతి వైద్యంలో నాణ్యతకు సంబంధించిన లక్ష్య పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. వివరాలకోసం అనుబంధం-IIIను చూడవచ్చు.

 

 

అనుబంధం-I

ఇండియా కోవిడ్-19 అత్యసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్యాకేజీ: (ఇ.సి.ఆర్.పి.-I)

 

  • “ఇండియా కోవిడ్-19 అత్యసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్యాకేజీ” కింద  రూ. 15,000 కోట్ల (2 బిలియన్ అమెరికన్ డాలర్ల) మొత్తానికి కేంద్ర మంత్రివర్గం 2020 ఏప్రిల్ 22న ఆమోదం తెలపింది. కోవిడ్-19 వైరస్ ముప్పును ముందస్తుగా పసిగట్టు, అందుకు తగినట్టుగా ప్రతిస్పందనా చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ మొత్తాన్ని ఆమోదించారు.
  • ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఎ.ఐ.ఐ.బి.), ఆసియా అభివృద్ధి బ్యాంకు సహకారంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకం అమలవుతోంది. ఈ ప్యాకేజీ అమలులో,.. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.), జాతీయ వ్యాధి నియంత్రణా కేంద్రం (ఎన్.సి.డి.సి.), జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్.హెచ్.ఎం.), కేంద్ర సేకరణ విభాగం (సి.పి.డి.) వంటి సంస్థలతో పాటుగా, రైల్వే మంత్రిత్వ శాఖ కూడా పాలుపంచుకుంటున్నాయి.
  • ఈ ప్యాకేజీ కింద ఇప్పటివరకూ  మొత్తం రూ. 13719.22 కోట్లు ఖర్చుకు కట్టుబడి ఉన్నట్టు  ప్యాకేజీని అమలు చేస్తున్న సంస్థలు తెలిపాయి. ఇక, కోవిడ్ ముప్పును నివారించి, వైరస్ వ్యాప్తిని పసిగట్టి, తగిన విధంగా ప్రతిస్పందించే కార్యక్రమాలకోసం వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ. 8147.29 కోట్లను విడుదల చేశారు.
  • కోవిడ్ రోగుల చికిత్సా నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకత్వానికి అనుగుణంగా కోవిడ్ రోగులకోసమే ప్రత్యేక ఆసుపత్రి సదుపాయాలను ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి. ఈ ఆసుపత్రుల ఏర్పాటులో 2020 ఏప్రిల్ నెలనుంచి గణనీయమైన ప్రగతి చోటుచేసుకుంది. 2021వ సంవత్సరం జూన్ 30 నాటికి జాతీయ స్థాయిలో ప్రగతి ఈ కింది విధంగా ఉంది.:
  • 1వ కేటగిరీ- కోవిడి చికిత్సకోసమే కేటాయించిన ఆసుపత్రుల సంఖ్య 163నుంచి 4,389కి పెరిగింది.  – అంటే 27 రెట్ల పెంపు.
  • 2వ కేటగిరీ- కోవిడ్ ఆరోగ్య రక్షణ కేంద్రాల సంఖ్య 0 నుంచి 8340 పెరిగింది.
  • 3వ కేటగిరీ- కోవిడ్ సెంటర్ల సంఖ్య 0 నుంచి 10,015కు పెరిగింది.
  • ఆక్సిజన్ సదుపాయం కలిగిన పడకల సంఖ్య 50,583నుంచి 4,16,947కు పెరిగింది. –అంటే ఈ పడకల సంఖ్య 8 రెట్లు పెరిగింది.
  • ఐ.సి.యు. పడకలు మినహాయిస్తే మొత్తం ఐసొలేషన్ పడకల సంఖ్య 41,000 నుంచి 1,811,850కు పెరిగింది.  –అంటే  44రెట్ల పెరుగుదల నమోదైంది.
  • మొత్తం ఐ.సి.యు. పడకల సంఖ్య 2,500 నుంచి 121,671కు పెరిగింది –  48-రెట్ల పెరుగుదల.
  • కోవిడ్-19 వైరస్.పై పోరాటంలో భాగంగా, ఆశా వర్కర్లతో పాటుగా మొత్తం 22లక్షల మంది ఆరోగ్య కర్తలకు బీమా సదుపాయం కల్పించారు.
  • వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనపు మానవ వనరుల తరలింపు:  స్పెషలిస్టులు – 3,720 మంది, వైద్యాధికారులు – 7,030మంది, స్టాఫ్ నర్సులు – 36,303మంది.

