మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత

Posted On: 06 AUG 2021 5:18PM by PIB Hyderabad

2022 మార్చి, 31 తేదీ నాటికి, 6 కోట్ల గ్రామీణ గృహాలను (ప్రతి ఇంటికి ఒక వ్యక్తి చొప్పున), డిజిటల్ ఇండియా కార్యక్రమ పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, “ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ (పి.ఎం.జి.డి.ఐ.ఎస్.హెచ్.ఏ)” అనే పథకాన్ని అమలు చేస్తోంది.  సమానమైన భౌగోళిక స్థాయిని నిర్ధారించడానికి, దేశవ్యాప్తంగా 2,50,000 గ్రామ పంచాయితీలు సగటున 200 నుండి 300 మంది అభ్యర్థులను నమోదు చేసుకోవాలని భావించారు.  షెడ్యూల్డ్ కులాలు (ఎస్.సి) / షెడ్యూల్డ్ తెగలు (ఎస్.టి), దారిద్య్ర రేఖకు దిగువన (బి.పి.ఎల్), మహిళలు, వికలాంగులు మరియు మైనారిటీలు వంటి సమాజంలోని అట్టడుగు వర్గాలతో సహా గ్రామీణ జనాభాను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని డిజిటల్ అక్షరాస్యతలో అంతరాలను తగ్గించాలన్నదే ఈ పథకం లక్ష్యం.

డిజిటల్ అక్షరాస్యులు కంప్యూటర్లు / డిజిటల్ ఆధారిత పరికరాలు (టాబ్లెట్‌ లు, స్మార్ట్ ఫోన్లు మొదలైనవి), ఈ-మెయిళ్ళను పంపడం, స్వీకరించడం, ఇంటర్నెట్ ఉపయోగించడం, ప్రభుత్వ సేవల వివరాలను తెలుసుకోవడం, అవసరమైన సమాచారం కోసం శోధించడం, నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం మొదలైనవి చేయగలరు. తద్వారా, జాతి నిర్మాణ ప్రక్రియలో చురుకుగా పాల్గొనడానికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ని సమర్ధవంతంగా ఉపయోగించుకోగలుగుతారు. 

పి.ఎం.జి.డి.ఐ.ఎస్.హెచ్.ఏ. పథకం కింద, 2021 ఆగష్టు, 2వ తేదీ నాటికి, సుమారు 5.01 కోట్ల మంది లబ్ధిదారులు నమోదుకాగా, దాదాపు 4.21 కోట్ల మంది శిక్షణ పొందారు.  ఇప్పటివరకు నమోదైన లబ్ధిదారుల మొత్తం సంఖ్య లో దాదాపు 52 శాతం, అంటే సుమారు 2.59 కోట్లకు పైగా మహిళా లబ్ధిదారులు నమోదయ్యారు. పైన పేర్కొన్న వారిలో, దాదాపు 1.78 కోట్లకు పైగా మహిళా లబ్ధిదారులు ఈ పథకం కింద సర్టిఫికేట్లు పొందారు. పి.ఎం.జి.డి.ఐ.ఎస్.హెచ్.ఏ. పథకం కింద సర్టిఫికేట్లు పొందిన మొత్తం లబ్ధిదారులలో ఇది దాదాపు 54 శాతం. 

దీనికి అదనంగా, దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఈ-లెర్నింగ్ ద్వారా నాణ్యమైన విద్యను అందించడం కోసం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని, ఉన్నత విద్య విభాగం, ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ’ (ఎన్.ఎం.ఈ.ఐ.సి.టి) పథకం,  స్వయం (యువ ఔత్సాహిక విద్యార్థుల కోసం క్రియాశీల అభ్యాస వెబ్‌సైట్లు), స్వయం ప్రభ, జాతీయ డిజిటల్ గ్రంధాలయం (ఎన్.డి.ఎల్), వర్చువల్ ప్రయోగశాలలు, ఈ-యంత్ర; నీట్ (నేషనల్ ఎడ్యుకేషన్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ) మొదలైన పధకాలను నిర్వహిస్తోంది. 

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో, ఈ సమాచారాన్ని పొందుపరిచారు. 

 

 ****


(Release ID: 1743671) Visitor Counter : 159


Read this release in: English , Urdu