ఆర్థిక మంత్రిత్వ శాఖ
జార్ఖండ్ లో ఆదాయపు పన్ను శాఖ దాడులు
Posted On:
29 JUL 2021 7:28PM by PIB Hyderabad
ఆదాయపు పన్ను శాఖ బుధవారంనాడు జార్ఖండ్‌లోని ఒక ప్రముఖ భవన నిర్మాణ, రియల్ ఎస్టేట్ గ్రూప్ పై దాడులు నిర్వహించింది. రాంచి, కోల్‌కతాల్లోని ఆ సంస్థ కార్యాలయాలపై ఒకే సారి దాడులు ప్రారంభమయ్యాయి. 20కి పైగా ప్రాంగణాలను స్వాధీనం చేసుకున్నారు.
సోదాల సందర్భంగా ఆ గ్రూప్ పద్దు పుస్తకాలు సరిగ్గా నిర్వహించడంలేదని తేలింది. ఆ దాడుల అనంతరం నిజాయతీపూర్వకమైన దర్యాప్తు కింద ఆదాయపు పన్ను శాఖకు ఆడిట్ సర్టిఫికెట్లు, స్టేట్ మెంట్లు సమర్పించారు. భవన నిర్మాణ వ్యాపారంలో భాగంగా ఆ గ్రూప్ భారీ పరిమాణంలో పద్దు పుస్తకాల వెలుపల లావాదేవీలు నిర్వహించిందని, అమ్మకం సందర్భంగా భారీగా అందుకున్న నగదు ఖాతా పుస్తకాల్లో చూపలేదని దాడుల సందర్భంగా అందిన వివరాలు నిరూపిస్తున్నాయి. అలా అందుకున్న నగదులో కొంత మొత్తాన్ని బోగస్ షేర్ క్యాపిటల్ రూపంలో నకిలీ కంపెనీల ద్వారా తిరిగి వ్యాపారంలోకి తెచ్చారని తెలిసింది. ఈ లావాదేవీల్లో భాగస్వాములైన నకిలీ కంపెనీలు ఎనిమిది వరకు ఉన్నాయని తేలింది. కేవలం పేపర్ల పైనే కనిపించే ఈ “కంపెనీల”కు డైరెక్టర్లుగా ఎలాంటి ఆదాయవనరులు లేని బంధువులను, ఇతర వ్యక్తులను నియమించారు. తాము “డమ్మీ డైరెక్టర్లే” అన్న విషయం ఆ “డైరెక్టర్లు” అంగీకరించారని, ఆ గ్రూప్ యజమానులు ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతామని వారు చెప్పారని అధికారులు తెలిపారు. దాడుల్లో భాగంగా రూ.25 కోట్ల మేరకు అన్ సెక్యూర్డ్ రుణాలు, బోగస్ షేర్ క్యాపిటల్ గుర్తించారు. ఈ గ్రూప్ లో పెట్టుబడులు పెడుతున్న నకిలీ కంపెనీల అడ్రస్ కోల్కతాలో ఎక్కడా కనిపించలేదు. వాటా మూలధనం, అన్ సెక్యూర్డ్ రుణం అందుకున్నషెల్ కంపెనీల డైరెక్టర్లే ఉద్యోగులుగా పని చేస్తున్న ముందు వరుసలోని కంపెనీలకు సంబంధించిన నేరపూరితమైన పత్రాలు కూడా అధికారులకు లభించాయి.
రాంచి నగర శివార్లలో భారీగా 1458 ఎకరాల విస్తీర్ణం భూమిని ఆ గ్రూప్ కొనుగోలు చేసి అందులో రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు నిర్మిస్తోంది. స్టాంప్ డ్యూటీ భారం తగ్గించుకునేందుకు ఆ భూమి విలువను పదో వంతు తగ్గించి చూపించినట్టు కూడా తేలింది. ఇందుకోసం బ్రోకర్లకు కోట్ల రూపాయల్లో ఫీజు కూడా చెల్లించారు. ఆ భూమి కొనుగోలుకు చెందిన ఇతర వ్యయాలు కూడా కోట్లలోనే ఉన్నాయి. ఆ భూములు విక్రయించిన వారిని కూడా ఈ దాడులు సందర్భంగా ప్రశ్నించగా తాము రిజిస్టర్ చేసిన పత్రంలోని భూమిలో 25 శాతం అటవీ భూమి అని, అది తమ యాజమాన్యంలోనిది కాదని, ఆ భూమికి మాత్రం తమకు ఎలాంటి సొమ్ము చెల్లించలేదని వారు తెలియచేశారు. ఆ గ్రూప్ పేరు మీద 300 ఎకరాలకు పైగా అటవీ భూములు రిజిస్టర్ అయినట్టు ఈ దాడుల సందర్భంగా లభించిన ఆధారాలు నిరూపిస్తున్నాయి.
దాడుల సందర్భంగా లెక్కల్లో చూపని రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మూడు లాకర్లను కూడా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ గ్రూప్ రూ.50 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు తెలుపుతున్నాయి.
దాడుల అనంతర దర్యాప్తు కొనసాగుతోంది. పన్ను ఎగవేత మొత్తం గణనీయంగా పెరగవచ్చు.
***
(Release ID: 1740572)
Visitor Counter : 168