 

  • కోవిడ్ పరీక్షల నిర్వహణలో గణనీయమైన ప్రగతి: 2020వ సంవత్సరం ఏప్రిల్ నాటికి రోజుకు 30,000మేర టెస్టుల నిర్వహణా సామర్థ్యం ఉండగా, ఇపుడు 20.60లక్షల మేర నమూనాలను పరీక్షించే సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా, దేశవ్యాప్తంగా 2,734 లేబరేటరీల ద్వారా 41.40కోట్లకు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. (ప్రభుత్వ ఆధ్వర్యంలోని 1, 288 పరిశోధన శాలలు, ప్రైవేటు యాజమాన్యంలోని1446 లేబరేటరీల్లో ఈ పరీక్షలు చేపట్టారు.) రోజువారీ పరీక్షల నిర్వహణా సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది.
  •  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెంచేందుకు 85 ఆర్.టి.పి.సి.ఆర్. మెషీన్లు, 125 ఆటోమేటెడ్ ఆర్.ఎన్.ఎ. సంగ్రహణ యంత్రాలు, 4 కోబాస్ మెషీన్లను భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.) అందించింది.
  • కోవిడ్ నియంత్రణకు 4.23కోట్ల మేర పరికరాలను, ఔషధాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు అందించింది. 1.77 కోట్ల ఎన్-95 మాస్కులు, 11కోట్ల పి.పి.ఇ. కిట్లు, 11.16 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు, 48,232 కృత్రిమ శ్వాస పరికరాలు (వెంటిలేటర్లు), 14,000 అందించింది. 10లీటర్ల సామర్థ్యం కలిగిన 14,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సరఫరా చేసింది. 1,02,400 ఆక్సిజన్ సిలిండర్లు, 1,00,000,.. సార్స్ సి.ఒ.వి.-2 కాట్రిట్జీలు, 12 లక్షలవరకూ  కోవిడ్ పి.సి.ఆర్.చిప్.లను,  ఒక కోటి రెమ్.డెసివిర్ ఇంజక్షన్లను 2021 జూన్ 17 నాటికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించింది.
  • కోవిడ్ చికిత్సా నిర్వహణలో రైల్వే మంత్రిత్వ శాఖ కూడా పాలుపంచుకుంది. కరోనా చికిత్సకోసం 5,601 రైలు బోగీలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చివేసింది. అలా మార్చిన రైల్వే బోగీలను ఆయా రాష్ట్రాల డిమాండుకు అనుగుణంగా తరలిస్తూ వచ్చింది.  రైల్వేల అధ్వర్యంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షల సామర్థ్యం కూడా బలోపేతమైంది. అదనంగా 5 ఆర్.టి.పి.సి.ఆర్. మెషీన్లను (ట్రూనాట్ మెషీన్లతో పాటుగా) రైల్వే మంత్రిత్వ శాఖ సమకూర్చుకుంది.

 

 

అనుబంధం-II

  • ఇండియా కోవిడ్-19 అత్యసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్యాకేజీ: (ఇ.సి.ఆర్.పి.-II)

 

