శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కొవిడ్‌ జన్యుపటం, మ్యాథమెటికల్‌ మోడలింగ్‌ను ఆవిష్కరించనున్న నాలుగు బ్రిక్స్ దేశాల శాస్త్రవేత్తలు

Posted On: 06 AUG 2021 11:43AM by PIB Hyderabad

చైనా, రష్యా, బ్రెజిల్ శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో, సార్స్‌ కోవ్‌-2 జన్యుపటాన్ని భారత శాస్త్రవేత్తలు ఆవిష్కరించనున్నారు. కొవిడ్‌-19 వ్యాప్తి, మ్యాథమెటికల్‌ మోడలింగ్‌పైనా అధ్యయనాలు చేస్తారు. వైరస్‌ జన్యుపర ఉత్పరివర్తనాలు, పునఃసంయోగాలతో పాటు భవిష్యత్‌ వ్యాప్తి గురించి తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

    వైరస్ జన్యు ఉత్పరివర్తనాలు, పునఃసంయోగాలను గుర్తించడానికి సంపూర్ణ జన్యుపటం అవసరం. సాంక్రమిక రోగ అధ్యయనాలు దీని వ్యాప్తిని అంచనా వేయడంలో సాయపడతాయి. భవిష్యత్‌ వ్యాప్తిని అంచనా వేయడానికి మ్యాథమెటికల్‌ మోడలింగ్‌ అవసరం.

    దీనిని దృష్టిలో ఉంచుకుని; విభిన్న విభాగాల శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల నైపుణ్యాలను ఒకచోటికి చేర్చడం ద్వారా ఒక పరిశోధన ప్రణాళికను రూపొందించారు. హైదరాబాద్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్‌ సిహెచ్‌.శశికళ; బీజింగ్‌లోని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన సీనియర్‌ ప్రొఫెసర్‌ యుహువా జిన్‌; రష్యాలోని చెందిన ఫెడమెంటల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఫండమెంటల్ అండ్ ట్రాన్స్‌లేషన్ మెడిసిన్‌కు చెందిన సీనియర్ పరిశోధకుడు ఇవాన్ సోబోలెవ్; బ్రెజిల్‌లోని రెస్పిరేటరీ వైరసెస్‌ అండ్‌  మీజిల్స్ లాబొరేటరీకి డా.మరిల్డా మెండోనియా సిక్వేరా ఈ ప్రాజెక్టు సభ్యులు.

    భారత్‌కు చెందిన శాస్త్ర, సాంకేతిక విభాగం ఈ పరిశోధనకు సాయం చేస్తుంది. వ్యర్థ జల ఆధారిత అంటువ్యాధి (డబ్ల్యూబీఈ) పరిశోధన కోసం, మెటాజినోమ్ విశ్లేషణ ద్వారా పర్యావరణ నమూనాల్లో సార్స్‌ కోవ్‌-2 వ్యాప్తిని బ్రెజిల్‌ వైపు నుంచి అంచనా వేస్తారు. శ్వాసకోశ వ్యాధుల లక్షణాలు ఉన్న రోగుల నుంచి తీసిన నమూనాల్లో సార్స్‌ కోవ్‌-2 రియల్‌ టైమ్ పీసీఆర్‌ గుర్తింపును చైనా, రష్యా శాస్త్రవేత్తలు చేపడతారు. జన్యు వైవిధ్యం, పరిణామ అభివృద్ధి విశ్లేషణను పరిశీలిస్తారు.

    వైరస్‌ మ్యాథమెటికల్‌ మోడలింగ్‌ను అభివృద్ధి చేయడానికి భారత్‌, చైనా, రష్యా, బ్రెజిల్ నుంచి వచ్చే జన్యు సంబంధ, మెటాజెనోమిక్, ఎపిడెమియోలాజికల్ సమాచారాన్ని కలిపి సమగ్ర పరుస్తారు. వైరస్ వ్యాప్తి మార్గాలు, మనుగడను గుర్తించడానికి ఇది సాయపడుతుంది. వివిధ విభాగాల ద్వారా అభివృద్ధి చేసిన సమాచారాన్ని వివిధ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి, మనుగడతో పోల్చి చూస్తారు. సంబంధిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై సర్వైవలెన్స్‌ ఏర్పాటు చేస్తారు.

    చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఫెడరల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఫండమెంటల్ అండ్ ట్రాన్స్‌లేషన్‌ మెడిసిన్ ఆఫ్ రష్యా, బ్రెజిల్‌కు చెందిన రెస్పిరేటరీ వైరస్ అండ్‌ మీజిల్స్ లాబొరేటరీ నుంచి అంతర్జాతీయంగా ఉన్న సహకారాలను పరిగణనలోకి తీసుకుని, ఈ సహకార పరిశోధన ప్రణాళికను అభివృద్ధి చేశారు. నాలుగు విభిన్న దేశాల సమాచారాన్ని పంచుకోవడానికి, విశ్లేషించడానికి, వైరస్ వ్యాప్తి మార్గాలు, మనుగడను అర్ధం చేసుకోవడానికి ఈ అధ్యయనం ఒక ఉమ్మడి వేదికను అందిస్తుంది.

    మరిన్ని వివరాల కోసం డాక్టర్ సీహెచ్‌.శశికళను (sasi449@jntuh.ac.in; sasikala.ch[at]gmail[dot]com) సంప్రదించవచ్చు.
 

    బ్రిక్స్‌ ఎస్‌టీఐ విధాన కార్యక్రమం గురించి మరింత తెలుసుకోవడానికి http://brics-sti.orgను సందర్శించవచ్చు.

***


(Release ID: 1743238) Visitor Counter : 275


Read this release in: Hindi , English , Urdu