రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

'ఐఎన్‌ఎస్‌ డేగ'లో విధుల్లోకి చేరిన అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు

Posted On: 07 JUN 2021 9:13PM by PIB Hyderabad

విశాఖలో, తూర్పు నౌకాదళం (ఈఎన్‌సీ) కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌, వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ సమక్షంలో, '322 డేగ ఫ్లైట్‌' పేరిట హెలికాప్టర్ల చేరిక కార్యక్రమం జరిగింది. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్‌) ఎంకే-3 హెలికాప్టర్లు, నౌకాదళ కేంద్రం ఐఎన్‌ఎస్‌ డేగలో లాంఛనంగా విధుల్లోకి చేరాయి. ఈ సముద్ర నిఘా, తీర భద్రత (ఎంఆర్‌సీఎస్‌) హెలికాప్టర్ల చేరికతో, దేశ ప్రాదేశిక జలాల ప్రయోజనాల పరిరక్షణలో, శక్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈఎన్‌సీకి గట్టి ప్రోత్సాహం లభించినట్లయింది. 'హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్' నిర్మించిన అత్యాధునిక హెలికాప్టర్లు ఇవి. 'ఆత్మనిర్భర్ భారత్'లో ప్రధాన అడుగుగా మారాయి.

    గతంలో, నౌకాదళానికి చెందిన భారీ, బహుళ సామర్థ్య హెలికాప్టర్లలో మాత్రమే కనిపించే వ్యవస్థలు ప్రస్తుత ఏఎల్‌హెచ్‌ ఎంకే-3 హెలికాప్టర్లలో ఉన్నాయి. వీటిలో ఆధునిక నిఘా రాడార్, ఎలెక్ట్రో-ఆప్టికల్ పరికరాలను అమర్చారు. వీటివల్ల పగటితోపాటు రాత్రి కూడా, సముద్రంపై నిఘాతోపాటు, సుదూర పరిధిని గమనించడం, సహాయక కార్యక్రమాలను చేపట్టడం చేయవచ్చు. ప్రత్యేక కార్యాచరణ సామర్థ్యాలకుతోడు, రక్షణ కార్యక్రమాలను చేపట్టేందుకు, ఈ హెలికాప్టర్లలో భారీ మెషీన్‌గన్‌ను కూడా అమర్చారు. అత్యవసర వైద్య సాయం అవసరమైన రోగులను తరలించేందుకు, 'మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్'ను (ఎంఐసీయూ) కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎంఐసీయూ అవసరమైనప్పుడు హెలికాప్టర్‌లో బిగించుకోవచ్చు, లేదంటే తొలగించేందుకు వీలుంది. ఏఎల్‌హెచ్‌ ఎంకే-3 హెలికాప్టర్‌లో అధునాతన ఏవియానిక్స్ కూడా ఉంది. హెలికాప్టర్‌ ఎలాంటి వాతావరణంలోనైనా సురక్షితంగా ఎగిరేలా ఇది సహకరిస్తుంది.

    విస్తృత అనుభవజ్ఞుడు, ఏఎల్‌హెచ్‌ 'క్వాలిఫైడ్‌ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌' (క్యూఎఫ్‌ఐ) అయిన కమాండర్‌ ఎస్‌ఎస్‌ దాస్‌, ఈ హెలికాప్టర్లకు మొదటి 'ఫ్లైట్‌ కమాండర్‌'గా నాయకత్వం వహిస్తున్నారు.

 

 

***

 


(Release ID: 1725219) Visitor Counter : 224


Read this release in: English , Urdu , Hindi