  • “ఇండియా కోవిడ్-19 అత్యసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్యాకేజీ”: 2వ దశ (ఇ.సి.ఆర్.పి.-II) కింద రూ. 23,123 కోట్ల మొత్తానికి కేంద్రమంత్రివర్గం 2021 జూలై 8న ఆమోదం తెలిపింది. 2021 జూలై 1వతేదీ నుంచి 2022 మార్చి నెలాఖరు వరకూ  ఈ దశ అమలు జరుగుతోంది. కోవిడ్ వైరస్ వ్యాప్తికి ప్రతిస్పందనగా జిల్లాల్లో, ఉప జిల్లాల్లో ఆరోగ్య రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ప్యాకేజీని అమలు చేస్తున్నారు.  
  • ఇ.సి.ఆర్.పి.-II కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కూడా అమలవుతుంది. కేంద్ర సేకరణ విభాగం (సి.పి.డి.), ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన (పి.ఎం.ఎస్.ఎస్.వై.), జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్.సి.డి.సి.), కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రజారోగ్య విభాగం, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనుబంధ సేవల విభాగం ద్వారా ఈ సేవలు అమలవుతాయి.
  • జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్.హెచ్.ఎం.) కింద ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థల ద్వారా కూడా ఈ సేవలందుతాయి. ఇప్పటికే అమలులో ఉన్న ఎన్.హెచ్.ఎం. పనితీరులో వెసులుబాటు కోసం ఈ చర్యలు తీసుకున్నారు.  ఇందుకు కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది.
  • కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు, ఏజెన్సీలు, కార్యక్రమ అమలు విభాగాల ద్వారా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలాపాలు అమలవుతాయి. వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.:
  • కోవిడ్ చికిత్సా నియంత్రణకోసం కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలు (ఎయిమ్స్), తదితర సంస్థలకు మద్దతు: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ఆసుపత్రులు, న్యూఢిల్లీ ఎయిమ్స్ ఆసపత్రితో సహా వివిధ ఎయిమ్స్ ఆసుపత్రుల్లోని 6,688 పడకలకు నాణ్యమైన సదుపాయాలతో మద్దతు.
  • కోవిడ్-19 వ్యాక్సినేషన్ తోపాటుగా, కేంద్రీయ వార్ రూమ్ సదుపాయాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థలకు మద్దతు: కోవిడ్-19 పోర్టల్, ఇ-సంజీవని, టెలి కన్సల్టేషన్, 1075 కోవిడ్ హెల్ప్ లైన్, క్లౌడ్ టెలిఫోనీ, కాల్ సెంటర్లు వంటి కేంద్రీయ వార్ రూమ్ ఐ.టి. వ్యవస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆసుపత్రి నిర్వహణ సమాచార వ్యవస్థను, వ్యాక్సినేషన్ కు సంబంధించిన కోవిన్ పోర్టల్.ను బలోపేతం చేయడం కూడా లక్ష్యంగా నిర్దేశించారు.
  •  జన్యు అనుక్రమణిక (జినోమ్ సీక్వెన్సింగ్) ప్రక్రియ, సంబంధిత కార్యక్రమాలతోపాటుగా, ఎన్.సి.డి.సి.ని బలోపేతానికి మద్దతు: కోవిడ్ వైరస్ జన్యు అనుక్రమణిక వ్యవస్థ, సార్స్ సి.ఒ.వి.-2 వైరస్ పుట్టుక, పరిణామం, వ్యాప్తి వంటి అంశాలను అవగాహన చేసుకోవడం, వ్యాక్సీన్ల, ఔషధాలకు సంబందించిన లక్ష్యాలు,  వైరస్ వ్యాప్తిని పసిగట్టే కార్యకలాపాలను బలోపేతం చేయడం, ఎన్.సి.డి.సి.లో జన్యు అనుక్రమణిక పరికరాలను ఏర్పాటు చేసుకోవడం వంటి వాటికి మద్దతు ఇస్తారు. ఇందుకోసం ఇండియా జినోమ్ కన్సార్షియం (ఇన్సాకాగ్)ను ఏర్పాటు చేస్తారు.
  • 28 ప్రవేశ మార్గాల వద్ద నిఘా ఏర్పాటుకు మద్దతు: ఈ విభాగం కింద 16 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో, 11 ఓడరేవుల్లో, ఒక భూ సరిహద్దు ప్రాంతం వద్ద నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తారు. బయోసేఫ్టీ పరికరాలు,  ఐ.టి. పరికర సామగ్రితో తనిఖీ సదుపాయాలు కల్పిస్తారు.

 

  • నిత్యావసర మందులు, ఇతర సరఫరాలకు సంబంధించిన కేంద్రీయ సేకరణ వ్యవవ్థకు మద్దతు: కోవిడ్ చికిత్సా నిర్వహణలో వినియోగించే నిత్యావసర మందులు, రాబోయే మందులకు సంబంధించి కేంద్రీయ సేకరణ వ్యవస్థను ఏర్పాటు.

