జల శక్తి మంత్రిత్వ శాఖ

జలస్పృహ కలిగిన నగరాల ఏర్పాటు!

గంగాపరీవాహక ప్రాంతం పరిధిలో
వినూత్న పథకానికి శ్రీకారం...
కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన
ఎన్.ఎం.సి.జి. డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్
కాలుష్య నివారణ మాత్రమే చాలదని, జల పర్యావరణ వ్యవస్థ
సంరక్షణ, పునరుద్ధరణ జరగాలని సూచన.

Posted On: 27 JUL 2021 8:58PM by PIB Hyderabad

  గంగానది స్వచ్ఛతను, ప్రవాహగతిని సంరక్షించడమే లక్ష్యంగా తగిన నిర్వహణా సామర్థ్యాలను పెంపొందించే కొత్త కార్యక్రమం జాతీయ గంగశుద్ధి పథకం (ఎన్.ఎం.సి.జి.) ఆధ్వర్యంలో ప్రారంభమైంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సి.ఎస్.ఇ.) సంస్థతో కలసి ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జలస్పృహ కలిగిన పట్టణప్రాంతాల నమూనా, ప్రణాళిక, పట్టణ నీటి సామర్థ్యం, రక్షణ, వికేంద్రీకరించిన మురుగునీటి నిర్వహణ, స్థానిక పునర్వినియోగం, పట్టణ భూగర్భ జల నిర్వహణ, పట్టణ ప్రాంత నీటి వనరుల, సరస్సుల నిర్వహణ వంటి ప్రక్రియలపై ఈ వినూత్న కార్యక్రమంలో ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తారు.

   ఎన్.ఎం.సి.జి. డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ ఈ వినూత్న కార్యక్రమాన్నిలాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జల సంరక్షణ సంప్రదాయాలను గౌరవించవలసిన అవసరం ఉందని, పట్టణ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన మౌలిక నియమాలు, మౌలిక సూత్రాలపై దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. కేవలం జలకాలుష్యాన్ని నివారిస్తే సరిపోదని, జల సంరక్షణ, నీటిని పొదుపు చేయడం, వర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం తదితర అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘వర్షపునీటిని ఒడిసిపట్టు’ అనే కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ స్ఫూర్తిని ఆయన గుర్తు చేశారు. వర్షపునీటి సంరక్షణకోసం చొరవ చూపడం చాలా అవసరమన్నారు. “పట్టణ ప్రాంతాల్లో బహిరంగ స్థలాల ఆవశ్యకత చాలా ఉంది. ప్రజా సమూహాలకు చేరువలో నదీ తీర ప్రదేశాలు ఉండటం, నగరాల్లో నీటి వనరులు ఉండటం కంటే మరో గొప్ప విషయం ఏముంటుంది” అని వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రకృతి ప్రాధాన్యత కలిగిన దృశ్యాలు, పట్టణ జలవినియోగ వ్యవస్థ మధ్య సామరస్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. నదుల పరిస్థితి క్షీణించడానికి, పట్టణాలు, నగరాలు ఎలా కారణమవుతున్నాయో ఆయన వివరించారు. నదుల పునరుజ్జీవానికి జరిగే కృషిలో పట్టణాలు, నగరాలు కీలకపాత్ర పోషించవలసిన అవసరం ఉందన్నారు. పట్టణాలు, నగరాల కోసం ప్రణాళికలు రూపొందించేటపుడు నదీ జలాల ప్రధాన స్రవంతిని సంరక్షించే స్పృహతో వ్యవహరించాలన్నారు.  నదీ తీర ప్రాంతాల్లోని నగరాల ప్రణాళిక విషయంలో మొదటి సారి గణనీయమైన మార్పు చోటుచేసుకోబోతున్నట్టు చెప్పారు. “నదీ తీర నగరాల కూటమి” అన్న వ్యవస్థ గురించి కూడా డైరెక్టర్ జనరల్ ప్రస్తావించారు.  సుస్థిర అభివృద్ధి, సామర్థ్యాల నిర్మాణం  ద్వారా మన నదులను పూర్వస్థాయికి పునరుజ్జీవింపజేయడానికి, అందుకోసం సమష్టిగా పరస్పరం సహకరించుకోవడానికి ఈ వ్యవస్థ దోహదపుడుతుందని అన్నారు.

   సి.ఎస్.ఇ. సంస్థ సీనియర్ డైరెక్టర్ సురేశ్ కుమార్ రోహిల్లా మాట్లాడుతూ, గంగా పరీవాహక ప్రాంతం పరిధిలోని నగరాలు, పట్టణాల్లో నదీ జలాల స్వచ్ఛతను కాపాడే లక్ష్యంతో సుస్థిర పట్టణ నీటి వినియోగ నిర్వహణను ప్రోత్సహించడానికే తాజా కార్యక్రమం రూపొందించారని, ఇందుకోసం సామర్థ్యాలను పెంపొందించడం, కార్యాచచరణతో కూడిన పరిశోధన నిర్వహించడమే లక్ష్యమని అన్నారు.  భాగస్వామ్య వర్గాలన్నింటికీ ఈ వినూత్న కార్యక్రమం ఎలా ప్రమేయం కల్పిస్తుందో ఆయన వివరించారు. (నమామి గంగే కార్యక్రమానికి సంబంధించిన రాష్ట్ర కార్యక్రమ నిర్వహణ గ్రూపు, నగరపాలక సంస్థలు, సాంకేతిక పరిశోధనా వర్గాలు, అంతర్జాతీయ సంస్థలు, స్థానిక దిగువ స్థాయి ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్య వర్గాలుగా ఉంటాయన్నారు.

