ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మహమ్మారి కొత్త దశలు ఎందుకొస్తాయి?
నీతి ఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యుని సమాధానాలు;
మన చేతిలో ఉన్నదానిపై దృష్టి పెట్టండి.. వైరస్‌కు అవకాశం ఇవ్వొద్దు..
దాని మనుగడకు అనువైన అతిథిలా మారవద్దు: డాక్టర్ వి.కె.పాల్;
“పాఠశాలల పునఃప్రారంభంపై చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి”
Posted On:
22 JUN 2021 7:15PM by PIB Hyderabad
“ప్రపంచంలో మహమ్మారి రెండోదశ పాదమైనా మోపని దేశాలున్నాయి. మనం కూడా చేయాల్సింది చేస్తే, బాధ్యతారహిత ప్రవర్తనకు దూరంగా ఉంటే మహమ్మారి వ్యాప్తికి అవకాశం ఉండదు. ఇదే అత్యంత సరళమైన వ్యాధి అధ్యయన శాస్త్ర సంబంధిత సూత్రం” అన్నారు నీతి ఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యులు డాక్టర్ వి.కె.పాల్ స్పష్టం చేశారు. మహమ్మారి కొత్త దశల వెనుకగల కారణాలు, కోవిడ్ సముచిత ప్రవర్తన అనుసరణ ద్వారా దాని నియంత్రణ లేదా టీకా తీసుకోవడం వంటి చర్యల గురించి వివరిస్తూ ఆయన ఈ మేరకు చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలో పీఐబీకి చెందిన జాతీయ మాధ్యమ కేంద్రంలో కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇవాళ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొత్త దశలు ఎందుకు సంభవిస్తాయి
కొత్త దశలు రూపుదిద్దుకోవడానికి నాలుగు అంశాలు దోహదం చేస్తాయని డాక్టర్ పాల్ చెప్పారు. అవేమిటంటే:
- వైరస్ ప్రవర్తించే తీరు: వైరస్‌కు వ్యాప్తిచెందగల శక్తి, సామర్థ్యం ఉండటం
- అనువైన అతిథి: వైరస్ తన మనుగడకు అనువైన అతిథుల కోసం అన్వేషిస్తూనే ఉంటుంది. కాబట్టి అప్పటికేగల వ్యాధివల్ల ముప్పులేకుండా లేదా టీకా తీసుకోవడం ద్వారా స్వీయ రక్షణ చేసుకోవాలి. లేకపోతే దానికి అనువైన అతిథులమై పోతాం.
- సంక్రమణ సామర్థ్యం: వైరస్ ఎంతో చాకచక్యంగా పరివర్తన చెంది, మరింతగా సంక్రమించగల సామర్థ్యం సంతరించుకోగలదు. అంటే ముగ్గురు వ్యక్తులకు సంక్రమించగల వైరస్ ఏకంగా 13 మందికి వ్యాపించగలిగేంత శక్తిమంతం కాగలదు! ఈ పరిణామాన్ని మనం ఊహించడం అసాధ్యం... అటువంటి పరివర్తన రకాలపై పోరుకు ముందస్తు వ్యూహం సాధ్యం కాదు. వైరస్ స్వభావంలో మార్పు, దాని సంక్రమణ సామర్థ్యం కచ్చితంగా అత్యం ప్రమాదకరం. అంతేగాక వైరస్ పరివర్తన ఎప్పుడు.. ఎలా జరుగుతుందో ఏ ఒక్కరూ పసిగట్టలేరు.
- అవకాశం: ఇక నాలుగోది వైరస్ సంక్రమణకు మనమిచ్చే ‘అవకాశాలు.’ మనమంతా కలసి కూర్చుని భోంచేయడం, గుమిగూడటం, నాలుగ్గోడల మధ్య ఒకేచోట మాస్కులు లేకుండా కూర్చోవడం వంటివి వైరస్ వ్యాప్తికి మరిన్ని అవకాశాలిస్తాయి.
మన చేయగలిగింది చేయాలని పిలుపు
మన చేతుల్లో ఏమున్నదో నీతి ఆయోగ్ సభ్యుడు మనకు గుర్తుచేస్తున్నారు. “పైన పేర్కొన్న నాలుగు అంశాలకుగాను- వ్యాధి వ్యాప్తికి అనువైన అతిథులు కావడం, వైరస్‌కు అవకాశాలను నియంత్రించడమనే రెండూ పూర్తిగా మన చేతుల్లోనే ఉన్నాయి. మిగిలిన రెండు అంశాలు- వైరస్ ప్రవర్తించే తీరు, దాని సంక్రమణ సామర్థం మనం అంచనాలకు అందనివి లేదా నియంత్రించ సాధ్యం కానివే. అందువల్ల మనం సురక్షితంగా ఉంటూ, అతిథులుగా మారకుండా చూసుకున్నట్లయితే మనుగడ సాగించగల శక్తి వైరస్‌కు ఉండదు. ఈ దిశగా మాస్కు ధరించడం లేదా టీకా తీసుకోవడం వంటి జాగ్రత్తలతో మనం అనువైన అతిథులుగా మారకుండా నియంత్రించుకోవచ్చు. ఆ మేరకు కోవిడ్ అనుగుణ ప్రవర్తనతో మనం అవకాశాలను తగ్గిస్తే, వ్యాధి వ్యాప్తికి అనువైన పరిస్థితులు లేకుండా చేస్తే మూడో దశ సంభవించడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదు.”
మరో దశ సంభవించకుండా నిరోధించాలంటే పౌరులతోపాటు వ్యవస్థలన్నీ సమష్టిగా కృషి చేయాల్సి ఉందని డాక్టర్ పాల్ పిలుపునిచ్చారు. “ఇందులో కొన్ని వ్యక్తిగత చర్యలు కూడా అవసరం కాగా- సముదాయాలను వేరుపరచడం, వ్యాధికారకుల జాడ పసిగట్డడం, పరీక్ష సామర్థ్యం పెంపు, వవ్యస్థల సత్వర స్పందన దిశగా అవగాహన వంటివి అవసరం.”
“పాఠశాలల పునఃప్రారంభంపై చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి”
దేశవ్యాప్తంగా ఆంక్షల సడలింపు, పాఠశాలల పునఃప్రారంభంపై మాట్లాడుతూ- ఈ విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని డాక్టర్ పాల్ స్పష్టం చేశారు. ఆ మేరకు మనం సురక్షితంగా ఉన్నపుడు మాత్రమే ఇలా చొరవ తీసుకోడం సాధ్యమని చెప్పారు. “పాఠశాల అంటే విద్యార్థులంతా గుమిగూడటం, ఓ మధ్యస్థ లేదా భారీస్థాయిలో అంతా ఒకే ప్రాంగణంలో చేరుతారు. ఇది వైరస్ వ్యాప్తికి అవకాశమిచ్చే పరిస్థితి. కాబట్టి మనం మెరుగైన రక్షణ కవచంతో ఉండి, వైరస్ ప్రభావాన్ని అణచివేయడంతోపాటు కనీస దూరం పాటిస్తూ కూర్చోవాలి. అంతే తప్ప అనూహ్య పరిస్థితులున్నపుడు పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోవడం అంత సులభమేమీ కాదు” అన్నారు. అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగడం, ప్రజలు క్రమశిక్షణతో నడచుకోవడం వల్ల ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. కానీ, ఇప్పుడు ఆంక్షలను సడలించి, పాఠశాలలు తెరిస్తే, వైరస్ విస్తృత వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది.
***
(Release ID: 1729558)
Visitor Counter : 270