 

  • జాతీయ ఆరోగ్య కార్యక్రమ వ్యవస్థ (ఎన్.హెచ్.ఎం.) ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయిలో సహాయం అందించడం. ఎన్.హెచ్.ఎం.లో వర్తించే విధంగా సంబంధిత రాష్ట్ర వాటాతో సహాయం అందించడం. ఈ తరహా సహాయం కింద ఈ కింది కార్యకలాపాలు చేపడతారు.:

 

  • దేశంలోని అన్ని జిల్లాల్లో చిన్నపిల్లల ఆరోగ్య రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం. సంబంధిత రాష్ట్ర స్థాయి చిన్నారుల ఆరోగ్య రక్షణ కేంద్రం సాంకేతిక మార్గదర్శకత్వంలో వీటిని ఏర్పాటు చేయడం.

 

  • ప్రజలకు చేరువగా ఉండేలా గ్రామీణ, గిరిజన, పట్టణ శివార్ల ప్రాంతాలతో పాటుగా, వివిధ ప్రాంతాల్లో అదనపు పడకల సదపాయాలను బలోపేతం చేయడం.

 

  • దేశంలో ఐ.సి.యు. సదుపాయంతో కూడిన పడకల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం. క్షేత్రస్థాయిలో ఆసుపత్రులను ఏర్పాటు చేయడం. రవాణాకోసం అదనపు వాహనాల వ్యవస్థ అందుబాటులోకి తేవడం.

 

  • ప్రభుత్వ ఆరోగ్య రక్షణ వ్యవస్థలు, ఆసుపత్రుల్లో ద్రవరూప ఆక్సిజన్ లభ్యతను పెంచడం. మెడికల్ గ్యాస్ పైప్ లైన్ వ్యవస్థతో పాటుగా ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ నిల్వకోసం ట్యాంకులను ఏర్పాటు చేయడం ద్వారా ఆక్సిజన్ లభ్యతను పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవడం. కనీసం జిల్లాకు ఒకచోటైనా ఇలాంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం. 

 

  • పటిష్టమైన కోవిడ్ చికిత్సా నిర్వహణలో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్ (యు.జి.), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పి.జి.) రెసిడెంట్ డాక్టర్ల సేవలను వినియోగించుకునేలా రాష్ట్రాలకు తగిన మద్దతు ఇవ్వడం. అలాగే, చివరి సంవత్సరం ఎం.బి.బి.ఎస్., బి.ఎస్సీ., జి.ఎన్.ఎం. నర్సింగ్ విద్యార్థుల సేవలను వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవడం

 

  • కోవిడ్ చికిత్స కోసం ఔషధాల బఫర్ నిల్వలతో పాటుగా, నిత్యావసర మందులు అందుబాటులో ఉండేందుకు వీలుగా రాష్ట్రాలకు తగిన మద్దతు ఇవ్వడం.

 

  • కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను జిల్లా కంటే దిగువ స్థాయిలో నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ జిల్లాల స్థాయిలో వ్యాధి నిర్ధారణ కేంద్రాల ఎంపిక ప్రక్రియకు మద్దతు ఇవ్వడం.

 

  • వివిధ రాష్ట్రాల్లోని ఆసుపత్రుల నిర్వహణా సమాచార వ్యవస్థ (హెచ్.ఎం.ఐ.ఎస్.)కు మౌలిక సదుపాయాల రూపంలో మద్దతు ఇచ్చేందుకు చర్యలు. ఇందుకోసం అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఇ-హాస్పిటల్, ఇ-శుశ్రుత్ వంటి ఐ.టి. ఆధారిత సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేయడం. 

 

  • దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టెలీ కన్సల్టేషన్ కేంద్రాలను బలోపేతం చేయడం. కోవిడ్ కేర్ కేంద్రాల్లో టెలీ కన్సల్టేషన్ కోసం ఉపకేంద్రాలను ఏర్పాటు చేయడం.  

 

  • కోవిడ్-19 చికిత్సా నిర్వహణకు సంబంధించి అన్ని అంశాల్లో సామర్థ్యాల నిర్మాణ ప్రక్రియకు, శిక్షణా కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం. 