  సి.ఎస్.ఇ. డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ మాట్లాడుతూ, నదులపై, జలవాతావరణ వ్యవస్థపై వాతావరణ మార్పుల పెను ప్రభావాన్ని గురించి ప్రధానంగా ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా వర్షపాతం తీవ్రత బాగా పెరిగిందని, కానీ వర్షంకురిసే రోజులు మాత్రం తగ్గిపోయాయని, దీనితో నీటి  వినియోగ నిర్వహణా వ్యవస్థ కీలకమైన అంశంగా మారిపోయిందని అన్నారు. నీటి సంరక్షణ కోసం మన మూలాలను అనుసరించాలని, వర్షపునీటి సంరక్షణకు గతకాలపు నియమాలను, పద్ధతులను అనుసరించాలని అన్నారు. వరదనీటి సంరక్షణకోసం బీహార్ రాష్ట్రంలో అనుసరించే సంప్రదాయ బద్ధమైన అహర్-పైన్ వ్యవస్థను, రాజస్థాన్ కోటల్లో అనుసరించిన బావుల వ్యవస్థను, దక్షిణాదిలో, ఇతర ప్రాంతాల్లో సెలయేటి ప్రవాహంతో ఏర్పరుచుకునే సరస్సుల వ్యవస్థలను వరదనీటి సంరక్షణకు ఉదాహరణలుగా సునీతా నారాయణ్ పేర్కొన్నారు.

   ప్రస్తుతం అమలవుతున్న అమృత్, స్మార్ట్ సిటీస్, స్వచ్ఛభారత్, వంటి జాతీయ పట్టణ ప్రాంతపు ప్రధాన పథకాలను,..  నమామి గంగే పథకంతో సమీకృతం చేసేందుకు జాతీయ గంగ శుద్ధి పథకం (ఎన్.ఎం.సి.జి.) ఆధ్వర్యంలో కృషి జరుగుతోంది. జాతీయ వారసత్వ నగర అభివృద్ధి పథకం (హృదయ్-హెచ్.ఆర్.డి.ఎ.వై.), జాతీయ పట్టణ జీవోపాధి పథకం (ఎన్.ఎల్.యు.ఎం.), అటల్ భూజల్ యోజన, జలజీవన్ మిషన్, జలశక్తి అభియాన్ వంటి పథకాలను కూడా నమామి గంగే పథకంతో సమీకృతం చేస్తున్నారు. గంగా పరీవాహక ప్రాంతం పరిధిలోని రాష్ట్రాలు, నగరాల స్థాయిలో ఈ పథకాలన్నింటినీ చేపట్టనున్నారు.

  ఈ కార్యక్రమంలో భాగంగా, 40వరకూ  శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మూడేళ్ల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమాల్లో అధ్యయన అంశాలను, శిక్షణార్థులకోసం మార్గదర్శనులను రూపొందిస్తారు. ఇందుకోసం ఇళ్లలో శిక్షణ, ఆన్.లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమాలు, క్షేత్రస్థాయి సందర్శనలు, వెబినార్ సదస్సులు కూడా నిర్వహిస్తారు. మొదట్లో ఈ పథకాన్ని గంగా పరీవాహక ప్రాంతంలోని 3-4 నగరాల్లో ప్రయోగాత్మకంగా చేపడతారు. ఇందుకోసం పట్టణ ప్రాంతపు స్థానిక పరిపాలనా సంస్థలకు (యు.ఎల్.బి.లకు) అవసరమైన సాంకేతిక సహాయాన్ని కూడా అందజేస్తారు. సామర్థ్యాల నిర్మాణంకోసం ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా చేపడుతున్నారు. 33దేశాలకు చెందిన 240 నగరాలనుంచి 840మందికిపైగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

   జలస్పృహ కలిగిన పట్టణప్రాంత నమూనా, ప్రణాళిక (డబ్ల్యు.ఎస్.యు.డి.పి.) కార్యక్రమం అనేది ఇప్పుడిప్పుడే ఆవిర్భవిస్తున్న వినూత్న ప్రక్రియ. జలవాతావరణ వ్యవస్థపై పట్టణీకరణ పరిమాణాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఇది రూపొందింది. అత్యంత విలువైన నీటి నిక్షేపాలను గరిష్టస్థాయిలో వినియోగించుకునేందుకు, మన నదులు, నీటి కయ్యలకు జరిగే హానిని తగ్గించేందుకు, అన్ని జలవ్యవస్థల నిర్వహణా పద్ధతులపై దృష్టిని కేంద్రీకరించేందుకు అవసరమైన పట్టణ, నగర ప్రాంతాల ప్రణాళికా పద్ధతులను డబ్ల్యు.ఎస్.యు.డి.పి. ప్రక్రియలో పొందుపరిచారు. తాగునీరు, వరదనీరు, జల మార్గాల సంరక్షణ, మురుగునీటి శుద్ధి, రీసైక్లింగ్ నిర్వహణా పద్ధతులను ఈ వినూత్న ప్రక్రియ కింద చేపడతారు.

  

 

***


(Release ID: 1739797) Visitor Counter : 246


Read this release in: English , Hindi