 

అనుబంధం-III

 

ఆరోగ్య రక్షణ సేవల్లో నాణ్యతా ప్రమాణాలకోసం చర్యలు తీసుకోవడం

  జాతీయ నాణ్యతా ప్రమాణాల హామీ (ఎన్.క్యు.ఎ.ఎస్.): నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆరోగ్య సేవలందించడం,.. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో కీలకపాత్ర పోషింస్తుంది. వైద్యసేవలతో ప్రజలకు అనుసంధానం పెంచడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, చికిత్సా వ్యవస్థను బలోపేతం చేయడం, చికిత్స పొందిన వారికి మెరుగైన సంతృప్తిని అందించడం వంటి లక్ష్యాలతో ఎన్.క్యు.ఎ.ఎస్.  వ్యవస్థను రూపొందించారు. దీనికి అంతర్జాతీయ నాణ్యతా, ఆరోగ్య రక్షణ సంఘం (ఇస్క్వా) గుర్తింపు ఉంది. ఈ వ్యవస్థలో పాటించే ప్రమాణాలకు బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐ.ఆర్.డి.ఎ.), జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్.హెచ్.ఎ.)ల నుంచి కూడా గుర్తింపు ఉంది. 2021వ సంవత్సరం మార్చి నెలాఖరు వరకూ అందిన సమాచారం ప్రకారం, 3,544 ప్రజారోగ్య కేంద్రాలు, నాణ్యతా ధ్రువీకరణను సాధించాయి. (వీటిలో 813 కేంద్రాలు జాతీయ స్థాయిలోధ్రువీకరణ పొందినవి కాగా, 2,731 కేంద్రాలు రాష్ట్రాల స్థాయిలో ధ్రువీకరణ పొందినవి ఉన్నాయి.)

 

   లక్ష్య : ‘రక్షణతో కూడిన శిశు జననం’లో నాణ్యత, భద్రతా ప్రమాణాలే ప్రాతిపదికగా లక్ష్య పథకానికి 2017లో శ్రీకారం చుట్టారు.  లక్ష్య పథకం కింద ఇప్పటి వరకూ 2,805 కేంద్రాలను ఎంపిక చేశారు. (వీటిలో 193 వైద్యకళాశాలలు కూడా ఉన్నాయి.).  పథకం ప్రారంభంనుంచి 2021 మార్చి నెలాఖరు వరకూ, 765 ప్రసూతి కేంద్రాలకు, 652 ప్రసూతి ఆపరేషన్ థియేటర్లకు లక్ష్య పథకం కింద రాష్ట్రస్థాయిలో ధ్రువీకరణ లభించింది. 322 ప్రసూతి కేంద్రాలు, 271 ప్రసూతి ఆపరేషన్ థియేటర్లకు జాతీయ స్థాయిలో లక్ష్య పథకం కింద ధ్రువీకరణ లభించింది. 

 

  కాయకల్ప: ఆసుపత్రి వాతావరణం కారణంగా సూక్ష్మ జీవులతో సంక్రమించే ఇన్ఫెక్షన్.ను పరిశుభ్రతను పాటించడం ద్వారా నియంత్రించేందుకు కాయకల్ప అవార్డు పథకాన్ని 2015నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్రస్థాయి ప్రజారోగ్య కేంద్రాలకోసం అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ, దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని మొత్తం 9,815 ఆరోగ్య కేంద్రాలకు ఈ పథకం కింద గుర్తింపు లభించింది. (వీటిలో 347 జిల్లా ఆసుపత్రులు, 1,926 ఉపజిల్లా ఆసుపత్రులు/కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 4,761 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 1,025 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 1,756 ఆరోగ్య, సంక్షేమ కేంద్రాలు ఉన్నాయి.) ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, చండీగఢ్, డామన్ డయ్యూ, దాద్రా నాగర్ హవేళీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర రాష్ట్రాల్లోని ఆరోగ్య కేంద్రాలకు ఈ పథకం కింద ధ్రువీకరణ లభించింది.

  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాలు తెలియజేశారు.  

 

***



(Release ID: 1744550) Visitor Counter : 188


Read this release in: English , Urdu